నల్లేరు మీద నడక
నల్లేరు మీద నడక (Author: వాడపల్లి పూర్ణ కామేశ్వరి)
“ఆశ్రయకి వెళ్ళి కనుక్కుని వచ్చి అప్పుడే మూడు రోజులైంది. వారన్న ప్రకారం మరో మూడురోజుల్లో అక్కడికి వెళ్ళిపోవాలి కూడాను. ఇంకా నీళ్లు నముల్తారేంటండీ?!” నొక్కిచెపుతూ అంది గాయత్రి.
మొహమాటపడుతున్న మూర్తికి ఇంకా ధైర్యం చాలట్లేదు. భార్యా విధేయుడే అయినా, ఆమె మాటతో మాట కలపలేకపోయాడు.
“చాల్లెండి, ఇప్పుడు మీరు చెపుతారా? నన్ను చెప్పమంటారా?” రెట్టిస్తూ అంది.
“అది కాదు గాయత్రీ, అమ్మకి ఇదొక పెద్ద షాక్ గా ఉంటుందనీ..” మింగలేక కక్కలేక నీళ్ళు నమిలాడు.
“చూడండీ, అత్తగారి వరకూ అయితే సరే, నా బాధ్యత అనుకుంటాను. అత్తగారికి అత్తగారిని కూడా చూడవలసిన అవసరం నాకు లేదు. ముసుగులో గుద్దులాట ఇష్టం లేదు కనుక నేను కచ్చింగా చెప్పేస్తున్నాను” తేల్చింది గాయత్రి.
ఇంకా మౌనంగా ఉన్న భర్తతో, “ముసలావిడ గుడికెళ్ళింది. ఇప్పుడే మీ అమ్మతో చెపితే, ఆమె బామ్మగారితో చెప్పడానికి, విషయం మింగుడు పడి సద్దుకోవడానికి సమయం ఉంటుంది” అంది గాయత్రి.
అలవాటు ప్రకారం తల ఊపి హాల్లో పుస్తకం చదువుతకుంటున్న అమ్మ దగ్గరికి వచ్చాడు.
“అమ్మా, మామ్మ పేరు వృద్ధాశ్రమంలో నమోదు చేసి వచ్చాను. రేపు ఆదివారం దింపి వస్తాను” అన్నాడు.
అన్నపూర్ణమ్మ చేతిలోని పుస్తకం నేలకు జారింది.
“ఇప్పుడావిడను ఎక్కడికో పంపడమెందుకు? అసలు ఏమైంది రా?” ఆకస్మికంగా విన్న వార్తకు ఖంగుతిన్నట్టు స్పందించింది అన్నపూర్ణ.
మాట పెగలక, లోపలున్న భార్య వంక చూశాడు. ‘ధైర్యంగా మాట్లాడండి’ అన్నట్టుగా సైగ చేసింది గాయత్రి. జారిన పుస్తకాన్ని తీసి బల్లపై పెడుతూ,“అమ్మా, ఇన్నేళ్ళూ చూసుకున్నాముగా, ఇక పై కష్టమవుతుందనీ..”
“అదేంట్రా మామ్మగారు బాగానే ఉన్నారుగా! తన పనులు తను చేసుకుంటున్నారు. ఆవిడని చూసుకోవడానికేముంది?” బాధగా అడిగింది.
కొడుకుకి తెలియని విషయం కాకపోయినా సందర్భం వచ్చింది కనుక, పాత విషయాన్ని చెప్పుకొచ్చింది అన్నపూర్ణమ్మ.
“సురేష్, నాకు పదేళ్ళ వయసులో మా అమ్మ పోయింది. మా నాన్న మరో పెళ్ళి చేసుకున్నారు. నన్నో అయ్య చేతిలో పెట్టే వరకూ మా పిన్ని వల్ల ఇబ్బందులు పడ్డాను. పెళ్ళైన దగ్గర్నుంచీ పుట్టింటి ఆదరణ పూర్తిగా కరువయ్యింది. నిన్ను కడుపులో మోస్తున్నప్పుడు మొదటి కాన్పు పుట్టింట్లోనే జరగాలని అందరూ అన్నారు. అదే రివాజు కూడా. కానీ, మా పిన్ని వల్ల నేను ఎటువంటి కష్టమూ పడకూడదని పురిటికి కూడా నన్ను పుట్టింటికి పంపకుండా మా అత్తగారే నాకు పురుడు పోశారు. ఇక నిన్నైతే మీ మామ్మే పెంచారు.
