వైభవ వేంకటేశ!  (Author: పాణ్యం దత్త శర్మ)

సీ:

నీ శిరసుపై వెల్గు నీలంపు పింఛమ్ము

నీ వదనమందున నింపు కాంతి

నీ నుదుట వెలుగొందు నిండుతిరునామమ్ము

కస్తూరి వరగంధ కలితదీప్తి

నీదు వక్షము నందు నెగడు కౌస్తుభ రశ్మి

మహికి నంతయు గూర్చు మహిత గరిమ

నీ కంఠసీమలో నిత్యమ్ము దనరెడు

తులసిపేరుల సొగసు ద్యుతిని జూపు

తే. గీ.:

సకల జగములు మోహించు శౌరి! నీదు

వైభవంబది బాహ్యమే! విదితమగును

నిన్ను లోతుగ ధ్యానింప నిత్యమైన

నీదు వైరాగ్య శేముషి, నీరజాక్ష!

~

సీ:

గట్టు పుట్టను ముట్టి గడ్డి మేయుచు వచ్చి

దూడకు బాలిచ్చు పాడియావు

మందార పూలపై మకరందమును గ్రోలి

తియ్య తేనియనిచ్చు తేటివీవు

సంద్రము తపియించి, సాగి మిన్నును జేరి

మెండుగా వర్షించు మేఘమీవు

కడు దూరమున కేగి యొడుపున తన పిల్ల

కుక్షి నింపెడు తల్లి పక్షి నీవు

తే. గీ.:

సకల జీవుల నివ్విధి సాకునట్టి

నీదు వైభవమది యెల్ల మాది గాదె?

వేంకటేశ్వర! ప్రత్యక్ష వేల్పు నీవె

నిక్కమగు జ్ఞాన సంపద నీవే యనఘ!

0 Comments