పశ్చాత్తాపం
పశ్చాత్తాపం (Author: పారుపల్లి అజయ్ కుమార్)
ఎక్కువ శాతం నగరమంతా యింకా నిదరోతూనే వుంది. చీకట్లు ముసురుకునే వున్నాయి. తూరుపు వేదికపై వెలుగు రేఖలు ఇంకా విచ్చుకోలేదు. పదహారేళ్ళ శంకర్ సైకిల్ తొక్కుతున్నాడు. వెనుక కారేజ్ పై న్యూస్ పేపర్ల కట్టలున్నాయి. ప్రతిరోజూ ప్రొద్దునే 4 గంటలకు లేచి పేపర్ ఏజెంట్ దగ్గరకెళ్ళి న్యూస్ పేపర్లను తీసుకుని వాటిని తను పంచవలసిన ఏరియా ప్రకారం సర్దుకుని బయలుదేరుతాడు. అన్నీ పంచి తిరిగి ఇంటికి చేరేసరికి ఆరు అవుతుంది. అప్పుడు రెడీ అయి ఏడు గంటలకల్లా కాలేజీకి బయలదేరుతాడు.
ఆరోజు కూడా అలాగే పేపర్లను ఇంటింటికి తిరిగి ఇస్తున్నాడు. నవంబర్ మాసపు చలి వంట్లో ఒణుకు పుట్టిస్తున్నది. ఎక్కడైనా ఆగి టీ తాగుదామనుకున్నాడు. దోమలగూడా దగ్గర ఇరానీ కేఫ్ లో తాగుదామని అనుకొన్నాడు. మరింత ఉత్సాహంతో సైకిల్ ను స్పీడ్ గా త్రొక్కసాగాడు.
ఎదురుగా లోయర్ టాంక్ బండ్ నుండి అతివేగంగా వస్తున్న ఓ కారు అదుపుతప్పి వచ్చి సైకిల్ని ఢీకొట్టింది.
దీంతో శంకర్ సైకిలు పైనుండి ఎగిరిపడి కిందపడి పోయాడు. కారు వెనుకచక్రం శంకర్ కుడిపాదం చీలమండ పైనుండి వెళ్ళింది. శంకర్ ఒక్కసారిగా గావుకేకలు పెట్టాడు. కారు ఆగకుండా అదేవేగంతో ముందు కెళ్ళిపోయింది. రోడ్డుమీద అక్కడక్కడా వాకింగ్ చేస్తూ వున్న జనం పోగయ్యే సరికే కారు దరిదాపుల్లో లేకుండా వెళ్ళిపోయింది.
***********************************
మూడునెలల తరువాత ఓరోజు తెల్లవారుజామున యాదగిరి ఆటో నడుపుతూ శంకర్ మఠ్ నుండి యూనివర్సిటీ వైపుగా వెళుతున్నాడు.
చీకట్లు పూర్తిగా తొలగిపోలేదు. వెనుకనుండి వేగంగా దూసుకొచ్చిన ఒక కారు ఆటోను
అదుపుతప్పి డివైడర్ ను డీకొట్టింది.