ఎంతో హాయిగా గడిచిపోతున్న మన కుటుబంలో ఆవిడకి రాకూడని కష్టం వచ్చింది. చెట్టంత కొడుకు ఆవిడ కళ్ళెదుటే పోయారు. మీ నాన్నగారు పోయినప్పుడు కూడా మామ్మగారిని మీ అత్తయ్య దగ్గరికి పంపకుండా ఇక్కడే ఉంచుకున్నాను. నాన్నగారు పోయిన నాటికి నువ్వు ఇంకా చదువుతున్నావు. ఆవిడ దగ్గర ఉన్న చివరి నగను అమ్మి నీ ఇంజీనీరింగు ఫీసు కట్టారు. ఇవన్నీ నీకు తెలియనివి కాదు. అలాంటిది ఇప్పుడు మామ్మను ఎక్కడికో పంపించడమేంటి? ఆవిడ నీకు భారమని ఎలా అనుకోగలుగుతున్నావు?”
“భారం కాదు కాబట్టే కదమ్మా, నెలనెలా వృద్ధాశ్రమానికి డబ్బు కడతాను” అన్నాడు సురేష్.
“మనం ఉండి కూడా ఆవిడను అనాథగా ఎందుకు రా అక్కడ పెట్టాలి? మామ్మకి మనం లేమా?” బాధగా అడిగింది అన్నపూర్ణమ్మ.
“మామ్మని మనం మాత్రమే ఎందుకు చూడాలమ్మా? అత్తయ్య కూడా ఆమె కూతురేగా! తనకీ బాధ్యత ఉందిగా!”
“ఉందిరా. కానీ అత్తయ్యకే ఒక పూట భోజనానికి గడవట్లేదు ఆమె కొడుకింట్లో. అలాంటప్పుడు అక్కడ మామ్మకు ఎలా సాగుతుందని అనుకుంటున్నావు?”
“అందుకేనమ్మా, డబ్బు కట్టి మామ్మను ఆశ్రమానికి పంపడానికి నిశ్చయించుకున్నాను”
“అసలు మామ్మ వల్ల మీకు ఇబ్బంది ఏంటిరా? ఆవిడ పనులు ఆమె చేసుకుంటున్నారు. మరీ చేతకాకపోతే నేనున్నానుగా. నేను చూసుకుంటాను” అంది అన్నపూర్ణమ్మ.
“గాయత్రికి ఇష్టం లేదు. అందుకే అమ్మా ఈ నిర్ణయం”
“బాగా ఆలోచించు. ఇది మంచిది కాదు. నాకు ససేమిరా ఇష్టం లేదు”
“అమ్మా, ఈ విషయం బామ్మతో చెప్పడం నీకు కష్టమవుతుందని నాకు తెలుసు. నేనే నిదానంగా చెపుతాను” అన్నాడు సురేష్, నిర్ణయం మారదని చెప్పకనే చెపుతూ.
చిన్నవయసులో తల్లిపోయి, సవతి తల్లి దగ్గర బాధలు పడ్డ అన్నపూర్ణమ్మ, అత్తగారిలో తల్లిని చూసింది. ఒక మాట అనడం తెలియని మనిషి. ఆడపడుచుకి తల్లి పోలికలు రాలేదు. ఉన్నవీ లేనివీ వదిన పై తన తల్లికి చెప్పినప్పుడు కూడా ఒక్క మాట వినకుండా, కూతిరినే తిట్టింది. కూతురి పురుడు, కోడలి పురుడూ అన్నీ ఆమె చూసుకున్నారు. భర్తను పోగొట్టుకున్న బాధను కూడా అత్తగారి నీడన మరచింది. అమ్మను తనకెక్కడ అంటగడతారో అని, అన్నగారి పదకొండో రోజు కార్యక్రమాలు అవుతూనే జారుకుంది ఆడపడుచు.
పెద్దగా ఆస్తులు కానీ, డబ్బుకానీ లేనందున, రోజులు గడవడం కష్టమే అయ్యేది. ఎవ్వరి సహాయం దొరకలేదు. అప్పుడు చేతిలోని విద్యే అన్నం పెట్టింది. పక్కనే ఉన్న కాలేజీ క్యాంటీన్ లో వంటపనికి చేరింది అన్నపూర్ణ. అత్తగారు కోడలు కలిసి క్యాంటీనుని నిడిపించారు. పొట్టపోసుకోవడమే కాకుండా సురేష్ ను మంచి కాలేజీలో చదివించారు.
అత్తగారికి వయసు మీద పడడంతో కొన్నేళ్ళకు పనులు చేయలేని పరిస్థితి వచ్చింది. ఒళ్ళు సహకరించలేదు. అత్తగారిని కూర్చోపెట్టి అన్నిపనులూ తానే చేసుకుంటూ మెస్సుని నడిపింది అన్నపూర్ణ.
