రాగ బంధాలు
రాగ బంధాలు (Author: పాండ్రంకి సుబ్రమణి)
భళ్లున తెల్లవారింది. కనురెప్పలు బరువుగా కదుపుతూ అరమోడ్పు కళ్ళతో చూపు సారించాడు ఎల్లయ్య. వంట మొగసాల నుండి గిన్నెల చప్పుడు వినిపిస్తూంది. చిల్లర తిండికి అలవాటుపడ్డ కాకులు పెరట్లో కావ్ కావ్ మని అరుస్తు న్నాయి; తుండు ముక్కల కోసం వెంపర్లాడుతూ -- ముత్యాలమ్మ హడావిడిలో ఉన్నట్లుంది; మూడో వీధిలో ఉన్న మిషన్ టూల్స్ ఫ్యాక్టరీకి వెళ్ళేందుకు. ఆమె అక్కడ స్క్రాప్ పిక్కర్ కమ్ క్లీనర్ గా పని చేస్తూంది. రంపపు జోరుకి ఊడుతూ పొట్టులా రాలిపోయే ఇనుప తీగ ముక్కల్నీ అందుకుని గోనె పట్టాలో వేసుకుని స్క్రాప్ గుట్ట వేపు వెళ్ళే మినీ టెంపోలోకి యెత్తి పోసేలా డ్యూటీ చేస్తుంది. పెందలకడే లేచి వంటా వార్పూ పూర్తి చేసుకుని, పిమ్మట అంతా సర్దుకుని సమయానికి డ్యూటీ చేరుకోవడానికి తెగ యాతన పడ్తుంటుంది. కొడుకూ కూతుర్నీ లేపి ముఖ ప్రక్షాళనం గావించి అప్పటికి చేసిన అల్పాహారం తినిపించి ముస్తాబు చేయించి మధ్యాహ్న భోజనం చేయడానికి వీలుగా వాళ్ళిద్దరి టిఫిన్ బాక్సులూ నింపి, తనకొకటి స్వయంగా నింపుకుని ఇద్దర్నీ స్కూలుకి దిగబెట్టి అటు పిమ్మట అక్కణ్ణించి ఫ్యాక్టరీకి వెళ్ళాలి హాజరు పట్టీ మూసేయక ముందే -- అంతటితో పూర్తవుతుందా ఆవిడ ముగించాల్సిన తతంగం! అవదు. మంచాన పడి ఉన్నఅత్త ఆదెమ్మ వద్దకు వెళ్ళి ఆమెను లేపి ఆమె చేత ఏదైనా తినిపించి ఆవిడకు మందులిచ్చి మరుసటి జామున తీసుకోవలసిన మందుల చిట్కా విప్పి వంట గదిలో ఏమేమి ఉందో మధ్యాహ్మ భోజనానికి ఎంతెంత గిన్నెలో వేసుకోవాలో వివరించి పాటించ వలసిన పథ్యం గురించి హెచ్చరిక చేసి వెళ్తుంది. పెద్ద ప్రాణం కాబట్టి కోడలు, మచ్చికతో మన్ననతో చెప్పిందంతా వెంటనే మరచిపోతుంటుంది ఆదెమ్మ. అప్పుడప్పుడు ఆవిడ ఆదమరపున ఒకటికి రెండుసార్లు అధికంగానే మాత్రలు వేసేసుకుంటుంది. మగతగా వాలిపోతుంటుంది. అప్పుడు, అటువంటి హడావిడి సమయాన ఉన్నట్లుండి లోపల నుండి కొడుకూ కూతుళ్ళ గొంతులు కీచుమని ఎల్లయ్చకు వినిపించాయి -“మాటి మాటికీ ఉప్మా చేస్తున్నావే అమ్మా! ఏమీ నచ్చడం లేదు. జిడ్డులా అంటుకుపోతుంది. విమల వాళ్ళింట్లోలా - పార్వతి వాళ్ళ ఇంట్లోలా ఇడ్లీలు గారెలూ ఎందుకు చేయవూ! పెసరట్టయినా యెందుకు చేయవే అమ్మా?” దానికి అటునుంచి బదులు లేదు. ఉండదని నులక మంచం మీద బోర్లా పడుకున్న ఎల్లయ్యకు తెలుసు. కుండలో ఉంటేనే కదా తీసి