సైకిల్ సవారి
సైకిల్ సవారి (Author: సుదర్శనం రంగనాధ్)
కొన్ని జీవితాలు అంతే! ఏది వద్దని వదిలేస్తారో! అది వారిని ఏలినాటి శనిలా పట్టుకుంటుంది. ఏంచేస్తారు? పాపం రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం వదలదన్నట్లు ఒక్కొక్కరి (పారబ్ధం అంతే. సరే... విషయం ఏంటంటే?
శోభన్ బాబుకు పక్కూరి పిల్ల శ్రీదేవి తో ఈ మధ్యే పెళ్లి ఖాయం అయ్యింది. శోభన్ బాబుకున్న ఆస్తి, పాస్తి చూసి చదువు తక్కువైనా, పిల్ల సుఖపడుతుందని సంబంధం ఖాయం చేశారు పెద్దలు. అప్పటికే ముప్పై ఏళ్ళు నిండిన శోభన్ బాబుకు ఆస్తీ, పాస్తీ అన్నీ ఉన్నా, పల్లెటూరువాడని చదువు తక్కువని ఏ సంబంధం కుదరటంలేదు. ఈ పరిస్థితిలో చదువుకున్న అందగత్తె శ్రీదేవితో పెళ్లి ఖాయం కావడంతో శోభన్ బాబు తెగ సంబర పడిపోయాడు.
ఇక శ్రీదేవికి హీరో శోభన్ బాబoటే పిచ్చి అభిమానం, అందుకే కాబోయే భర్త పేరు శోభన్ బాబు అని వినగానే ఒళ్ళు పులకించి తనను తాను మర్చిపోయి పెళ్ళికి డబుల్ ఒకే చెప్పింది.
పెళ్లి చూపుల నాడు శోభన్ బాబుకు, శ్రీదేవికి జరిగిన ఏకాంత సంభాషణలో.. ఆ పిల్ల పిచ్చిపిచ్చిగా నచ్చిన మైకంలో శోభన్ బాబు వీర లెవల్లో ఫోజు కొట్టి...
"దేవి ఏమిటి నీ కోరిక?" అని రెచ్చిపోయి అడిగాడు.
దానికి శ్రీదేవి... "ఊఁహూ...." అంది కాలి బొటనవేలు నేలపై రాస్తూ... చున్నీని..... చూపుడు వేలుకు ముడివేస్తున్నట్లు తిప్పుతూ.
"అబ్బ ఏంటో చెప్పు... ప్లీజ్" అన్నాడు శోభన్ బాబు.
"మరీ... మరీ.. నాకు చిన్నప్పటినుండి తీరని కోరిక ఒకటుంది!" అంది సిగ్గు పడుతూ శ్రీదేవి.
"ఏంటో చెప్పు... ఏంచేయమన్నా చేస్తాను?" అన్నాడు శోభన్ బాబు ప్రేమగా...
మళ్లీ... శ్రీదేవి సిగ్గుపడుతూ... ముఖం చేతుల్లో దాచుకుంది. ఒక ఆడపిల్ల, అందునా కాబోయే భార్య కోరిక తీర్చకుంటే ఎలా? అనుకొని, “నీ కోరిక ఏదైనా ఎంతటిదైనా చెల్లించే పూచి నాది, నువ్వు సంకోచించక చెప్పు దేవీ” అన్నాడు ఎలాగైనా ఆమెతో చెప్పించి, ఆ కోరిక తీర్చి తన ప్రతిభను నిరూపించుకోవాలని శోభన్ బాబుఆరాటం.
మళ్ళీ సిగ్గుతో మొగ్గలా ముడుచుకుపోయింది శ్రీదేవి. అడాగాలా? వద్దా? అన్న మీమాంసలో కొట్టుమిట్టాడుతూ..
