మార్పు మొదలయింది  (Author: శింగరాజు శ్రీనివాసరావు)

"ప్రమదా..నేను బజారుకు వెళుతున్నాను. కూరలు ఏమైనా కావాలా?" పాంటు తగిలించుకుంటూ అడిగాను.

"కూరలే కాదు.. పాలు కూడ కావాలి" వంటగదిలో నుంచే కేకలు పెట్టింది ప్రమద.

"ఎన్ని?"

"రెండు పాల పాకెట్లు. అలాగే మార్కెట్లో మంచి గుమ్మడి కాయ ఉంటే పట్రండి. రేపు పులుసు పెట్టుకుందాం. కనీసం వారానికి ఒకసారైనా మంచి గుమ్మడి తింటే ఆరోగ్యానికి మంచిదట"

"సరే.. వస్తా"

"ఇదిగో దిక్కుమాలిన ప్లాస్టిక్ గోతాలలో కాకుండా, గదిలో మొన్న కొనుక్కొచ్చిన సంచి ఉంది. అది పట్టుకెళ్ళండి"

"ఇక ఆపు నీ కేకలు. వీధి చివరిదాక వినిపిస్తున్నాయి" అని నేను కూడ అదే స్థాయిలో అరచి, సంచి తీసుకోకుండానే బయలుదేరాను.

అదేమిటోగానీ బయటకు వెళుతూ సంచి తీసుకు వెళ్ళాలంటే చచ్చేటంత నామోషి నాకు. నా చిన్నతనంలో సంచి లేని భుజం ఉండేది కాదు. చేతిలో గొడుగు, చంకలో తగిలించుకునే సంచి లేకుండా మా నాన్నగారి స్నేహితులను ఎప్పుడూ చూడలేదు నేను. అదేమిటో ప్లాస్టిక్ సంచులు వచ్చాక చేతులు ఊపుకుంటూ పోవడం, బజారులో కొన్న సరుకును ప్లాస్టిక్ సంచిలలో వేసుకుని రావడం ఒక ఫ్యాషను అయిపోయింది.

నాలుగు అడుగులు వేశానో లేదో, మా ఇంటికి నాలుగు గుమ్మాల అవతల ఉండే శంకరం తగిలాడు నాకు. నాతో పాటే బ్యాంకులో పనిచేసి, నా కంటే రెండు సంవత్సరాల ముందు పదవీ విరమణ చేశాడు. మనిషి సాధుస్వభావి. ఎవరినీ నొప్పించడు. సంప్రదాయానికి విలువ అధికంగా ఇచ్చేవాడు కావడంతో అతడిని అంతా చాదస్తపు శంకరయ్య అనేవారు. పదవీ విరమణ తరువాత నేను కాస్తంత సాహిత్యసేవ చేసుకుందామని రచనా వ్యాసంగంలో పడితే, అతను మాత్రం భక్తి ఛానల్ కు అంకితమై పోయాడు. అందులో వచ్చే అన్ని  ప్రవచనాలను, ధర్మసందేహాలను విని, వాటిని మాకు వినిపిస్తూ మాకు పిచ్చెక్కిత్తించేవాడు. కార్తీకమాస స్నానాలని, దీపారాధనలని, గోమాత పూజలని.. ఒకటేమిటి.. ప్రవచనకారులు ఏది చెబితే అది చేసేవాడు. అన్నింటిలోకి ఆయన అధికంగా చేసేది గోపూజ. పర్వదినము వచ్చినా సరే తెల్లవారేసరికి ఇంటి ముందుకు వచ్చిన ఆవును ఆపి దాని ముఖానికి, వీపుకు, వెనుక భాగానికి పసుపు పూసి, కుంకుమ బొట్లు పెట్టి, దాని నోటికి అరడజను అరటిపండ్లు అందించి మరీ సాష్టాంగ నమస్కారాలు చేసేవాడు. మొదట్లో ఎవరైనా ఆవును తోలుకు వస్తేనే ఇలాంటి కార్యక్రమం నిర్వహించేవాడు. కానీ ఒక సంవత్సరం నుంచి మా వీధిలో తిరిగే ఆవును రోజుకో అరటిపండు పెట్టి మచ్చిక చేసుకుని పండుగ రోజులలో దానికి అలంకరణ చేసి ఆనందపడడం మొదలు పెట్టాడు. అది కూడ తతంగానికి అలవాటు పడి ఆయన కార్యక్రమం పూర్తి చేసేవరకు నిలబడడం అలవాటు చేసుకుంది. ప్రతిరోజూ ఉదయం ఏడు కొట్టేసరికి శంకరయ్య ఇంటి ముందు ప్రత్యక్షమయ్యేది ఆవు. అలా వీధికి ఒక గోమాతను పరిచయం చేసిన శంకరం శ్రమ వృధా పోలేదు. ఆయనను చూసి మా వీధిలో మరికొందరు కూడ పర్వదినాలలో గోమాత సేవ చేసుకోవడం మొదలెట్టారు. నాకు ఇలాంటి ఆర్భాటాలు సుతరామూ ఇష్టంలేక పోయినా, మా ఇంటి జోరీగ మాట కాదనలేక, పుట్టలో పుణ్యముందో అనే ఆలోచనతో నేను కూడ మొదలెట్టాను గోపూజ.