తింటానికి--పాపం-ముత్యాలు మాత్రం ఎన్నాళ్లిస్తుంది అదే జవాబు-తెలిసీ తెలియని లేత వయస్సు లో ఉన్న పిల్లలకి... అటువంటప్పుడు చప్పున లేచి వెళ్లి పిల్లలిద్దర్నీ మందలించాల నిపిస్తుందతనికి; తల్లిని అనవసరంగా వేగిరపాటుకి లోను చేయకూడదని—ఉన్నదానితో సరిపుచ్చుకోవాకా లని--కాని వెళ్ళి పిల్లల్ని మందలించడానికి తనకి వీలు పడదు. తను అనుకున్నపళంగా లేవలేడు. పక్షవాతం వచ్చి కుడీ చేయీ కుడి కాలూ చచ్చు పడిపోయాయి. అలాంటప్పుడు తనెలా లేచి భార్యకు వత్తాసుగా నిలవగలడు? నిజానికి తనే ఆమెకు బరువు. అసలైన బండరాతి బరువు. ఆమె సంపాదిస్తూన్న డబ్బుల్లో సగం తన వైద్య చికిత్సకు, ముఖ్యంగా ఫిజియో థెరపీకే ఖర్చయిపోతూంది. ఇక పిల్లలకు మంచి వంటలు ఎలా వస్తాయి? ఇక అత్తగారికోసం మందూ మాకులకు ఖర్చుపెట్టడం ఎలాగూ తప్పేది లేదు కదా-- అప్పుడు అతడి ఆలోచనలు గిర్రున తను పని చేసిన లేథ్ ప్యాక్టరీ వేపు మళ్ళింది. నిండైన లేథ్ మిషిన్ సరిగమల దరువుల తో కళ్ళ ముందు మెదిలింది. ఆ తరవాత ఎప్పటిలాగే ఊపిరి బరువుగా తన్నుకొచ్చింది. తమ యూనియన్ లీడర్ భద్రయ్య మాటలు గుర్తుకి వచ్చాయి. అతను తరచుగా ఆడ కార్మికులకు వత్తాసుగా నిలుస్తాడు. బాహాటంగా అంటుంటాడు -“ రాను రాను అధికమవుతూన్న మగాళ్ల అరాచక ఆధిక్యత సమాజ శ్రేయస్సుకి మంచిది కాదు. ఆడది ఇంటా బైటా పని చేయాలి.. కాని మగాడు మాత్రం ఇంటికి వెళ్లి దర్జాగా దమ్ము పీలుస్తూ మందుకొడ్తూ కాలుపైన కాలేసుకుని కూర్చుంటాడు. పెళ్ళాం కూడా ఒక మనిషే కదా! ఆవిడ ఓపిక్కీ తీరిక్కీ హద్దుంటుందని తలపోయడు. పిడికెడంత చేతి సహాయం చేయడు. విశ్వవ్యాపితంగా తీసిన సర్వేలో తెలిసిందేమంటే—ప్రతి మగాడూ సగటున భార్యకు పందొమ్మిది నిమిషాలే ఇంటి పనుల్లో చేదోడుగా ఉంటున్నా డట -ఇది చాలదని రాత్రిపూట పడక చేరిన తరవాత వాడిని పూటుగా గమనించాలి. తృప్తి పరచాలి. లేక పోతే బ్లాక్ మెయిల్ చేస్తాడు—ఎక్కణ్ణుంచైనా మరొకతెని తెచ్చుకుంటానని--
అలా ఆలోచిస్తున్నవాడల్లా ఎల్లయ్య ఏదో మెలకువ వచ్చిన వాడిలా చటుక్కున ఆలోచనా తీగల్ని తనకు తాను తెంపేసుకున్నాడు. మంచం వేపు వస్తున్నట్టు ముత్యాలమ్మ అడుగుల చప్పుడు వినిపించింది. వెంటనే కళ్లు రెండూ గట్టిగా మూసుకున్నాడు. అతడు యెదురు చూసినట్లే ముత్యాలమ్మ ముఖం దగ్గర ముఖం పెట్టి చూసి ఆ తరవాత వంటగదినుండి తెచ్చిన పాల ప్లాస్కుని ఉప్మా ప్లేటునీ పొడవుపాటి స్టూలుపైన ఉంచి-వేసుకోవలసిన మాత్రలు