మీరు ప్రవహించాలంటే………
మీరు ప్రవహించాలంటే……… (Author: అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము)
మీ ఊరెళ్ళండి వెళుతూ……. వెళుతూ…..
మీ దగ్గరున్న జ్ఞాపకాల్ని వెంట తీసుకెళ్ళండి
వీలయితే మీవెంట మరెవరినయినా తీసుకెళ్ళండి
అక్కడ మీకు పట్టెడన్నం లేక ఖాళీ కడుపుతో
గాయపడ్డ దేహాలు ఎదురు పడొచ్చు;
ప్రేమతో వాళ్ళని పలకరించండి,
మీకు ప్రేమతో కథలు చెప్పిన తాత, ముత్తాతలు, అవ్వలు
ఎదురు పడొచ్చు, వారితో కరచాలనం చేయండి,
వీలయితే ప్రేమగా గుండెకు హత్తుకోండి,
మీరు మనుషులను ప్రేమించండి;
మీరు మనసులని ప్రేమించండి;
మానవ దేహాలని ధైర్యంగా ప్రేమించండి,
కొత్త లోకాన్ని నిర్మించొద్దు;
పాత లోకాన్ని అక్కున చేర్చుకోండి;
గాయపడిన గడప లుంటాయి,
వెల వెల బోయిన వీదులూ ఉంటాయి,,
గుడిలో గాలిగోపురాన్ని పలకరించండి,
ఊరిమధ్యలో ఉన్న వేపచెట్టు నీడలో
కాసేపు ప్రశాంతంగా సేదతీరండి,
ముందు మీ ఊరెళ్ళండి,
అక్కడ పాతతరం మనుషులుంటారు;
కొత్తతరం కోసం వేచి ఉన్న మనుషులుంటారు,
అందరి మధ్యా స్థూపంలా నిలబడి మమత,
అనురాగాలని పంచండి, పంజరం లోని పావురాల్ని
బయటకు వదలండి,
చేనులోకి (ని) పాలకంకు లని ముద్దాడండి;
మనషుల్లో, నిజ మానవుల్లో బ్రతుకు ప్రవహించాలంటే
ముందు మీ ఊరెళ్ళాలి; దానితో సహవాసం చేసి రావాలి;
అందుకే నామాట విని వెంటనే మీ ఊరెళ్ళండి;;;;;
—————————————శుభంభూయాత్—————————————