అనంతరం పల్టీలు కొడుతూ కారు డివైడర్ ను దాటి అటువైపు రోడ్డుపై పడింది. దీంతో కారులో నుండి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. యాదగిరి ఒక్కక్షణం నిర్ఘాంతపోయి చూసాడు. మరుక్షణమే తెప్పరిల్లి ఆటోను ఆపి కారుదగ్గరకు పరుగెత్తుకెళ్ళాడు. కారు ముందుభాగం నుజ్జు నుజ్జు అయింది. మంటలు కారు లోపలికి వ్యాపించబోతున్నాయి. కారు కిటికీ అద్దాన్ని పగులకొట్టి లోపలున్న మనిషిని అతికష్టం మీద సీట్ బెల్ట్ నుండి వేరుచేసి బయటకు లాగి కారుకు దూరంగా లాక్కొచ్చి పడేశాడు. అతని నుండి మద్యం వాసన గుప్పుమని వస్తున్నది. కారుకు వున్న ఎయిర్ బెలూన్ ఎందుకో తెరుచుకోలేదు. నుదురు చీల్చుకు పోయి నెత్తురు ధారగా కారిపోతున్నది. కారు పల్టీలు కొట్టడంతో ఆ మనిషికి బాగానే దెబ్బలు తగిలాయి. ఆ మనిషిని చూస్తుంటే నెత్తురు ముద్దలాగా భయంకరంగా కనిపిస్తున్నాడు. యాదగిరి ముక్కు దగ్గర వేలుపెట్టి చూసాడు. శ్వాస ఆడుతూనే వుంది. వెంటనే 108 కు రింగ్ చేసాడు. చుట్టూ జనం చేరుతున్నారు. కొందరు సెల్ లో ఫోటోలు, వీడియోలు తీయటంలో బిజీ అయిపోయారు. ఎవరో ఆదెబ్బలు తగిలిన మనిషిని చూస్తూనే "అరె, ఇతను శివజ్యోతి విద్యాసంస్థల అధినేత శివ ప్రసాద్ “అని అరిచాడు. పోలీసులు వచ్చారు. ఫైర్ ఇంజన్ కు ఫోన్ సారు.
యాదగిరి తను చూసినది చెప్పాడు. 108 వచ్చింది. శివప్రసాద్ ను స్ట్రెచ్చర్ సాయంతో దానిలోకి ఎక్కించారు. కుటుంబ సభ్యులు వచ్చేదాకా యాదగిరిని శివప్రసాద్ కు తోడుగా ఉండమన్నాడు ఎస్.ఐ. ఆటోను స్టేషనులో ఉంచుతామని తరువాత వచ్చి తీసుకెళ్లమని చెప్పాడు. సరేనన్నాడు యాదగిరి. హాస్పిటల్ లో ప్రమాదానికి గురై గాయపడ్డ వ్యక్తి శివప్రసాద్ అని తెలియగానే హడావుడి మొదలయ్యింది. వెంటనే ఐ. సి.యు లో చేర్చుకున్నారు. రక్తం బాగాపోయింది. రక్తం ఎక్కించాలన్నారు. అరుదైన ఓ నెగిటివ్ గ్రూపు శివప్రసాద్ ది. హాస్పిటల్ లో స్టాక్ లేదు బయటినుండి తెప్పించాలని ఎక్కడికో ఫోన్ చేస్తున్నారు. యాదగిరి డాక్టర్లు మాట్లాడేది విని వారిదగ్గరకు వెళ్ళి “డాక్టరుగారు ,నాదికూడా ఓ నెగిటివ్ గ్రూపు.కావాలంటే నేను ఇస్తా. “అన్నాడు. డాక్టరు సంతోషించి సిస్టర్ ను పిలిచి యాదగిరికి రక్త పరీక్ష చేయమని ఆదేశించాడు. గ్రూపు సరిపోవటంతో యాదగిరి నుండి ఒకయూనిట్ రక్తాన్ని సేకరించి శివప్రసాద్ కు ఎక్కించారు. శివప్రసాద్ భార్య రేవతి, కొడుకు అభిరామ్ వచ్చారు అప్పటికి. ఫైర్ ఇంజన్ వచ్చేటప్పటికే కారు మొత్తం కాలిపోయింది అని చెప్పారు పోలీసులు.
