వసుధైక కుటుంబం
వసుధైక కుటుంబం (Author: ఎస్. ఘటికాచల రావు)
“మన దేశం వదిలి అక్కడికి రావడమంటే అది జరగని పనిరా!”
‘‘ఎందుకమ్మా! ఎందుకు వీలుపడదు?”
‘‘చూడు నాన్నా! ఈ ఊళ్ళోనే నీ ఫ్రెండ్స్ ఉన్నారు. నువ్వు వాళ్ళింటికెళ్తే ఎంతకాలం ఉండగలవు? అలాగే ఇదీనూ. మనింట్లో మనకున్న స్వతంత్రత మిగతాచోట్ల ఉండదురా. విదేశాలు కేవలం విహారయాత్రలకు మాత్రమే. పర్మనెంట్ గా ఉండడం అనుకున్నంత సులభం కాదు. అక్కడ మనం ఇమడలేం. అక్కడి ఆచారవ్యవహారాలు, కట్టుబాట్లు, సాంప్రదాయాలు అంతా వేరే. వాటికనుగుణంగా నడుచుకోవడం, మనల్ని మార్చుకోవడం అసాధ్యం. ముఖ్యంగా, నాకసాధ్యం” అంటూ తెగేసి చెప్పింది.
‘‘ఇట్సోకే అమ్మా! అలాగైతే నేను కూడా నా చదువు విషయం గురించి డ్రాపై పోతాను. మీరున్నచోటే నేనూ ఉండాలి. ఐమీన్ నేనెక్కడుంటే మీరు కూడా అక్కడే ఉండాలి. ఈ విషయంలో రాజీ ప్రసక్తే లేదు. మనమంతా ఎప్పటికీ ఒకటిగానే ఉండాలి, ఉంటాము. అంతే…”
‘‘అలాగంటే ఎలా కుదురుతుందిరా! రేపు పెళ్ళయ్యాక నీకంటూ ఒక కుటుంబం ఉంటుంది గదా. ఆ వచ్చే అమ్మాయి ఇష్టాయిష్టాలు కూడా చూడాలి కదా.”
‘‘ఈ కండీషన్ కు ఇష్టపడే అమ్మాయినే చూద్దాం. అలాగైతే నాన్న కూడా ఆ కండీషన్ మీదే నిన్ను పెళ్ళి చేసుకున్నారా?”
‘‘మా కాలం వేరురా”
‘‘కాలం ఎప్పటికీ ఒకేలా ఉంటుందమ్మా! మారేది మనుషులూ, మనసులూ, మనస్తత్వాలే..”
‘‘అసలు టాపిక్ వదిలి వేరే టాపిక్ లోకి వెళ్ళడం అవసరమా సంధ్యా! వాడి చదువు గురించి మాట్లాడుతున్నామిప్పుడు’‘ విసుక్కున్నాడు మదన్.
సంధ్య ఏదో మాట్లాడబోతే మదన్ మళ్ళీ అడ్డుకుని ‘‘ఒరేయ్! ముందు నువ్వు జర్మనీ వెళ్ళి చదువుకోవాలనుకుంటే వెళ్ళి చదువుకో. అక్కడుండాలా, ఇక్కడుండాలా తరువాత ఆలోచిద్దాం”
అలాగేనన్నట్టు తలూపాడు. అప్పటికి ఆ చర్చకు తెరపడింది.
ఆరునెలలు గడిచాయి. ఒకరోజు సాయంత్రం సరుకులు తెచ్చుకునేందుకు సూపర్ మార్కెట్ కు వెళ్ళింది సంధ్య. ఒక్కొక్కటిగా చూస్తూ తిరుగుతున్నప్పుడు, హటాత్తుగా కళ్ళముందు ఒక మెరుపు మెరిసింది. పోతపోసిన బంగారు శిల్పంలా ఉన్న అద్భుత సౌందర్యం ఆమె కళ్ళముందు కదిలింది. సూపర్ మార్కెట్ మొత్తం డజను మంది అమ్మాయిలున్నా అందరిలోకీ ఈ అమ్మాయి ప్రత్యేకంగా కనిపించింది. అందరూ జుట్టు విరబోసుకుని ఉంటే ఈ అమ్మాయి ముచ్చటగా జడ వేసుకుని లంగా ఓణీలో ఒద్దికగా, పొందికగా ఉంది.
