దారి చూపిన నేత్రాలు  (Author: పొత్తూరు రాజేంద్ర ప్రసాద వర్మ)

కంటి ఆసుపత్రి అంతాకోలాహలంగా ఉంది.

చాలామంది కంటి పరీక్షల కోసం వచ్చిన వారు ముందు గదిలో కూర్చున్నారు.

 రెండవసారి చికిత్స కోసం వచ్చిన వారి కోసం మరో గది ఉంది. పైన ఆపరేషన్‌ థియేటర్ ఉంది.

అక్కడ సుజాత బెడ్‌ మీద పడుకుని ఉంది. ఆమె చుట్టూ బంధువులు స్నేహితులు కూర్చుని ఉన్నారు. ఎడమ కంటికి కట్టు కట్టి ఉంది. మత్తు ఇంజక్షను వేయడం వల్ల నిస్త్రాణగా పడుకుని ఉంది.

కంటి చికిత్స చేసిన డా.ప్రతాప్‌ వస్తున్నట్లు వార్డులో నర్సులు చెప్పడంతో మంచానికి దగ్గరగా ఉన్న వారంతా దూరంగా జరిగిపోయారు. ఇద్దరు డ్యూటీ డాక్టర్లతో కలిసి వచ్చిన ఆయన్ని చూడగానే అందరూ లేచి నిల్చున్నారు.

“పేషెంట్‌కు ఎలా ఉంది?”   అక్కడున్న వారిని డా.ప్రతాప్‌ అడిగారు.

“ప్రస్తుతం మత్తులో ఉంది. ఇంజక్షను చేసి అరగంట అయింది..” నర్సు చెప్పింది

“సార్‌... మా ఆవిడకు చూపు వస్తుందా?” సుజాత భర్త రమణ అతృతగా అడిగాడు.

డాక్షరు ప్రతాప్‌ ఎటువంటి భావం లేకుండా అతని వైపు చూస్తూ... “జరిగిన ప్రమాదం తీవ్రమైనది. టెస్టు రిపోర్టులు వస్తే తప్పా ఏమీ చెప్పలేం..” నెమ్మదిగా అన్నాడు.

రమణ డాక్టరుని వదిలిపెట్టలేదు... డాక్టరు గారూ... ఎలాగైనా మా ఆవిడకు చూపు తెప్పించాలి. రెండురోజుల నుంచి వాళ్లమ్మ మీద బెంగతో మా పిల్లలు ఏమీ తినడం లేదు. ఆమె కన్నుకు ఏ ప్రమాదం లేకుండా మీరే చూడాలి... అన్నాడు వేడుకోలుగా...

డాక్టరు ప్రతాప్‌ రమణ దగ్గరికి వచ్చి అతని భుజాన్ని తడుతూ “ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేదు. ఎడమ కన్ను విషయమే డౌట్‌గా ఉంది. తెల్లగుడ్డుకు డామేజ్‌ జరిగితే చూపురావడం కష్టం అవుతుంది...”

ఆ కన్ను పనిచేయదా? చూపు రాదా?”  రమణ ఆందోళనగా ప్రశ్నించాడు.

కంటి ప్రాంతంలో ఎటువంటి ప్రమాదం జరిగినా కన్ను మూసుకునిపోతుంది. చాలా ప్రమాదాల్లో కంటిలో ఉన్న నల్లగుడ్దుకు మాత్రం ప్రమాదం జరుగుతుంది. కానీ, మీ భార్య సుజాత కంటిలో తెల్లటి భాగం దెబ్బతింది. అరుదుగా ఇటువంటి పరిస్థితి వస్తుంది. ఏమేరకు పాడై౦దో కట్టు విప్పిన తర్వాత పరిక్షించి చూస్తే కానీ చెప్పలేం. ఇటువంటి ప్రమాదాన్ని వైద్య పరిభాషలో ‘సింపథిటిక్‌ ఆప్తాల్మియా’ అంటారు” డాక్టరు ప్రతాప్‌ వివరించి చెప్పాడు.