శోభన్ బాబు రెచ్చిపోయాడు. "సరే దేవి, అట్టి ఆకాశంలోని జాబిల్లిని తెచ్చి చెండులా, పూదండలా నీ వాలుజడలో ఉంచమందువా?" హయ్యారే... శిరోజాలకు భారమౌనేమో కదా!? చంద్రవంకను తుంచి నీ తలపై హెయిర్ బ్యాండ్ లా అలంకరించమందువా!? ఓహ్.. నీకు నచ్చదేమో కదా! మచ్చారే!! అట్టి నక్షత్రరాశులను హారాలుగా గుదిగుచ్చి నీ మెడలో దండలా వేయ మందువా? లేదా... అట్టి సప్తవర్ణ శోభితమైన ఇంద్రధనస్సును తెచ్చి నీ నడుముకు వడ్డాణంలా చుట్టమందువా?” అని కైపెక్కిన సంతోషంలో తనలోని పైత్యాన్ని కవిత్వంలా చెప్పి, “ఇదిగో నువ్వు చెప్పకుంటే నా మీద ఒట్టే” అన్నాడు శోభన్ బాబు.
అలా... ఒట్టేసి మరీ మరీ అడగటం బుద్ధి తక్కువయ్యిందని ఆమెను అడిగాక గానీ తెలిసి రాలేదు శోభన్ బాబుకు.
"మరేను.... మరీ, నాకు దేవత సినిమాలో.... శోభన్ బాబు శ్రీదేవిని సైకిల్ ముందు కూర్చోబెట్టుకొని డబుల్ సవారీ చేసినట్లు, మనం కూడా అలా టేప్ రికార్డర్లో పాటలు వింటూ, సైకిల్ షికారు చేయాలని ఉంది!" అని బుంగమూతి పెట్టి మూ డువంకర్లు తిరిగి తన కోరికను తెలిపింది శ్రీదేవి.
ఆ మాట వింటూనే గుండెల్లో పిడుగులు పడ్డాయి శోభన్ బాబుకు, సైకిల్ తొక్కడం రాదంటే ఎక్కడ పరువు పోతుందోననుకొని, "ఓహ్ అంతేనా!" అని పైకి అన్నా, “హతవిధీ! ఎంత కష్టం వచ్చిపడిందిరా భగవంతుడా!” అనుకొని, ఎలాగైనా దేవి మనసు మళ్లించాలని తన తెలివితేటలతో ఆమెను బురిడీ కొట్టించాలనుకొని, గుటకలు మింగి, గొంతును సవరించుకొని ఇలా అన్నాడు శోభన్ బాబు.
“ఛీ... అంత చీప్ కోరికనా! ఏ మెర్సిడెస్ బెంజ్ కారో, విమానమో ఎక్కుతానని అడగాలి కానీ ఇదేంటి?” అన్నాడు శోభన్ బాబు.
శ్రీదేవి ముక్కుపుటాలదిరాయి, కండ్లు ఎరుపెక్కాయి... కొంగు అడ్డం పెట్టుకొని బోరున ఏడ్వబోయింది.
“ఛ.. చా... ఊరకే జోక్ చేశానంతే. అలాగే చేద్దాం. సరేనా?” అని అనునయించాడు శోభన్ బాబు ఇక తప్పదన్నట్లు.
“కానీ ఒక షరతు” అంది శ్రీదేవి.
“ఏంటి?” అన్నాడు శోభన్ బాబు జావగారిపోతూ. మళ్ళీ ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని భయపడుతూ.
“ఒక్క నిముషం” అని శ్రీదేవి తను దాచుకున్న డబ్బుల పర్సు ను శోభన్ బాబు చేతిలో పెట్టి వీటితో "ఒక హీరో సైకిల్, టేప్ రికార్డర్ కొనమని” చెప్పింది. “కాదు, కూడదు, వద్దు అంటే నా మీద ఒట్టే." అని శోభన్ బాబు మారు మాట్లాడకుండా బ్రేకులు వేసింది శ్రీదేవి.
పెళ్లి చూస్తే దగ్గరలోనే ఉంది. ఎంతో ప్రేమతో డబ్బులిచ్చి మరీ తన కోరిక తీర్చమన్నది శ్రీదేవి. అందుకే ఇక తప్పదని సైకిల్ నేర్చుకోవాలని భీష్మ శపథం చేశాడు శోభన్ బాబు.
ఇప్పడు శోభన్ బాబుకు ముప్పై ఏళ్ళు వచ్చాయి, కారు, మోటార్ సైకిల్ డ్రైవింగ్ వచ్చినా, ఈ దిక్కుమాలిన సైకిల్ తొక్కే అవసరం వస్తుందని కలలో కూడా అనుకోలేదు.
