రాతి గుండెలు  (Author: డాక్టర్ సాగర్ల సత్తయ్య)

'కళా! కాస్త తలనొప్పిగా ఉంది. కాస్త టీ ఇవ్వు'. అప్పుడే బయట నుంచి ఇంట్లోకి వచ్చి బయట కుళాయి వద్ద కాళ్లు చేతులు కడుక్కుని నారాయణ అలసటగా సోఫా పై కూర్చొని తన భార్య చంద్రకళను ఉద్దేశించి అన్నాడు.

   'అబ్బబ్బ ఏందో ఈ నస ఇంకా ప్రారంభం కాలేదేమిటా అని అనుకుంటూనే ఉన్నా. ఇంట్లో అడుగు పెట్టారో లేదో అప్పుడే పెడ బొబ్బలు... నాలుగు గంటలకు స్కూలు ముగిసినా ఏడు గంటల వరకు ఏం రాచ కార్యాలు వెలగబెట్టినట్లో.. రాగానే అయ్యవారికి టీ కప్పుతో ఎదురు రావాలి. నా కర్మ..కర్మ..'

 'ఏంటే కళా! ఇప్పుడు నేను ఏమన్నానని? ఎందుకింత చిరాకు? నేనేమైనా బలాదూరుగా తిరిగి వస్తున్నానా? ఈ నెల చివరలో నా రిటైర్మెంట్ అనే విషయం నీకు తెలుసు కదా! దానికి సంబంధించిన పెన్షన్ పేపర్లు సిద్ధం చేయించి డీఈఓ ఆఫీస్ లో ఇచ్చి వస్తున్నాను'.

 'ఓ గొప్ప ఉద్యోగం... ఈ ప్రపంచంలో ఇంకెవరైనా చేశారా? ఈ కొంప తప్ప ఓ ప్లాట్ గొన్నది లేదు. పట్టుమని పది తులాల బంగారంతో నాకు నగ చేయించింది లేదు. తోటి వాళ్ళు ఎందరు టీచర్ ఉద్యోగం చేయడం లేదు. అందరూ మనలాగే ఉన్నారా? అయినా నిన్ను అని ఏం లాభం నా రాత బాగాలేదు'

 'అయ్యో ఇప్పుడు నేనేం చేశాను? వచ్చిన జీతం అంతా నీ చేతిలోనే పెట్టాను కదా! ఇంటి లోను, అబ్బాయి చదువులు పోను ఇంకా వెనకేయడానికి ఏముంటుంది? కొందరిలా నేను రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, చిట్టిల వ్యాపారాలు చేయలేను. నా శక్తి మేరకు ఉద్యోగ ధర్మం, కుటుంబ బాధ్యతలు నిర్వహించాను. మన ఇంటి అవసరాలకు తగ్గట్టుగా ఒక కారు కూడా కొన్నాను. నన్ను ఇట్లా అనడం న్యాయం కాదు చంద్రకళా!'

 'చాల్లే సంబరం' అని మూతి తిప్పుతూ టీ కప్పు తెచ్చి ముందు పెట్టింది'.

 మౌనముద్రను దాల్చిన నారాయణ టీ తాగి అలాగే సోఫాలో వెనుకకు వాలి కళ్ళు మూసుకున్నాడు.

