స్వయంకృతం
స్వయంకృతం (Author: నూతలపాటి వెంకట రత్న శర్మ)
శంకరం బట్టల కొట్టు పెట్టుకున్నాడు. అతనికి ఇద్దరు కొడుకులు. పెద్దవాడు రాజాకి పెళ్ళయ్యింది. రెండోవాడు రమేష్. రమేష్ యం. బి. బి. ఎస్. చదువుతున్నాడు. శాస్త్రి గారు జాతకం బాగా చెబుతాడని ఆ వూళ్ళో పేరు. అందుకే ఆయన్ని వెతుక్కుంటూ వచ్చాడు శంకరం.
‘‘శాస్త్రిగారు! బాగున్నారా” అంటూ పలకరిస్తూ అడుగుపెట్టాడు శంకరం.
ఎవరూ? ‘‘శంకరమా! రా!’’ అంటూ లోపలికి ఆహ్వానిస్తూ కూర్చోమంటూ కుర్చీచూపించాడు తనొక కుర్చీలో కూర్చుంటూ శాస్త్రి.
‘‘శాస్త్రిగారు! మా రెండోవాడికి పెళ్ళెప్పుడౌతుందో చూసి చెప్పండి’’. అని చేతిలో ఉన్న కంప్యూటర్ జాతకాన్ని ఆయన చేతిలో పెట్టాడు శంకరం.
శాస్త్రిగారు ఆ జాతకాన్ని కొంత సేపు పరిశీలించిన తర్వాత ఈ సంవత్సరాంతంలో పెళ్ళవుతుందని చెప్పాడు. కొంత దక్షిణ చెల్లించుకుని శంకరం నెమ్మదిగా అక్కడి నుండి బయటకు వెళ్ళాడు. శంకరం వెళ్తుండగానే నరసింహారావు లోపలికి వచ్చాడు. వెళ్తోన్న శంకరాన్ని పలకరించి లోపలికి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు.
నరసింహారావు శాస్త్రి దగ్గరకు వచ్చి కాసేపుండి పిచ్చాపాటి మాట్లాడి వెళ్తుంటాడు.
‘‘శంకరం ఎందుకు వచ్చాడు” అడిగాడు నరసింహారావు శాస్త్రిని.
‘‘అతను నీకు తెలుసా?” అడిగాడు శాస్త్రి.
‘‘శంకరం మా వీధిలోనే ఉంటాడు” చెప్పాడు నరసింహారావు.
‘‘వాళ్ళ రెండోవాడి జాతకం చూసి పెళ్ళెప్పుడో చెప్పమన్నాడు.’’ అన్నాడు శాస్త్రి.
‘‘వాణ్ణి యం. బి. బి. ఎస్. చదివిస్తున్నాడు. వీడికేమో వ్యాపారం సరిగా నడవటం లేదు. పెద్దకొడుకేమో అత్తగారింట్లో తిష్ఠ వేశాడు. పైగా అప్పుల్లో మునిగి ఉన్నాడు’’ అన్నాడు నరసింహారావు శంకరం గురించి కొంత ఇన్ఫర్మేషను అందిస్తూ.
‘‘ఎంతుంటుందేంటి అప్పు’’ అన్నాడు శాస్త్రి ఆరాగా
‘‘ఆ! ఉంటుంది ఒక యాభై లక్షలు’’ అన్నాడు నరసింహారావు
‘‘మరి ఆస్తి ఏమైనా ఉందా?’’ అడిగాడు శాస్త్రి మళ్ళీ
‘‘ఇల్లొకటుంది. పాతికముఫ్పై లక్షలు చేస్తుంది.’’ అంతకుమించి వేరే ఆస్తులు ఏమీలేవు’’ అన్నాడు
‘‘మరి అప్పు తీర్చటం ఎట్లా?’’
‘‘అదేవాడి బాధ. రెండోవాడికి పెళ్ళిచేసి ఆ కట్నంతో అప్పులు తీర్చుకోవాలని వాడి ఆశ’’ అన్నాడు నరసింహారావు
ఇంకా ఆ గొడవంతా తనకెందుకులే అని శాస్త్రి ఆ సంభాషణకి ఫుల్‌స్టాప్ పెట్టాడు. ఆ తర్వాత ఒక అరగంట పిచ్చాపాటి మాట్లాడి నరసింహారావు కూడా అక్కడి నుండి వెళ్ళటంతో శాస్త్రి కూడా లోపలికి వెళ్ళాడు.
