ప్రేమ- పెళ్ళి  (Author: యలమర్తి చంద్రకళ)

కలల వాకిట నీకై ఎదురు చూస్తున్నా.  నాకనులకు పెట్టిన కాటుక ఆ కళ్ళల్లో వున్న నీ రూపానికి, దిష్టి తగలకూడదని మాత్రమే. ఇరువురి మనసులను కలిపే ప్రేమ ఎలా పుడుతుందో, ఎక్కడ  మొదలవుతుందో తెలియని అద్భుతం.  ప్రేమ ఆకర్షణతో మొదలైనా, విడదీయలేని రాగబంధంగా మారుతుంది. ఆపై వారు వలపుల తలపుల్లో, ఊహల్లో తేలిపోతారు. నిజమైన ప్రేమ ఆరాధనగా మారుతుంది. ప్రేమ అందరికీ దొరకని భాగ్యం. ప్రేమించబడటం అదృష్టం. సుజీ చదువుతున్న పుస్తకం పక్కన పెట్టి లేచింది.  

         ప్రేమ గురించి చదువుతుంటే భలే థ్రిల్లింగ్ గా ఉంటుంది. టైమే తెలియదు. కానీ కడుపులో ఆకలి నకనకలాడుతోంది. తినాలంటే వంట చేసుకోవాలి, కాలేజీకి వెళ్ళాలి. పనులన్నీ పెండింగ్ పడుతున్నాయి. రేపటి నుండి పనులు అయ్యాకనే పుస్తకాలు చదవాలని గట్టిగా అనుకుంది.  

       ఇంతలో "ఈవేళలో నువ్వు ఏం చేస్తు ఉంటావో..." కమ్మని పాట రింగ్ తో ఫోన్ మోగింది. అబ్బా ఇప్పుడే తలుచుకున్నా అవుడే కాల్ చేసశాడేంటి? అనుకుంటూ, "హలో" అంది.

         "హాయ్! సుజీ! గుడ్మార్నింగ్" సుధాకర్ హుషారుగా పలకరించాడు.

         "ఆ! మార్నింగ్!... చెప్పు. పొద్దున్నే ఫోన్ చేశావేం?"

         "ఏం? పొద్దున్నే ఫోన్ చెయ్యకూడదా?"

         "నీకేమ్మా, మగాడివి, బాగా డబ్బున్నోడివి. నేను అన్నీ ఆలోచించుకోవాలి కదా."

         "అదేంటి సుజీ...! డిస్టర్బ్ చేసానా? ఎగ్జామ్స్ అయిపోయాయి కదా అందుకే చేశాను." 

         "లేదులే... నవల చదువుతున్నాను. అంత బాధ పడిపోకు."

         "నువ్వు నవలలు చదువుతావా? ఇది ప్రపంచ వింత అవుతుంది."

         "ఎగ్జామ్స్ కి చదివి, చదివి మెదడు కాస్త వాచింది. జస్ట్ చేంజ్ కోసం చదువుతున్నాను."

         "హమ్మయ్య! నువ్వు కూడా మామూలు మనిషిలా ఆలోచిస్తావన్నమాట"

         "నీలా బాధ్యతలు లేకపోతే నీలా, హాయిగా ఉండేదాన్నేమో."

         "నువ్వు ఆలా అంటే నేనేం ఏమనుకోవాలి?"

         "అలా అంటే, నాకు పనుందని అనుకోవాలి అంతే."

         "సుజీ, నీ మాటలలో తీపి కరువైంది సుమా."

         "నాకు, టైం కరువైంది మహాశయా! నా కడుపులో ఎలకలు పరిగెడు తున్నాయి. అంటే ఆకలి దంచేస్తోంది. ఏదో వండుకుని తినాలి. కాలేజీకి రావాలంటే రెడీ కావాలి కదా."

         "నా గుండెగుడిలో ప్రేమదీపం వెలిగించాను. నీ కోసమే ఎదురు చూస్తున్నాను."

         "అప్పుడే కాలేజీకి వెళ్ళడం, నాకోసం ఎదురు చూడడం కూడానా? సరే దీపం పెట్టి ఊరుకుంటే ఎలా... నాయనా? ఏదయినా నైవేద్యం కూడా పెడితే నాకు టిఫిన్ చేసుకునే బాధయినా తప్పేది కదా."

         "సరే! త్వరగా రా, నువ్వు వచ్చేసరికి నీకిష్టమయిన పెసరట్టు, నీకోసం ఎదురు చూస్తుంటుంది."

         "ఛ... వూరికే అన్నాను. వంట చేసుకుని తినే వస్తాలే."

         "నో... నో... ఈరోజు నాతోపాటే నువ్వూ తింటావు."

         "అంటే నువ్వూ తినలేదా? సరే పదంటే పదినిముషాల్లో వచ్చేస్తాను."