తర్వాత డ్యూటీ డాక్టరుని పిలిచి  “ఎప్పటికప్పుడు ట్రిట్‌మెంట్ ఫాలోఅప్‌ చేయండి. అవసరమైతే నన్ను కాంటాక్ట్  చేయండి..” ఆదేశాలిస్తూ వెళ్ళిపోయాడు. డాక్టరు చెప్పిన విషయాలు విన్న సుజాత కుటుంబసభ్యులు ఆందోళన చెందారు.

బెడ్ మీద పడుకున్న సుజాతకు డాక్టరు చెప్పిన మాటలు అస్పష్టంగా వినిపించాయి. ఆమెకు జరిగిన ప్రమాదం గుర్తుకు వచ్చింది..

బజారులో నడుచుకుని వెళుతుండగా గేదెలు ఎదురు రావడం.. పక్కకు తప్పుకుని రోడ్డువార నిల్చోవడం.. గేదెల వ్యక్తికి వాటిని అదిలించడంతో ఒక గేదె తన వైపు రావడం.. అది విసిరిన కొమ్ము ఎడమ కంటికి గుచ్చుకోవడం.. కంటిని చేత్తో పట్టుకుని తాను కింద పడిపోవడ౦.. కంటి నుంచి రక్తం కారడం గుర్తున్నాయి. తర్వాత చుట్టపక్కల వారు దగ్గరలో ఉన్న డాక్టరు వద్దకు తీసుకుని వెళితే అతను ప్రథమ చికిత్స చేసి కంటి ఆసుపత్రికి పంపించడం తెలుసు. తర్వాత ఆపరేషన్‌ జరిగిందన్న విషయం మాటల బట్టి అర్థం అయింది. సుజాతకు మళ్లీ నిద్ర పట్టేసింది.

++++++++

తల్లి తండ్రీ  అమ్మాయిని కంటి ఆసుపత్రికి తీసుకుని వచ్చారు.

అమ్మాయికి ఇరవైళ్ళు ఉంటాయి. అందంగా ఆకర్షణీయంగా ఉంది.

అమ్మాయి తల్లిసాయం పట్టి సుజాత పడుకున్న బెడ్‌ పక్కన ఖాళీగా ఉన్న బెడ్‌ మీద పడుకోబెట్టింది.

ఆ అమ్మాయిని చూసిన వారు అయ్యో అనుకున్నారు.

కంటి ఆసుపత్రి గాబట్టి కంటికి సంబంధించిన శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారే ప్రతి బెడ్ మీదా ఉన్నారు. ఒకరినొకరు పలకరించుకుంటూ ఒకరి కష్టాలు మరొకరికి చెప్పుకుంటున్నారు. కంటి ఆపరేషన్‌ చేయించుకున్న వారికి సహాయకులు తప్పనిసరిగా ఉండాలన్న నిబంధన ఉండటం వల్ల కుటుంబసభ్యులు కూడా వస్తూ పోతున్నారు. డాక్టరు ప్రతాప్‌ వచ్చి ఆ అమ్మాయిని పరీక్షించాడు.

“ఇంటరు పరీక్షలు నేను రాయగలనా డాక్టర్‌?” ఆ అమ్మాయి ఆతృతగా అడిగింది.

ఆ అమ్మాయి స్టూడెంట్‌ అన్న విషయం అక్కడి వారికి అప్పుడు తెలిసింది.

అమ్మా స్వాతి... నువ్వెం బెంగపడకు. సిన్సియర్‌గా ప్రయత్నిస్తాను..”

దాక్టరు మాటలు విని స్వాతి...  తల్లి వెక్కి వెక్కి ఏడ్చింది.

ఊరుకో... అన్నీ సర్దుకుంటాయి... ఎవడో దుర్మార్గుడు చేసిన పనికి మనం శిక్షను అనుభవిస్తున్నాం...” ఆమె భర్త సముదాయించాడు.

ఏం జరిగింది?" ఎవరో అడిగారు.

