యువత మార్చేను భవిత  (Author: మంజీత కుమార్)

చెమటలు కక్కుతూ అలసిపోయి ఇంటికి చేరాడు తులసయ్య. వాకిట్లో ముఖం కాళ్లుచేతులు కడుక్కుని లోపలికి వచ్చాడు.

భార్య సుభద్ర మంచినీళ్లు అందిస్తూ “ఆ.. వచ్చారా?  అన్నం వడ్డించనా? ఈపూట ఎండ ఎక్కువున్నట్టుంది”  అంటూ భుజంపైన తువ్వాలు వేసింది.

తులసయ్య ఆ తువ్వాలుతో ముఖం తుడుచుకుని “ఎండైనా వానైనా మనకు తప్పదుగా. ఇంతకీ మన పుత్రరత్నం హరి లేచాడా?”  అనడిగాడు.

సుభద్ర లేదన్నట్టు తలాడిస్తూ “ఇంకా లేదండి. రాత్రంతా ఆ సెల్‌ఫోన్‌ చూస్తూనే ఉన్నాడు. తెల్లారుతుండగా పడుకున్నట్టున్నాడు. ఎప్పుడు లేస్తాడో మరి”  అంది.

తులసయ్యకు వయసుకొచ్చిన కొడుకు వాలకం ఏ మాత్రం నచ్చట్లేదు. ఏ పనీపాటా లేకుండా రోజంతా బలాదూర్‌గా తిరగడం, రాత్రంతా ఫోన్లో మునగడం చిరాకుగా ఉంది. ఎన్నిసార్లు మందలించినా కొడుకు మాట వినకపోవడంతో అదో పెద్ద తలనొప్పిగా మారింది.

..................................................................

అద్భుతాపురమనే పల్లెటూర్లో పుట్టిపెరిగాడు తులసయ్య. తాతముత్తాతల నుంచి వ్యవసాయమే వారి జీవనాధారాం. తులసయ్యే కాదు ఆ ఊళ్లో దాదాపు అందరూ రైతులే. పంటలు బాగా పండితే పండగ, లేకుంటే బ్యాంకు రుణాలు, అక్కడా ఇక్కడా అప్పులు.. ఇదే వారి జీవితం.

ఇక యువత ఆలోచనలు వేరుగా ఉన్నాయి. చిన్నతనం నుంచి తల్లిదండ్రుల కష్టం చూసిన వారికి వ్యవసాయమంటేనే నచ్చడంలేదు. ఆరుగాలం కష్టపడి వచ్చే అరకొర డబ్బులతో అప్పులు తీర్చలేక వారు పడే అవస్థలు తాము పడలేమని వారి వాదన. ఎలాగైనా పట్టణాలకు వెళ్లిపోవాలని కలలుకంటున్నారు. ఇదే విషయాన్ని ఇంట్లో వారికి చెబితే వారేమో ఒప్పుకోవడం లేదు. దీంతో వారు ఏ పని చేయకుండా టివి, ఫోనులకు బానిసలై సోమరిపోతుల్లా తయారయ్యారు.

.......................................................................................................

ఇదిలా ఉండగా... ఓ సాయంత్రం చెరువు గట్టు మీద కూర్చుని ఏదో ఆలోచనలో పడ్డాడు తులసయ్య. అప్పుడే అక్కడికి సుందర్‌, వాసు, సుబ్రహ్మణ్యాలు కూడా చేరుకున్నారు. వీలున్నప్పుడు ఆ గట్టు మీద కూర్చుని కష్టసుఖాలు మాట్లాడుకుంటుంటారు బాల్య మిత్రులు.

సుందర్‌ గట్టుపై కూర్చుంటూ “ఏరా తులసి.. ముఖం దిగాలుగా ఉంది. పంటకు గిట్టుబాటు ధర రాలేదని బెంగపెట్టుకున్నావా ఏంటీ, మనకు ఈ కష్టాలు అలవాటే కదరా”  అంటూ ఆత్మీయంగా భుజంపై చేతేశాడు.

తులసయ్య సన్నగా నవ్వుతూ “అదేం లేదురా. మనకిదంతా కొత్తా ఏంటి? నా బెంగంతా నా కొడుకు గురించేరా”  అన్నాడు.