వెంటనే ఆ అమ్మాయి తల్లిదండ్రుల మీదికి సంధ్య ఆలోచన మళ్ళింది. ‘మంచి పద్ధతులు నేర్పారు అమ్మాయికి’ అనుకుంది.
తనవంకే తదేకంగా చూస్తున్న సంధ్యను కాస్సేపలాగే గమనించి ఆ అమ్మాయి మెల్లగా సంధ్య వద్దకు చేరుకుని “ఏంటత్తయ్యా అలా చూస్తున్నారు?” అనడిగింది.
హటాత్తుగా ఆ అమ్మాయి తననలా పలకరించడంతో ఉలికిపడ్డ సంధ్య “అబ్బే... ఏం లేదు... ఏం లేదు” అని అంతలోనే “నువ్వేమన్నావిప్పుడు?” అనడిగింది తాను విన్నదేమిటో మరోమారు మననం చేసుకుంటూ.
“అత్తయ్యా... అన్నాను, తప్పా?” తొణక్కుండా, దీటుగా ఎదురు ప్రశ్న వేసిందా అమ్మాయి.
సంధ్య ముఖంలో మారుతున్న భావాలు గమనిస్తూ, “హలో... అత్తయ్యా అని పిలిచానని మీరెక్కడికో వెళ్ళిపోవద్దు. ఈ కాలంలో అందరూ అంకుల్, ఆంటీ అంటారు కదా. అలా కాకుండా అత్తయ్యా, మావయ్యా అని పిలవమని అమ్మ చెప్పింది. అంతే. ఇదంతా మన పెద్దవాళ్ళకు ముందు జాగ్రత్త చర్యే అత్తయ్యా, అంతకన్నా మరేమీ లేదు” అన్నది.
ఆ అమ్మాయి మాటలు, భావం, అర్థం కాలేదు సంధ్యకు.
“అత్తయ్యా, మావయ్యా అంటే ఈకాలపు వాళ్ళకు ఎబ్బెట్టుగా ఉంటుందని అంకుల్, ఆంటీ అని పిలిపించుకుంటారు. అత్తయ్యా అని పిలిస్తే మా నాన్నకు చెల్లి వరసో, అక్క వరసో అవుతారు. మగాళ్ళను మావయ్యా అని పిలిస్తే మా అమ్మకు అన్న వరసో, తమ్ముడు వరసో అవుతారు. వాళ్ళ ముందు జాగ్రత్త చర్య అంటే అదన్నమాట” అన్నది అర్థమైందా అన్నట్టు కళ్ళు చక్రాల్లా తిప్పుతూ. ఆ అమ్మాయి సమయస్ఫూర్తికి, పరిపక్వతకు, మాటల ధాటికి ముచ్చటపడి, వెంటనే మరో ప్రశ్న అడిగేసింది సంధ్య.
“ఇదేమిటీ! అమ్మమ్మ కాలంనాటి డ్రస్ వేసుకున్నావు? మీ వయసు వాళ్ళంతా ఇప్పుడు చూడీదార్లే కదా వేసుకునేది?” అన్నది.
నవ్వేసింది ఆ అమ్మాయి. “అన్నింటికీ మనసే కారణం అత్తయ్యా! అన్నట్టు అత్తయ్య అని పిలిస్తే మీకేమీ అభ్యంతరం లేదు కదా, లేకపోతే ఆంటీ అని పిలవాలా?”
ఆ అమ్మాయి బుగ్గ నిమిరి, “నీకెలా బాగుంటే అలాగే పిలువు” అన్నది నవ్వేస్తూ.
“ఆ... అదే చెప్తున్నాను. మనకిష్టమైనట్టు మనముండాలిగానీ పది మంది చేస్తున్నారని మనం కూడా ఆ పని చెయ్యలేం కదా. నాకిదే సౌకర్యంగా ఉంటుంది. అమ్మకూడా చాలాసార్లు ‘ఎందుకే అమ్మమ్మలా డ్రస్ వేసుకుంటా’వని చెప్పింది. డ్రస్సేదైనా ఎబ్బెట్టుగా ఉండకుండా ఉంటే చాలు కదా”
“నీ పేరేమిటమ్మాయ్?”