“ఈ కట్టె పోయేదెపుడో. ఒంటరిగా బరువు మోస్తున్న నీకు నేనూ భారమయ్యానే అమ్మా!” బాధ పడింది కాంతమ్మ.
“ఊరికే భారం అనకండి, పుట్టింటికి కూడా పంపకుండా నాకు పురుడు పోశారు. అప్పుడు దాన్ని భారం అనుకున్నారా? లేదుగా!! ఇప్పుడు మీరు నాకు భారమెలా అవుతారు!”
“ఒక్క పురుడు పోసినందుకు ఇన్ని సార్లంటున్నావు. నా కూతురికి మూడు పురుళ్ళు పోశాను. కన్నతల్లి ఎలా ఉందో అని వెనక్కి తిరిగైనా చూడట్లేదు” బాధ పడింది కాంతమ్మ.
సురేష్ కాలేజీ పూర్తయ్యే వరకూ క్యాంటీన్ నుండి వచ్చిన సంపాదనే సంసారం గడపడానికే సరిపోయింది. ఇంజనీరింగుకు చాలలేదు.
“మంచి మార్కులతో వాడు పాసై ప్రయోజకుడు అవ్వడం కంటే మనకేం కావాలే!” అంటూ కాంతమ్మ చేతికున్న జత గాజులూ తీసి ఇచ్చేసింది.
సురేష్ చదువు పూర్తై మంచి ఉద్యోగం వచ్చింది. అలసిన అన్నపూర్ణమ్మ ఇంక ఆ మెస్సు పని మానేయాలని నిశ్చయించుకుంది.
“అమ్మా, మీ చేతి వంటకు పిల్లలు అలవాటు పడ్డారు. ఇకపై రుచికరమైన మంచి భోజనం వాళ్ళకి పెద్ద లోటే అవుతుంది. కానీ, మీకూ విశ్రాంతి కావాలి కాబట్టి కాదనలేక పోతున్నాను” అన్నాడు కాలేజీ సెక్రెటరీ.
కొడుకు పెళ్ళైయ్యేవరకూ బాగానే నడిచింది. బ్యాంకు ఉద్యోగం చేస్తున్న గాయత్రితో సురేష్ పెళ్ళయ్యింది. మనవడి పెళ్ళాన్ని చూసి మురిసిపోతూ ఉండేది కాంతమ్మ.
“ఏమే మనవరాలా!” అంటూ పిలిచే బామ్మ అంటే గాయత్రికి నచ్చేది కాదు.
ఒక్క పనీ చెయ్యకుండా ఎందుకూ పనికి రాని ముసలమ్మను చూస్తే చిరాకు వేస్తుంది గాయత్రికి.
“ఈ న్యూసెన్సు ఏంటి!” అంటూ భర్త దగ్గర విసుక్కునేది.
మామ్మగారికి ఏదో పని చెప్పాలని,“ఇదిగో మామ్మగారూ, ఈ ఆకు కూర కాస్త ఒలవండి” అంటూ పని అప్పచెప్పింది గాయత్రి.
“ఆవిడకి వయసు మళ్ళింది. నీకేమైనా అవసరమైతే నాకు చెప్పు. నేను చేస్తాను. ఆవిడని విశ్రాంతిగా ఉండనిద్దాం” అంది అన్నపూర్ణ గంభీరంగా.
కాలక్షేపానికి కాంతమ్మ రోజూ పక్కింటి బామ్మతో కబుర్లాడుతూ ఉండేది. కానీ, ఆవిడ అలా ప్రశాంతంగా కొన్నాళ్ళే ఉండగలిగింది. మనవరాలి చిరాకు పరాకులకు కాంతమ్మ నోరు కొన్నాళ్ళకే మూత పడింది. ఇంట్లో మనవరాలు ఉన్నప్పుడు మామూలుగా మెసలడానికే భయపడేట్టుండేది. అంత మార్పు వచ్చినా, గాయత్రి విసుగు మాత్రం తగ్గలేదు. అత్తగారు చెప్పకపోయినా అన్నపూర్ణ అన్నీ గమనిస్తూనే ఉండేది. ఆ వయసులో అత్తగారు పడుతున్న బాధ, తన దృష్టిని దాటిపోలేదు. జైల్లో ఖైదీలా ఆమె ఉండడం చూస్తే బాధ అనిపించేది.
*****
మవనడి ద్వారా కాంతమ్మకు విషయం తెలిసింది. తను మాట్లాడడానికి ఏమీ లేదనుకుని మౌనంగా ఉండిపోయింది. ఇంక రెండురోజుల్లో వెళ్ళి పోవాలన్న బెంగతో ఉంది కాంతమ్మ.