"ఏమోయ్ శీనయ్యా.. ఎక్కడికి పొద్దున్నే.. కూరగాయల మార్కెట్ కేనా" అంటూ పలకరించాడు శంకరం.

"అవును శంకరం అక్కడికే. మీరెందాకా?" అని బదులు ప్రశ్న వేశాను. (ఇక్కడ శంకరం / మీరు అనడం బాగో లేదు)

"కనపడడంలేదా చేతిలో సంచి. నేనూ అక్కడికే..పద. ఉదయాన్నే రెండు కిలోమీటర్లు ఇలా పనిగట్టుకు పోతుంటేనే వయసులో కాస్త ఆరోగ్యంగా ఉంటాం. అవును సంచి ఏది, అలా ఊపుకుంటూ వస్తున్నావు" అన్నాడు.

"ఎందుకు శంకరం వాడెలాగూ ప్లాస్టికు సంచిలో పోసి ఇస్తాడుగా. ఎందుకు చేతిలో అదొక అదనపు బరువు"

"అలా కాదు శీనయ్యా. ప్లాస్టికు వాటిలో వస్తువులు తేవడం అంత మంచిది కాదు. వాటిలో మనం వస్తువులు తీసుకురావడం, ఇంట్లో వస్తువులు సర్దుకున్న తరువాత వాటిని వీధిలో విసరడం, అవి వానకు తడిసి, భూమిలో కలిసి విషంగా మారడం అవసరమా చెప్పు. ప్లాస్టిక్ రహిత సమాజం కావాలని ప్రభుత్వాలు ఘోషిస్తుంటే చదువుకున్న మనం కూడ ఇలా బాధ్యతా రాహిత్యంగా ఉంటే ఎలా?"

"అబ్బా.. మొదలుపెట్టావా. భక్తి ప్రవచనాలు విని విని నువ్వు కూడ ఒక ప్రవచనకర్తవై పోయావు స్వామీ. చేతిలో సంచి పట్టుకుని వచ్చే మనిషిని చూపించు నాకు. ఏదో నీలాంటి ఒకరు, అర చాదస్తులు తప్ప. సరేలే..నా అలవాటు నాది. నీ అలవాటు నీది"

"నేను చెప్పేది మన కోసమే కాదు శీనూ..పర్యావరణ పరిరక్షణ కోసం. మనమంటే జాగ్రత్తగా ఉంటాం. కానీ మిగిలిన జీవాలు అలా కాదు కదా. అవి మనం విసిరిన చెత్తను తింటూ, వాటితో పాటు ప్లాస్టికు సంచులు తింటాయి. దానివలన వాటి ఆరోగ్యం దెబ్బతింటుంది కదా. అవి కూడ మనలాంటి జీవాలే కదా"

"ఇక ఆపుతావా నీ ఉపన్యాసం. నువ్విలాగే గీతోపదేశాలు చేసే పనయితే నేను ఆటో ఎక్కి వెళ్ళిపోతాను" అని బెదిరించాను.