శంకరం సంగతి విన్న దగ్గర నుండి మనసులో ఎన్నో ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయ్. కొడుకుల గురించి, కొడుకులు తెచ్చే కట్నం గురించి ఆలోచించటం శుద్ధ దండుగని శాస్త్రికి తెలుసు. స్వానుభవం అట్లాంటిది. కట్నం గురించి ఆలోచించటం కరెక్టుగాదని తన కొడుకు పెళ్ళిలోగాని శాస్త్రికి తెలిసి రాలేదు. శంకరం ఆలోచనల నుండి శాస్త్రి ఒక పట్టాన బయట పడలేదు.
శాస్త్రి కూడా తన కొడుక్కి నాలుగు లక్షలు కట్నం తీసుకునే పెళ్ళిచేశాడు. అయితే అందులో సగం తిరిగి బంగారం రూపంలో పెళ్ళికూతురికి పెట్టాడు. మిగతా సగం పెళ్ళిఖర్చులకు చాలక తనే కొంత అప్పుచేసి పెళ్ళి ఘనంగా చేశాడు. వాళ్ళు కట్నం ఇచ్చినట్లయ్యింది. తను తీసుకున్నట్లయింది. కాని పైసా మిగిలింది లేకపోగా చేతికి కొంత చమురు వదిలింది. కొడుక్కి పైసా ఇవ్వలేకపోయాడు.
ఇక రెండోది జాతకాలు సంగతి. జాతకాలు నమ్మి మంచి మంచి సంబంధాలను పోగొట్టుకొంటున్నవాళ్ళు ఎంతోమంది. గుడ్డి నమ్మకాల కన్నా ఏది జరిగితే అది జరుగుతుందని ఆనందంగా ముందుకు వెళ్ళినవాళ్ళు హాయిగా కాపురాలు చేసుకుంటున్నారు. జాతకాలపై ఆధారపడి మంచి సంబంధాలను వదులుకుని చివరకి నలభై ఏళ్ళ వయస్సులో ఎవరో ఒకర్ని కట్టుకోవటమో లేకపోతే బ్రహ్మచారిగా మిగిలిపోవటమో చూస్తున్నాం. అయినా జనం మారరు గాక మారరు. జాతకాలు చెప్పేనాలాంటి వాళ్ళు ఇలా ఆలోచించటం తప్పేమోకాని వాస్తవం మాత్రం ఇంతే! జాతకాలు దిశానిర్ధేశం చేస్తే పరవాలేదు కాని ఉన్నదానిని చెడగొడితేనే సమస్య. ఇలా ఆలోచిస్తూ శాస్త్రి నిద్రలోకి జారిపోయాడు కొంతసేపటికి.
శంకరం కొడుకు పెళ్ళి చేయ్యటానికి సంబంధాలు వెదకటం ప్రారంభించాడు. తనకు తెలిసినవాళ్ళకు కొడుకు ప్రొఫైల్ ఇచ్చాడు. మారేజ్ బ్యూరోలో కూడా రిజిష్టర్ చేశాడు.
ఏవో కొన్ని సంబంధాలు వచ్చినయ్. వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఒకటి రెండు సంబంధాలు చూద్దామనుకున్నారు శంకరం దంపతులు. ఆ సంగతే కొడుకు రమేష్‌కు ఫోన్ చేసి చెప్పాడు.
ఆ మాట చెప్పగానే రమేష్ ఇంతెత్తున ఎగిరాడు తండ్రిమీద. ‘‘సంబంధాలు ఎవరు చూడమన్నారు? నాకిప్పుడు పెళ్ళిచెయ్యమని అడిగానా?’’ అంటూ రంకెలేశాడు. వాళ్ళమ్మ నచ్చచెప్పటానికి ప్రయత్నించింది. వాళ్ళమ్మనీ అలాగే కసురుకున్నాడు వాడు. దాంతో చేసేది లేక కొంతకాలం పెళ్ళి ప్రయత్నాన్ని విరమించుకున్నాడు శంకరం.
అప్పుల వాళ్ళ వత్తిడి ఎక్కువ కావటంతో శంకరానికి ఏం చెయ్యాలో పాలుపోలేదు. పెద్దకొడుకు ఏమైనా ఆదుకోగలడేమోనని అడిగిచూశాడు. వాడు కూడా తోకతొక్కిన త్రాచులా బుసకొట్టాడు. ‘‘అంత అప్పులు ఎవరు చెయ్య మన్నారు? ఇప్పుడు ఇంత అవస్థ ఎవడు పడమన్నాడు? అసలు వాడిని అంత ఖర్చుపెట్టి చదివించకపోతే ఏం?’’ అంటూ లెక్చర్ ఇచ్చాడు. చివరగా ‘‘నా దగ్గర ఏమీ లేవు నేనే ఎలాగోలా నెట్టుకొస్తున్నాను’’ అన్నాడు వాడు. చేసేది లేక శంకరం నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు.