“ప్రజ్ఞ”
“హబ్బ. పేరుకు తగ్గట్టు తెలివిగా మాట్లాడుతున్నావు. ఆలోచిస్తున్నావు. మీ ఇల్లెక్కడ?”
“ఇందాకట్నుంచీ అన్నీ మీరే అడుగుతున్నారు. నేనడగొద్దా? ముందు మీ పేరు చెప్పండి. తరువాత మా ఇల్లెక్కడో చెప్తాను”
మరింతగా నవ్వుతూ, “నా పేరు సంధ్య, మా వారిపేరు మదన్, మాకు ఒకే ఒకబ్బాయి వాడి పేరు ప్రద్యుమ్న. మా ఇల్లు...” అంటూండగానే,
“ఆగండాగండి. అడక్కుండా కుటుంబం మొత్తం పరిచయం చేసేశారు. థాంక్స్. ఐనా ముందుగా నేను మా ఇల్లెక్కడో చెప్పాలి. ఆ తరువాతే మీ ఇంటి సంగతి. మా ఇల్లు ఇక్కడికి దగ్గరే. పావుగంట వాకింగ్. ఇలా రోడ్డంట నేరుగా వెళ్ళి ఎడమవైపు తిరిగితే, ఆ వీధి చివరనుంచి రెండో ఇల్లు.“ బృందావనం” అని రాసి ఉంటుంది. మేం కూడా ముగ్గురమే, అమ్మ, నాన్న, నేను. ఇప్పుడు మీ ఇల్లెక్కడో చెప్పండి” అన్నది అల్లరిగా.
సంధ్య ఆహ్లాదకరంగా నవ్వుతూ చెప్పి, “ఏం చదువుతున్నావు?” అనడిగింది.
“ఫైనలియర్ ఫైనల్ సెమిస్టర్ బీ. ఈ. ఇన్ఫోసిస్ లో క్యాంపస్ సెలెక్షన్ కూడా వచ్చేసింది. ఇక్కడొద్దు అమెరికా వెళ్ళిపొమ్మని అమ్మా, నాన్న ఒకటే పోరు. నాకేమో ఇష్టం లేదు. చూడబోతే పెళ్ళిచేసి విదేశాలకు తోలేస్తారు లాగుంది”
ఆశ్చర్యంగా చూసింది సంధ్య. ‘తన భావజాలానికి తగ్గట్టుగా ఉన్నాయి ఆ అమ్మాయి మాటలు’ అనుకుంటూ, “వాళ్ళు చెప్పినదాంట్లో తప్పేముంది అమ్మాయ్. పిల్లలు వృద్ధిలోకి రావాలని కోరుకోవడం తప్పు కాదు కదా!” అన్నది.
“అక్కడ నేను ఒంటరిగా ఉండడం నాకిష్టం లేదండీ. ఉన్నంతకాలం అమ్మానాన్నలతో ఉండాలి. పెళ్ళయ్యాక ఎలాగూ ఉండనివ్వరుగా!” బాధ తొంగిచూసిందా అమ్మాయి మాటల్లో.
సంధ్య మనసులో ఆ అమ్మాయి అంతకంతకూ మహోన్నతంగా ఎదిగిపోతూంది. ఈ జ్ఞాపకాలు తాజాగా ఉండగానే వీటికొక అర్థాన్నివ్వాలన్న ఉద్దేశ్యంతో, వెంటనే “సరే అమ్మాయ్! ఉంటాను, ఆలస్యమౌతూంది” అంటూ సామాన్లతో బయటికి నడిచింది సంధ్య.
హటాత్తుగా ఆమె అలా వెళ్ళడంతో ప్రజ్ఞకు ఏదో వెలితిగా అనిపించింది. వెనకనుంచి, “మళ్ళీ ఎప్పుడు కలుస్తారత్తయ్యా?” అంటూ అరిచింది.
“త్వరలో…” అని,“నువ్వు కూడా రావచ్చుగా మా ఇంటికి?” అన్నది వెనక్కు తిరిగి. అలాగే అన్నట్టు థమ్స్ అప్ చూపినట్టు బొటనవేలు పైకెత్తింది ప్రజ్ఞ.
