నవ్వు పూలు
నవ్వు పూలు (Author: శానాపతి (ఏడిద) ప్రసన్నలక్ష్మి)
నాకు తెలుసు
నా నవ్వులో జీవంలేదని!
తడారి పోయిన పెదవులపై
నవ్వుపూలనెలా పూయించను?
బీటలు బారిన భూమిపై
పచ్చదనం పూయాలంటే
నీళ్ళు చిలకరిస్తే చాలదు
దాని సారం మళ్ళీ పుంజుకోవాలంటే
గాలులు వీచి, నిప్పులు రేగి
ఆకాశం ఉరిమి మేఘాలు అలిమి
కుంభవృష్టి కురిసి నేలను కౌగలించాలి
అలా పంచ భూతాలూ కలిసినప్పుడే
కళకళ లాడుతూ ఈ నేలతల్లి నవ్వేది!
ఈ సృష్టి పంచ భూతాల బంధాన్ని
కోరుకున్నప్పుడు...
మానవ జాతికి చెందాకా నేనంటూ
ఓ బంధాన్ని ఆశిస్తానుగా!
అణువంతైనా ఆనందం లేక
దూరమైన బంధాల కోసం తపించడం
లేని బంధాల కోసం ఆరాట పడటం
బ్రతుకే ఎడారిగా కనబడుతుంటే
ఒంటరితనాన్ని గెలవలేక
ఓడిపోతున్నాననే అశక్తత
మనసును బీడుబార్చుతుంటే
బ్రతుకు పంటనెలా పండించను?
ఎదుటివారు ముందు
మనసారా నవ్వలేని స్థితికి జారుకుంటూ
ఎండిన పెదాలపై కృత్రిమ నవ్వును
పులుముతూ తిరుగుతుంటే
నాకనిపిస్తూ వుంది...
నాకు ప్రాణం వున్నా
నా నవ్వులో జీవం లేదని!
అందుకే...
బ్రతుకు పంటలో
నవ్వు పూలనిక పండించలేనేమో!