సంపాదకీయం  (Author: ఊటుకూరి విజ్ఞాన్ కుమార్)

మానవ చరిత్రలో 1687 లో Isaac Newton మహాశయుడు ప్రచురించిన Principia తో ఒక మేధా యుగం, ఒక వైజ్ఞానిక యుగం ప్రారంభమైందనుకుంటే, 1905 లో Einstien ప్రతిపాదించిన సాపేక్ష సిధ్ధాంతంతో (Theory of Relativity) మరొక యుగం ప్రారంభమైంది. ఆ లెక్కలో ప్రస్తుత కాలాన్ని, కృత్ర్రిమ మేధా యుగం, Age of Artificail Intelligence (AI) అనచ్చు. ఈ AI సాధించలేనిది ఏమన్నా ఉన్నదా అని ఆశ్చర్యం కలుగుతుంది. దీనిని ఎవరు తయారు చేశారూ అని గూగులమ్మని (Google.com) అడిగితే వీరూ వారు అని ఒకరి పేరు చెప్పలేం, 1950 నుంచీ దీని మీద పరిశోధన జరుగుతున్నదీ అని చెప్పింది. కానీ నిజానికి ఆ AI పరిఢవిల్లి మన నిత్య జీవితంలోకి అడుగు పెట్టింది ఇటీవలే అని చెప్పచ్చు. ఏ విషయమైనా అంతే కదా. ఒక కొత్త విషయం కనిపెట్టడానికీ అది నిత్య జీవితంలోకి రావడానికీ ఓ పాతికేళ్ళు, ఏభై ఏళ్ళు పట్టడం పరిపాటే. 

ప్రస్తుతం ఈ AI గురించి ఆశ్చర్య పోతున్నాం, అది ఏమేమి చేస్తుందో, చేయగలదో అని భయ పడి పోతున్నాం. కొంచెం  వెనక్కి వెళ్తే, Calculator వచ్చిన మొదటి రోజుల్లో, అది చూసి మా పెద్దలలో ఒకరు, ఏమిట్రా ఇది, ఇక ఎక్కాలు బట్టీ పెట్టడం అక్కర్లేదన్నమాట, ఇక చదువెలా వస్తుందీ అని తిట్టి పోశారు. కంప్యూటర్లు సర్వ సాధారణం ఐపోయింతరువాత ఆయన బతికి ఉంటే ఏమనుండేవారో ఏమో. కానీ ఈ AI విప్లవం ఇప్పటి వరకూ వచ్చిన అన్ని విప్లవాలని మించినదౌతుందేమో అని చాలా మంది భయపడ్తున్నారు.  

కేవలం లెక్కలే కాదు, AI ఒక కథో పుస్తకమో చదివి, దానిలోని భావం చెప్పగలదు, భాష ఎలా ఉందో చెప్పగలదు, దాని సామాజిక విలువలేమిటో చెప్పగలదు. ఇటువంటివి, మనం మనుషులకే సాధ్యమౌతుంది అనుకునే అన్నీ కూడా AI చేస్తున్నది. పాతకాలం సినెమా, గుండమ్మ కథ లో పాట -'అది ఇది యేమని అన్ని రంగముల .... ' గుర్తుకొస్తున్నది.

ఇక  ఇప్పటి దాకా జరిగిన 'గొప్ప' విషయాలన్నీ ఒక విధంగా English లోనే జరిగాయనచ్చు. కానీ ఈ విప్లవం అన్ని భాషల్లోనూ జరుగుతోంది. మనం వేసే ప్రశ్నలు తెలుగులోనూ వేయచ్చు, ఆఖరికి సంస్కృతంలో కూడా వేయచ్చట.

ఉదాహరణకి అర్జనుడు కృష్ణుణ్ణి ఏమడిగాడు అని పూర్తి తెలుగు ప్రశ్న వేస్తే గూగులమ్మ ఇచ్చిన తెలుగు సమాధానాల్ల్ళో ఒకటి ఇలా ఉన్నది: అప్పుడు కృష్ణుడు అర్జునుడితో నీకు అర్థం కానివి ఏంటి?? వాటిని గురించి వివరంగా అడుగు అని అన్నాడు. కేవలం ఒక మనిషి చెప్పినట్టే చెప్పింది.

వెనకటికి కార్లో గుఱ్ఱం పెట్టారా అనీ, రేడియోలో గొంతు కోసి పెట్టారా అని అనుకునే వాళ్ళు. Chess Champion Gregory Kasparov ని IBM వారి కంప్యూటరొకటి ఓడించినప్పుడు ఆయనకి ఒళ్ళు మండి దీనిలో ఏదో మోసం ఉన్నది, కంప్యూటరేమిటి నన్ను ఓడించడమేమిటి, అది అన్ని ఎత్తులు ముందు ఆలోచించి ఆడటమేమిటి దాని లోపల ఎవరో మనిషి కూర్చుని ఉండాలి అని కోపంతో లేచి పోయాడట. 