వాసు విస్తూపోయి “నీ కొడుకేం చేశాడ్రా”  అనడిగాడు.

తులసయ్య వాపోతూ “ఏం చేయట్లేదనే నా బాధరా. రోజంతా ఇంట్లోనే ఖాళీగా ఉంటాడురా. నా పీకలమీద కూర్చుని అదేదో  ఫోనట కొనిపించుకున్నాడు. ఇరవై నాలుగ్గంటలు అందులోనే మునిగి ఉంటాడు. నాకు పొలం పనుల్లో సాయం చేయడు. ఇంట్లో వాళ్లమ్మకు సాయం చేయమంటే అదీ చేతకాదు. ఏమన్నా అంటే పట్నంపోయి ఉద్యోగం చేసుకుంటా. ఈ వ్యవసాయం దండగ... టైమ్ వేస్ట్ అంటున్నాడు”  అని తలపట్టుకున్నాడు.

సుందర్‌, వాసు, సుబ్రహ్మణ్యాలు ఒకరిముఖాలు ఒకరు చూసుకున్నారు.

ముందుగా సుబ్రమణ్యం పెదవి విప్పి “అరేయ్‌ మా ఇంట్లోనూ ఇదే గోలరా. వ్యవసాయం చేసి ఏం సంపాదించారు. ఎప్పుడూ ఆకలి, అప్పులే. అందుకే సిటికెళ్లి జాబ్ చేసుకుంటా. పొలమమ్మి డబ్బులు ఇవ్వమని ఒకటే గొడవనుకో”  అన్నాడు.

తులసయ్య ఆశ్చర్యంగా సుబ్రమణ్యం వైపు చూశాడు.

ఇంతలో సుందర్‌ బాధగా “వ్యవసాయం అంటే ఈ కాలం పిల్లలకు బొత్తిగా ఇష్టం లేదురా. కాయాకష్టం చేయకుండా ఏదో సంపాదించాలని ఆరాటం. పైగా పొలం పనులు చేయాలంటే నామోషీగా చూస్తున్నారు. పల్లెల్లో పుట్టి పెరిగిన మన పిల్లల పరిస్థితే ఇలా ఉంటే ఇక పట్నం పిల్లల గురించి చెప్పనే అక్కర్లేదురా”  అన్నాడు.

తాము వింటున్నది నిజమేనా అన్నట్టుగా అందరూ ఒకరినొకరు చూసుకున్నారు. వారి మౌనాన్ని చేధిస్తూ వాసు దిగాలుగా “నా కొడుకైతే నన్నే వ్యవసాయం మానేయమని వేధిస్తున్నాడురా. అందరం కలిసి పట్నం వెళ్లి ఏదో ఒక ఉద్యోగం చేసుకుందామని ఒకటే పోరు. మా ఆవిడని, నా కూతురిని ఒప్పించేశాడు కూడా. నేను రానంటున్నానని నాపై పగ పట్టాడు. నాతో మాట్లాడక ఎన్ని రోజులైందో తెలుసా”  అని బాధపడుతూ కన్నీళ్లు కార్చాడు.

అందరూ వాసు దగ్గరికి వెళ్లి అతడి కన్నీరు తుడిచారు. తులసయ్యకు ఊళ్లో పరిస్థితి పూర్తిగా అర్థమయ్యింది. ఇన్ని రోజులు చిన్న సమస్యే.. తన ఇంటి సమస్యే అనుకున్నాడు కానీ ఇప్పుడే ఈ వ్యవహారం పెద్దగా అవుతోందని తెల్సి వచ్చింది. అందుకే ఏదైనా మార్పును తీసుకురావాలని ధృడంగా సంకల్పించాడు.

తులసయ్య నిశ్చయించుకున్నట్టు లేచి నిలబడి “ఇది నా ఒక్కడి సమస్యే అనుకున్నానురా. కానీ నేటి యువత అందరిదీ అని మీ మాటల్లోనే అర్థమయ్యింది. ఇప్పటికే మన ఊరు వలసలతో చాలా ఖాళీ అయ్యింది. ఇక చాలు. వ్యవసాయాన్ని వారసత్వంగా తీసుకోలేకపోతున్న మన ముందు తరాల వారికి దాని గొప్పదనాన్ని తెలియజేయాలిరా”  అన్నాడు.    