“వచ్చే ఆదివారం ఇదే సమయానికి ఇక్కడికి వస్తాను” అన్నది మళ్ళీ సంధ్య. దానిక్కూడా ఆ అమ్మాయి అలాగే సంజ్ఞ చేసింది.
తృప్తినిండిన మనసుతో ఇల్లు చేరిన సంధ్య ఎప్పుడు సాయంత్రం ఔతుందా, ఎప్పుడు భర్తతో ఈ విషయం చెప్తామా అని గడియారం వంకే చూస్తూ కూర్చుంది. భర్త రాగానే, ఉరుములేని పిడుగులా “ఏమండీ మనబ్బాయికి పెళ్ళి చేసేద్దాం” అన్నది.
ఆమె మాటలకు ఉలికిపడ్డాడు మదన్ “మతుండే మాట్లాడుతున్నావా? వాడేమో జర్మనీ వెళ్ళాలి, చదువుకోవాలి అంటూంటే నువ్వు వాడికి పెళ్ళి చేస్తానంటావే? వాడి భవిష్యత్తేం కాను?”
“ఎప్పటికైనా పెళ్ళి చేసుకోవాల్సిందే కదండీ. పెళ్ళి చేసేసి ఇద్దరినీ పంపేద్దాం. కచ్చితంగా ఆ అమ్మాయి వాణ్ణి అక్కడ ఉండనివ్వదు. మన దేశంలోనే ఉంటారు” అనేసి నాలిక్కరుచుకుంది.
“వ్హాట్? అమ్మాయిని చూసేశావా? జాతకాలూ నక్షత్రాలూ అక్కర్లేకుండానే?”
“మనసులు కలిస్తే చాలండీ. జాతకాలదేముంది?”
“నీకు పూర్తిగా మతి చలించినట్టుంది. వాణ్ణి కాస్త ప్రశాంతంగా చదువుకోనివ్వు”
“వాడి చదువుకేం ఢోకా ఉండదు. మన ఆలోచనలకూ ఇబ్బంది కలుగదు”
“నువ్వేదో పొడుపు కథలా మాట్లాడుతున్నావు. కాస్త నిదానంగా ఆలోచించు”
“అలాగే లెండి. మరో రెండు మూడు పర్యాయాలు కలిశాక పూర్తిగా అర్థం చేసుకుంటా. ప్రస్తుతానికి ఆ అమ్మాయి డబల్ ఓకే, అహహ, త్రిబుల్ ఓకే” అన్నది సంతోషం పట్టలేక.
మదన్ భార్యవంక అయోమయంగా చూసి తల పంకించాడు.
అనుకున్నట్టుగానే తరువాత ఆదివారం మళ్ళీ పనిగట్టుకుని సూపర్ మార్కెట్ కు వెళ్ళింది సంధ్య. ఆమె కళ్ళు ప్రజ్ఞ కోసం వెదికాయి. ఐనా తన పిచ్చి గానీ చెప్పిన సమయానికి అమ్మాయి వస్తుందని అనుకోవడం సబబేనా? ఫోన్ నంబరైనా తీసుకోకుండా తప్పు చేసింది. ఆ అమ్మాయి తనను మర్చిపోయి ఉండొచ్చేమో’ అలా ఆలోచిస్తూ మార్కెట్టంతా తిరగసాగింది అన్యమనస్కంగా.
పావుగంట గడిచినా ఆ అమ్మాయి జాడలేదు. ఆ అమ్మాయి ఇక రాదని నిర్ణయించుకుని వచ్చినందుకు ఏవో రెండు సామాన్లు తీసుకుని క్యాష్ కౌంటర్ దగ్గరికి వచ్చింది సంధ్య. అప్పుడే ప్రజ్ఞ లోపలికి వస్తూ కనిపించింది. ఆనందంగా ఎదురెళ్ళి“హలో” అంటూ పలకరించింది.
ముందు గుర్తుపట్టనట్టుగా చూసి, ఆ తరువాత గుర్తుకు తెచ్చుకుని, “హలో అత్తయ్యా, బాగున్నారా?” అని పలకరించింది.
అంతలోనే తను బయట పడకూడదనుకుని, “నేనొచ్చి అరగంట ఐంది. వెళ్ళడమే” అన్నది.