టానిక్కూ వాటికి ప్రక్కనే సర్ది మెల్లగా నడిచి వెళ్ళిపోయింది; పిల్లలిద్దరినీ జబ్బలంది పుచ్చుకుని నడి వీధిలోకి నడిపిస్తూ--మరొకసారి కొడుకు అందుకు న్నాడు; వాడి యూని ఫాం షర్టు అక్కడక్కడ బొంతలు పడ్డదని, క్లాసు కుర్రాళ్ళది చూసి యెగతాళిగా గన్ షాట్సుకి చినిగిన బొంతల్లా ఉన్నాయంటూ ఆట పట్టిస్తున్నారని పిర్యాదు చేస్తూ--ఆమె అదేమీ లక్ష్య పెట్టకుండా సాగిపోతూంది. పెళ్ళాం కాళ్ల చప్పుడు దూరమైందని తెలుసుకుని ఎల్లయ్య కనురెప్పలు తెరిచాడు. అతడికి తెలియకుండానే అతడి రెండు కళ్లూ తడిసున్నా యి. తన కాళ్ళూ చేతులూ బాగున్నప్పుడు ముత్యాలమ్మ చాలా మంది గృహిణుల్లాగే ఇంటి పట్టునే ఉండేది-పిల్లల్ని సాకుతూ అత్తయ్య అవసరాలను గమనిస్తూ--తనేమో వారానికి ఒకసారో పదిరోజులకొకసారో డ్యూటీ ఆఫ్ దొరికినప్పుడల్లా రేషన్ షాపుకి వెళ్ళి సరుకుల తెచ్చిచ్చేవాడు. తనకు పక్షవాతం వచ్చినప్పట్నించీ నిర్వీర్యంగా మంచాన పడ్డప్పట్నించీ ముత్యాలమ్మ వెచ్చాలకు డబ్బులు చాలక పనికి వెళ్ళనారంభంచింది. ఇంతకూ తనకు పక్షవాతం తానుగా వచ్చిందా! చౌకగా దొరికింది కదానని దొంగ సారాయం తీసుకుని కదా ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు-- వైట్ కార్టు ఆసరాతో అత్తయ్యను క్యూలో నిల్చోబెట్టి వచ్చి గంటో అరగంటో ఐన తరవాత డీలర్ షాపుకి వెళ్లి రేషన్ సరుకులు తనే ఇంటికి తెచ్చుకుంటుంది ముత్యాలమ్మ. ఎల్లయ్యకు వచ్చి పడ్డ అనారోగ్యం వల్ల ఇంటి పరిస్థితి పూర్తి గా తలక్రిందులైంది. ముత్యాలమ్మకు సంసారం పట్ల ఎంత అక్కర ఉంటే మాత్రం-పిల్లలపైన ఎంతటి మమకారం ఉంటే మాత్రం-ఈ సమస్యల రుద్దుడు ఎన్నాళ్లు సాగుతుందని. నిజానికి తను ముత్యాలమ్మకు మాత్రమేనా భారం? యావత్ కుటుంబానికే తను గుది బండలా తయారవడం లేదూ! తన ఉనికి వల్ల పిల్లలిద్దరి బంగారు భవిష్యత్తుకీ గండి కొట్టడం లేదూ--అతడలా ఆలోచిస్తూ మనసున మధనపడుతూ కుంటుతూ ఊత కర్ర ఆసరాతో లేచి వెళ్లి తల్లి పడుకున్న మంచం వేపు ఓపారి తేరి చూసి నిదానంగా ముఖ ప్రక్షాళనం చేసుకున్నాడు. టిఫిన్ తిని పాలతో మాత్రలు మ్రింగి ఎడారి గాలి వంటి వీచికతో తీర్మానించు కున్నాడు; ఇది ఎక్కువ రోజులు సాగదని-సాగకూడదని---
అదేరోజు సాయంత్రం ఎల్లయ్యకు మరొకటి ఎదురైంది. పనినుండి వచ్చిన ముత్యాలమ్మ కుంటుతూ చేరి తన మంచం
వేపు కష్టపడుతూ చేరి అడిగింది-“డాటర్ ఇచ్చిన మందులన్నీ కరక్టుగా తీసుకున్నావా మాఁవా?”