"సరే అననులే..రా" అని ఇంకొకమాట మాట్లాడకుండా నా వెంట నడవసాగాడు శంకరయ్య. ఇద్దరం కలిసి టీ తాగి, కూరగాయలు కొనుక్కుని తిరుగుముఖం పట్టాము. దారిలో గుర్తుచేశాడు రాబోయే దసరా పండుగ గురించి. పండుగ మూడు రోజులు గోపూజ చేసుకోమని, ఎంతో పుణ్యం వస్తుందని, నేను ఆపుతున్నా ఆగకుండా, గోసేవ పుణ్యఫలాన్ని దారి పొడుగునా వివరించాడు. దీన్ని కూడ ఆపితే బాధపడతాడని చెప్పినదల్లా వింటూ ఇంటికి చేరాము. ఇంటిలోకి ప్లాస్టిక్ సంచులు విసిరేసి, ప్రమద చేత చిక్కని కాఫీ పెట్టించుకుని తాగిన తరువాతకానీ తగ్గలేదు, శంకరయ్య మాటలకు తగులుకున్న తలనొప్పి.

"ఏమండీ..ఈరోజు విజయదశమి. గోమాత పూజ చేసి, తల్లి తోకను నెత్తికి తాకించుకుంటే, కోటి జన్మల పాపం పటాపంచలయి పోతుందట. త్వరగా స్నానం చేసిరండి. అవతల శంకరం అన్నయ్య గారింటికి ఆవు వచ్చే వేళయింది. అన్నయ్య గారి ఇంటి వద్ద పూజ కాగానే మనింటికి తెచ్చుకుందాం తల్లిని" అని చెబుతూ తువ్వాలును నా ముఖాన విసిరేసి వెళ్ళిపోయింది ప్రమద.

అయినా ఆవు ఎక్కడ నుంచి వచ్చిందో నా ప్రాణం తీయడానికి. అనాథగా పుట్టి పెరిగిందో అది కూడ. ఊరు, ఊరు తిరుగుతూ ఇక్కడికి వచ్చి ఉంటుంది. మా శంకరయ్య వంటి అరటిపండు దాత దొరికేసరికి తృప్తిపడి ఉంటుంది. అయినా ఈయన పెట్టే ఒకటో, రెండో అరటి పండ్లతో దాని కడుపు నిండుతుందా..ఏదో ఆయన పట్ల విశ్వాసం కొద్ది రోజూ ఠంచనుగా వస్తున్నది. దాని ఆకలి తీర్చుకోవడానికి హోటలు వద్ద విసరివేసిన అన్నం పొట్లాలో, పండ్లకొట్టు ముందు పారేసిన చెడిపోయిన పండ్లో తింటూనే ఉండి ఉంటుంది అనుకున్నాను. కానీ నాకు ఆశ్చర్యం వేసేది ఒకటే.. ఎవరూ తీసుకురాకుండానే ప్రతిరోజూ ఉదయం వీధికి రావడం.. శంకరంతో పాటు ఇంకెవరైనా ఏదైనా పెడితే తినడం దాని దినచర్యగా మారింది. ఒకరోజు బజారు నుంచి వస్తుంటే చూశాను. మా వీధి చివర చెత్తకుండీలో మూతి పెట్టి గెలికి తనకు నచ్చినవి తింటున్నది ఆవు. '....చెత్త తింటున్నదేమిటి, అందరూ పూజించే గోమాత' అనుకుని అదిలించబోయి ఆగిపోయాను. ఆకలిగొన్న వారికి అన్నం దూరం చేయకూడదని మా బామ్మ చెప్పిన మాట గుర్తుకువచ్చి.
"అయిందా స్నానం" అన్న మా ఆవిడ అరుపుతో ఆలోచనలకు కళ్ళెంవేసి బయలుదేరాను స్నానాల గదిలోకి.

