పాహి మాం
పాహి మాం (Author: జొన్నలగడ్డ రామలక్ష్మి)
సాయంత్రం నాలుగూ ఇరవైమూడు. నగీనా పార్కులో గులాబి పొదల పక్కన సిమెంటు బెంచి వద్ద నిలబడి, ‘పాహి రావడానికింకా ఏడు నిముషాలుంది’ అనుకున్నాను.
ఐనా నాలుగున్నరంటే నాలుగున్నరకే రావాలా? నేను నాలుగుంపావుకే రాలేదూ!
‘ఆడపిల్ల కదా, తెమిలి బయల్దేరడానికే పడుతుంది టైం’ అంది మనసు.
అంతలోనే అనుమానం – తను నిజంగా అమ్మాయేనా? లేక ఫేస్‌బుక్‌లో అమ్మాయి ప్రొఫైల్ పెట్టుకున్న అబ్బాయా?
నా అనుమానానికి కారణం లేకపోలేదు. మా చాటింగులో దొర్లిన అంశాలు, ఆశయాలు అలాంటివి.
వాటిలో కొన్నిః
స్త్రీపురుషుల మధ్య ఆకర్షణ సహజం. పరస్పరం ఇష్టపడితే దగ్గరవడానికి పెళ్లి అనే నియమం అర్థరహితం
పెళ్లి ఒక జంజాటం. రికామీగా గడపడానికి ప్రతిబంధకం. శీలం శారీరకం కాదు. అత్యాచారం హత్యలాంటి నేరమే తప్ప, శీలహరణం కాదు. భావిభారతంలో పెళ్లికి బదులు - సహజీవనం ప్రాధాన్యం వహించాలి.
అబ్బాయిగా నాకిలాంటి అభిప్రాయాలుంటే ఆశ్చర్యం లేదు. కానీ ఒక అమ్మాయి ఇవే అభిప్రాయాల్ని స్నేహితుడైన ఓ అబ్బాయితో పంచుకుని సమర్థించడం – ఇంచుమించు షాకింగే!
అందుకే ఆమెతో ఈరోజు సాయంత్రం ముఖాముఖీ ఏర్పాటు చేశాను. ఆమె ఒప్పుకోవడం కూడా షాకింగే నాకు.
ఇప్పుడు నేను చెయ్యబోయే ప్రతిపాదన ఆమెకు షాకిస్తుందో లేదో చూడాలి!
ప్రొఫైల్లో ఆమె ముఖం చూశాను. వెన్నెల్లు కురిపిస్తున్న చంద్రబింబం! మొబైల్లో ఆమె గొంతు విన్నాను. ఆశ్చర్యంగా ఆ స్వరం నుంచీ వెన్నెల్లు కురిశాయి.
అంతలోనే – అంతవరకూ జ్ఞాపకాలకు పరిమితమైన ఆ వెన్నెలలు పార్కునీ ఆవరించాయి. ఏమయిందా అని చుట్టూ చూశాను. నీరెండలో లేత గులాబులు మనోహరంగా మెరిసిపోతున్నాయి. కానీ ఆ వెన్నెలలు వాట్నించి కావు.
సుదూరంలో ఆమె, మొబైల్లో లొకేషన్ చూసుకుంటూ- వెన్నెల్లో ఆడపిల్లలా కాదు, తనే వెన్నెలలా నావైపు వస్తోంది. ఆమె దగ్గరౌతున్నకొద్దీ నాలో ఉత్కంఠ! దగ్గరవగానే ఉత్సాహభరితంగా ఉద్వేగం!
పాహి ఆడపిల్లే! ఫేస్‌బుక్ ప్రొఫైల్లో చూసినట్లే ఉంది.