"కారుపోతే పోయింది. డాడీ క్షేమంగా వుంటే చాలు.”అన్నాడు అభిరామ్. రక్తం ఇచ్చి బయటకు వచ్చిన యాదగిరికి చేతులుఎత్తి నమస్కరించింది శివప్రసాద్ భార్య రేవతి. అంత పెద్దామె తనకు దండం పెట్టేసరికి యాదగిరి కంగారుపడి "అయ్యో! మీరు నాకు నమస్కరించటం బాగా లేదండి. నేను పెద్దగ చేసింది ఏమీలేదు. ఆ టైమ్ లో అక్కడున్నాను కాబట్టి మనిషిగా స్పందించాను. నాకు తోచింది చేసాను. రక్తం గ్రూపు ఒక్కటే అయ్యెసరికి కొంచెం రక్తం ఇచ్చాను. అంతే.”అన్నాడు. అభిరాం అయితే యాదగిరి కాళ్ళమీద పడబోయాడు. యాదగిరి 'వద్దు తప్పు' అని వారించాడు. డాక్టర్లు ప్రస్తుతానికి గండం గడిచిందని ఒకటిరెండు రోజుల్లో స్పృహ రావచ్చని చెప్పారు.
తరువాత వచ్చి కలుస్తానని, పోలీస్ స్టేషన్ కు వెళ్ళి ఆటో తీసుకోవాలని అక్కడున్న వారికి చెప్పి యాదగిరి బయలుదేరుతుంటే అభిరామ్ కారుడ్రైవర్ ను పిలిచి యాదగిరిని స్టేషనుదాకా దించి రమ్మని పంపించాడు.
**********************************
నాలుగురోజుల తరువాత యాదగిరికి అభిరామ్ ఫోన్ చేసాడు.
"అంకుల్ , నేను అభిరామ్ ను. మొన్న నాన్నగారికి స్పృహ వచ్చింది. విషయం తెలిసి నిన్న మీగురించి అడిగారు. పోలీస్ స్టేషన్ నుండి మీ సెల్ నెంబర్ తీసుకుని మీకు ఫోన్ చేస్తున్నాను. మీరు ఖాళీగా వుంటే ఒకసారి హాస్పిటల్ కు వస్తారా? నాన్నగారు మిమ్ములను చూడాలని అంటున్నారు.”అన్నాడు. “ఆటో రిపేర్ కు ఇచ్చాను బాబు. అది వచ్చాక వస్తాను.”అన్నాడు యాదగిరి. “మీఇల్లు ఎక్కడో చెప్పండి అంకుల్. డ్రైవరువచ్చి మిమ్ములను కారులో తీసుకొస్తాడు”అని అభిరామ్ అనగానే ఇంటిఅడ్రసు చెప్పాడు యాదగిరి.
అరగంటలో కారువచ్చి యాదగిరిని తీసుకుని హాస్పిటల్ కు బయలుదేరింది. శివప్రసాద్ ను ఐ. సి. యు. నుండి రూంకు మార్చారు. యాదగిరిని చూడగానే శివప్రసాద్ రెండు చేతులూ జోడించి నమస్కారం చేసాడు. బాబుగారు మీరు పెద్దవారు. నాకు దండం పెట్టకూడదు. నేను పెద్దగా చేసింది కూడా ఏమీలేదు. ఇప్పుడు ఎలావుంది మీ వంట్లో? నెప్పులు తగ్గుముఖం పట్టాయా?” వినయంగా అడిగాడు. "ఫరవాలేదు. ఇంకో నాలుగురోజులు ఇక్కడ ఉండాలంటున్నారు. తరువాత ఇంటికి పంపిస్తామని చెపుతున్నారు. రోజూ గాయాలను శుభ్రంచేసి, బ్యాండేజ్ మార్చటానికి పదిపదిహేను రోజులదాకా ఒక నర్స్ ను ఇంటికి పంపిస్తామన్నారు.”చెప్పాడు శివప్రసాద్ నెమ్మదిగా.
శివప్రసాద్ సైగతో అభిరామ్ ముందుకొచ్చి “అంకుల్ మీరు అన్యధా భావించవద్దు. మా నాన్నగారి ప్రాణాలను కాపాడిన మీరుణం ఏమిచ్చినా తీర్చుకోలేము. మా సంతోషం కోసం ఇది మేమిస్తున్నాం.మీరు తీసుకోవాలి"
అంటూ పదిలక్షల చెక్కును యాదగిరి చేతిలో పెట్టబోయాడు. యాదగిరి పాముని చూసి బెదిరినట్లు చేతులను వెనక్కి లాగేసుకున్నాడు.