  నారాయణ ఓ స్కూల్ టీచర్. వృత్తి పట్ల అంకితభావం, నిబద్ధత కలిగిన వాడు. సమాజానికి విలువలు బోధించే ఉపాధ్యాయుడు ఆ విలువలను తన జీవితంలో తప్పకుండా ఆచరించాలనే నియమం కలిగిన వాడు. ప్రభుత్వంతో పాటు అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా నారాయణ వ్యక్తిత్వాన్ని గుర్తించి జిల్లా, రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందించి సత్కరించాయి. పనిచేసిన ప్రతిచోట విద్యార్థుల చేత ఆయా గ్రామ ప్రజల చేత గొప్ప గౌరవ మర్యాదలు అందుకున్నాడు. నారాయణ కు ఒక్కగానొక్క కొడుకు. పేరు ప్రశాంత్. కొడుకు ప్రశాంత్ వల్లనే తన జీవితంలో కొంత ప్రశాంతత కోల్పోయాడు. ఒక్కగానొక్క కొడుకు కావడం చేత తన ఆర్థిక స్థాయి సరిపోనప్పటికీ ఫీజులకు వెరవకుండా చిన్ననాటి నుండే పెద్ద కార్పొరేట్ పాఠశాలలో చదివించాడు. పదవ తరగతి అనంతరం కూడా ఐఐటీ బోధించే కార్పొరేట్ కళాశాల ఏసీ బ్రాంచ్ లో సీటు కొని చదివించాడు. ప్రశాంత్ మాత్రం అత్తెసరు మార్కులతోనే పాస్ అవుతున్నాడు కానీ చదవాలన్న పట్టుదల గాని, తన తల్లిదండ్రులు తన కోసం త్యాగం చేస్తున్నారన్న విషయం గానీ ప్రశాంత్ గ్రహించలేకపోయాడు. ఇక ప్రశాంత్ కు చదువు అబ్బదని గ్రహించి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చేయమని సలహా ఇచ్చాడు నారాయణ. చంద్రకళ ఎంత మాత్రం అంగీకరించలేదు. తన తోటి స్నేహితుల పిల్లలు టాప్ టెన్ కాలేజీల్లో ఇంజనీరింగ్ చేస్తుంటే తన కొడుకు డిగ్రీ చేయడం అవమానంగా భావించింది. తన కొడుకు ఎలాగైనా పెద్ద యూనివర్సిటీలో చదవాలని పట్టుబట్టింది. ప్రశాంత్ మాత్రం ఎంసెట్లో కూడా క్వాలిఫై కాలేదు. భార్య పోరు తట్టుకోలేక తమిళనాడులోని ప్రతిష్టాత్మకమైన ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ యూనివర్సిటీలో పది లక్షలు పోసి సీటు కొన్నాడు నారాయణ. అక్కడ చదివిన చదువు కూడా బూడిదలో పోసిన పన్నీరు అయింది. ప్రతి సెమిస్టర్లోనూ నాలుగైదు సబ్జెక్టులలో ఫెయిల్. ఇంజనీరింగ్ ఫెయిల్ అయి ఇంటి ముఖం పట్టాడు ప్రశాంత్. పైగా అక్కడ ఉన్నప్పుడే జులాయి స్నేహితుల ప్రభావం వల్ల మద్యపానం సిగరెట్ లాంటి అలవాట్లకు కూడా బానిస అయ్యాడు. ఇప్పుడు ప్రశాంత్ ఏ పని లేకుండా తిని తిరుగుతూ ఇంట్లోనే ఉంటున్నాడు. తాను రిటైర్ అయ్యే లోపుగా ప్రశాంత్ పెళ్లి చేస్తే బాగుంటుందని భావించాడు నారాయణ. ఏ పని చేయకుండా తిని తిరుగుతున్న ప్రశాంత్ కు పిల్లనివ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. కొడుకుకు వివాహం కాలేదన్న బెంగ కూడా నారాయణ మనసును కలచివేస్తుంది. గోరుచుట్టపై రోకటి పోటు అన్నట్టు ఇటీవల కాలంలో చంద్రకళ తన పట్ల చిరాకు పరాకుగా ప్రవర్తించడం ఎక్కువైంది. ముప్పై ఐదు సంవత్సరాల తమ వైవాహిక జీవితంలో చంద్రకళను ఎంతో అపురూపంగా చూసుకున్నాడు. ఏనాడూ తన మనసు కష్టపడకూడదని ఎంతో జాగ్రత్తగా ప్రవర్తించాడు. పెళ్లయిన కొత్తలో చంద్రకళ కూడా తన పట్ల అంతే ప్రేమగా ఉండేది. కొడుకు ఎదిగిన తర్వాత చంద్రకళలో వస్తున్న మార్పు నారాయణకు ఆశ్చర్యం కలిగిస్తుంది. అకారణంగా నిందించడం మనసు గాయపడే విధంగా దూషించడం సర్వసాధారణమైపోయింది. నారాయణ కూడా వయసు పైబడుతుండడంతో సహనంతో అన్ని భరిస్తున్నాడు.