         —-

         పది నిముషాల తర్వాత కాంటీన్లో కబుర్లు చెప్పుకుంటూ ఇద్దరూ టిఫిన్ తిన్నారు.

         "సుధా, నీకెందుకోయ్ నామీద అంత ప్రేమ?" అడిగింది సుజీ.

         "సుజీ, నా సోల్మేట్ నువ్వే అని నా మనసు చెప్పింది."

         "నువ్వు, నీమనసుతో మాట్లాడినంత ఈజీ గా, మీ అమ్మానాన్నలతో కూడా హాయిగా మాట్లాడగలిగితే బాగుండు."

         "నాకు మంచి జాబ్ రానీ చెబుతాను."

         "మావాళ్ళు కట్నాలు ఇచ్చుకోలేరు. నాకు మనపెళ్ళి జరుగుతుందన్న నమ్మకం లేదు."

         "కట్నం ఇమ్మని నేను అడగను."

          "నువ్వు అడగవు. మీవాళ్ళు అడుగుతారు కదా."

         "వాళ్ళూ అడగరు. నామాట నమ్ము."

         "ఇది మరీ సినిమా డైలాగ్లా వుంది. మహాభారతంలో మన కృష్ణపరమాత్మ గారి భార్యలు రుక్మిణీ దేవి, సత్యభామ వీళ్ళు కూడా కట్నం తెచ్చుకున్నారుట తెలుసా?’’ అంటూ నవ్వింది. మన అమ్మమ్మల కాలం నుండి ప్రతి తరంలోనూ కట్నం సమస్య తీరిపోతుందనే అనుకున్నారుట. కానీ మిగతా దురాచారాల్లా దీన్ని నిర్ములించడం కుదరలేదు."

         "నిన్ను విడిచి నేను బ్రతకలేను సుజీ."

         "సుధా! మరి, ఒక మంచి జోక్ చెప్పనా?" 

         "ఓ షూర్, చెప్పు. నీలో నాకు మరీ నచ్చేది అదే."

         “అతను ఒక రోమియో! నిన్ను నేను ప్రేమిస్తున్నాను. నీవు నిరాకరిస్తే చచ్చిపోతాను” అన్నాడు. ఆమె నిరాకరించింది. అతను నిజంగానే చనిపోయాడు అరవై ఏళ్ళ తరువాత." 

         సుజీ జోక్ చెప్పి పకపకా నవ్వింది.

         సుధాకర్, వెంఠనే  "సో, శాడ్" అన్నాడు. ఒక్క నిముషం తర్వాత “వాట్?” అని తనూ ఆమెనవ్వుతో శృతి కలిపాడు.

—-

         "సుజీ, మనఎగ్జామ్స్ ఐపోయాయి. ఇంక మనంరోజూ కలవలేము. మనం పీజీ వేరు, వేరు కాలేజీలలో చదవాలి. ఇది మన ప్రేమ గుర్తుగా తెచ్చాను."

         "ఓ గిఫ్టా? ఏంటది? తెరిచి చూడనా? వావ్! రాధాకృష్ణుల పాలరాతి విగ్రహాలు. చాలా బాగున్నాయి. కానీ సుధా! నువ్వు ఏదీ సరిగా అంచనా వెయ్యలేవని ఇంకోసారి రుజువయ్యింది."

         "ఏమయ్యింది రాధా? సారీ సుజీ!"

         "రాధాకృష్ణులు వారి జీవితంలో భార్యాభర్తలు కాలేదు. వారు గొప్ప ప్రేమికులు మాత్రమే."

         "సుజీ! ఎందుకలా భయపెడతావు? నీ మాటలు నన్ను కలవర పెడుతున్నాయి. నీకోసం మరో తాజ్ మహల్ కడతాను. ఆకాశంలోని తారల్ని కోసుకొస్తాను."

         "ఆ... ఆ... నో... నో... సుధా! తాజ్ మహల్ కడితేనే నామీద ప్రేమ ఉన్నట్టు కాదు! నాకోసం, ఇంట్లో కూరగాయలు తరిగినా, గిన్నెలు తోమినా, బట్టలు ఉతికి ఆరేసినా, ప్రేమ ఉన్నట్టే లెక్క!!"

         "నీకంతా వేళా కోళంగా వుంది. కానీ, నాకు జీవన్మరణ సమస్యలా వుంది."

         "నేను నిజంచెబుతున్నాను. మనం సున్నిత మనస్కులమయినా కొన్ని నిజాలు తెలుసుకోవాలి."

—---

         "సుజీ కంగ్రాట్స్ ఎం. డి. ఎస్ పూర్తిచేశావు. అదీ మెరిట్తో."

         "సుధా, నీకు కూడా కంగ్రాట్స్."

         "నీ కల నెరవేరింది కదా, నాకు చాలా సంతోషంగా వుంది."