“అది తరవాతి ఇసయం గాని ముందిది చెప్పు--ఏమైంది? ఎందుకేమిటి అలా కుంటుతూ వస్తున్నావు? నాకు పోటీగా రావాలని డిసైడ్ ఐపోయావేంటి!”
“ అబ్బే—మరేమీ లేదు మాఁవా! చిన్నపాటి ఇనుప గుండు పాదం పైన పడితేనూ—రేపటికి కుదిరిపోతుందిలే—“
“రేపటి మాటా మాపటి మాటా కాదు. రేపు పనికి లీవు పెట్టి దవాఖానాకి వెళ్తావు. డాకటర్ సర్టిపికేట్ ఇస్తావు. అడిగితే వారం రోజుల పాటు లీవు సాంక్షన్ చేస్తారు” అది విని పేలవంగా నవ్విందామె-“ఔను! భలే మజాగానే లీవు సాంక్షన్ చేస్తారు. కాని జీత మో! అదెవరు ఇస్తారు?” ఎల్లయ్య విసుగ్గా చూసాడు-“ అదేంవిటోయ్ అట్లా మాట్లాడుతావు? రూల్ ప్రకారం హాఫ్ జీతం ఇవ్వరూ-“
“ హాఫ్ జీతం గాని వస్తే ఇక అంతే గతి మరి —“ ఆ మాటంటూ ముత్యాలమ్మ అక్కణ్ణించి లేచి వెళ్లిపోయింది. అప్పుడతని మనసునిండా ఒంటరి తనం దిగాలుగా చీకటి సొరంగంలా వ్యాపించింది.
ఆ రోజు రాత్రి భోజనాల సమయంలో ఎల్లయ్య రెండవసారి పెళ్ళానికి గుర్తు చేసాడు; పురుగుల మందు తెచ్చావానని-
“పెరడులోని ములం కాయ చెట్టుపైన ప్రాకుతూన్న ఆ చెదల పురుగుల కోసమేనా — దానికోసం అంత పెద్ద డబ్బా ఎందుకని ఆలోచిస్తున్నాను మాఁవా! ఖరీదు కూడా ఎక్కువలా ఉంది. దానికి చిన్న డబ్బా దొరికితే తెస్తాలే మాఁవా—“ దానికతడు ఏమీ అనలేదు. భార్యనూ అటు మూలన గిన్నె ముందేసుక్కూర్చున్న తల్లినీ కళ్ళు మిటకరించి చూస్తూ ఉండిపోయాడు. పాత పాటల ప్రేమికుడైన ఎల్లయ్య అసంకల్పితంగా ముబైల్ ని నొక్కాడు -“ ధరణికి గిరి భారమా — గిరికి తరువు భారమా—తరువుకి కాయ భారమా—కనిపెంచే తల్లికి పిల్ల భారమా?” పాట వింటూ కళ్ళు రెండూ గట్టిగా మూసుకున్నాడు ఎల్లయ్య.