       రాత్రి తొమ్మిది గంటలు. ప్రశాంత్ ఇంట్లోకి వస్తున్నాడు. తాగినట్టున్నాడు. తూలి పడబోయి తలుపు పట్టుకుని నిలబడ్డాడు. సోఫాలో కాళ్లు బార్ల జాపి కూలబడ్డాడు. నారాయణ కోపంతో 'ఏంట్రా ఇది? ఇప్పటివరకు ఎక్కడికి వెళ్లావు? తాగావా? ఛీ ఛీ నీకు ఎప్పటికీ బుద్ధి రాదు ' అన్నాడు.

 ప్రశాంత్ ఏదో మాట్లాడబోతుండగా అతడు మాట్లాడక ముందే చంద్రకళ అందుకుంది.

' అబ్బో ఇగ నువ్వే నీతులు చెప్పాలె. అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదు అన్నట్టు కొడుకు ఏం తింటున్నాడు ఎట్లా ఉంటున్నాడు అని ఏనాడన్న చూసిన ముఖమేనా నీది? వాడి ఫ్రెండ్ బర్త్ డే పార్టీ ఉందని పోయిండు. మన ముఖానికి ఎన్నడైనా అట్లాంటి పార్టీలు చేస్తే గా ఆ కల్చర్ గురించి తెలిసేది?' అంటూ దెప్పి పొడిచింది.

 కొడుకు చెడిపోతున్నాడన్న బాధ చంద్రకళకు ఏ కోశానా లేదు. పైగా అతనిని సమర్థిస్తూ నారాయణ ను మాట్లాడకుండా చేస్తుంది.

'థాంక్యూ మమ్మీ... మై లవ్లీ మమ్మీ...' తడబడుతున్న స్వరంతో అంటున్నాడు ప్రశాంత్.

    తాను ఉద్యోగ విరమణ చేసిన తర్వాత కుటుంబ పరిస్థితి ఏమిటా అని ఆలోచనలో పడ్డాడు నారాయణ . చాలీచాలని పెన్షన్ కుటుంబ ఖర్చులకే సరిపోదు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ప్రశాంత్ ఏదైనా ప్రైవేట్ ఉద్యోగమైనా చేస్తాడేమో అంటే కనీసం ఆ మాట ఎత్తే అవకాశం కూడా తనకు ఇంట్లో లేదు.తల పట్టుకున్నాడు నారాయణ.

           నారాయణ ఉద్యోగ విరమణ తేదీ దగ్గర పడుతోంది. పాఠశాలలో తోటి ఉపాధ్యాయులు గ్రామస్తులు విద్యార్థులు ఘనంగా ఉద్యోగ విరమణ సభ నిర్వహించాలని ప్రయత్నాలు ప్రారంభించారు. పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు గొప్పగా సన్మాన పత్రం సిద్ధం చేశాడు. విద్యార్థులంతా తరగతి వారీగా మాస్టారుకు బహుకరించదలచిన కానుకల గురించి చర్చించుకుంటున్నారు. ఇవేమీ పట్టించుకునే స్థితిలో నారాయణ లేడు. ఇంట గెలిచి కదా రచ్చ గెలవాలి. తన కుటుంబ సభ్యుల సహకారం లేకుండా తాను ఎన్ని సన్మానాలు పొందినా సంతృప్తి కలుగదు.