“అరగంట సేపు షాపింగ్ చేసి ఈ రెండు మాత్రమే తీసుకున్నారా?” అన్నది.
తడబడి ఆ తడబాటును కప్పిపుచ్చుకునేందుకు వెర్రి నవ్వొకటి నవ్వింది సంధ్య.
“అది సరేగానీ నీ నంబరివ్వమ్మాయ్. ఎప్పుడైనా అవసరమైతే ఫోన్ చేస్తాను. నీ పరిచయం బాగుంది” అన్నది తన సెల్ బయటికి తీస్తూ.
“నాకు మొబైల్ లేదండీ. చదువు పూర్తయ్యేవరకూ తీసుకోగూడదనుకున్నాను”
“అదేంటమ్మాయ్. ఈ కాలంలో మొబైల్ లేకుండా పని జరుగుతుందా?”
“అమ్మ నాన్న తీసుకోమన్నారు. నేనే వద్దన్నాను”
“నువ్వు మరీ సత్యకాలపు మనిషిలాగున్నావే. ఈ మధ్య ప్రతీ పనికీ సెల్ కావాలి కదా. ముఖ్యంగా బ్యాంక్ లావాదేవీలన్నీ దానిమీదే ఎక్కువగా జరుగుతున్నాయి”
“నిజమే కానీ, అదిలేకున్నా జరుపుకోవచ్చు. కంప్యూటర్ ఉంది. మెయిల్ తో కానిస్తాను”
“ఒక విధంగా అదీ మంచిపనే. ఈ మధ్య పిల్లలు సెల్ ఫోన్ లో మునిగి ప్రత్యక్ష సంబంధాలన్నీ తెంపేసుకుంటున్నారు”
“అవన్నీ తెలీదుగానీ నాకొక్క పది నిముషాలు సహాయం చేస్తారా? నేను కూడా మీతోనే బయటికి వచ్చేస్తాను. కాస్సేపలా పక్కనున్న పార్క్ లో కూర్చుని మాట్లాడుకుందాం”
“అలాగే కానీయ్” అంటూ చెప్పినట్టుగానే పది నిముషాల్లో ప్రజ్ఞకు కావలసిన సామాన్లు కొనుక్కుని బయటపడ్డారు. నిదానంగా నడుచుకుంటూ పక్కనే ఉన్న పార్క్ లో వెళ్ళి కూర్చున్నారు. సంధ్య అన్యమనస్కంగా ఉంది. తమ మధ్య మాటలు ఎలా కొనసాగించాలా అన్న విషయమై ఆమె లోలోపలే మథనపడుతూంది.
“ఏంటండీ అదోలా ఉన్నారు?” అన్నది ప్రజ్ఞ.
“మా అబ్బాయి గురించే ఆలోచిస్తున్నాను. వాడికి ఇక్కడుండడం ఇష్టం లేదు. జర్మనీకి వెళ్ళి పై చదువులు చదువుకుని అక్కడే సెటిలైపోతాడట. మేం కూడా కూడా అక్కడికే వెళ్ళిపోవాలట. నువ్వే చెప్పమ్మాయ్. మన దేశంలో ఉన్నంత స్వేచ్ఛగా విదేశాల్లో ఉండగలమా? ఈ విషయంలో నీ ఉద్దేశ్యమే కరెక్ట్. నీక్కూడా విదేశాల్లో ఉండడం ఇష్టం లేదన్నావు. మనకు మనింట్లో ఉన్నంత స్వేచ్ఛ మన బంధువుల ఇంట్లోగానీ, స్నేహితుల ఇంట్లోగానీ ఉంటుందా? ఈ విషయం వాడు అర్థం చేసుకోవడం లేదు” అంటూ తను ఇంట్లో కొడుకుతో చెప్పిన అదే డైలాగ్ మళ్ళీ ఇక్కడ పలికింది.
“ఉండాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు తప్పదు కదండీ”
ఉలికిపడింది సంధ్య. ‘ఇదేమిటి? నిన్న విదేశాలకు వెళ్ళడం ఇష్టం లేదని చెప్పిన మనిషి ఇప్పుడిలా మాట్లాడుతూంది?’ అనుకుంది.