మర్నాడు ఉదయం బయటకు వెళ్ళివస్తానని చెప్పి అన్నపూర్ణ ఎక్కడికో వెళ్ళింది. సాయంకాలం కొడుకూ, కోడలు ఆఫీసుల నుండి వచ్చే ముందే వచ్చింది.
“ఎక్కడికెళ్ళిపోయావు పూర్ణా. నాకు ఏదో భయం వేసిందనుకో!” చంటిపిల్లలా అంది కాంతమ్మ. చిరునవ్వే అన్నపూర్ణ సమాధానమయ్యింది.
ఆ సాయంకాలం ఇల్లంతా నిశ్శబ్దంతో నిండింది. అందరూ భోజనం అయ్యిందనిపించి గదుల్లోకి నిష్క్రమించారు.
రాత్రి బట్టలు సద్దడం మొదలుపెట్టింది అన్నపూర్ణ. మంచమ్మీద కూర్చున్న కాంతమ్మ కోడలివైపు తదేకంగా చూస్తోంది. తనని వదిలి వెళ్ళిపోతున్నానన్న బెంగ మనసుని పిండేస్తోంది. ఆలోచనలతో కోడలిని చూస్తూ ఉండగా..
“పూర్ణా, నావి సద్దుతున్నావు సరే, నీవీ పెడుతున్నావేంటీ!” ఆశ్చర్యంగా అడిగింది కాంతమ్మ.
“మిమ్మల్ని వదిలి నేను మాత్రం ఎలా ఉంటాను!” అంది అన్నపూర్ణ.
ఆశ్చర్యంతో గాజు కళ్లను పెద్దవి చేసుకుని చూసింది కాంతమ్మ.
“మీరు లేకుండా నాకు ముద్ద దిగదు. అందుకే మీరెక్కడుంటే నేనూ అక్కడే!” నిశ్చంతగా అంది అన్నపూర్ణమ్మ.
“అదేంటే! నువ్వూ వృద్ధాశ్రమానికా వస్తావూ? వద్దమ్మా, వద్దు. ఇవాళ ఉండి రేపు పోయేదాన్ని నేను” కాంతమ్మ స్వరంలో బెంగ పోయి బాధ తలెత్తింది.
“లేదు అత్తయ్యగారూ, మనం ఇక అక్కడికి వెళ్ళట్లేదు. మునపట్లాగా మెస్ పని మొదలు పెడతాను. మనం పాతింటికే వెళదాము”
స్థాణువైన కాంతమ్మకు తేరుకోవడానికి కొంత సమయం పట్టింది. కళ్ళు చమర్చాయి.
“పూర్ణా, నా గురించి అలాంటి పిచ్చిపని చెయ్యకమ్మా. ఇది సరైన నిర్ణయం కాదు. నా తల్లివి కదూ. నిన్ను వదిలి వెళ్ళి నేను ఎంతో కాలం బ్రతికి ఉండను. ఎండిన కట్టె నాది. నాకు చివరి ఘడియలు వచ్చేస్తున్నాయి. నేను కొన్నాళ్ళు కష్టపడతానని నువ్వు జీవిత కాలం కష్టాలు కొని తెచ్చుకోవద్దు. నువ్విన్నేళ్లు నన్ను చూసినందుకే నీ ఋణం ఎలా తీర్చుకోగలనో నాకు తెలియదు. నీకు ఏం చేసినా నేను తీర్చుకోలేనమ్మా!” కన్నీరు కారుస్తూ అంటున్న అత్తగారి మంచం దగ్గరగా వచ్చి కింద కూర్చుని, ప్రేమగా, “మీకోసం నేను ఈ నిర్ణయం తీసుకున్నానని ఎవరన్నారు?” అంది అన్నపూర్ణమ్మ.
అర్థం కానట్టు చూసింది కాంతమ్మ.
“అత్తయ్యా, నాకు ఈ రోజు ఒంట్లో ఓపిక ఉంది, అందుకే నన్ను ఉంచుకుంటామంటున్నారు. కొన్నాళ్ళకు నేనూ మీలాగే అవుతాను అప్పుడు నన్నూ ఇలాగే పంపేస్తారు. ముందు జరగబోయేది తెలుసుకున్నాను కనుక ఇప్పుడే కళ్ళు తెరిచాను. అందుకే ఈ నిర్ణయం.