      నారాయణ ఇంట్లో తల్లీ కొడుకులు ఇప్పుడు ఆలోచనలో పడ్డారు. ఉద్యోగ విరమణ తర్వాత తమ పరిస్థితి ఏమిటి అని ఆలోచించారు. కల్పవృక్షం లాంటి నారాయణ మరుసటి నెల నుండి పనిచేయకపోతే తాము ఒడ్డున పడవేసిన చేపల రీతిన గిలగిలా కొట్టుకోవాల్సిందే. నారాయణ లేని సమయంలో ఈ విషయమై వారిలో తీవ్ర తర్జనభర్జనలు జరుగుతున్నాయి.

        ఏప్రిల్ 25వ తేదీ... ఉదయమే దినపత్రిక చదువుతున్న నారాయణ వద్దకు ప్రశాంత్ వచ్చాడు. ఎదురుగా సోఫాలో కూర్చున్నాడు. ప్రశాంత్ వదనం ప్రశాంతంగా ఉంది.

' నాన్నా' ప్రశాంత్ ఆత్మీయమైన పలకరింపుతో దిగ్గున తలెత్తి చూసాడు నారాయణ. ఇటీవలి కాలంలో ఇంతటి ఆప్యాయతతో తన కొడుకు తనను పలకరించింది లేదు. ఆశ్చర్యంతో పాటు ఆనందం నారాయణ ముఖంలో తాండవించింది.

 'ఏంటి నాన్నా...' ప్రేమగా అన్నాడు నారాయణ.

 'ఏం లేదు నాన్నా.. ఇంతకాలం నీవు మాకోసం ఎంతో కష్టించావు. మీ శ్రమను అర్థం చేసుకోలేకపోయాను మన్నించు నాన్న'. ప్రశాంత్ కళ్ళలో పల్చని కన్నీటి పొర.

 'అయ్యో అదేం లేదురా. నీవు ఎల్లప్పుడూ సుఖంగా ఉండాలి అదే రా నేను కోరుకునేది' అన్నాడు నారాయణ.

' నాన్నా... నీ ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిద్దాం. మన బంధువులందరికీ నీ మిత్రులందరికి ఆహ్వానాలు పంపుదాం. మీ పాఠశాల విద్యార్థులకు ఆరోజు రుచికరమైన భోజనం ఏర్పాటు చేద్దాం. ఈరోజు నేను కూడా మీ పాఠశాలకు వస్తాను. ఆ ఏర్పాట్లు చూస్తాను నాన్నా'.

 అయ్యో అదేం వద్దురా... నా బాధ్యతలు నేను నిర్వహించాను. వయసు మీరిపోయింది కనుక ఉద్యోగ విరమణ తప్పనిసరి. అంతమాత్రానికే ఈ హడావుడి దేనికి? అయినా పాఠశాలలో ఏదో సభ ఏర్పాటు చేస్తామని పాఠశాల ప్రధానోపాధ్యాయులు అన్నారు. వీలైతే ఆ సభకు రండి. అంతకంటే ఆర్భాటాలు వద్దురా '

' కాదనకు నాన్నా... ఈ జన్మలో మీ రుణం తీర్చుకునే ఒక అవకాశం ఇది. తప్పకుండా ఈ విషయంలో మాత్రం నేను అనుకున్నట్టే జరగాలి'పట్టుదలతో అన్నాడు ప్రశాంత్.

' వాడు ముచ్చట పడుతున్నాడు కదా కాదనకండి. మీ ఉద్యోగ జీవితంలో చివరి వేడుక మనందరికీ సంతోషం కలిగేలా జరుపుకుందాం ' సంతోషంతో అన్నది చంద్రకళ.

 తన భార్యాబిడ్డలలో వచ్చిన మానసిక పరివర్తనకు ఎంతగానో సంతోషించాడు నారాయణ. ఇది ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాడు.

' మీరు ఎలా అంటే అలాగే' అంటూ చిరునవ్వుతో సమాధానం ఇచ్చాడు.

