అకారాది సామెతలు - మొదటి విడత
అకారాది సామెతలు - మొదటి విడత (Author: ఎం వి అప్పారావు)
ముందు మాట
సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. సామెతలకు ఏ ఒక్కరినీ రచయితగా చెప్పలేము. ఐతే తెలుగులో భిన్న కాలాల్లో భాషలో చేరి యిమిడి పోయిన పదజాలంతో పోలిస్తే యధాతధంగా చేరిన ఇతర భాషల్లోని సామెతలు పరిమితం. ఒక కాలంలో ఒక సామాన్యార్థం మరో ప్రాంతములో అశ్లీలార్ధం కలిగి ఉండవచ్చు. ప్రజలు తమ అనుభవాల్లోనుంచే సామెతలను పుట్టిస్తారు. సామెతలో ధ్వని ఉంటుంది. ప్రసంగోచితంగా ఒక సామెతను ప్రయోగిస్తే పాలల్లో పంచదార కలిపినట్లుంటుంది. అవి సంభాషణకు కాంతినిస్తాయి. ఉదాహరణకి:. పిఠాపురం నాగేశ్వర రావు మైనర్ బాబు సినిమాలో పాడిన “అంగట్లో అన్నీ వున్నాయి పాట” చాల ప్రాచుర్యం పొందింది..
అ
అందని పూలు దేమునికి అర్పణ
అందరికే శకునం చెప్పే బల్లి కుడితి తొట్టెలో పడ్డట్టు
అందరూ అందలమెక్కితే, మోసేవారెవరు
అగ్నికి వాయువు సహాయమైనట్టుఅత్త చచ్చిన ఆరు మాసములకు కోడలి కంట నీరు వచ్చినదట
అనువు కాని చోట అధికుల మనరాదు
అన్న మయం ప్రాణమయం
అన్నమదము వల్ల అన్ని మదములు కలుగుతవి
అన్నము పెట్టిన వారింట్లో కన్నము పెట్టవచ్చునా?
అన్నీ రుచులూ సరేగాని, అందులో వుప్పు లేదు
అబద్ధమాడినా గోడ పెట్టినట్టు వుండవలెను
అయిన పనికి చింతించే వాడు, అల్పబుద్ధి కలవాడు
అయ్య కదురు వలె, అమ్మ కుదురు వలె
అర్థము (డబ్బు)లేని వాడు నిరర్ధకుడు
ఆ
ఆకలి కాకుండా నీకు ఔషధం ఇస్తాను, నీ ఇంట్లో చద్ది నాకు పెట్టు
ఆకాశానికి నిచ్చెన వేసేవాడు.
ఆచారం ముందు, అనాచారం వెనుక.
ఆచార్యునికి ద్రోహం చేసినా, ఆత్మకు ద్రోహం చెయ్యరాదు
ఆడే కాలూ పాడే నోరూ ఊరకుండవు
ఆముదపు విత్తులు, ఆణి ముత్యాలు
ఆయన ఉంటే, విస్తరి అయినా కుట్టును.
ఆరంభ శూరత్వం
ఆవగింజ అట్టే దాచి గుమ్మడి కాయ గుల్ల కానుగా యెంచేవాడు
ఆవుల సాధుత్వము, బ్రాహ్మణుల పేదరికం లేదు.
ఆశ ఆలి మీద, ఆధారం చాప మీద.
ఆసలేనివానికి దేశమెందుకు.
ఇ
ఇంటి పిల్లికి పొరుగింటి పిల్లి తోడు. ఇచ్చకాల వారు బుచ్చకాల వారు పొట్ట కొరకు పొక్కులు గోకుతారు.
ఇచ్చేటప్పుడు కాముని పండుగ, పుచ్చుకునేటప్పుడు దీపావళి పండుగ ఇల్లు కాలినా యిల్లాలు చచ్చినా గొల్లు మానడు
ఈ
ఈ పిల్లి ఆ పాలు తాగునా.
ఈ నెలలో వడ్డీ లేదు, వచ్చే నెలలో మొదలు లేదు.
ఉ
ఉతికే వారికి గాని చాకలి ఉతకడు
ఉడికిన మెతుకులు తిని వూళ్లో ఉండేవాణ్ణి, నాకు ఎవరితో ఏమి పని ఉన్నది
ఉన్నది ఒక కూతురు, వూరెల్ల అల్లుండ్లు
ఉపనయనము నాటి మాట వుండక పోదు.