ఎప్పుడో చిన్నప్పుడు స్నేహితులతో ఓ కిరాయి సైకిల్ తీసుకొని అందరి లాగే ప్రయత్నించాడు. ఖర్మకొద్దీ శోభన్ బాబు చెయ్యి పడగానే దాని చైను తెగి పడింది. వాళ్ళ నాన్నకు తెలిస్తే చావగొడతాడని భయపడి, స్నేహితుల దగ్గర అప్పుచేసి చైను బాకీ చెల్లించాడు. నోరు కట్టుకొని, సినిమాలు షికార్లు మానుకొని, పైసా పైసా కూడబెట్టి ఆ బాకీ తీర్చడానికి నానా తంటాలు పడ్డాడు. ఆ దెబ్బతో మళ్ళీ సైకిల్ జోలి తీస్తే ఒట్టు. అలా శోభన్ బాబు బాల్యం సైకిల్ కు దూరం అయ్యింది.
కానీ ఇప్పుడు శ్రీదేవి కోసం తప్పింది కాదు, కానీ ఈ విషయం నలుగురికీ తెలిస్తే నవ్విపోతారు. కానీ తప్పదు. అందుకే, గుట్టుచప్పుడు కాకుండా రాత్రిళ్ళు నేర్చుకునే ప్రోగ్రాం పెట్టాడు. తోడుగా ఎదురింటి బాబ్జీగాడిని జత చేసుకున్నాడు. అలా వచ్చినందుకు వాడికి రోజూ ఒక పుల్ల ఐసు, లెమన్ షోడా లంచంగా ఇవ్వాలి. అదనంగా ఈ విషయం ఎవ్వరికీ చెప్పనందుకుగాను వాడికి రెండు రౌండ్లు కొత్తసైకిల్ తొక్కే ఛాన్స్ కూడా ఇవ్వాలి. ఇది వాడితో శోభన్ బాబు ఒప్పందం.
ఒక మంచి ముహూర్తం చూసుకొని ఓ టెంకాయ కొట్టి, రాత్రి కాగానే రెండో ఆట సినిమాకని చెప్పి సైకిల్ సర్కస్ మొదలుపెట్టాడు శోభన్ బాబు.
లుంగీ గోచిలా పెట్టుకొని ఒక ఎత్తైన బండరాయి చూసుకొని సైకిల్ పై ఎక్కాడు, శ్రీదేవి గుర్తుకు వచ్చి ఏనుగు నెక్కినంత సంబరం అయ్యింది శోభన్ బాబుకు. బాబ్జీగాడు వెనుక పట్టుకొని బ్యాలన్స్ చేస్తుంటే అష్టవంకరలు తిరుగుతూ, కొద్దిదూరం పోగానే దబీమని క్రింద పడ్డాడు. రెండు మోచేతులు, మోకాలి చిప్పలు డోక్కుపోయి రక్తం వచ్చింది. బాబ్జీ గాడు ఒకటే నవ్వులు.
అయినా దెబ్బలు తగలకుండా సైకిల్ ఎలావస్తుంది? కాబోయే పెళ్ళాం కోసం నొప్పిని పంటిబిగువున ఓర్చుకొని మళ్ళీ సైకిల్ ఎక్కాడు, ఈసారి బ్యాలెన్స్ తప్పి, జారి బురద పొలంలో పడ్డాడు. బాబ్జీగాడు మళ్ళీ నవ్వుడే నవ్వుడు.
ఇక లాభం లేదని ఆవేళ కు ట్రైనింగ్ ప్రోగ్రాం ఆపి ఇంటికి వెళ్ళారు. దారిపొడవునా, బాబ్జీగాడు కడుపు పట్టుకొని నవ్వుతూనే ఉన్నాడు.
తెల్లవారి ఒళ్లంతా ఒకటే సలపరింతలు. “ఏంటీ ఖర్మ?” అనిపించింది. “ఇది నా వల్ల కాదని శ్రీదేవితో చెపితేనో!” అనిపించింది. దీనికి బదులు తనను విమానం ఎక్కిస్తానని చెప్పటం మంచిది అనుకున్నాడు. కానీ మళ్ళీ అనిపించింది “పాపం పైసా పైసా కూడేసి మరీ డబ్బులు ఇచ్చింది తనకోసం ఆ మాత్రం చెయ్యలేనా?” అని తనకు తాను సర్ధిచెప్పుకున్నాడు శోభన్ బాబు..