         "అమ్మానాన్నల కల నెరవేరింది. కానీ ఇంకా ఫై చదువులు చదవాలని వుంది."

         "చిల్డ్రన్ స్పెషలిస్ట్ అయ్యావు. అందరూ కోరి నీ దగ్గర ట్రీట్మెంట్ కోసం వస్తున్నారు. పిల్లలు కూడా నిన్ను ఇష్టపడుతున్నారు. కథలు చెబుతూ, ఆడిస్తూ వాళ్ళకి నొప్పి తెలియకుండా ట్రీట్మెంట్ చేస్తున్నావు. నిన్ను చూస్తుంటే నాకు గర్వంగా వుంది. ఇంకా ఏం చదవాలి?"

         "జీవితాన్ని సార్ధకం చేసుకోవాలని, పీహెచ్ డి చెయ్యాలని కొత్త విధానాలు కనిపెట్టాలని వుంది."

         "ఇంకా చదువుతాను అంటున్నావు. కానీ నీకు నన్ను పెళ్ళి చేసుకోవాలని లేదని చెప్పవేం?"

         "నిజమే ప్రస్తుతానికి పెళ్ళి చేసుకోవాలని లేదు. పెళ్ళి ఒక బంధంలా వుండాలి కాని బంధనంలా వుండకూడదు."

         "అది కాదు. పెళ్ళి అనేది ఒక వయసులో చేసుకోవాలి. ఏ వయసు కా ముచ్చట అన్నారు కదా."

         "వయసు, అచ్చట, ముచ్చట అనుకోడానికి ఇదేం రామాయణ కాలం కాదు."

         "మీ నాన్నగారు దీనికి ఒప్పుకుంటారా?"

         "నేను చదువుకుంటాను అంటే మానాన్న నన్ను చదివిస్తారు. కూతురి చదువు ఆపి పెళ్ళి చేసేస్తే నా బాధ్యత తీరిపోతుంది. అని అనుకొనే మనస్తత్వం మా నాన్నది కాదు. ఆవిషయం నీకు కూడా బాగా తెలుసు."

         ----

         "హలో సుజీ ఆఖరు సారి అడుగుతున్నాను. ఇంకా మించిపోయింది లేదు. మనం పెళ్ళి చేసుకుందాం. నీ చదువు, నా తెలివి కలిస్తే మనం అద్భుతాలు సృష్టించివచ్చు. మనం కోట్లు సంపాదించవచ్చు."

         "సారీ, సుధా, డబ్బు సంపాదన నాధ్యేయం కాదు. మన అభిప్రాయాలు కలవట్లేదు. మన ఆలోచనలు, ఆశయాలు వేరు. వైద్యో నారాయణో హరిః అన్నారు. అది నేను నమ్ముతాను."

         "మరి, మన ప్రేమ సంగతి ఏమిటి?"

         "మనది ప్రేమ కాదు. ఆకర్షణ మాత్రమే."

         "ఇన్నాళ్ళ మన ప్రేమను కాదంటావా?"

         "ప్రేమ అనుకుని నటిస్తూ, మనం చివరిదాకా ఆనందంగా కలిసి జీవించలేము."

—-

          మరో, నాలుగేళ్ళు గడిచాయి. వారి మధ్య ఆకర్షణ క్రమంగా తగ్గసాగింది. విశాల ప్రపంచంలో అడుగుపెట్టాక, ఎన్నో వాస్తవాలు తెలుసుకున్నారు.  

         "నువ్వన్నది నిజం సుజీ! మనం మంచి స్నేహితులుగానే వుండిపోదాము." 

         పదకోట్లు కట్నం తెచ్చిన అమ్మాయితో సుధాకర్ పెళ్ళి, కట్నం లేకుండానే సుజీ పెళ్ళి మరో డాక్టర్తో వారి  అంతస్తులకు తగ్గట్లే వేరువేరుగా జరిగిపోయాయి.

         ఎవరి జీవితాల్లో వారు సంతోషంగానే వున్నారు. వారి పనుల్లో బిజీ ఐపోయారు. సుధాకర్ పెద్ద మల్టీ స్పెషలిటీ హాస్పిటల్కి ఓనర్ అయ్యాడు. బెంజ్ కార్లో తిరుగుతున్నాడు.

         సుజీ ఐ10 కారు కొనుక్కుంది. పేదవారికి ఉచితంగా వైద్యం చేస్తోంది. భర్త సహకారంతో, తన చదువునూ ఇంకా, కొనసాగిస్తోంది. వైద్య రంగంలో కొత్త అధ్యాయాలను సృష్టిస్తోంది.

         ఎప్పుడయినా మెడికల్ కాలేజ్ వైపు వెళితే పాత విషయాలు గుర్తుకొచ్చి వారి పెదాలు చిరునవ్వుతో క్షణకాలం పాటు విచ్చుకుంటుంటాయి.

         ------

0 Reacties