‘అర నిముషం ముందే వచ్చాను కదూ! ’ అందామె. ఆ గొంతు అచ్చం మొబైల్లో విన్నట్లే ఉంది! అన్నీ అలాగే ఉన్నప్పుడు, పంచుకున్న అభిప్రాయాలు మాత్రం ఎందుకు మారతాయి? అంటే - అన్నింటికీ ఒప్పుకుంటుందా? తినబోతూ రుచి అడగడమెందుకు– అనుకుంటూ సంభాషణకు ఉపక్రమిస్తూ– గొంతు సవరించుకున్నాను.
- - - - -
“ఇంట్లో పెళ్లి చేసుకోమని ఒత్తిడి. నా వయసు కూడా ఆడ తోడు కావాలని పోరు పెడుతోంది కానీ- పెళ్లంటే అదో పెద్ద జంజాటం. రికామీగా తిరగడానికి గొప్ప ప్రతిబంధకం. అందుకని పెళ్లి విషయంలో నాకులాగే ఆలోచించే అమ్మాయి దొరికితే సహజీవనం చెయ్యాలనుంది. ఇష్టమైనన్నాళ్లు కలిసుంటాం. తర్వాత విడిపోతాం.
ఈ కాలానికి నా కోరిక సబబైనదే. అలాగని ఒప్పుకునేవాళ్లు అమ్మాయిల్లోనూ ఎక్కువే ఉన్నారు. కానీ మావాళ్లే - ఇంకా అప్డేట్ కాలేదు. ముఖ్యంగా అమ్మ!
అమ్మ ఎమ్మే లిటరేచర్ చదివింది. అంకితభావంతో కుటుంబ బాధ్యతలు నిర్వహించడానికి అడ్డు ఔతుందని ఉద్యోగం వద్దనుకుంది. మమ్మల్ని సంస్కారవంతుల్ని చెయ్యడంలో ఆమెదే పెద్ద పాత్ర. పిల్లలం కాస్త పెద్దవాళ్లమయ్యాక, ఆన్‌లైన్లో ఎడిటరుగా పనిచేస్తోంది. తనకో బ్లాగు కూడా ఉంది.
‘అనుభవంతో చెబుతున్నా! చదువు కేవలం సంపాదనకి కాదు. బ్రతుకుపట్ల అవగాహనకీ, ప్రవర్తనలో సంస్కారానికీ, సమాజంపట్ల బాధ్యతకీ దోహదం చేయాలి. అందుకు ప్రతి అబ్బాయికీ ఓ అమ్మాయి తోడు, ప్రతి అమ్మాయికీ ఓ అబ్బాయి తోడు ఉండాలి. ఆ తోడుని చట్టబద్ధం చేసేది పెళ్లి. ఆ పెళ్లిని అర్థవంతం చేసేది సంప్రదాయం’ అంటుంది అమ్మ.
మాటలతో అమ్మని గెలవడం కష్టం. నోటితో లేదనేది చేత్తో లేదంటే సరిపోతుందని– నేను మావాళ్లు చెప్పిన ప్రతి సంబంధానికీ ఏదో వంక పెడుతున్నాను. నాకు సహకరించే అమ్మాయి కోసం సోషల్ మీడియాలో వెదుకుతున్నాను. అలా ఫేస్‌బుక్‌లో పరిచయమైంది పాహి.
వయసులో ఏడాది చిన్న. ఉద్యోగస్థురాలు. ప్రొఫైల్ చూస్తే- సంప్రదాయాన్ని నిరసించకపోయినా, ప్రాధాన్యం ఆధునిక దృక్పథానికే అనిపించింది. కొన్నాళ్లు చాట్ చేసుకున్నాం. అభిప్రాయాలు కలిసినట్లే ఉన్నాయి.
పది రోజుల్లో- సున్నితమైన అంశాలపైన కూడా నిస్సంకోచంగా మాట్లాడుకోగలిగాం. దాంతో మా పరిచయం చాట్ నుంచి, మొబైల్ టాక్ దాకా వచ్చింది. చనువు మరింత పెరిగి, మొబైల్ నుంచి ఈరోజు పార్కులో ముఖాముఖీ సమావేశానికి దారితీసింది.