ఆ మాటను పైకే అనేసింది.“అదేంటమ్మాయ్. క్రితంసారి కలిసినప్పుడు నీకు విదేశాలకు వెళ్ళడం ఇష్టం లేదన్నావు. మరిప్పుడేమో ఇలా మాట్లాడుతున్నావు?”
“భలేవాళ్ళే. నా ఉద్దేశ్యం మీరు సరిగ్గా అర్థం చేసుకోలేదు. ముందుమాట, విదేశాలకెళ్ళి స్థిరపడడమంటే అంత సులభం కాదు. అక్కడి పరిస్థితులకు, కట్టుబాట్లకు ఇమడడం కష్టం. అంతమాత్రాన వెళ్ళకుండా ఉండాలా? నేను కూడా పెళ్ళయ్యేవరకూ వెళ్ళనన్నాను గానీ అసలు వెళ్ళనే వెళ్ళనని అనలేదే” సంధ్య ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. ప్రజ్ఞ ఆమెను పట్టి కుదిపింది.
“అత్తయ్యా, స్నేహితుల, బంధువుల ఇళ్ళల్లో ఎక్కువ రోజులు ఉండలేమన్న మాట నిజమే. కానీ అది అన్ని సందర్భాలకూ వర్తించదు. ఆ లెక్కన ఏ ఆడపిల్లా పెళ్ళి చేసుకుని అత్తవారింటికి వెళ్ళకూడదు. ఎందుకంటే అత్తవారిల్లు ఆమెకు స్నేహితుల ఇల్లూ కాదు, బంధువుల ఇల్లూ కాదు. ఎవరి ముఖ పరిచయమూ లేని అత్తవారింట్లో తనవాళ్ళందరినీ కాదని వచ్చి అక్కడి పరిస్థితులు, ఆచారవ్యవహారాలు, సాంప్రదాయాలూ, పద్ధతులు అన్నీ అర్థం చేసుకుని నేర్చుకుని ఇమిడిపోవడం లేదా? మంగళసూత్రం అనే ఒకేఒక దారంతో పరిచయంలేని వ్యక్తితో విడదీయలేని బంధాన్ని ముడివేసుకుని, ఆ ఇంటితో అనుబంధాన్ని పెనవేసుకోవడం లేదా? ఆడపిల్లకు ఇదీ ఒక విధంగా విదేశాల్లో స్థిరపడడంలాంటిదే కదా. విదేశాలకు వెళ్ళే ప్రతి వ్యక్తీ ఆడైనా మగైనా ఈనాడు దాదాపు ఇదే చేస్తున్నారు. మీ విషయమే తీసుకోండి. పెళ్ళికి ముందు మీకు మావయ్య పరిచయమా? మీరిక్కడికి వచ్చి స్థిరపడలేదా? మీ ప్రవర్తనతో మీకంటూ ఒక ప్రత్యేకస్థానం ఏర్పరచుకోలేదా? మరొకరి మనసులో మనమున్నంత కాలం దూరాలు లెక్కకు రావు. ఎక్కడున్నా, ఎలాగున్నా, మన పద్ధతులు సాంప్రదాయాలు మర్చిపోకుండా, ఇతరుల పద్ధతులను సాంప్రదాయాలను గౌరవిస్తూ ఉంటే మనమూ ఆనందంగా ఉండి ఇతరులనూ ఆనందంగా ఉంచగలం. శాంతియుత జీవనానికి ఇదే కదా ఆధార సూత్రం. అదే కదా వసుధైక కుటుంబం”
ప్రజ్ఞ మాటలు సంధ్యను ఆలోచింపజేశాయి. చిన్నపిల్ల అయినా చాలా పరిపక్వతతో ఆలోచించింది. అమ్మాయి చెప్పిన లాజిక్ ప్రతివ్యక్తికీ కచ్చితంగా సరిపోతుంది. వ్యక్తిగత జీవితాన్ని ఎంత బాగా వసుధైక కుటుంబంతో పోల్చింది.