 'ఏమండీ... నాదొక చిన్న కోరిక..' కాస్త సిగ్గుతో కూడిన చిరునవ్వుతో తలవంచుకొని అన్నది చంద్రకళ.

 'ఏంటి ' నవ్వుతూ అన్నాడు నారాయణ

' నేను చాలా రోజుల క్రితం తుమ్మడం మైసమ్మ అమ్మవారికి మొక్కుకున్నాను. మీ పదవీ విరమణ లోగా ఆ మొక్కు తీర్చుకోవాలనుకుంటున్నాను. ఒకరోజు అమ్మవారి వద్ద నిద్ర చేసి తెల్లవారి బోనం చేసి వద్దాం. మీరు శనివారం నాడు రిటైర్ అవుతారు కదా.గురువారం సాయంత్రం వెళ్దాం. అక్కడే రాత్రి నిద్రించి తెల్లవారి బోనం చేసి అమ్మవారిని దర్శించుకుని వద్దాం. నా కోరికను కాదనకండి' అన్నది చంద్రకళ.

'సరే సంతోషమే. రిటైర్మెంట్ సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడం నాకు కూడా ఆనందమే కదా' అన్నాడు నారాయణ.

        గురువారం రోజు ఒక పూట మాత్రమే పాఠశాలకు వెళ్లి మధ్యాహ్నం సెలవు పెట్టి ఇంటికి బయలుదేరాడు నారాయణ. వచ్చేసరికి కొడుకు ప్రశాంత్ కారు బయటకు తీసి శుభ్రంగా తుడిచి సిద్ధం చేసి ఉంచాడు. దేవాలయం వద్దకు కావలసిన సామాగ్రిని సిద్ధం చేసుకుంది చంద్రకళ.

 సాయంత్రం ఐదు గంటలకు బయలుదేరారు. కార్ డ్రైవింగ్ చేస్తున్నాడు ప్రశాంత్. వెనుక నారాయణ, చంద్రకళ ఇద్దరు కూర్చున్నారు. లోకాభిరామాయణం మాట్లాడుకుంటూ హాయిగా సాగుతుంది ప్రయాణం. నల్లగొండ నుంచి బయలుదేరిన కారు లింగోటం దాటింది. చెక్ పోస్ట్ కు చేరింది. హాలియా, నిడమనూరు, నల్లగొండ రోడ్లు కలిసే కూడలి అలీ నగర్ చెక్ పోస్ట్ పద్నాలుగవ నెంబర్ మైలురాయి వద్ద నాగార్జునసాగర్ నుంచి వచ్చే ఎడమ కాలువ కనిపిస్తుంది. సూర్యుడు అస్తమించాడు. మసక చీకటి కమ్ముకుంటున్నది. అప్పుడే చెక్ పోస్టు రోడ్డు మీద ఉన్న షాపుల వాళ్ళు లైట్లు వేస్తున్నారు. కాలువ బ్రిడ్జి నుంచి దాటగానే ప్రశాంత్ కారు పక్కకు ఆపాడు.

 'ఏంటి రా?' నారాయణ అడిగాడు యథాలాపంగా.

 'ఏం లేదు నాన్నా. తుమ్మడంలో నీటి వసతి సరిగ్గా ఉండదు. ఇక్కడే కాళ్లు చేతులు కడుక్కొని వెళ్దాం నేరుగా గుడికి వెళ్ళవచ్చు.' అన్నాడు ప్రశాంత్.