"బాబుగారూ, క్షమించండి. మీరు నాకు డబ్బులు ఇవ్వటం అస్సలు బాలేదు. ఎప్పుడైనా మీదగ్గరికో, మీఇంటికో వస్తే, నాలుగు మాటలు మాట్లాడి ఇంత ఛాయ్ ఇచ్చి పంపించండి చాలు. డబ్బులతో మనమధ్య దూరాలను పెంచకండి. నాకెప్పుడైనా అవసరమైతే ముందుగా మిమ్ములను అడుగుతాను. ప్రస్తుతానికి ఆ చెక్కు మీదగ్గరే వుంచండి.”అన్నాడు వినమ్రత ఉట్టిపడుతూ.
తండ్రీ కొడుకులు యాదగిరి మాటలకు ముగ్ధులై అతనివంక చూసారు. వంద రూపాయలు ఇస్తే రెండొందలు ఇవ్వమని డిమాండ్ చేసే మనుషులు వున్న ఈకాలంలో యాదగిరి వారికి అద్భుతమైన,అనిర్వచనీయమైన వ్యక్తిలా అగుపించాడు. కాసేపు మాట్లాడాక ఇక వెళతానని లేచాడు యాదగిరి. "నేనుకూడా వస్తా అంకుల్. మీఇంటి దాకా”అని అభిరామ్ కూడా బయలుదేరాడు. యాదగిరి కారుదిగి అభిరాంను, డ్రైవర్ ను లోపలికి తీసుకెళ్లాడు.
భార్య లక్ష్మిని, కొడుకు శంకర్ ను పరిచయం చేసాడు. శంకర్ సిమెంట్ కట్టు వేసుకుని వున్న ఒక కాలు స్టూలుమీద పెట్టి కుర్చీలో కూర్చుని వున్నాడు. చేతిలో ఏదో పుస్తకం వుంది.
లక్ష్మి తీసుకొచ్చిన టీ తాగుతూ శంకర్ వైపు చూస్తూ, "కాలుకు కట్టు వుంది. ఏమయింది అంకుల్ ? దెబ్బ ఎలా తగిలింది? అని అడిగాడు.
యాదగిరి ఒక్కక్షణం నిట్టూర్చి “ఏం చెప్పమంటావ్ బాబూ. మా దురదృష్టం. మూడునెలల క్రితం జరిగిన ప్రమాదంలో వాడికాలు దెబ్బతిన్నది”అన్నాడు.
“ప్రమాదమా? ఎలా జరిగింది అంకుల్ ?"
"మావాడు కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. పుస్తకాలకు, నోట్సులకు సరిపోయే డబ్బులు వస్తాయని రోజూ ప్రొద్దున్నే సైకిల్ మీద పేపర్లు ఇంటింటికి తిరిగి ఇస్తాడు. మూడు నెలల క్రితం ఒకరోజు సైకిలుమీద వెళుతుంటే ఒక కారు మావాడిని గుద్ది వెళ్ళిపోయింది. వీడు సైకిలుమీద నుండి క్రింద పడిపోయాడు. కారు వెనుక చక్రం మావాడి కాలుమీదుగా దూసుకెళ్లింది. అక్కడ వున్న ఓ మహానుభావుడు 108 కు ఫోన్ చేసి పిలిపించాడు. మా వాడిని అడిగి నా నెంబరుకు ఫోన్ చేసాడు. నేనూ, నాభార్య హాస్పిటల్ కు పరుగెత్తాము. కాలి ఎముక ఒకచోట విరిగిందన్నారు, మరోదగ్గర చిట్లిందన్నారు. వారం రోజులు ఆసుపత్రిలో ఉన్నాము. కాలువాపు తగ్గటం లేదు. వాపుతగ్గాక ఆపరేషన్ చేయాలన్నారు. ఎముక నయం కావడానికి చాలాకాలం పడుతుంది. లోపల స్టీల్ రాడ్ వేస్తే కాలు వంకర లేకుండా వస్తుందన్నారు. ప్రస్తుతానికి సిమెంట్ కట్టు వేసారు. డబ్బులు వెసులుబాటు చూసుకొని ఆపరేషన్ చేయించాలి.
