మానవత్వానికి రెక్కలు తొడగాలి  (Author: శింగరాజు శ్రీనివాసరావు)

ఆకాశం, అవని ఒకటిగా కలిసిపోయి
ఎర్రటి చీరను వంటికి చుట్టుకున్నాయి

ఎటుచూసినా రుధిరసంద్రంలో తేలుతూ
తొణుకుతున్న మాంసఖండాల ముక్కలు

ప్రాణమున్న విరులు, తరువుల నుంచి విడివడి
చిరిగిన మానాలతో రక్తపు మరణశాసనం వ్రాసుకుంటున్నాయి

మతోన్మాదం విశృంఖలమై ఇజ్రాయిల్ వీధుల్లో
గర్భస్థ శిశువును గర్భంలోనే  తుదముట్టించింది

శాంతికపోతాలకు రుధిరధారలను అద్దిన రాజ్యకాంక్ష
వైరి గాజాను హోమగుండంగా మార్చివేసింది

పిచ్చుకలకు చల్లుతున్న బియ్యపు గింజల్లా
శత్రురాజ్యం విసురుతున్నది అణుబాంబులు

ఎవరి స్వార్థంకోసం జరుగుతున్న మారణహోమం ఇది
నిలువెత్తు దేహంలో అణుమాత్రమైనా మానవత్వం లేదా

చంద్రునితో జతగా మనిషి మసలే విజ్ఞానం ఎదిగినా
అంతరించని ఆటవికత ఇంకెంత కాలం?

ప్రాణానికి ప్రాణం, రక్తానికి రక్తం సమాధానం కారాదు
తెల్లని పావురాల రెక్కలకు సింధూరం అంటకూడదు

ఎరుపు జాడలు కనిపించని శ్వేతపతాకం ఎగరాలి
శాంతి కపోతాన్ని ఎగురవేయగల చేతులు పెరగాలి

మరుగున పడిన మానవత్వానికి రెక్కలు తొడగాలి
సంస్కార శిఖరాన్ని అధిరోహించే దిశగా పయనం సాగాలి

ఆకాశవీధిలో గుంపులుగా సాగిపోయే పక్షుల్లా
మనుషులంతా ఒక్కటై అవనితల్లికి మానవహారం అందించాలి..

0 Comments