ఉప్పుతో ముప్పై ఆరు వుంటే, ఉత్త ముండయినా వండుతుంది
ఊ
ఊర పిచ్చుక మీద తాటికాయ ఉంచినట్టు
ఊరి జబ్బు చాకలి యెరుగును, ఉద్యోగపు జబ్బు బంట్రోతు యెరుగును.
ఊరి ముందరికి వచ్చి నా పెండ్లాము పిల్లలు ఎట్లా ఉన్నారని అడిగినాడట
ఊరు వున్నది, చిప్ప వుంది
ఎ
ఎండు మామిడి టెంకలు వొళ్ళో పెట్టుకుని ఎవరి తాడు తెంప వచ్చినావోయి వీరన్న అన్నాడట
ఎక్కుమంటే ఎద్దుకు కోపం, దిగుమంటే కుంటివానికి కోపం
ఎద్దును అడిగి గంట కట్టడం
ఎద్దు నెక్కిన వాడే లింగడు, గడ్డను ఎక్కిన వాడే రంగడు
ఎద్దువలె తిని మొద్దు వలె నిద్ర పోయినట్టు
ఎముక లేని నాలుక ఎట్లా తిప్పినా తిరుగుతుంది.
ఎరువు సతము (శాశ్వతము)కాదు, వాక్కు తోడు కాదు
ఎరువుల సొమ్ములు యెరువులవారు ఎత్తుకొని పోతే, పెండ్లికొడుకు ముఖాన పేడనీళ్ళు చల్లినట్టే ఉంటుంది
ఎలుక ఎంత ఏడ్చినా, పిల్లి తన పట్టు వదలదు
ఎలుక యేట్లో పోతేనేమి, పులి బోనున పోతేనేమి
ఎవరి కొంప తియ్యడానికి యీ జంగం వేషం వేసినావు
ఎవరి జానతో వారు యెనిమిది జానలే
ఎవరు యిచ్చినది యీ మాన్యము అంటే, నేనే యిచ్చుకున్నాను అన్నదాట.
ఏ
ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు
ఏ పుట్టలో ఏ పాము ఉందో తెలియదు
ఏ ఎండకు ఆ గొడుగు పట్ట వలెను
ఏ గాలికి ఆ చాప ఎత్తినట్టు
ఏకాదశి నాడు తలంటుకొంటావేమి అంటే, అది నిత్య వ్రతం నేడే ఆరంభం అన్నదట ; మర్నాడు ఎందుకు తలంటుకోలేదంటే, నిన్నటితో వ్రత సమాప్తి అన్నదట
ఏకుల వంటి మెతుకులు వేసుకొని యెనక పెరుగు పోసుకొని యమరాలిని గనుక తింటూ వున్నాను గాని, దగ్గరికి రాకండి పిల్లల్లారా జడుసుకునేరు.
ఏకులు వంచితే బుట్ట చిరుగుతున్నదా?
ఏటి ఒడ్డు చేను ఏటి ఆవల ముత్యములు తాటికాయలంత అన్నట్టు
ఏటి యీత కు లంక మేతకు సరి
ఏటిదారి మణికి యెప్పుడూ చలనము.
ఏట్లో కలిపిన చింతపండు
ఏట్లో పారె నీళ్ళు ఎవరు తాగితే ఏమి.