ప్రస్తుతానికి కర్ర సాయంతో ఒక్క కాలితో నెట్టుకొస్తున్నాడు. కాలేజీ ప్రిన్సిపాల్, సార్లూ అందరూ వచ్చి చూసి, కాలేజీకి రాక పోయినా హాజరు మినహాయింపు ఇస్తామని మార్చిలో పరీక్షలు రాయమని చెప్పి వెళ్ళారు.
వాడి స్నేహితులు నోట్సులు ఇస్తున్నారు. అవి చదివి పరీక్షలకు తయారవుతున్నాడు. సహజంగానే మావాడు తెలివైన వాడు. పరీక్షల గురించి బెంగ లేదు నాకు, వాడి కాలు గురించే బెంగ మాకు. “అన్నాడు యాదగిరి.
“మరి యాక్సిడెంట్ చేసిన వారిమీద కేసు పెట్టలేదా అంకుల్? "
“కారు ఎవరిదో తెలియని వారి మీద కేసు ఎలా పెడతాం. పోలీసులు కూడా లాలూచీ పడ్డారేమో తెలియదు. యాక్సిడెంట్ జరిగిన దగ్గర వారంరోజుల నుండీ సి. సి. కెమెరాలు పనిచేయటం లేవన్నారు. నిజమేదో ఆ భగవంతునికే తెలుసు. మావాడి ప్రాణం దక్కింది చాలని మేము ఏ ప్రయత్నం చేయలేదు.”యాదగిరి మాటలతో అభిరామ్ ఒక్కక్షణం కలవరపడ్డాడు.
"యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది అంకుల్?”అనుమానంగా అడిగాడు అభిరామ్.
"దోమలగూడా దగ్గర. యాక్సిడెంట్ జరిగినప్పుడు చుట్టూ చాలామంది జనం గుమి కూడారట. అంత మందిలో ఒకే ఒక్కరు స్పందించారు. అది చూసి మావాడు ఇంటికొచ్చాక ఆ విషయంపై ఒక కవితకూడా రాసాడు"
అంటూ యాదగిరి ఒక కాగితాన్ని అభిరామ్ కు ఇచ్చాడు. అభిరామ్ వణికే చేతులను కూడ దీసుకుని ఆ కాగితంలోకి తొంగి చూసాడు.
స్పందించని హృదయం
*************************
'తాను మనిషినని
మరచిన మనిషి
మమత తెంచుకొని
మనసు చంపుకొని
మర మనిషై పోతున్నాడు
జాలి లేని కరుణ లేని
పాషాణం అవుతున్నాడు
సాటి మనిషి చస్తున్నా
స్పందించని హృదయంతో
కసాయిగా మారాడు
సాయం అందించని
సాతానులా మారాడు
తోటి మనిషి చావు కేకలను
వినోదంగా చూస్తు
వీడియోలు తీస్తున్నాడు
సోషల్ మీడియా
లైకింగుల కోసం
తహతహలాడుతున్నాడు
విలువలన్నీ పుచ్చి పోయి
మానవత్వం చచ్చిపోయి
మనిషి మాయమై పోతున్నాడు…'
అది చదివిన అభిరామ్ తల వంగిపోయింది. అక్కడ ఒక్క క్షణం వుండ లేక యాదగిరి ముఖం లోకి సూటిగా చూడలేక ఎటో చూస్తూ "వెళ్ళొస్తా అంకుల్”అని బయటకు వచ్చేశాడు.