సుబ్రమణ్యం తలాడిస్తూ “ నిజమేరా కానీ ఎలా?  మొక్కై వంగనిది మ్రానై వంగునా అన్నారు పెద్దలు. ఎదిగిన మన పిల్లల మనసు మార్చేదెలా? వారి దారి మార్చేదెలా“ అనడిగాడు.

తులసయ్య సావధానంగా “ఏదో ఒక పరిష్కార మార్గం అన్వేషిస్తానులే. నేటి యువత రేపటి వ్యవసాయ భవితను మార్చాలిగానీ, వ్యవసాయాన్నే వదులుకుంటానంటే మనం ఊరుకోవద్దు. మనం పెద్దవాళ్లం. పిల్లలను సరైన దారిలో పెట్టాల్సింది మనమే. అయితే కాస్త ఓపిక, సహనం కావాలి అంతే”  అంటూ చిన్నగా నవ్వాడు.

అందరూ సరే అన్నట్టు తలాడించారు. అలా కాసేపు పైరుగాలిని పీలుస్తూ... ప్రకృతమ్మ ఒడిలో పిచ్చాపాటి మాట్లాడుకుని ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు.

................................................................................

ఓరోజు హరి యధావిధిగా ఫోను చూస్తూ “అమ్మా ఏం వండావు, నాకు కాస్త కంచంలో పెట్టి గదిలోకి తెచ్చివ్వు”  అని పురమాయించాడు.

కాసేపటికి “అమ్మా మంచినీళ్లు తెచ్చివ్వు”  అంటూ అరిచాడు.

సుభద్రకు కొడుకుపై మహా చిరాకేసింది. పాపం మండుటెండలో భర్త కష్టపడి పొలం పనులు చేస్తూ, మధ్యాహ్నం అంత దూరం సైకిల్‌పై వచ్చి అన్నం తిని వెళ్లడం. కొడుకేమో ఎండెరగకుండా పెరుగుతుండడం.. కనీసం ఒళ్లు వంచి సొంత పనులు కూడా చేసుకోకపోవడం ఆమెను బాధపెట్టింది.

మరో రోజు హరి టివి చూస్తూ “అమ్మా ఇంకెంతసేపు కంచంలో కూర అయిపోయింది, త్వరగా తీసుకురా”  అని పిలిచాడు.

ఏదో పనిలో ఉన్న సుభద్ర కోపం పట్టలేక “అరేయ్‌ నీకు ఇంత ఒళ్లు బద్దకమేంట్రా. రైతు బిడ్డవు, పంట పండించకుండా ఆ పండిన ధాన్యాన్ని ఎలా తినాలనుకుంటున్నావురా?  యువత బద్దకిస్తే దేశానికే అరిష్టమని తెలియదా?  నీలాంటి వారు మట్టికి భారంరా. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకో మీ నాయనకు సాయంగా వ్యవసాయం చేసుకో. చేతకాదంటే చెప్పు. నేనెళ్లి మీ నాయనకు సాయంగా ఉంటా. నువ్వు ఇంట్లో వంటావార్పు చేసుకుంటూ ఉందూగానీ”  అంటూ చీవాట్లేసింది.

ఎప్పుడు పల్లెత్తు మాట అనని తల్లి ఒక్కసారిగా విరుచుకుపడేసరికి హరికి ఎలాగో అనిపించింది.

ఆ మరునాడు ఎప్పటిలానే మధ్యాహ్నం కావస్తుండగా నిద్రలేచిన హరి.. ముఖం కడుక్కుని “అమ్మా ఏంటీ వంట ఆకలేస్తోంది”  అనడిగాడు.

సుభద్ర టక్కున “నేనేమీ వండలేదు”  అంది.

హరికి నమ్మశక్యం కాలేదు. వంటగదిలోకి వెళ్లి చూడగా పాత్రలన్నీ ఖాళీగా కనిపించాయి.

“ఏంటమ్మా ఏమీ వండలేదు, ఎందుకు ఏమైంది”  అని రెండుమూడుసార్లు తల్లిని ప్రశ్నించినా ఆమె నుంచి ఎటువంటి సమాధానం రాలేదు.

