చంచల మనసు  (Author: అంబల్ల జనార్దన్)

చంచల మనసుకు పట్టిన చెడు చెదలు నిర్మూలించేందుకు

ఘాటైన కీటక నాశని మంచిమనుషుల సాంగత్యమే

ఒలికిన పాలను తలచుకుంటూ

వగచితే ఫలితం శూన్యమని ఎంత తెలిసినా

గాలికంటే వేగంగా సంచరించే మనసు

పదే పదే ఆ పాలనే జ్ఞాపకం చేసుకుంటుంది

గతం గతః భవిష్యత్తు అనూహ్యం

వర్తమానమే మనం ఆస్వాదించాలని

ఎన్ని సూక్తులు చదివినా మతిలేని మనసు ఊరుకోదే

గతంలోని గంపెడంత తీపిని

పక్కన పెట్టి సూది మొనంత చేదును

పర్వతంలా ఊహించుకొని బాధపడితే

వ్యథ తప్ప ఏమైనా మిగులుతుందా?

రూపంలేని రేపు ఏమౌతుందో అనే భయంతో

ఖచ్చితమైన నేడు వాపోతూ ఆందోళన చెందితే

వర్తమానం పాడవడం తప్ప వేరే ప్రయోజనం ఏమైనా ఉందా?

అదుపులేని అనర్థాల పుట్ట ఐన మనసు గుర్రం

ఉన్న చోట ఉండకుండా ఎక్కడెక్కడో సంచరించబోతే

విచక్షణ కళ్లెం వేసి దాన్ని అదుపు చేసి సరి ఐన దారిలో

నడిపిస్తూ ముందుకు సాగితేనే

మన మనుగడ సార్థకమౌతుంది

మన జీవన గమనం సుగమమౌతుంది

నలుగురిలో మన పరపతి పెరుగుతుంది

మనః శాంతి అనే గమ్యం మనదౌతుంది

0 Comments