---------------------------------------------------------------------------
మిట్ట మధ్యాహ్నం. ఇంట్లో ఎవరి అలికిడీ లేదు. ముత్యాలమ్మ పనికి ఎప్పటిలాగే పెందలకడే వెళ్లిపోయింది; అటు పిల్లలిద్దర్నీ స్కూలులో దిగబెట్టి--తల్లేమో ఓపిక తెచ్చుకుని ఎదురింటి వెంకాయమ్మతో బొడ్రాయి తల్లి మాంచాలమ్మను మొక్కి రావడానికి ప్రక్క వీధికి వెళ్ళింది. ఇప్పుడే ఒకటి తరవాత ఒకటిగా రెండు భారీ ట్రైనులు వచ్చే వేళయింది. ఇదే అదను తన చిరకాల నిర్ణయానికి రూపం ఇవ్వడానికి—
ఊతకోలు ఆసరాతో ఊపిరి బిగబట్టి లేచి ఇంటినుండి బైటకు వచ్చి ఎల్లయ్య అటూ ఇటూ చూసి ఎవరూ లేరని తేల్చుకుని వేగంగా కుంటుతూ జోగుతూ రైలు పట్టాల వేపు నడవసాగాడు. వేగం అందుకోవాలంటే ఊపుండాలి. ఊపుండాలంటే సత్తా ఉండాలి. పక్షవాతానికి గురైన ఎల్లయ్యకు అంతటి వేగమూ ఊపూ ఎలా వస్తాయి? ఐనా ఎల్లయ్య ఆగలేదు. అటూ ఇటూ ఊగిపోతూనే తొట్రుపడుతూనే ఊతకోళ్ళ పై పట్టు బిగించి సరాసరి రైలు పట్టాలు సాగుతూన్న దిబ్బ వరకూ వచ్చేసాడు. అప్పుడు అతడు ఏమాత్రమూ ఎదురు చూడనిది జరిగింది.“ఒరేయ్ బామ్మర్దీ! ఏమిటా పరుగు? పడిపోయేవు—ఉన్నదానికి మరొకటీను—“ ఆ గొంతు విని ఆగిపోయాడు ఎల్లయ్య. అది తనకు తెలిసిన చిర పరచిత కంఠ స్వరం—సూరప్పడిది. కొద్ది సేపట్లో ఎల్లయ్య దగ్గరకు వచ్చేసాడు. వచ్చేస్తూ అడిగాడు-“ నేనిప్పుడు వస్తున్నది ఎవరికోసమనుకుంటున్నావు? నీ కోసమే--” లోలోన ఉక్రోశంతో ఊగిపోతూ ఎందుకన్నట్టు కనుబొమలెగరేసి చూసాడు ఎల్లయ్య.“రాత్రికి రాత్రే రావాలనుకున్నాను, మరీ చీకటి పడిపోతేనూ-అసలే నీకు అనారోగ్యం-అందుకని డ్యూటీ ముగించుకుని తిన్నగా ఇక్కడకు పరుగెత్తుకొస్తున్నాను”
“అది సరేరా బావా! ఇంతకీ ఇసయం చెప్పనంటావు. సంగతేమిటి?” ఎల్లయ్య అడిగాడు-అసహనంతో ఊగిపోతూ--
“ ఇసయం కొంచెం సీరియస్సేరా బావా! గుండె దిటవు చేసుకో—ఎందుకైనా మంచిది—“ అలాగే అన్నట్టు తలాడించాడు ఎల్లయ్య.