‘అవును, వసుధైక కుటుంబం. అంటే ప్రపంచమంతా ఒకే కుటుంబం. సరిహద్దులు కేవలం భౌతికం. మానసికంగా మనం ప్రపంచంలో ఎక్కడైనా ఉండగలం! మానసిక పరిస్థితులను భౌతికానికి మలచుకోవడంలోనే మానవుడి విజ్ఞత ఉంది. నొప్పింపక తానొవ్వక అన్నట్టుగా నడచుకుంటే ఈ ప్రపంచంలో సమస్యలే ఉండవు. వీసాలు పాస్పోర్టులు అనవసరం. కానీ అది సాధ్యమా? ప్రయత్నిస్తే సాధ్యం కాకపోదా? ప్రజ్ఞలాంటి వాళ్ళుంటే ఏదైనా సాధ్యమే’.
“అత్తయ్యా” అన్న ప్రజ్ఞ పిలుపుతో ఉలికిపడి ఇహలోకంలోకి వచ్చింది సంధ్య. ఎక్కడో ప్రారంభించిన ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి. మిగతా విషయాలెలా ఉన్నా ఇంత పరిపక్వతతో ఆలోచించ గలిగిన అమ్మాయిని మాత్రం వదలకూడదు. ఈ అమ్మాయి నా ఇంట్లో అడుగుపెట్టాలి. ప్రద్యుమ్నకు సరైన జోడీ అవుతుంది. వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అమ్మాయిని కోడలిగా చేసుకోవాలి’ అన్న స్థిరమైన నిర్ణయంతో బెంచీ మీది నుంచి లేచింది సంధ్య.
“ఇంతకూ విదేశాలకు వలస వెళ్ళడం మంచిదంటావా?”
నవ్వింది ప్రజ్ఞ. “మీరు మళ్ళీ తప్పుగానే అర్థం చేసుకుంటున్నారు. మన దేశం, విదేశం అన్న ఆలోచనే నా బుర్రకు తట్టడం లేదు. ప్రపంచమంతా ఒకటే అనుకుంటున్నాను. ఈ భూప్రపంచంలో ఎక్కడున్నా ప్రశాంతంగా సంతోషంగా కలుపుగోలుగా ఉంటూ నలుగురితో మసలుకోవాలి. అదే నా సిద్ధాంతం. వీలైతే ఈ వీసాలు పాస్పోర్టులు లేకుండా చెయ్యడమే నా జీవితాశయం. జీవితంలో ఏదో ఒకరోజు అది కూడా సాధ్యపడుతుందనే అనుకుంటున్నాను. మనిషిలో, మనసులో మంచితనం ఉన్నప్పుడు ఈ సరిహద్దులు అనవసరం”
“ఏమో నాకేమీ అర్థం కావడం లేదు”
నవ్వేసి, “మన పెంపకంలో మన సంస్కృతిపాలు ఎక్కువగా ఉంటే మన పిల్లలు మనల్ని వదిలి ఎక్కడికీ వెళ్ళరు. ఒకవేళ వెళ్ళినా అది తాత్కాలికమే. అందుకు మీ అబ్బాయే ఉదాహరణ. మీకోసం తన చదువు, భవిష్యత్తు వదులుకుంటున్నాడంటే మన సంస్కృతిని అంత బాగా అర్థం చేసుకున్నాడన్నమాట. హీ ఈజ్ సింప్లీ గ్రేట్”
ఏదో అర్థమైనట్టు తలూపింది సంధ్య. అంత చిన్నపిల్ల ఇంత పరిపక్వతతో ఎలా మాట్లాడగలుగుతూందన్నదే ఆమెకు అర్థంకాని విషయంగా ఉంది. ఆ అమ్మాయి చెప్పినట్టు పెంపకంలో మన సంస్కృతిపాలు ఎక్కువగానే ఉన్నది. వెంటనే ప్రజ్ఞ తల్లిదండ్రులను కలిసి పరిచయం పెంచుకోవాలి అనుకుంది. తన పెంపకం మీద కూడా నమ్మకం పెరిగింది.
ఏదేమైనా ఇప్పుడామె మనసులో కొడుకు విదేశాల్లో స్థిరపడి పోతాడేమోనన్న దిగులు లేదు. సంధ్య అదే ఆలోచనతో ఒకవైపు మానసికంగా ప్రజ్ఞను తన కోడలిగా ఊహించుకుంటూ మరొకవైపు వసుధైక కుటుంబాన్ని ఊహించుకుంటూ స్థిరంగా ఇంటివైపు అడుగులు వేసింది.
***