చీకటి పడగానే బాబ్జి గాడు వచ్చాడు. తప్పదన్నట్లు మళ్ళీ మొదలు పెట్టాడు, ఈరోజు కాస్త పర్వాలేదు. ఎత్తునుండి పల్లానికి తొక్కుతూ పడబోయే ముందు కాళ్ళతో బ్యాలన్స్ చేసి ఆపటం వలన కింద పడే ప్రమాదం తప్పింది.
మొత్తానికి ఒక వారం రోజులు ఇబ్బంది పడ్డాక సైకిల్ తొక్కడం వచ్చింది. కానీ ఇక్కడే పెద్ద చిక్కొచ్చి పడింది శోభన్ బాబుకు. ఎంతగా ప్రయత్నించినా సైకిల్ ఎక్కడం, దిగడం మాత్రం రావడంలేదు.
ఓ బండ రాయి సపోర్ట్ తో ఎక్కడం, మళ్ళీ బండరాయి సపోర్ట్ తో దిగడం మాత్రం వచ్చింది. ‘ఇంక ప్రయత్నించినా రాదు’ అని నిశ్చయించుకొని, ‘ఇది చాలు దీనితో శ్రీదేవి కోరిక తీర్చవచ్చు’ అనుకున్నాడు శోభన్ బాబు.
మొత్తానికి పెళ్లయిపోయింది. రోజులు, వారాలు గడిచిపోయాయి, సైకిల్ ను చూసినప్పుడల్లా శోభన్ బాబు గుండెల్లో గుబులేసేది. ఎప్పుడు ఉపద్రవం ముంచుకొస్తుందోనని హడలిపోయేవాడు.
ఒకరోజు అనుకున్నంతా అయ్యింది, ఆరోజు ఇంట్లో ఎవ్వరూలేరు, శ్రీదేవి ఆరోజు తన ముచ్చట తీర్చమని ముచ్చట పడింది.
"సరే పదా!" అనక తప్పింది కాదు. శ్రీదేవి ముఖం వెలిగిపోయింది, ఎప్పటినుండో ఎదను దాగిన కోరిక తీరబోతున్నందుకు చాలా సంతోషపడింది. ప్రత్యేకంగా పెళ్లి పట్టుచీర కట్టుకొని, తలనిండా మల్లెలు పెట్టుకొని, మంచి సువాసనలు విరజిమ్మే బాడీ డియాడరెండ్ స్ప్రే చేసుకొని చక్కగా ముస్తాబయి, శోభన్ బాబు ను కొత్త బట్టలు వేసుకోమని చెప్పి, రడీ అంది శ్రీదేవి.
‘పాపం శ్రీదేవికి నా సంగతి తెలియక చక్కగా ముస్తాబయింది. కింద పడితే పట్టుచీర గోవిందా! బురదలో పడితే సెంటువాసన గోవిందా! గోవిందా!!’ అనుకుని, ఎలాగైనా ఈ గండం గట్టెక్కించి.. ఏ ఉపద్రవం ముంచుకు రాకుండా చూడమని గణపతిని, ధైర్యం కోసం ఆంజనేయస్వామిని మొక్కుకుని, శ్రీదేవి కొనిచ్చిన అంబర్ సైకిల్ బైటికి తీశాడు శోభన్ బాబు.
జాగ్రత్తగా దారిలో ఎక్కడానికి దిగడానికి అవసరమైన రాళ్ళు రోడ్డు పక్కన పక్కాగా ఏర్పాటు చేసుకొని, ముందే రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నాడు శోభన్ బాబు.
చేతిలో ఓ బుట్ట, అందులో ఓ జంపకానా, తినడానికి చిరుతిళ్ళు, మంచి నీళ్ళ బాటిల్, టేప్ రికార్డర్ తో శ్రీదేవి దేవతలా కదిలింది.
ఊరిలో సైకిల్ ఎక్కడం బాగుండదని ఊరి చివరదాకా తీసుకెళ్ళి, అడ్డా రాగానే శోభన్ బాబు శ్రీదేవి ని సైకిల్ ఎక్కించుకున్నాడు.