మా తాతలు నేతులు తాగారూ, మా మూతులు వాసన చూడండి అన్న సామెత అందరూ వినే ఉంటారు. ఆ సామెత విని నోరారా నవ్వే వాళ్ళు కూడా ఏ కొత్త విషయమైనా ప్రస్తావించినప్పుడు, 'ఆ అది మన వేదాల్లోనే ఉన్నది లెస్తూ, పెద్ద గొప్పేం కాదు' అని నోరు చప్పరించేస్తారు. మనం ఎప్పుడో గొప్ప వాళ్ళం అన్న భావం మనలో తరతరాలుగా జీర్ణించిపోయింది. దానికి ఎన్నో కారణాలు చెప్తారు, మరింకెన్నో వందల కారణాలు ఇంకా చెప్పచ్చు. ఎన్ని చెప్పినా దానికి విరుగుడేమిటో, ఆ భావం ఎలా పోతుందో అర్ధం కాదు. తమ జీవితంలో ఏమీ సాధించలేని వాళ్ళు ఇలా తమని మభ్య పెటుకుంటారు అని సరి పెట్టుకోవడం కూడా సరి కాదు. కొంతమంది మేధావులు, సమర్ధులూ కూడా ఇలా అంటూంటే ఆశ్చర్యం వేస్తుంది.

అటువంటి వాళ్ళు ఈ విప్లవాన్ని చూసి ఏమంటారో కదా!!!

ఇక ఈ సంచికకొస్తే, 2026 సంక్రాంతి పోటీలకి తమ రచనలు పంపిన రచయితలందరికీ ధన్యవాదాలు, పోటీలలో బహుమతుల గెలిచిన వారందరికీ మా అభినందనలు.

  • ‘అచ్చతెలుగు మాటలాట’ అన్న తమ వ్యాసంలో కర్లపాలెం హనుమంతరావు గారు అచ్చ తెలుగే వాడాలీ అన్న భేషజం వద్దన్నారు.
  • ‘ఊరవతలి మేఘం’ అన్న తమ కథలో లింగా అనర్ఘ్య గౌతం గారు వర్ణ వ్యవస్థ గురించి ఆలోచింపజేశారు.
  • యుద్ధం వద్దు శాంతే ముద్దుఅన్న తమ కవితలో పి లక్ష్మీ ప్రసన్న గారు, నేనుశాంతిని‌ కోరుకొంటానుఅన్న తమ కవితలో వారణాసి భానుమూర్తి రావు  గారు తమ శాంతికాముకత్వాన్ని వెల్లడించారు
  • తన్మయ సాహిత్య గారి సంక్రాంతి......’  గేయం, దివాకర్ల రాజెశ్వరి గారి ‘ధాతువు’ రెండూ కూడా సంక్రాంతి మీదే
  • అతనొక శాపగ్రస్తుడుఅన్న తమ కవితలో చిత్రాడ కిషోర్ కుమార్ గారు ఒక 'పిచ్చి' వాడనుకునే మనిషి గురించి రాశారు 
  • కళ్ళున్న మనసు అన్న తమ కథలో ఎమ్. విజయశ్రీముఖి గారు భర్త పోయిన ఆడవాళ్ళని సమాజం పెట్టే వ్యధలని చక్కగా చిత్రించారు
  • గన్నవరపు నరసింహ మూర్తి  గారి ‘మృత్యోర్మా అమృతంగ‌మ‌య’ కులమత భేదాలమీద ఒక విమర్శ
  • మంజు గారి కవిత 'అక్షర కోవెల అంతర్యామి  ' - మకుటమే ఆ కవిత తాత్పర్యం.
  • ఆకెళ్ళ సూర్యనారాయణ మూర్తి గారి కవిత అక్షరాలని ప్రేమిస్తాను నేను కూడా ఈ కోవకే చెందిమనిపిస్తున్నది 
  • ఎం కోటేశ్వరరవు గారి కవిత 'హృదయాంజలి ', gift ఏమీ కొననందుకు చెప్పిన క్షమాపణ అనిపిస్తోది సుమా !!
  • మొహమ్మద్ అఫ్సర వలీషా గారి కవితచిరస్మరణీయం’  ఒక భావ కవిత్వం
  • శిక్ష నాది కాదు అన్న తమ కథలో హరి వెంకట రమణ గారు తప్పొకరిది శిక్షొకరికీ అన్నారు
  • పాలూరి సుజన గారి సంక్రాంతి గేయం’  యొక్క Audio recording కూడా పెట్టడమైంది. ఇది తెలుగుజ్యోతికొక నూతన ప్రక్రియ.

Kommentera