- - - - -
మొదటిసారి కలుసుకున్నాం కదా! దాంతో ముందు ముఖపరిచయం మాటలు అవసరపడ్డాయి.
కొంచెం సెటిలయ్యేక నేను నేరుగా టాపిక్‌కి వస్తూ, ‘స్నేహంలో మనమధ్య మంచి అవగాహన ఏర్పడింది. దీన్ని నెక్స్‌ట్ లెవెలుకి తీసుకెళ్లాలి’ అన్నాను.
‘ఔను. నేనూ అలాగే అనుకుంటున్నాను’ అంది పాహి. ఉత్సాహం ఉరకలు వేసింది.
‘ఆమె నిన్ను ప్రోత్సహిస్తోంది. ఇదే మంచి సమయం. సంకోచం వదిలి, చెప్పదల్చుకున్నది సూటిగా ఆమెకు చెప్పేసేయ్’ అంది మనసు. ఆ మాట కళ్లలో బయటపడిందో ఏమో, ‘ఏదో చెప్పాలని అనుకుంటున్నట్లు ఉన్నావ్’ అంది పాహి.
‘ఔను’ అని ఓ క్షణం ఆగాను.
ఆమె కళ్లలో కుతూహలం నన్ను మరింత ప్రోత్సహించగా, ‘నాకోసం ఆఫీసుకి ఒక వారం సెలవు పెట్టగలవా? ’ అన్నాను.
‘సెలవెందుకు దండగా, సాయంత్రాలు మనకుండగా’ అంది పాహి నవ్వుతూ.
‘ఎందుకంటే మనకి ఊటీ ట్రిప్పు ప్లాన్ చేస్తున్నాను’ అన్నాను.
అనేశాక నేనే కాస్త తడబడ్డాను కానీ పాహి నా ప్రతిపాదనని ముందే ఊహించినదానిలా అదోలా నవ్వి, ‘నువ్వొక్కడివే ప్లాన్ చేస్తే అది మన ట్రిప్పెలాగౌతుంది? ’ అంది.
‘ఇప్పుడు నువ్వు ఓకే చేస్తే ఔతుంది’ అన్నాను.
పాహి తల అడ్డంగా ఊపి, ‘అంత ఖర్చు పెట్టుకుని అంత దూరం వెడితే, కనీసం వారంరోజులైనా ఉండాలి! సెలవు వారమే ఐతే మా ఆఫీసుతో ప్రోబ్లమేం లేదు కానీ, స్కూలుతోనే వస్తుంది చిక్కు. రెండ్రోజులకంటే కుదరదు’ అంది.
తెల్లబోయాను, ‘స్కూలేంటి? ఎక్కడైనా పార్ట్ టైం జాబా, లేక ఏదైనా కొత్త కోర్సు చేస్తున్నావా? ’ అన్నాను.
‘రెండూ కాదు. మా అన్నయ్య కొడుకు మహేశ్ స్కూల్లో మూడు చదువుతున్నాడు’ అంది పాహి.
తెల్లబోయాను. అంటే పాహి తనతోపాటుమూడు చదువుతున్న మేనల్లుణ్ణి కూడా తీసుకొస్తుందన్నమాట!
‘అర్థమైంది. నీకు నామీద నమ్మకం లేదు. ఔనా? ’ అన్నాను నిరుత్సాహంగా.
‘నీ సంగతి తెలియదు. కానీ నాకే నామీద నమ్మకంలేదు’ అంది పాహి.
ఏమనాలో తెలియలేదు. ఓ క్షణం ఆగి, ‘ఆధునికులం. సంప్రదాయాన్ని గుడ్డిగా నమ్మకూడదనేవాళ్లం. మనమీద మనకి నమ్మకం లేకపోతేనేం, ఏంజరిగినా నష్టమేముంది? ’ అని సవాలు విసిరాను.