"ఏమండీ..త్వరగా రండి" అన్న మా ఆవిడ అరుపులాంటి పిలుపుతో అదిరిపడి జారిపోతున్న పంచెను మొలతాడుతో బిగించి కిందికి పరిగెత్తాను. మా ఆవిడ ఇంట్లో మాట్లాడుతుంటే వీధి చివరకు వినిపించేది. ఒకసారి మా ఆవిడ దూరపు బంధువు ఒకతను నేను అడ్రసు చెబితే వీధి వరకు వచ్చి, వీధిలో మా ఇల్లేదో అని వెతుక్కుంటుంటే మా ఆవిడ గొంతు వినిపించి నేరుగా మా ఇంటికి వచ్చాడట. అంతటి స్వరమాధుర్యం నా సతీమణిది.

"..వచ్చా..వచ్చా" అంటూ గోమాతను పూజిస్తున్న మా ఆవిడ దగ్గరకు చేరి ఆమె చూపించిన హారతిని కళ్ళకు అద్దుకుని గోవు చుట్టూ ప్రదక్షిణలు చేసి, దాని తోకతో కొట్టించుకుని ఆశీర్వాదం పొంది నా జన్మను తరింపజేసుకున్నాను.

అలా మా పూజ అయిందో, లేదో మా వీధి చివరి గోవిందం ఆవును తీసుకు వెళ్ళడానికి రెడీ అయ్యాడు. అతను అదిలిస్తుంటే కదలలేక పోతున్నది ఆవు. దానికి కూడ బద్ధకం వచ్చినదేమో అనుకున్నాను. కానీ దాని కాళ్ళలో శక్తి క్షీణించినట్లు నాకు అనిపించింది. అయినా వదలకుండా దాన్ని అదిలిస్తూ తనవెంట తీసుకుపోయాడు గోవిందం.
ఇంతలో మా ఆవిడ భుజం మీద తట్టడంతో ఆమెను అనుసరించి లోనికి వెళ్ళాను.
యథాప్రకారంగా ప్రతి పండుగకు మా ఆవిడ చేసే పాయసం, వడ, పులిహోరలలో తొలి విడతగా గ్లాసెడు పాయసాన్ని ఆరగించి పుస్తకం చదువుకుంటూ కూర్చున్నాను.

ఇంతలో "శీనూ..శీనూ" అన్న శంకరం కేక వినిపించి వాకిట్లోకి వచ్చాను.

"ఏంది శంకరం..ఏమయింది"

"శీనూ..మన గోవు గోవిందు గారింటి వద్ద పూజ చేయించుకుంటూ ఉన్న పళంగా కిందపడిపోయిందట. ఆయన భయపడుతూ నాకు ఫోను చేశాడు"

"అవునా ఒక్క నిముషం చొక్కా వేసుకుని వస్తాను" అని చెప్పి హడావుడిగా చొక్కా తోడుక్కుని, నన్ను వదలి ఉండలేని నా ప్రాణమైన చరవాణిని జేబులో వేసుకుని శంకరంతో కలిసి గోవిందు ఇంటికి చేరాను.

మేము అక్కడికి చేరేసరికి వీధిలో జనమంతా అక్కడ చేరి ఉన్నారు. శంకరం గబగబా వెళ్ళి మగతగా పడుకుని ఉన్న దాని ముక్కు దగ్గర వేలు పెట్టి చూశాడు. ఏదో అనుమానంతో నా దగ్గరికి వచ్చి "శీనూ..ఒక్కసారి నీ స్నేహితుడు ఠాగూరుకు ఫోను చెయ్యవా. అతను పశువుల వైద్యుడే కదా.. వచ్చి చూసి విషయం చెబుతాడేమో" అన్నాడు దీనంగా.

నేను కూడ ఆదుర్దాలో ఉన్నాను కనుక వెంటనే ఫోను చేసి ఠాగూరుకు విషయం చెప్పి రమ్మంటే, ఒక పది నిముషాలలో వస్తానన్నాడు.

అప్పటికే అక్కడికి వీధిలోని అందరూ చేరారు. విషయం అర్థంకాకపోయినా గోవు అలా పడిపోవడానికి కారణాలను ఎవరికి తోచినట్లు వారు చెప్పుకోసాగారు.