**********************************
మరుసటి రోజు రాత్రి యాదగిరి భోజనానికి కూర్చోబోతుండగా ఇంటి ముందు ఏదో వెహికిల్ ఆగిన చప్పుడయింది.
యాదగిరి ఎవరా అని చూసాడు. ఇంటి ముందు ఆంబులెన్స్ ఆగివుంది. దానిలోనుండి చక్రాలకుర్చీ దింపారు.
ఆంబులెన్స్ లో నుండి శివప్రసాద్ ను ఇద్దరు మేల్ నర్సులు పట్టుకొని దించుతున్నారు. యాదగిరి చప్పునపోయి శివప్రసాద్ గారి చేయి అందుకున్నాడు.
"బాబుగారూ! మీరా ! ఇంత రాత్రివేళ? కబురుచేస్తే నేనే వచ్చేవాడిని కదా. అసలు మీరీ పరిస్థితిలో ఇక్కడి దాకా ఎందుకొచ్చారు? “ఆశ్చర్యంగా అడుగుతూనే జాగ్రత్తగా చేయిపట్టి నడిపించి లోపలికి తీసుకెళ్ళి మంచం మీద కూర్చోబెట్టాడు. శివప్రసాద్ అక్కడున్న శంకర్ ను చూస్తూ స్టూల్ పై చాచివున్న కాలును అరచేతితో నిమిరాడు.
కళ్ళవెంట నీరు కారిపోతుండగా యాదగిరి చేతులు పట్టుకొని "మమ్ములను క్షమించు యాదగిరి”అన్నాడు.
యాదగిరికి ఏం అర్థం కావటంలేదు. “ముందు నేను చెప్పేది ప్రశాంతంగా విను. మద్యం సేవించి కారు నడుపుతూ మీ అబ్బాయిని యాక్సిడెంట్ కు గురి చేసింది మా అభిరామ్. ఆరోజు మావాడిని కేసులో ఇరుక్కోకుండా చెయ్యాలని పోలీసులను మభ్య పెట్టింది నేనే. కొడుకుమీద ప్రేమతో అలా చేసాను.
నిన్న విషయం తెలిసిన క్షణంనుండి మావాడు ఏడుస్తూనే వున్నాడు. నాకు అంతా చెప్పాడు. నా యందు నీవు చూపిన మానవత్వం ముందు మేము చేసింది తలుచుకుంటేనే తలకొట్టుకుని చావాలని అనిపిస్తున్నది. మీముఖం చూసే దైర్యం లేక తల్లడిల్లుతున్నాడు వాడు. నిన్నటినుండి ఏమీ తినడం లేదు. నీరసం
తో కళ్ళు తిరిగి పడిపోయేలా వున్నాడు.
మీవాడి కాలు బాగుచేసే బాధ్యత నేను తీసుకుంటాను. అపోలో ఆసుపత్రిలో నాకు తెలిసిన మంచి డాక్టరు వున్నాడు. నువ్వు ఒప్పుకుంటావనే భరోసాతోనే రేపుఉదయానికి అప్పాయింట్ మెంట్ కూడా తీసుకున్నాను.
మీవాడిని ఈక్షణం నుండే మాకాలేజీలో చేర్చుకుంటున్నాను. మీవాడి చదువు బాధ్యత అంతా నాదే. ఎక్కడి దాకా చదువుతానంటే అక్కడి వరకూ చదివిస్తాను. నీవు ఇకనుండి ఆటో నడపవద్దు. నాకారు డ్రైవర్ గా నిత్యం నాతోనే వుందువుగాని. మీరు ఇక్కడ ఖాళీచేసి మా ఔట్ హౌజ్ కు మారాలి. డాక్టర్లు కదలవద్దని చెప్పినా వినకుండా, నా భార్యకు కూడా చెప్పకుండా వచ్చాను. నువ్వు మారు మాట్లాడక ఇవన్నీ చేస్తేనే మావాడు నాకు దక్కుతాడు. దయచేసి నాకు పుత్రభిక్ష పెట్టు యాదగిరి. నువ్వు నాకు మాట ఇస్తేనే ఈరోజు నేనిక్కడనుండి కదిలేది.”