ఆ రోజు రాత్రి తల్లిదండ్రులిద్దరు ఒక నిర్ణయానికి వచ్చారు. రెండో కొడుకుని ఇంటికి పిలిపించి నెమ్మదిగా మాట్టాడి వాడిని పెళ్ళికి ఒప్పిద్దామనుకున్నారు. అనుకున్నదే తడవుగా వాడికి ఫోన్ చేసి ఈ శని ఆది వారాల్లో రమ్మని చెప్పారు. సరేనన్నాడు రమేష్.
శనివారం ఉదయం కొడుకు కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్న శంకరానికి ఊహించని పరిణామం ఎదురయ్యింది. రమేష్ ఒక అమ్మాయిని వెంటబెట్టుకుని వచ్చాడు. శంకరానికి శంకరం భార్యకి ఏంజరుగుతోందో క్షణకాలం అర్థంకాలేదు.
‘‘ఆ అమ్మాయి ఎవరురా?’’ అంది తల్లి ముందుగా తేరుకుని
‘‘ఆమె నా క్లాస్‌మేట్, పేరు మాధవి.’’ అన్నాడు రమేష్
“అంతవరకు బాగానే ఉంది. ఇంటికి ఎందుకు తీసుకువచ్చాడు?” అని సందేహపడుతూనే, ‘‘లోపలికి వచ్చి ముందు ఫ్రెష్ అయి రండి” అంది తల్లి.
తర్వాత కొంచెంసేపటికి మంచినీళ్ళు త్రాగటం అదీ అయిన తర్వాత ‘‘ఆ అమ్మాయిది ఏ ఊరు?” అని అడిగింది తల్లి.
‘‘హైదరాబాదు” అని కొంత గ్యాప్ ఇచ్చి, “నేను తను ప్రేమించుకున్నాం. పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాం” అన్నాడు రమేష్ మళ్ళీ.
దాంతో ఒక్కసారిగా కుప్పకూలినట్లయ్యింది శంకరం దంపతుల స్థితి. అందుకే ఇంతకాలం పెళ్ళిమాట ఎత్తగానే తప్పించుకుంటున్నాడు అనుకున్నాడు శంకరం. ఆ క్షణం వాళ్ళింట్లో పెద్ద యుద్ధమే జరిగింది.
“నిన్ను చదువుకో అని పంపిస్తే, ప్రేమ, పెళ్ళి అంటూ పిల్లని వెంటబెట్టుకొచ్చావా! ఆ పిల్ల ఎవరు? ఏ కులం? ఇవన్నీ మీకక్కరలేకపోయినా మాకు అక్కరలేదా!” అంది ఆక్రోశంగా తల్లి.
మీరేవేవో సంబంధాలు చూస్తారు. ఏ పల్లెటూరి పిల్లనో తెచ్చి నా మెడకు తగిలిస్తారు. జీవితాంతం ఆ పిల్లతో నేను బాధపడాల్నా?” అన్నాడు వాడు.
“నలుగురిలో మన పరువు ఏంగాను?” అంది తల్లి
“పరువుకోసం నా జీవితం పాడు చేసుకోను. నా జీవితం నాది. నా పెళ్ళి నా యిష్టం” అని తెగేసి చెప్పాడు వాడు.
తల్లి సమాధానం చెప్పలేక బోరుమని ఏడ్చింది.
‘‘సరేరా! నీ చదువు కోసం యాభైలక్షలు అప్పుచేశాను. ఇంకా నీ పెళ్ళి చేసి ఆ అప్పు తీరుద్దామనుకున్నాను. ఇప్పుడు నాగతేంకాను?” అడిగాడు తండ్రి శంకరం.
“అప్పు చేయటం నీ సమస్య. అంత చదివంచలేని వాడివి మమ్మల్నెందుకు కన్నట్లు” అడిగాడు నిష్ఠూరంగా వాడు. “అయినా నీ అప్పుని నేను ఉద్యోగం చేసి తీరుస్తాను అన్నాడు మళ్ళీ బింకంగా.
‘‘అంతేగాని లవ్‌మ్యారేజి చేసుకోవల్సిందేనంటావ్!’’ అన్నాడు తండ్రి. “ఇంత గొడవ చేస్తే ఇంకోసారి ఇంటికి కూడా రానంతే…” అంటూ రమేష్ తన స్నేహితురాలిని తీసుకుని వెంటనే రైల్వేస్టేషనుకు వెళ్ళిపోయాడు. తల్లి కుమిలి కుమిలి ఏడ్చింది. తండ్రైతే తన ఆశాసౌధాలన్నీ కూలినట్లయి నిస్సత్తువతో కూలబడ్డాడు.