“నీ ఫ్రెండు నీ క్లోజ్ ఫ్రెండు కోమటి గోరన్న లేడూ—ఏదో వ్యాపారం చేసుకుంటానని ఇక్కణ్ణంచి కాచిగూడ వెళ్లిపోయాడే—వాడేమి చేసాడో తెలుసా- స్వీసైడ్ చేసుకున్నాడురా—“ ఆమాటకు ఎల్లయ్య నిర్ఘాంతపోయాడు. కణతలు రక్త ప్రసారంతో పొంగి చేతులు వణక సాగాయి. నోట మాట పెగలడానికి యమయాతన పడసాగాడు ఎల్లయ్య. అప్పుడు పరిస్థితి గమనించి సంభాషణ కొనసా గించాడు సూరప్పడు-“ మనిషంటే కష్టాలురావా? అప్పులపాలయానని—తన వల్ల అందరూ కష్టాలపాలవుతున్నారని ఉత్తరం రాసి ప్రాణాలు తీసుకున్నాడు. నీ ఫ్రెండేమో తను వెళ్లి పోతే కష్టాలు గట్టెక్కుతాయాననుకున్నాడు. కాని అలా జరగలేదురా బావా!” పూడుకుపోయిన గొంతుతో అన్నాడు సూరప్ప డు. ఎట్టకేలకు పెదవులు విప్పి అడిగాడు ఎల్లయ్య-“ఇంకా ఏమి జరిగందని?” సూరప్పడు కొనసాగించాడు-“భర్త పోయాడని తెలిసిన వెంటనే కోమటి గోరన్న భార్య ఏమి చేసిందో తెలుసా! తను కూడా ప్రాణాలు తీసుకోవడానికి పూనుకుంది. సీరియస్ కండీషన్ లో కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతూంది దవాఖానాలో— ఇప్పుడు ఇద్దరు ఆడ కూతుళ్లూ నడిరోడ్డున నిల్చున్నారు. వాళ్ల గతేమవుతుందో ఆ పైనున్న దేవుడికే ఎరుక—“ ఆ మాట విన్నంతనే ఎల్లయ్య చేతిలోని ఊతకోలు చప్పున జారి పడింది. దానితో బాటు ఎల్లయ్య కూడా క్రింద పడ్డాడు. అది చూసి సూరప్పడు వెంటనే ఊతకోలు అందుకుని ఎల్లయ్యను నిలబెట్టాడు.” గుండె దిటవు చేసుకోమని ముందే అన్నానా! ఐనా అదేం పెడ బుధ్దులురా ఎల్లా! ఈ రోజ్లుల్లో చాలా మంది ఇంట్లో కూర్చునే కాంట్రాక్టు పని చేసుకుంటూ వందలూ వేలూ గడిస్తున్నారు. తలచుకోవాలే గాని—భార్యా బిడ్డలిద్దరూ ఇంటినుండే పనులు చేస్తూ రోజుకు మూడొందలు సంపాదించ లేరూ! ’ ఎల్లయ్య బదులి వ్వలేదు. కీ యిచ్చిన రొబోలా ఫుల్ ఫోర్సులో సర్రున కదలుతూ వెనక్కి తిరిగాడు.” అదేంవిట్రా బావా! నోటమాట పడిపోయినట్టు చూస్తూ అలా నడచి వెళ్లిపోతున్నావు! టైము చెప్తే నిన్ను కాశిగూడ తీసుకెళ్తాను నాటు వైద్యుడు నటరాజు దగ్గరకి--” ఎల్లయ్య ఆగలేదు. తిరిగి చూడ లేదు. వచ్చిన వేగంతోనే పట్టాలు దాటుకుంటూ ఇంటి వేపు నడవ సాగాడు. ఇప్పుడతనికి కావలసింది నాటు వైద్యం కాదు. ఆత్మ బలం. బలవన్మరణం ఎన్నటికీ సమస్యల్ని తీర్చలేదు. దానికి మారుగా సమస్యల్ని రెట్టింపు చేస్తుంది. నమ్ముకున్నవారందరికీ నరకం చూపిస్తుంది కూడాను - - కర్మఫలాన్ని అనుభవిస్తూ కష్టాలను యెతుర్కుంటూ ముందకు సాగుతూనే పోవాలి. మరి, దీనికి మరొక దారి ఉందా! ఉండదు. ఎవరకీ ఉండదు. ఇప్పుడతని ముందున్నది ఒకటే! పోరాడుతూ ముందుకు దూసుకుపోతూనే ఉండాలి. ఆకాశం దానికదే విచ్చుకుని హృదయద్వారాన్ని తెరచుకుని దారి చూపించేంత వరకూ—ఆటల పోటీలో పాటల పోటీలో పత్యర్థుల్ని ఓడించవచచు. కాని-- జీవితాన్ని గెలవాలంటే తనను నమ్ముకున్న వారందర్నీ ప్రేమించే తీరాలి. వాళ్ళకోసం పలాయనం చిత్తగించకుండా సవాళ్ళను యెదుర్కునే తీరాలి. అదే కదా—జీవిత సత్యం--