ఇంతలో ఠాగూర్ వచ్చి ఆవును పరీక్షించి అప్పటికే  ప్రాణం విడించిందని చెప్పాడు. ఒక్కసారి ఉలిక్కిపడ్డాము అందరమూ. హఠాత్తుగా ఎందుకలా జరిగిందో మాకు అర్థం కాలేదు. అప్పుడు అసలు విషయం చెప్పాడు ఠాగూరు.


"సర్.. ఆవు కడుపులోని ప్రేవులలో ప్లాస్టికు బాగా పేరుకుపోయి జీర్ణవ్యవస్థకు అడ్డంకిగా మారినట్లుంది. దాని వలన జీర్ణం కాని పదార్థాలు విషమయమై ప్రాణాంతకంగా మారాయి. బహుశ ఇది గత కొన్ని రోజులుగా సరియైన ఆహారం తీసుకోవట్లేదని అనిపిస్తున్నది. దానికి మీరు పెట్టే ఒకటో, అరో అరటిపండ్లు చాలక అది చెత్తలో దొరికే పండ్లను, ఆహార పదార్థాలను తినడం చేసి ఉంటుంది. కాలంలో ఎక్కడ చూసినా చెత్తను ప్లాస్టికు సంచులలో పెట్టి విసరి వేస్తున్నారు కదా. అది జంతువు కనుక ఆహారంతో పాటు ప్లాస్టికును కూడ తినడం వలన, కరగని ప్లాస్టిక్ కడుపులో పేరుకు పోయి, ఆవు మరణానికి కారణమయింది. మధ్యకాలంలో నేను పరీక్షించిన చాలా పశువులలో ఇదే సమస్య కనిపించింది. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా, మనషులలో మార్పు రానంతవరకు ప్లాస్టిక్ విషం జంతువుల ప్రాణాలను హరించక మానదు. జంతువులే కాదు, మనుషులలో కాన్సరు వ్యాధికి ఇది కూడ ఒక కారణం. మనలో మార్పు రానంతవరకు మరణమృదంగం ఆగదు" అని చెబుతున్నపుడు ఠాగూరు గొంతు బొంగురు పోయింది. అతని మనసు బాధతో నిండిపోయింది.

శంకరం కళ్ళు వర్షిస్తున్నాయి. అతడిని ఓదార్చడానికి ప్రయత్నించాను.

"శీనూ..మనం ఇన్నాళ్ళూ గోమాతను పూజిస్తున్నామని అనుకున్నాను. కానీ అది అబద్ధం. మనమే ప్లాస్టిక్ విషాలను వాడి జంతువధ చేస్తున్నాము" అని బోరుమంటున్న శంకరాన్ని ఓదార్చడం నావల్ల కావటం లేదునా అంతరాత్మ మాత్రం గోమాత చావులో నాకూ భాగం ఉందని నిలదీస్తూనే ఉన్నది. దానికి కారణం మా వీధి చివర విసరివేసే చెత్తలో సగభాగం నేను ప్లాస్టికు సంచులలో కట్టి విసరివేసిన వ్యర్థ పదార్థాలే.

మునిసిపాలిటి వాళ్ళు వచ్చి ఆవును తీసుకుని వెళ్ళిపోయారు. ఇన్నాళ్ళూ పూజలందుకున్న ఆవు ఇప్పుడొక అనాథ. నా మనసు బాధతో మూలిగింది.

ఆరోజు వీధిలో ఎవరమూ భోజనాలు చేయలేదు. అందరి మనసులలో ఏదో తప్పుచేశామనే భావన మెదిలింది.

రాత్రంతా బాధతోనే తెల్లవారింది.

"ఏమండీ..వెళ్ళి పాల ప్యాకెట్లు తెండి" అని చేతికి సంచి ఇచ్చింది మా శ్రీమతి. కాదనకుండా సంచి తగిలించుకుని బయలుదేరాను. వీధిలోకి అడుగుపెట్టగానే మా పక్కింటి రామచంద్రయ్య చేతిలో కూడ సంచి కనిపించింది. అంటే మార్పు మొదలయిందని అనుకున్నాను. పనేదో ముందునుంచి చేసుంటే గోమాత బ్రతికి ఉండేది కదా అని నా మనసుకు అనిపించింది.

0 Comments