పాహి ఓ క్షణమాలోచించి, ‘సరే, ఈ ట్రిప్పు నావరకూ ఓకే. ఐతే మనమిద్దరం కలిసి మా ఇంటికెళ్లి, ఇలా ఊటీ ట్రిప్పు వేస్కుంటున్నట్లు మావాళ్ల చెవిలో ఓ మాటేద్దాం’ అంది పాహి.
ఉలిక్కిపడ్డాను. ఏ పెద్దలైనా ఇందుకొప్పుకుంటారా? వాళ్ల వాళ్లేమిటి– మావాళ్లే ఒప్పుకోరు.
‘వాళ్లకి చెప్పడమెందుకు? మన జీవితాలు మనవి. మన నిర్ణయాలు మనవి. మన పెద్దవాళ్లకిది అర్థం కాదు కాబట్టి– వాళ్లకి చెప్పకుండా ఊటీ వెళ్లొద్దాం. అప్పుడు మనమధ్య కుదిరిన అవగాహనని బట్టి ఓ నిర్ణయం తీసుకుని పెద్దవాళ్లకి చెబుదాం. ప్రస్తుతానికి నువ్వు- ఆఫీసు టూరని ఇంట్లో చెప్పు. సరిపోతుంది’ అన్నాను.
‘సారీ ప్రకాశ్! మావాళ్లకి తెలియకుండా స్నేహితురాళ్లతోనే సినిమాలకి వెళ్లను. నీతో ఊటీకొస్తానా? ’ అంది పాహి.
‘అంటే, నీ కాళ్లమీద నువ్వు నిలబడ్డాక కూడా, నీ ఇంట్లో నీకు స్వేచ్ఛ లేదన్నమాట! ’ అన్నాను ఉక్రోషంగా.
‘స్వేచ్ఛ లేకేం? నామీద కొండంత నమ్మకంతో మావాళ్లు నాకు స్వేచ్ఛనిచ్చారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టు కోవడం నా బాధ్యత! ’ అని ఓ క్షణమాగి, ‘ఆఫీసు జీతాన్నిస్తోంది. సెలవు కావాలంటే కారణాలు చెపుతూ సెలవు చీటీ ఇస్తాం. అది స్వేచ్ఛ లేకపోవడం ఔతుందా? ’ అంది పాహి.
‘అంటే ఇల్లూ, ఆఫీసూ ఒకటేనా? ’ అన్నాను.
‘ఆఫీసు జీతమిస్తే, ఇంట్లోవాళ్లు నాకు జీవితమిచ్చారు. నాకంటూ వేరే జీవితమేర్పడే దాకా- నా జీవితం వాళ్లతో ముడిపడి ఉంది. నేనేం చేస్తున్నానో, ఎక్కడికెడుతున్నానో వాళ్లకి తెలియబర్చడం నా బాధ్యత’
‘ఇప్పుడు మనం ఊటీ వెడుతున్నది కూడా, మనకంటూ వేరే జీవితం ఏర్పాటు చేసుకుందుకే! ’
‘ఔననుకో! కానీ నేను ఉద్యోగంలో ఇంటర్వ్యూ కెడుతున్నప్పుడు మా వాళ్లకి చెప్పాను. ఉద్యోగంలో చేరేముందు కూడా వాళ్లని సంప్రదించాను’ ఆగింది పాహి.
నాలో సహనం కొడిగడుతోంది, ‘ఐతే, పెళ్లి విషయంలో కూడా- వాళ్లు చెప్పిన వరుడి ముందు తలొంచుకుని తాళి కట్టించుకుని సాధారణ గృహిణిగా స్థిరపడ్డమేనా- నీ జీవితాశయం? ’ అన్నాను.