ఏట్లో వంకాయలు కాస్తావా అంటే కాస్తవి అన్నట్టు
ఏట్లో వేసినా ఎంచి వెయ్య వలెను
ఏట్లో ఉదకము వున్నది సూర్యదేవా
ఏడుపులో ఏడుపు యెడమచెయ్యి బయట పెట్టు మన్నట్టు
ఏడుస్తూ ఏరువాక సాగితే, కాడి మోకులు దొంగలు ఎత్తుకొని పోయినారట
ఏడ్చే బిడ్డకు అరిటిపండు చూపినట్లు
ఏనుగు పడుకున్నా గుర్రమంత ఎత్తు
ఏనుగ మీద దోమ వాలితే ఎంత బరువు
ఏనుగకు ఒక సీమ, గుర్రానికి ఒక వూరు, బర్రెకు ఒక బానిస
ఏనుగకు వెల్లక్కాయలు లొట లొట
ఏనుగను చూచి కుక్కలు మొరిగినట్టు
ఏనుగను తెచ్చి యేకుల బుట్టలో వుంచి అది తననెత్తిన పెట్టి తన్ను ఎత్తుకో అంటాడు
ఏనుగనెక్కినవాడు కుక్క కూతకు జడవడు
ఏనుగమీద పొయ్యేవాణ్ణి సున్నము అడిగినట్టు
ఏనుగుకు కాలు విరగడం, దోమకు రెక్క విరగడం సమము
ఏమీ లేనమ్మకు ఏడుపుల శృంగారము, కలిగినమ్మకు కడుపుల శృంగారము
ఏమీ లేని ఆకులు యెగసి పడితే, అన్నీ వున్నా ఆకులు అణిగివున్నవి
ఏరు ఎన్ని వంకలు పోయినా, సముద్రంలో పడవలెను
ఏరు నిద్ర పోయినట్టు. ఏరు మూరెడు తీస్తే, కయ్య (మడి )బారెడు తీస్తుంది
ఏరు యెడామడ వుండగానే, చీర విప్పి చంక పెట్టుకొని పోయినట్టు
ఏరుకుని తినే పక్షి ముక్కున ముల్లు విరిగినట్టు
ఏలిన వానికి రేయింబగలు ఒకటే
ఏవూరే యేతామా అంటే, దువ్వూరే దూలమా అన్నాదట
ఐ
ఐసా వైసా
ఐశ్వర్యానికి అంతము లేదు
ఒ
ఒంటికి లేని వ్యాధి కొని తెచ్చుకున్నట్టు.
ఒంటికి ఓర్వలేనమ్మ రెంటికి ఓర్చునా
ఒక కంచాన తిని ఒక మంచాన పడుకోనేవారు
ఒక కన్ను కన్నూ కాదు, ఒక కొడుకు కొడుకు కాదు
ఒక కలగంటే తెల్లవారుతున్నదా
ఒక వూరికి వెయ్యి దోవలు.
ఒకటే దెబ్బ రెండే ముక్కలు
ఒకనాటి భాగవతము తో మూతి మీసాలన్నీ తెగకదిలినవి
ఒకరి కలిమికి యేడిస్తే ఒక కన్ను పోయింది, తన లేమికి యేడిస్తే మరియొక కన్ను పోయింది
ఒకరిని యిద్దరిని చంపితేగాని, వైద్యుడు కాదు.
ఒక్క చెయ్యి తట్టితే, చప్పుడు అవునా.
ఒక్కక్క రాయి తీస్తూ వుంటే, కొండైనా తరగుతుంది
ఒరగ పెట్టి తగేడి చెరిచేరా కంచరవాడు
ఒళ్లువంగనమ్మా కాలి మెట్టెలను కందిపోయినదట
ఒళ్లెరుగని శివము, మనసెరుగని కల్ల వున్నదా
ఓ
ఓకారము రానివాడు గుణించినట్టు
ఓడలు బండ్ల లో వస్తున్నవి, బండ్లు ఓడ లో వస్తున్నవి.
ఓబీ ఓబీ, నీవు వడ్లు దంచు, నేను పక్కలు యెగరవేస్తాను
ఓరిస్తే ఓరుగల్లు పట్నమవుతుంది.
ఓర్చలేని రెడ్డి వుండీ చెరిచెను, చచ్చీ చెరిచెను
ఓలి తక్కువ అని గుడ్డిదాన్ని పెండ్లాడితే నెలకు మూడు ఆవాలు
ఓలి తక్కువ అని గుడ్డిదాన్ని పెండ్లాడితే, దొంతి కుండలన్నీ పగలకొట్టినాదట
ఓహో కనుక్కోలేక పోతిరిగదా అన్నట్టు
ఔ
ఔషధానికి అవపథ్యానికి చెల్లు, రోగము పై పెచ్చు
2025 ఉగాది సంచిక
తెలుగు కళాసమితి అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)
సంగీత త్రిమూర్తి ఆరాధనోత్సవం (మా సమాచారం)
పురుషులందు పుణ్యపురుషులు వేరయా (వ్యాసం)
అకారాది సామెతలు - మొదటి విడత (వ్యాసం)
దేశ భాష లందు తెలుగు లెస్స! (కవితలు)
ఇచ్చట నేరస్థులు తయారు చేయబడును (కథలు)
సెల్ ఫోన్ సిక్ లీవ్.... (కవితలు)
తెలుగు వెలుగుల మహోదయం (కవితలు)