హరికి చిరాకేసి “సరే అయితే నేను పక్కింటి సుబ్రమణ్యం మావయ్య ఇంట్లో తింటాను”  అంటూ వాళ్లింటికి వెళ్లాడు. సుబ్రమణ్యం కొడుకు చిన్నా.. హరి తండ్రుల్లానే బాల్య స్నేహితులు.

హరి రావడం చూసిన సుబ్రమణ్యం కుశల ప్రశ్నలేసి ఏంటీ సంగతి అని అడిగాడు.

“అమ్మ ఇంట్లో ఏమీ వండలేదు మావయ్య. ఆకలేస్తోంది, ఇక్కడేమైనా తిందామని వచ్చాను”  అని మొహమాటం లేకుండా చెప్పాడు.

ఇంతలో చిన్నా బయటకు వచ్చి “అరేయ్ మా ఇంట్లో కూడా అమ్మ ఏమీ వండలేదురా.   ఆకలి దంచేస్తోంది. పద బాబాయ్‌ హోటల్లో ఏదన్నా తిందాం”  అన్నాడు.

సుబ్రమణ్యంవైపు చిన్నా.. హరి ఓ చూపు చూసి హోటల్‌కు బయలుదేరారు. అలా వారు వెళుతుండగా వాసు కొడుకు సుధీప్ నీరసంగా నడుస్తూ కనిపించాడు.

“అరేయ్ సుధీప్ ఏమైంద్రా.. గాలి తీసిన బుడగలా అలా ఉన్నావ్‌”  అని అడిగాడు హరి లేని ఓపిక తెచ్చుకుంటూ. ఎందుకంటే వారి కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయ్ మరి.

“మా ఇంట్లో ఇవాళ ఏమైందో ఏమోగానీ వంట చేయలేదు రా. మీకు తెలుసుగా నేను ఆకలికి తాళలేనని. అందుకే హోటల్‌కు వెళుతున్నా. డబ్బులు ఇవ్వమంటే కూడా ఇవ్వలేదురా. సరే బాబాయ్‌ హోటల్‌ తెల్సిందేగా, తర్వాత డబ్బులు ఇవ్వొచ్చులే అని బయలుదేరాను”  అన్నాడు.

చిన్నా అనుమానంగా “ఏంట్రా అందరి ఇళ్లల్లో ఇవాళ వంటలేదు. నాకెందుకో అనుమానంగా ఉందిరా”  అన్నాడు.

హరి, సుధీప్ కూడా అవునన్నట్టు తలాడించారు. ముగ్గురు కలిసి వారి ఊళ్లో ఉన్న ఏకైక హోటలైన బాబాయ్ హోటల్‌కు చేరుకున్నారు. అప్పటికే అక్కడ సుందర్ కొడుకు వాస్తవ్‌ డీలాగా కూర్చుని ఉన్నాడు. ఎందుకంటే హోటల్‌కు తాళమేసి ఉంది.

వాస్తవ్ వీళ్లందరిని ఆశ్చర్యంగా చూస్తూ “ఏంట్రా మీరంతా ఇక్కడ” అనడిగాడు.

మిత్రులంతా ఇంట్లో వంట చేయని విషయాన్ని, హోటల్ మూసి ఉండడాన్ని ఒకరికొకరు చెప్పుకుని... చేసేదేమీ లేక ఆకలితో నకనకలాడుతూ అక్కడే కూర్చుండిపోయారు. ఎప్పుడూ గలగల మాట్లాడుకునే బ్యాచ్‌ మూగబోయింది. వాళ్లకు కళ్లు తిరుగుతున్నాయి. కాళ్లు వణుకుతున్నాయి. కనీసం తోటలో జామకాయలో సీతాఫలాలో కోసుకు తిందామంటే.. అక్కడి వరకూ వెళ్లే ఓపిక, శక్తి కూడా క్షీణించుకుపోయింది.

చిన్నా ఢీలాగా ముఖం పెట్టి“ఏంట్రా పరిస్థితి. నా వల్ల కావట్లేదురా. ఎప్పుడూ సమయానికి అమ్మ అన్నం పెట్టేది. హాయిగా తిని పడుకునే వాడిని. ఇప్పుడు తెలుస్తోందిరా ఆకలి విలువ. బాబోయ్ ఇక తట్టుకోలేను” అన్నాడు.

