సంపాదకీయం

సంపాదకీయం

గత పాతిక ముఫ్ఫై ఏళ్ళ భారత దేశ చరిత్ర చూస్తే Success breeds success అన్న ఆంగ్ల సామెత గుర్తుకొస్తుంది. ఆ సామెతని ‘విజయం సృజంతి విజయం’ అని సంస్కృతంలోకి అనువాదం చేయచ్చునేమో. ఎన్నాళ్ళుగానో, అంటే 1947 లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచీ, ఒక ఏభై ఏళ్ళు, Sleeping Giant అనిపించుకున్న దేశం ఒక్క సారి నిద్ర లేచి ఒళ్ళు విరుచుకుని ప్రపంచ దేశాలలో తన స్థానం ఏమిటో గమనించిందా అనిపిస్తుంది. ఇప్పుడు 'మన' వాళ్ళు ప్రకాశించని రంగం లేదు, పేరు తెచ్చుకోని దేశం లేదు. ‘Nano Banana Pro from Google’ వాడి తయారు చేసిన ఈ నెల ముఖ చిత్రంతో ఆ సంగతి ఉదహరించడం జఱిగింది.

స్కాట్లాండ్ లోని ఎడిన్ బర్గ్ మహానగరంలో ఇటీవల జరిగిన దీపావళి వేడుకలు చూస్తే అక్కడ మన వాళ్ళెంతమందున్నారో ఎంత పేరు తెచ్చుకున్నారో అర్ధం ఔతుంది.

ఐతే ఇన్నాళ్ళూ కూడా ఈ ప్రగతిలో మహిళల స్థానం ఒక విధంగా అంతర్గతంగానే ఉండి పోయింది. అది ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నది. మనకి క్రికెట్ అంటే చెప్పలేనంత అభిమానం, మన క్రికెట్ జట్టు ఘన విజయాలు అనేకం. ఐతే ఇన్నాళ్ళూ అదంతా మొగవారి జట్టుకే పరిమితమైంది. ఇటీవల మహిళల జట్టు Cricket World Cup సాధించడంతో ఆ పరిస్థితి ఒక ముఖ్య విధంగా మారిందని చెప్పచ్చు. బరువులెత్తడంలోనూ (weight lifting) పరుగు పందాలలోనూ అలా చెదురు మదురుగా విజయాలు సాధించడం ఒక ఎత్తు, మన జాతీయ క్రీడ (National Game) అని చెప్పుకోదగ్గ క్రికెట్ లో విజయం సాధించడం మరో ఎత్తు. వాడ వాడల్లోనూ సందు సందుల్లోనూ క్రికెట్ సంఘాలున్నాయి మన దేశంలో. మా చిన్నప్పుడు, బ్రిటన్ దే పై చెయ్యిగా ఉండేది క్రికెట్లో. M. C. C. (British Cricket Club) అని పేరు పెట్టుకోడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించేవాళ్ళం. ఐతే ఆ సంఘాలన్నీ, సందుల్లో ఆడుకునే జట్ల నుంచి జాతీయ జట్టు దాకా, అన్నీ మొగ పిల్లలవే, మొగ వారివే ఉండేవి. ఆడపిల్లలు క్రికెట్ ఆడడం, ఇంత ఘన విజయం సాధించడం, నిజంగా గొప్ప విషయమే.

ఇక నేల మీదే కాదు, నింగిలో కూడా అనిపించేట్టు, వ్యోమగామి కాబోతున్న దంగేటి జాహ్నవి కి మా జోహార్లు. 

ఇక ఈ సంచికలో:

  • పూర్ణకామేశ్వరి గారి 'నల్లేరు మీద నడక', వృధ్ధాశ్రమాల మీద చర్చలో ఒక వాదం
  • సింగీతం విజయలక్ష్మి గారి ‘అడవి మల్లి’, కాలేజీలలో జరిగే రాగింగు (Ragging) మీద ఒక తమాషా కథ
  • జొన్నలగడ్డ రామలక్ష్మి గారి ‘పాహి మాం’, స్వతంత్రమంటే ఏంటీ అన్న చర్చ
  • కళాగోపాల్ గారి ‘అడవి బిడ్డ’ లో అడవుల్లో కొండకోనల్లో ఎన్నికలు, ప్రజాస్వామ్యపు మధురిమలు బాగా వర్ణించారు.
  • కర్లపాలెం హనుమంతరావు గారి ‘తమా'షా' ఒక జీవిత చదరంగపు కథ
  • సుదర్శనం రంగనాధ్ గారి ‘సైకిల్ సవారి’ ఒక అందమైన కొత్త జంట కథ
  • ఘటికాచల రావు గారి ‘వసుధైక కుటుంబం‘ అన్న ఆదర్శాన్ని సాకారం చేసుకోవచ్చంటుంది.
  • పాణ్యం దత్త శర్మ గారి ‘వైభవ వేంకటేశ!’, ఒక వేంకటేశ స్తోత్రం
  • నాదెళ్ళ అనూరాధ గారిది, 'కొసరు' మీదో తమాషా కవిత
  • అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ‘మీరు ప్రవహించాలంటే………’ చిన్న నాటి పల్లెటూరి జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకోమంటుంది
  • రాయప్రోలు వెంకట రమణ శాస్త్రి గారి ‘ఉండిపోరాదే... !’ వాన చినుకుల మీద ఒక భావ కవిత్వం
  • అంబల్ల జనార్దన్ గారి ‘చంచల మనసు’ మనసుకి పట్టిన చెదలు నిర్మూలించంటుంది
  • గోగినేని రత్నాకరరావు గారు ఛందోబధ్ధంగా రాసిన ‘నాటి భారతం’ భరతమాతకొక జోహారు
  • పాండ్రంకి సుబ్రమణి గారి ‘ఒక మందస్మిత గగనం కోసం’ చెట్టుచేమలు మనకారాధ్యాలంటుంది

0 Comments