శ్రీదేవి టేప్ రికార్డర్ ఆన్ చేసింది. పాట మొదలయ్యింది. “కుడికన్ను కొట్టగానే కుర్రాణ్ణి ఎడమకన్ను కొట్టగానే ఎర్రాణ్ణి”... “నిజమే వెర్రిబాగులోడ్ని! కొత్తజంట ఏ బైకో, కారో ఎక్కకుండా తొక్కరాని ఈ సైకిల్ ఎక్కడం ముమ్మాటికీ వెర్రితనమే కదా!” అనుకున్నాడు శోభన్ బాబు.
“ఏమాటకామాటే గానీ, శ్రీదేవి టేస్టే టేస్టు. ముందు పడుచు పెళ్లాం, ఆ రాపిడి, ఆ ఒరిపిడి, ఆ ఘుమఘుమలు ఈ పిల్లగాలి, ఆ చల్లగాలి ఈ మజాయే వేరు!” అనిపించింది శోభన్ బాబుకు. ఇంకో పాట మొదలయ్యింది. “ఎల్లువొచ్చి గోదారమ్మా.... ఎల్లకిల్లా పడ్డాదమ్మా…” “గోదారమ్మ కాదు. మేము ఎల్లకిల్లా పడకుంటే చాలు” అనుకున్నాడు శోభన్ బాబు.
ముందు పడుచు పెళ్ళాం, హుషారెక్కించే పాటల హుషారు. ఒళ్ళు మరిచిపోయాడు శోభన్ బాబు, ఆ సంతోషంలో తన రూట్ మ్యాప్ రాళ్ళ సంగతి మరిచిపోయాడు. సోయి తెచ్చుకునే సరికి తన రూట్ మ్యాప్ లో ఎక్కడా ఒక్క రాయి కనపడటం లేదు. “అబ్బా! పెట్టిన రాళ్లన్నీ ఏమైనట్టు?” అనుకున్నాడు.
ఇటు సైకిల్ సవారి, అటు పాటల జోరుకు శ్రీదేవి యమ హుషారుగా ఉంది. పాపం శోభన్ బాబుకు చెమటలు పడుతున్నాయి. అగుదామంటే ఒక్కరాయి ఎక్కడా కనిపించడం లేదు. ఎదురుగా నీటి కాలువ వచ్చింది. “హుషారుగా తొక్కండి” అంది శ్రీదేవి, కన్ ఫ్యూజన్ లో కసిగా తొక్కాడు శోభన్ బాబు. సైకిల్ వేగానికి నీళ్ళు సఁయ్యిమని చిమ్మాయి. సైకిల్ జుమ్మని దాటి పోయింది. “హమ్మయ్య” అనుకున్నాడు శోభన్ బాబు. కానీ ఇప్పుడెలా...?
“శ్రీరామ చంద్రా! నారాయణా! ఎన్ని కష్టాలు తెచ్చావురా నాయనా!” పాట మొదలయ్యింది. నిజమే ఇంతకన్నా కష్టం ఏముంటుంది అనుకున్నాడు. శోభన్ బాబు గుండెలదురుతున్నాయి అసలే కొత్త పెళ్ళాం, పైగా కోరి కొనుక్కున్న పట్టుచీర. పై ప్రాణాలు పైనే ఎగిరిపోయాయి శోభన్ బాబుకు. సైకిల్ ఆగదు, ఆపలేడు కూడా! శ్రీదేవి ఈ లోకంలో లేదు.
ఎందుకైనా మంచిదని ఇక తప్పేట్లు లేదని తన సైకిల్ బలహీనతను శ్రీదేవికి చెప్పాడు శోభన్ బాబు. శ్రీదేవి పక పకా నవ్వ, “నాకీ విషయం బాబ్జీ గాడు ముందే చెప్పాడు” అంది శ్రీదేవి ఇంకా గట్టిగా నవ్వుతూ..
“పాపం నాకోసం ఇన్ని కష్టాలు పడ్డారా!” అని శోభన్ బాబు చేతిని ఎదపై పెట్టుకొని ముద్దు పెట్టింది శ్రీదేవి. నరాలు జివ్వుమన్నాయి. “కింద పడి పోతాము” అన్నాడు శోభన్ బాబు భయంగా.
“నో.... ఛాన్స్“ అంది శ్రీదేవి ధైర్యంగా..