ా అమ్మాయి స్వాతి చాలా మంచి పిల్లండి... దించిన తల ఎత్తకుండా కాలేజీకి వెళ్లి వచ్చేది. వాడెవడో రౌడీ వెదవ ప్రేమించానని వెంట పడేవాడట. ప్రిన్సిపాల్‌కు పిర్యాదు చేసి౦ది వాడు. స్వాతి మీద కక్ష పెంచుకున్నాడు. సమయం కోసం చూసాడు. ఒంటరిగా వెళుతున్నప్పుడు పెళ్లి చేసుకోమని అడిగాడట. వాడి చెంప చెళ్లుమనిపించింది...” వాళ్లమ్మ ఆగింది.

అక్కడున్న రమణ ఆతృతగా.. “తర్వాత ఏమైంది? అడిగాడు.

ఆమె ఏడుస్తూ చెప్పింది. తెచ్చుకున్న యాసిడ్‌ బాటిల్‌ మూత తీసి స్వాతి మొహం మీద పోసాడు. తృటిలో స్వాతి తప్పించుకుంది. కళ్ల మీద యాసిడ్‌ పడటంతో అవి దెబ్బతిని కనిపించడం లేదు... చదువుకున్న పిల్ల... కళ్లు లేని పిల్ల అయింది..

వాడిని పట్టుకున్నారా?

చుట్టపక్కల వారు పట్టుకుని చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు... పెద్ద కేసు అయింది. వెంటనే ఆసుపత్రిలో చేర్పించాం. కళ్లు కనిపించకపోయినా పరీక్షలు రాస్తానని అంటోంది. కంటి చికిత్స కోసమే ఈ ఆసుపత్రికి తీసుకుని వచ్చాం..” అమె ముక్తాయించింది.

అక్కడున్న వారిలో నిశ్శబ్దం ఆవరించింది.జైళ్లో ఉన్న ఆ దుర్మార్గుడు బాగానే ఉన్నాడు. మాకు ఒక్కగా నొక్క సంతానం. పాప కోసం నిరంతరం ఏడుస్తూనే ఉన్నాం..” స్వాతి తండ్రి చెప్పాడు.

పక్క బెడ్‌ మీద మాగన్నుగా నిద్ర పోతున్న సుజాత ఈ మాటలు వింది. బాధతో మూలిగింది.

ఆ రోజు స్వాతిని ఆపరేషన్‌ థియేటర్ కు తీసుకుని వెళ్లి పరీక్షించారు. యాసిడ్‌ దాడి వల్ల రండు కళ్లూ దెబ్బతినడం వల్ల రికవరి కావడం కష్టమని తేల్చారు.

స్వాతికి రెండు కళ్లూ దెబ్బతినడం వల్ల లోకమంతా అంధకారం అయిపోతుంది.

ఏదో మార్గం మీరె చూడాలి డాక్టర్‌..” స్వాతి తల్లి కన్నీళ్లతో అభ్యర్థించింది.

వైద్యులు మరోసారి నిపుణుల అధ్వర్యంలో పరీక్షలు జరిపారు.

యాసిడ్‌ దాడి వల్ల రెండు కళ్లూ దెబ్బ తిన్నప్పటికి కుడి కన్నులో తెల్లటి భాగం కాస్తా బాగున్నట్లు గుర్తించారు. కాస్త బాగున్న కన్నుకు నల్లని గుడ్డిని అమరిస్తే ఆ కుడి కన్ను కనిపించే అవకాశం ఉంది. బ్రెయిన్‌ డెడ్‌ అయిన వారి నుంచి ఇటువంటి కన్ను కోసం ప్రయత్నించాలి" డాక్టర్ల బృందం చెప్పిన మాటల్లో స్వాతి తల్లిదండ్రులకు ఆశారేఖలు కనిపించాయి.