వాస్తవ్‌ కడుపుపై సుతారము రాసుకుంటూ“ నా జీవితంలో ఇంతసేపు ఎప్పుడూ ఆకలితో ఉండలేదురా. పంట చేతికి రాకున్నా.. అప్పులు తలపై భారమైనా.. నా కంచంలో అన్నం ఎప్పుడూ ఉండేలా చూసుకున్నారు అమ్మా నాన్నలు. ఇప్పుడు...“ అంటూ కన్నీళ్ల పర్యంతమయ్యాడు.

మిత్రులంతా నీరసంగా... ఆకలితో అలమటిస్తూ అక్కడే కూర్చుండిపోయారు.

కాసేపటి తర్వాత బాబాయ్‌ హోటల్‌ యజమాని విశ్వనాథ్‌ అటుగా వచ్చి పిల్లల వాలకం చూసి ముసి ముసిగా నవ్వుకున్నాడు. కాస్త వెటకారంగా“ఏంట్రా కుర్రాళ్లంతా ఇక్కడున్నారు. మీ ఇంట్లో టివి రావట్లేదా లేక ఫోనులో నెట్ బ్యాలెన్స్ అయిపోయిందా”  అని అడిగాడు.

“అదేం లేదు బాబాయ్. అవును హోటల్ ఎందుకు మూసేశారు. మాకు ఆకలేస్తోంది. తినడానికి ఏమన్నా ఉందా?”  అనడిగాడు సుధీప్.

విశ్వనాథ్ విస్తూపోతూ “అయ్యో మీకు తెలీదా?  మన ఊళ్లో అందరూ వ్యవసాయం మానేశారురా. అంటే మనం తినడానికి ఏ గింజా లేదన్నమాట. అందుకే హోటల్ కూడా మూసేశాను. ఇక నేను పట్నం వెళ్లి ఏదన్నా వేరే పని చూసుకోవాలి”  అన్నాడు.

హరి నమ్మలేనట్టుగా “అదేంటి బాబాయ్ వ్యవసాయం మానేయడమేంటి. తిండిగింజలు లేకపోవడమేంటి. మాకు.. మాకేం అర్థం కావట్లేదు”  అన్నాడు.

విశ్వనాథ్‌ యువకుల పక్కన కూర్చుంటూ “అరేయ్ పిల్లలు. మీ నాన్నలు అంటే రైతులు లేకుంటే వ్యవసాయం ఎవరు చేస్తారు. ఎవ్వరూ వ్యవసాయం చేయకపోతే మనకు ఆహారం ఎక్కడ్నించి వస్తుంది?  మీ పాటికి మీరు పట్టణాలకు వెళ్లిపోయి ఏదన్నా ఉద్యోగాలు చూసుకుంటాము, ఈ మట్టిలో రోజంతా పని చేయడం కష్టమని అనుకుంటున్నారట. అందరూ అలానే అనుకుంటే. మనిషన్నవాడికి ఆహారం ఎలారా?  ఒక్క పూట తిండి లేకుంటేనే మీ ముఖాలు ఎలా వాడిపోయాయో చూడండి. అలాంటిది వ్యవసాయమే లేకుంటే?  ఈ భూప్రపంచం ఏం కావాలి?  ఒక్కసారి ఆలోచించండి. అవును ఒప్పుకుంటాను వ్యవసాయం చేయడం సులువు కాదు. ఎప్పుడు వర్షాలుస్తాయో ఎప్పుడు రావో?  చేసిన అప్పులు తీరతాయో లేదో?  పంట చేతికొస్తుందో లేదో?  చివరి క్షణం వరకూ టెన్షనే. అలా అని ఊరుకుంటామా?  అమ్మ కడుపులో తొమ్మిది నెలలు ఉంటాము, ఎన్నో కష్టనష్టాలు పడి అమ్మ మనల్ని కంటుంది. అమ్మో అన్ని నెలలా నా వల్ల కాదు అని మన అమ్మ అనుకుంటే మనం పుట్టేవాళ్లమా చెప్పండి. అలాగే వ్యవసాయం కూడా”  అని విడమర్చి చెప్పాడు.

మిత్రులందరూ ఆలోచనలో పడ్డారు.