‘నువ్వు సంభాషణని ఎటో తీసుకెడుతున్నావ్! నావరకూ వస్తే- ఇంతవరకూ మావాళ్ల పెంపకంమీద నాకే ఫిర్యాదులూ లేవు. మా ఇంట్లో నాకు పూర్తి స్వేచ్ఛ ఉన్నదనడంలో నాకే అనుమానం లేదు. నా భవిష్యత్తుపై వాళ్లకున్న అవగాహన కూడా గొప్పదే అనిపిస్తుంది. ఇక వాళ్లకి నామీదున్న ప్రేమ ఇంతా అంతా కాదు. మరిమన ఊటీ ట్రిప్పు గురించి వాళ్లకి ముందే చెప్పడానికి, నీ అభ్యంతరమేమిటి? ’
మన సంప్రదాయంలో ఇలాంటి ట్రిప్పు చాలా సున్నితమైన విశేషం. ముందుగా బయటపడితే, వినాయకుడి పెళ్లికి వెయ్యి విఘ్నాలు అన్నట్లౌతుంది. ఒకసారి ట్రిప్పు పూర్తి చేసుకొచ్చామా- మా బంధానికిక ఎవరి అనుమతీ అవసరముండదు. ఆ విషయం తనకెలా చెప్పేది? అందుకని, ‘అన్నీ చెబుతాను – ఊటీలో! ’ అన్నాను తెలివిగా విషయాన్ని నా దారికి మళ్లిస్తూ.
‘మా అమ్మ ఇంజనీరు. ఉద్యోగం చేస్తోంది. పెద్దలు కుదిర్చారని, వాళ్లపై పూర్తి నమ్మకంతో నాన్నని పెళ్లి చేసుకుంది. పెళ్లికిముందు వాళ్లిద్దరూ ఏ ఊటీ వెళ్లలేదు. ఇప్పటికీ ఆదర్శదంపతులుగా ప్రపంచానికీ, ఆదర్శప్రాయమైన తలిదండ్రులుగా నాకూ అన్నయ్యకీ అనిపిస్తారు’
ఆమె నా ఊటీ ప్రతిపాదనపై వ్యంగ్యబాణాలు వేస్తోందని అర్థమైంది.
‘ఐతే ఏమంటావ్? సంప్రదాయానికి పెద్ద పీట వెయ్యడమే, యువత కర్తవ్యమంటావా? ’ అన్నాను.
‘కోర్కెలు తీర్చే ప్రభుత్వముంటే పౌరులకు సమ్మెలెందుకు? అడక్కుండా వరాలిచ్చే దేవుడుంటే, కఠోర తపస్సెందుకు? మా వాళ్లతో రెండు దశాబ్దాలకు పైగా అనుబంధం నాది. మీ ఇంటి సంగతి నాకు తెలీదు. ఆ పెంపకం వల్ల అవగాహనకోసం నన్ను రహస్యంగా ఊటీకి తీసుకెళ్లడం తప్పనిసరి అని నీకనిపిస్తే, నీకు నేను సరికాదు’ అంది పాహి.
తగలాల్సిన చోటే తగిలింది నాకు. నేను తనని ఊటీకి రమ్మనడం పాహికి నచ్చలేదు. అందుకని చాలా సున్నితంగా, మర్యాదగా నా పెంపకాన్ని తప్పు పట్టింది. అంటే మా అమ్మని తప్పు పట్టినట్లే కదా!
కానీ అమ్మ నాకు చెప్పిందేమిటి? ప్రతి అమ్మాయికీ, అబ్బాయికీ తోడు ఉండాలి. దాన్ని చట్టబద్ధం చేసేది పెళ్లి, దాన్ని అర్థవంతం చేసేది సంప్రదాయం అని కదా. అంటే పెళ్లి విషయంలో అమ్మ కూడా పాహి సరసనే ఉంది. పాహి అమ్మని తప్పు పడితే, ఆ తప్పు నాది.
అమ్మమాటలు చెవుల్లో గింగురుమనగా, అమ్మనుమనసులో తల్చుకుని, ‘పాహి మాం’ అనుకోబోయి అప్రయత్నంగా పైకి అనేసి- తడబడుతూ ఎదుట చూస్తే-
పాహి నవ్వుతోంది- భావి తరం ఆధునికతకు ఆదర్శ ప్రతినిధిలా...
తనని ఉద్దేశించి అన్నాననుకుందేమో మరి!
---౦—