ఆ రాత్రికి శంకరం భార్యకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి సీరియస్ అయ్యింది. అప్పటికప్పుడు హాస్పటల్‌లో చేర్చాడు శంకరం. ఒకటి రెండురోజులు మృత్యువుతో తీవ్రంగా పోరాడి మరణించిందామె.
కొడుకులిద్దరూ ఇంటికి వచ్చారు. తల్లి అంత్యక్రియలు అయిన తర్వాత ఆ రోజు రాత్రి ఆ ఇంట్లో అన్నదమ్ముల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. ఆస్తి పంపకాల గురించి గొడవ పడ్డారు కాని అప్పుల బాధ్యత ఏ ఒక్కరు తీసుకోలేదు.
‘‘వాడి చదువుకోసమే కదా అప్పు అయ్యింది. వాడినే ఆ అప్పులు తీర్చుకోమను’’ అన్నాడు పెద్దవాడు. ‘‘నీ ఆస్తి వద్దు, నీ అప్పు వద్దు” అన్నాడు రెండోవాడు.
తండ్రికి ఏం చెప్పాలో తోచలేదు. ‘‘మీరు తప్పించుకున్నా నాకు తప్పదు కదా! ఎట్లాగో నా తిప్పలు నేను పడతానులే మీరు గొడవపడకండి” అన్నాడు తండ్రి శంకరం.
మర్నాడు ఉదయాన్నే పెద్దకొడుకు అత్తగారింటికి వెళ్ళిపోయాడు. రెండోకొడుకు పట్నం వెళ్ళిపోయాడు. తండ్రి గురించి ఇద్దరూ ఆలోచించలేదు. ఒక్కడివే ఎట్లా ఉంటావనిగాని, కొన్నాళ్ళు మాతో ఉండమనిగాని ఇద్దరూ అనలేదు.
భార్య మృతితో ఏకాకి అయిన శంకరం ఉన్న ఇల్లుని, బట్టల కొట్టుని అప్పులవాళ్ళకి అప్పజెప్పి రాత్రికి రాత్రి ఎటో వెళ్ళిపోయాడు.
నరసింహారావు ఈ సంగతులన్నీ శాస్త్రిగారికి పూసగుచ్చినట్లు చెబుతున్నాడు ఎప్పటికప్పుడు.
కొంతకాలం గడిచింది. శాస్త్రిగారు కార్తీకమాసంలో శ్రీశైల క్షేత్రానికి వెళ్ళాడు.
‘‘శాస్త్రిగారు! బాగున్నారా!’’ అన్న పిలుపుతో పలకరించిన అతనిని పరిశీలనగా చూశాడు శాస్త్రిగారు. ఎదురుగా శంకరం, గుర్తించేంతలో ‘‘నేనండి! శంకరాన్ని గుర్తు పట్టలేదా!’’ అన్నాడు శంకరం.
‘‘ఓ శంకరమా! ’’ ఎక్కడుంటున్నావ్?’’ అడిగాడు శాస్త్రిగారు.
‘‘ఇక్కడే ఒక వృద్ధాశ్రమంలో ఉంటున్నా, జరిగిందంతా మీకు తెలిసే ఉంటుంది కదా! అప్పుల పాలయ్యాను. భార్య పోయింది. కొడుకులు ఎవరి దారి వారు చూసుకున్నారు. దిక్కుతోచక ఇక్కడ చేరాను’’ అన్నాడు వాపోతూ.
‘‘సరే! ఏంచేస్తాం ప్రారబ్ధం అంతే’’ అన్నాడు శాస్త్రిగారు సానుభూతితో.
మళ్ళీ కొంచెంసేపు ఉండి శంకరమే అన్నాడు. “పిల్లల్ని కంటాం గాని, వాళ్ళ తలరాతల్ని కనలేం. మనమే ముందుచూపుతో వ్యవహరించాలి. మన ఆర్థిక స్థితిగతుల కనుగుణంగా మన జీవితం గడుపుకోవాలి. మంచం ఉన్నంత వరకే కాళ్ళు ముడుచుకోవాలంటారు పెద్దలు అందుకే. దొరికినయ్ కదా అని అప్పులు చేసి తప్పు చేశాను. అది నా స్వయంకృతం. ఇప్పుడు పశ్చాత్తాపపడి ప్రయోజనం లేదు, అనుభవించ తప్పదు. కాకపోతే నాలాంటి వాళ్ళందరికీ, నా కథ కనువిప్పుకావాలని కోరుకుంటున్నాను అన్నాడు శంకరం ఆర్ద్రంగా. ఆ తరువాత ఇద్దరూ అక్కడ నుండి నిష్క్రమించారు.
::::::