విశ్వనాథ్‌ వాళ్లను బుజ్జగిస్తూ “ముందు మీ అమ్మానాన్నలను శత్రువుల్లా చూడడం మానేయండి. వాళ్లేం చేసినా మీ మంచికే. నేటి యువత రేపటి భవితను మార్చాలికానీ ఇలా సమయాన్ని వృధా చేయకూడదు. సరే వ్యవసాయం మీకు కష్టమే నేను ఒప్పుకుంటాను. మీరే వ్యవసాయాన్ని మీ తెలివితేటలతో మేధస్సుతో సులభతరం చేయండి. మీతోటి రైతులకు... మీ యువతరానికి వ్యవసాయాన్ని ఒక వరంలా మార్చి చూపండి. మీరు తల్చుకుంటే ఎంతసేపురా. టెక్నాలజీ మీ చేతుల్లో ఉంది. ప్రతిభ మీ ఉడుకు రక్తంలోనే దాగుంది. మీకు తిరుగులేదురా”  అని ప్రోత్సహించాడు.

“మీరు చెప్పింది నిజమే బాబాయ్. మా కళ్లు తెరిపించారు. అనవసరంగా మా అమ్మానాన్నలను తిట్టుకున్నాం. మాకు నచ్చనిది బలవంతంగా మాతో చేయించాలనుకుంటున్నారని భ్రమించామే కానీ... రైతు బిడ్డలం మా వారసత్వమే వ్యవసాయమని తెల్సుకోలేకపోయాము. ఇక నుంచి దూరపు కొండలపై ఆశలు పెంచుకోకుండా.. మేము పుట్టి పెరిగిన ఊరునే అభివృద్ధిపథంలో నడుపుతాం. రైతులకు నష్టాలు – అప్పుల బాధలు లేకుండా చూసుకుంటాం”  అన్నారు యువకులంతా.

సుధీప్‌ కాస్త ఓపిక చేసుకుని “అదంతా సరేగానీ.. నాకు విపరీతమైన ఆకలేస్తోందిరా. ముందు నా కడుపులో ఏదన్నా పడితేగానీ నా శరీరం కదలదు”  అన్నాడు.

మిత్రులంతా నవ్వి.. అతడిని పైకి లేపారు.

విశ్వనాథ్‌ నవ్వుతూ “అరేయ్ ఈ ప్లానంతా మా తులసిగాడి చలవే. మీలో మార్పు తీసుకురావడానికి నాతో ఈ నాటకం వేయించాడు. మీరు హాయిగా ఇళ్లకు వెళ్లండి. మీ కోసం కమ్మటి భోజనం ఎదురుచూస్తూ ఉంటుంది”  అన్నాడు.

“అవునా.. చాలా సంతోషం బాబాయ్‌”  అంటూ మిత్రులందరూ కలిసి ఇళ్లకు వెళ్లారు.

గుమ్మం వద్దే తమ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న అమ్మానాన్నలకు క్షమాపణలు చెప్పారు. పిల్లల్లో మార్పు వచ్చిందని అర్థమైన కన్నవారు... ఎంతో సంతోషించారు. అందరూ ఆవురావురుమంటూ కడుపారా భోజనం చేశారు.

ఆ మరు నిమిషం నుంచే టివి, మొబైల్ ఫోన్లలో సమయం వృధా చేసే వీడియోలు చూడడం మానేసి... రైతులకు ఉపయోగపడే కొత్త టెక్నాలజీ గురించి తెల్సుకోవడం ప్రారంభించారు. కొంగ్రొత్త సులభ పద్దతుల ద్వారా పంటలు పండిస్తూ... వ్యవసాయం దండగ కాదు రైతులకు పండగ అని అనతికాలంలోనే నిరూపించారు. ఇందుకు సంబంధించిన విషయాలను ఇతర గ్రామ యువతీ యువకులకు కూడా తెలియజేస్తూ వారిని కూడా వ్యవసాయం వైపు అడుగులు వేయించారు.

యువతలో వచ్చిన మార్పుకు గ్రామస్తులందరూ ఎంతో సంతోషించారు. పుత్రోత్సాహంతో వారి తల్లిదండ్రులు ఉప్పొంగిపోయారు. నేటి యువత తల్చుకుంటే ఏదన్నా సాధించగలరన్నది సత్యం. జై కిసాన్.

0 Comments