+++++++

స్వాతికి కంటి ఆపరేషన్‌ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేసారు. వైద్యశాస్త్రంలో అరుదుగా జరిగే కంటి ఆపరేషన్‌ విషయంలో ఆసుపత్రి వైద్యులంతా ఎంతో అప్రమత్తం అయ్యారు. కనుగుడ్డు ఇవ్వడానికి అంగీకరించిన వారి నుంచి అన్ని పత్రాలు తీసుకుని ఆపరేషన్‌కు ఏర్పాట్లు చేసారు. ముగ్గురు వైద్యులతో కూడిన బృందం రెండు గంటల పాటు శ్రమించారు. దాత కంటి నుంచి సేకరించిన కంటిలో ఉపయోగపడే తెల్లని భాగాన్ని స్వాతి కుడి కంటిలో నల్లని గుడ్డు చుట్టూ అమర్చడానికి వైద్యులు చేసిన ప్రయత్నం విజయవంతం అయింది. ఆపరేషన్‌ విజయవంతంగా పూర్తి చేసారు.

కనిపించని రెండు కళ్ల స్థానంలో ఒక కన్ను కనిపిస్తుందన్న ఆనందం.. స్వాతిలో ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది... “తాను పరీక్షలు రాయగలను..” అంది ఉద్విఘ్నతతో.

+++++++

స్వాతి పరీక్షలను దిగ్విజయంగా పూర్తి చేసింది

“అమ్మా నీకు కన్ను దానం చేసిన వ్యక్తి కుటుంబసభ్యుల వద్దకు వెళ్లి కృతజ్ఞతలు చెప్పుకుందాం. పరీక్షలు అయ్యేంత వరకు నిన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఊరుకున్నాం..” తల్లిదండ్రులతో కలిసి స్వాతి బయలుదేరింది.

ఆ ఇంటిలో వారంతా స్వాతి కుటుంబసభ్యుల్ని సాదరంగా ఆహ్వానించారు.

“ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా మా అమ్మాయికి చూపును దానం చేసిన మీ కుటుంబానికి శతకోటి వందనాలు. మీరు చేసిన మెలు ఈ జన్మకే కాదు. జన్మజన్మలకు తీర్చుకోలేనిది. భగవంతుడు మీ కుటుంబానికి మేలు చేస్తాడు...” దాత కుటుంభీకులకు దండం పెడుతూ చెప్పారు. స్వాతి కూడా వంగి నమస్కారం చేసింది.

్రమాదమనేది చెప్పి రాదు. చూపు కోల్పోవడమన్నది ఎంతటి బాధాకరమైన విషయమో అనుభవించిన వారికి తెలుస్తుంది. మీరు మీ అమ్మాయి పరిస్థితి చెప్పిన తర్వాత మాకుటుంబం అంతా ఆలోచించాం. స్వాతి ఎదుగుతున్న పిల్ల.. పెళ్లి కావల్సిన పిల్ల.. భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు పెంచుకుని చదువు కోసం కలలు కంటున్న అమ్మాయి. అటువంటి వ్యక్తికి కన్ను దానం చేయడం సమంజసమని మీకు మంచి జరుగుతుందని ఈ నిర్ణయం తీసుకున్నాం..” అతను స్వాతి తల్లిదండ్రులతో చెప్పాడు.

ఇంతలో లోపలి నుంచి ఒకావిడ టీకప్పులతో వారి వద్దకు వచ్చి అందరికీ అందించిది.. “ఈమె నా భార్య సుజాత.. మీకు కన్ను దానం చేసిన వ్యక్తి”  రమణ వారికి పరిచయం చేశాడు.

స్వాతి సుజాత కాళ్లమీద పడిపోయి కన్నీళ్లుతో తడిపెసింది.

ేమ్మా... స్వాతి...” అంటూ లేపి హత్తుకుంది. “నువ్వు నా కూతురు లాంటిదానివమ్మా..” అంది. తర్వాత సుజాత... స్వాతిని దగ్గరకి తీసుకుని ఆమెకు అమర్చిన తన కన్నును తాను ఆప్యాయంగా చూసుకుంది. స్వాతి కూడా సుజాతకున్న ఒంటి కన్ను వైపు చూసింది.

అలా చూస్తుండగా తెరిచి వున్న ఇద్దరి ఒంటి కళ్ల నుంచి జలజలా కన్నీళ్లు జాలువారాయి....

+++++++

0 Comments