“ఎలా!” అన్నాడు శోభన్ బాబు.
“అదిగో... బాబ్జీ గాడు” అంది శ్రీదేవి.
“వాడు చూస్తే ఊరంతా చెపుతాడు” అన్నాడు శోభన్ బాబు..
“ఏ... ఇప్పుడు చెప్పలేదనుకున్నావా?” అంది శ్రీదేవి.
“మన వెనుక మనం ఎలా పడతామా! అని కెమేరాలు పట్టుకొని చాలా మందే ఉన్నారు” అంది శ్రీదేవి.
“అమ్మ బాబ్జీగా! ఎంత పని చేశావురా! రాళ్ళన్నీ మాయం చేసింది నువ్వన్న మాట” అనుకున్నాడు శోభన్ బాబు.
శోభన్ బాబు కంగారు పెరిగిపోయింది, శ్రీదేవి శోభన్ బాబు చెయ్యి మీద చెయ్యి వేసి, “ధైర్యంగా ఉండండి, నేను చెప్పినట్లు చేయండి? ఈ బాబ్జీ గాడు ఆ జనాలు ఇక జన్మలో నవ్వరు” అంది శ్రీదేవి.
“ఎలా!” అన్నాడు శోభన్ బాబు.
“బ్రేకులు వేసి, సైకిల్ స్లో చేసి.. ఎడమ వైపు ఒరగండి, నేను కాళ్ళు కింద పెడ్తాను ఇద్దరం సేఫ్” అంది శ్రీదేవి. శోభన్ బాబు కు పట్టరాని ధైర్యం వచ్చింది.
అలాగే చేశాడు. నిజమే అలాగే జరిగింది, సైకిల్ ఆగింది, ఇద్దరూ దిగి. సైకిల్ పక్కకు పెట్టి, జంపకానా పరుచుకొని తెచ్చిన పదార్థాలు తిన్నారు. దూరంగా బాబ్జీగాడు, వాడి గ్యాంగు ముఖాలు నల్ల బడ్డాయి.
"దిగాము సరే, మరి.. ఎక్కడ ఎలా?" అన్నాడు శోభన్ బాబు సందేహంగా.
"మై.. హుం నా!?" అంది శ్రీదేవి భరోసాగా.
“అదే.. ఎలా?” అన్నాడు శోభన్ బాబు.
"ఎక్కేటప్పుడు.. ముందు కడ్డీ దగ్గర సపోర్టుగా నేను నిలబడతాను. నువ్వెక్కుతావు. అలా…"అంది.
ఇద్దరూ మళ్ళీ సైకిల్ ఎక్కారు, నిజంగా శ్రీదేవి పక్కనుంటే ఆ కిక్కేవేరు అన్నట్లు అన్నీ అలా వచ్చేస్తున్నాయి అనుకున్నాడు శోభన్ బాబు.
మళ్ళీ పాట మొదలయ్యింది. “పోరా... శ్రీమంతుడా.....”
అలా.. సైకిల్ సవారీలో మాత్రమే కాదు, జీవితంలో శ్రీదేవి తోడు శోభన్ బాబుకి ధైర్యం అయ్యింది, ధైర్యే సాహసే లక్ష్మీ అన్నారుగా పెద్దలు? అలా ఒకరికి ఒకరు తోడై.. వ్యాపారాన్ని వృద్దిలోకి తెచ్చారు.
అప్పుడప్పుడు సైకిల్ సవారీని ఆస్వాదిస్తూ... జీవితయాత్రను కొనసాగించారు శ్రీదేవి, శోభన్ బాబు.
శ్రీదేవి కోసం సైకిల్ నేర్చుకున్నాడు శోభన్ బాబు. కింద పడతానని తెలిసినా సైకిల్ ఎక్కింది శ్రీదేవి.
దాపరికం లేకుండా నిజం చెప్పాడు శోభన్ బాబు, తోడుగా నిలబడి ధైర్యం ఇచ్చింది శ్రీదేవి. అలా అరమరికలు లేకుండా ఒకరికోసం ఒకరు నిలబడితే ఏ సంసారంలోనూ ఒడిదొడుకులు రావు కదా!.
ఇప్పుడు తన పిల్లలకు చక్కగా సైకిల్ నేర్పిస్తున్నాడు శోభన్ బాబు.
********