మన అదృష్టం కొద్జీ మెస్సు ప్రారంభిస్తానంటే కాలేజీవాళ్ళు సంతోషంగా ఒప్పుకుని బయానా కూడా ఇచ్చారు. మనకి పెద్ద ఖర్చు లేదు. తలకి గూడు, ఇంత ముద్ద, కట్టుకోవడానికి బట్ట. అంతకు మించి మనకేం కావాలి? మన సంపాదనలో మిగిలిన డబ్బును దాస్తాను. నా చివరి రోజుల్లో కూడా నేను వృద్ధాశ్రమానికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చినా, అది నా డబ్బుతోనే చేస్తాను” అంది అన్నపూర్ణ దృఢ నిశ్చయంతో.
“వద్దమ్మా, వద్దు. సురేష్ నీకు ఆ గతి రానివ్వడు. వాడు మంచివాడు నీకలాంటి పరిస్థితి ఎన్నడూ రాకూడదు తల్లీ” అంది కాంతమ్మ మామ్మ మనసు.
“స్వంత నిర్ణయాలు తీసుకోలేని వాడు ఎన్నటికీ మంచివాడు కాలేడు అత్తయ్యా!!” అంటున్న కోడలిని బాధగా చూసింది అత్తగారు.
“అత్తయ్యా! మనం ఇలా వెళ్ళడంలో అన్నిటికీ మించిన మంచి మరోటి ఉంది. మన ఇంట్లో మనం స్వతంత్రంగా ఉండవచ్చు. మీరు పక్కింటి నరసత్తయ్యతో మీకు కావలసినంతసేపు మాట్లాడుకోవచ్చు. గట్టిగా నవ్వుకోవచ్చు. అక్కడ చిరాకు పడేవాళ్ళుండరు” అంటున్న కోడల్ని చూసి కాంతమ్మ కళ్ళి వర్షించాయి.
ఆ తరువాత వాళ్ళకి మాటలు లేవు. తెల్లవారగానే, కాల్ టాక్సీని పిలిపించింది అన్నపూర్ణ. ఇద్దరూ బయల్దేరారు.
“ఇందేంటమ్మా నీకేమైనా పిచ్చి పట్టిందా? పైగా మెస్ పని చేస్తానంటున్నావు! ఇప్పుడు పని చేసే వయసా నీది? పంతానికైనా ఒక అర్థముండొద్దూ!!” అంటూ విరుచుకు పడ్డాడు సురేష్.
“ఇక్కడ మాత్రం పని చెయ్యకుండా ఉన్నానా?” సూటిగా వేసిన అమ్మ ప్రశ్న ఎక్కడో గుచ్చుకుంది సురేష్ కి.
“కానీ, మామ్మ కోసం వృద్ధాశ్రమంలో నేను డబ్బు కట్టేశాను కదమ్మా!” అన్నాడు నిస్సహాయ స్వరంతో సురేష్.
సద్దుకున్న పెట్టెలు చేత పట్టుకుని,“ఆ డబ్బు ఊరికే పోదు లేరా, జాగ్రత్తగా ఉంచమని చెప్పు. ముప్పైయేళ్ళ తరువాత నువ్వు వెళ్ళినప్పుడు నీకే ఉపయోగపడుతుంది!” అంటున్న అన్నపూర్ణమ్మ మాట మెత్తని చెప్పుతో కొట్టినట్టైయ్యింది.
“ఇలా చెప్పా చెయ్యకుండా వెళ్తే ఎలా? ఇంటెడు పనీ నేనొక్కత్తినే ఎలా చేసుకోగలను? పనిమనిషిని కూడా పురమాయించుకోలేదు” వాపోయింది గాయత్రి.
ఆ మాటలకు సమాధానం చెప్పవలసిన అవసరం అన్నపూర్ణమ్మకు అనిపించలేదు. హద్దులు దాటి మాట్లాడే కోడలినీ, నోరెత్తి మాట్లాడలేని కొడుకునీ జాలిగా ఒక చూపు చూసి, చంటిపిల్లగా మారిన అత్తగారి చెయ్యి పట్టుకుని హుందాగా బబయటకు నడిచింది అన్నపూర్ణమ్మ. బాధ్యతలో ఆనందాన్ని ఎరిగిన అన్నపూర్ణమ్మకు ఓపిక సన్నగిల్లిన వయసులో కూడా తాను వేసుకున్న ఈ బాటలో నడక ముళ్ళ బాటగా అనిపించలేదు. జీవితపు చరమదశలో కోడలి చేయి పట్టుకుని వేస్తున్న అడుగులు కాంతమ్మకు నల్లేరు మీద నడకలే అయ్యాయి. చూస్తున్న గాయత్రి, సురేష్ ల ముఖాలు వివర్ణమైయ్యాయి.