 సరేనని తల్లి, తండ్రి కారులోంచి దిగారు. కాలువలోకి దిగడానికి వంతెనపక్కగా మెట్లు ఉన్నాయి. నారాయణ ముందు నడుస్తున్నాడు వెనుక నుంచి చంద్రకళ నడుస్తుంది. నెమ్మదిగా కాల్వ నీటి వద్దకు దిగారు. కాలువ నిండుగా ప్రవహిస్తుంది. కాబట్టి ఎక్కువ మెట్లు దిగవలసిన అవసరమే రాలేదు. ముందు వంగి నారాయణ ప్యాంటు మోకాళ్ళ వరకు మడుచుకొని కడుక్కోవడానికి వంగి దోసిళ్ళతో నీళ్లు తీసుకుంటున్నాడు. అటు ఇటు చూసింది చంద్రకళ. ఒక్కసారిగా నారాయణను కాలువలోకి తోసింది. ఊహించని హఠాత్పరిమాణానికి ఏం జరుగుతుందో ఆలోచించకుండానే నీటిలో పడి కొట్టుకుపోతున్నాడు నారాయణ.

 వామ్మో... నాయనో... ఓరి దేవుడో... కాపాడండి... కాపాడండి... గట్టిగా కేకలు పెడుతూ రోధిస్తున్నది చంద్రకళ. కారు వద్ద ఉన్న ప్రశాంత్ తో పాటు చుట్టుపక్కల ఉన్న జనం కూడా పరిగెత్తుతూ దగ్గరికి వచ్చారు. అప్పటికే నారాయణ నీటి ఉధృతిలో కనిపించకుండా పోయాడు. చంద్రకళ నెత్తి కొట్టుకుంటూ కాలువ కట్టమీద కింద పడి దొర్లుతూ ఏడుస్తోంది. ప్రశాంత్ కూడా ఒక్క పెట్టున నాన్న అని అరుస్తూ గుండెల మీద కొట్టుకుంటూ కింద కూలబడి ఏడుస్తున్నాడు. చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళని ఓరడిస్తున్నారు. ఇంకొందరు పోలీసు వాళ్లకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఇలా అప్పుడప్పుడు జనం ప్రమాదవశాత్తు కాలువలో పడడం ఇక్కడ జనానికి సర్వసాధారణమే. అయ్యో అని సానుభూతి తెలపడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. కాసేపు ఊరడించిన తర్వాత చంద్రకళను అడిగి తెలుసుకుని రెండు రోజుల్లో పదవి విరమణ చేస్తాడు అనగా ఇట్లా జరగడం చూసి అక్కడి ప్రజలంతా మరింత బాధపడ్డారు.

 చిమ్మ చీకటిలో చంద్రకళ ముఖంపై విరిసిన విషపు నవ్వు ప్రశాంత్ కు తప్ప మరెవరికి కనిపించలేదు. త్వరలో రాబోయే కారుణ్య నియామకపు ఉత్తర్వును తలుచుకొని ప్రశాంత్ మనసు గంతులు వేస్తున్నది.

0 Comments

Telugu Jyothi Ugadi 2024

2024-26 తెలుగు కళా సమితి కార్యవర్గం (మా సమాచారం)


సంపాదకుని మాట! (సంపాదకీయం)


అధ్యక్షుని కలం నుండి… (TFAS అధ్యక్షుని సందేశం)


New York Life Insurance (Advertisement)


2022-2024 TFAS కార్యవర్గ విజయాలు (మా సమాచారం)


Free health camp by TFAS for Edison community (TFAS కార్యక్రమాలు)


బాపు, రమణలతో నా తీపి గురుతులు... (కథలు)


ఒక కవిత (కవితలు)


విశ్వరూపం (కవితలు)


తెలుగు సౌరభం (కవితలు)


సంక్రాంతి హేల (కవితలు)


పశ్చాత్తాపం (కథలు)


కాంతి (కథలు)


రాతి గుండెలు (కథలు)


మేమింకా అక్కడే ! (కవితలు)


రైతు మిత్రుల కథ (కథలు)


శిశిరంలో వసంతం (కథలు)


సాన పెట్టని వజ్రం (కవితలు)


మారిన శీతాకాలం (కథలు)


వెలుతురు పంట (కవితలు)


కొత్త చేతులు మొలకెత్తాలి (కవితలు)


గర్భస్థ శిశువు (కవితలు)


వృద్ధాప్యం ఎంత దయలేని దండనో (కవితలు)