అంటూ శివప్రసాద్ వంగి యాదగిరి కాళ్ళను పట్టుకోబోయాడు. యాదగిరికి, శివప్రసాద్ చెప్పిన విషయాలు విస్మయానికి గురిచేశాయి. చప్పున తెప్పరిల్లి శివప్రసాద్ ను అడ్డుకుని "అభిరామ్ బాబు ఎక్కడ వున్నాడు?”అని అడిగాడు. “ఆంబులెన్స్ లో వున్నాడు. నువ్వు మనఃపూర్తిగా క్షమిస్తేనే ఇంటిలోకి వస్తానన్నాడు.”యాదగిరి కొడుకు వైపు చూసాడు.
శంకర్ లేచి కర్రసాయంతో ఆంబులెన్స్ దగ్గరికెళ్లి అభిరామ్ ను చూస్తూ "అన్నా, నాన్న రమ్మంటున్నారు." అని పిలిచాడు. అభిరామ్ క్రిందికిదిగి శంకర్ చేతిలో కర్ర లాగి అవతలకు విసిరేసి శంకర్ ను చక్రాల కుర్చీలో కూర్చోబెట్టి దాన్ని తోసుకుంటూ లోపలికి అడుగుపెట్టాడు. లక్ష్మి కలుపుకుని వచ్చిన అన్నం పళ్ళాన్ని తీసుకుని ముద్దలుచేసి అభిరామ్ నోటికి అందించాడు యాదగిరి. అభిరామ్ అన్నం తినడం పూర్తి అయ్యాక చేతులు కడుగుకొని "తప్పులు చేయడం మానవ సహజం. చేసిన తప్పులను ఒప్పుకోవాలంటే ఎంతో గుండె దిటవుకావాలి. చేసిన తప్పులను సరిదిద్దుకొన్న మనిషి మహాత్ముడవుతాడు. తెలిసిచేసినా, తెలియకచేసినా , జరగాల్సిన తప్పు జరిగి పోయినప్పుడు... ఒకసారి వెనక్కి తిరిగి చూసుకొని, సమీక్షించుకోవడం, బాధపడడం, ఎలాజరిగిందో తెలుసుకోవడం, ఇకపై జరగకుండా జాగ్రత్త పడడమే పశ్చాత్తాపం. చేసినతప్పు తెలుసుకొని, దిద్దుకున్నవారికి మానసికశాంతి లభిస్తుంది. ఒత్తిడులు తొలగిపోతాయి. పశ్చాత్తాపం మనిషిని పునీతునిగా చేస్తుంది. పశ్చాత్తాపం పరివర్తనకు చిహ్నం. మీరు చెప్పినవి నేను ఒప్పుకోవాలంటే మరలా ఇటువంటివి జరగకూడదు. మీరిద్దరూ ఈక్షణం నుండి మద్యం తాగమని మాట ఇవ్వాలి”అంటూ తన కుడిఅరచేతిని ముందుకు చాపాడు యాదగిరి.
శివప్రసాద్,అభిరామ్ లు ఏమాత్రం సంకోచించకుండా యాదగిరి చేతిలో చేయి వేసారు.
Telugu Jyothi Ugadi 2024
2024-26 తెలుగు కళా సమితి కార్యవర్గం (మా సమాచారం)
అధ్యక్షుని కలం నుండి… (TFAS అధ్యక్షుని సందేశం)
New York Life Insurance (Advertisement)
2022-2024 TFAS కార్యవర్గ విజయాలు (మా సమాచారం)
బాపు, రమణలతో నా తీపి గురుతులు... (కథలు)
Free health camp by TFAS for Edison community (TFAS కార్యక్రమాలు)
కొత్త చేతులు మొలకెత్తాలి (కవితలు)
వృద్ధాప్యం ఎంత దయలేని దండనో (కవితలు)