కొసరు  (Author: నాదెళ్ళ అనూరాధ)

చిత్రంగా ఆ సాయంకాలం ఒకానొక వీధి మలుపులో-

ఓ దృశ్యం నన్ను నిలేసింది!

ఇంకాసేపు ఆడుకుంటానే పసివాడి గొంతులో వేడుకోలు!

ఎక్కడున్నాను నేను?

బాల్యపు సరిహద్దు రేఖ తటాలున తెరుచుకుంది

ఈ మాటలే దశాబ్దాల వెనుక నా నోటి వెంట!

అదాటుగా వచ్చి అమ్మ ఒంటినంటిన మట్టి దులిపింది,

విసిగించిన అల్లరిని కడిగి, గుండెలకు హత్తుకుంది

ఇంకో ముద్ద తినమని కొసరుతూ అమ్మ

కళ్ళ మీదకి వాలుతున్న నిద్ర మాటున

ఆడుకుంటానంటూ కొసరుతున్న నేను!

ఆనాటి పాతబొమ్మ మసకబారింది!

నిశ్శబ్దం పరుచుకున్న ఖాళీ ఆటమైదానాలు

పిల్లల పార్కుల్లో జారుడు బల్లలు

నిర్వికారంగా, నిరామయంగా ఎదురుతెన్నులు చూస్తూనే ఉన్నాయి!

అవి మాయమయ్యే రోజూ ఇక్కడెక్కడో పొంచే ఉంది.

ప్రపంచంలో పిల్లలంతా ఏమయ్యారు?

శరీరాలూ, మనసులూ మూర్ఛిల్లేలా ఏ విజ్ఞాన గుహల్లో బందీలైపోయారు?

ఊకుమ్మడిగా బడి దినాలు, సెలవు దినాలు

సాయంకాలాలకి కొత్త సంప్రదాయ పూతలు పూస్తూనే ఉన్నాయి,

ఒక్క వాయిద్యం మీద ఒకే ఒక్క రాగాన్ని పాడుతూనే ఉన్నాయి!

ఆటనేదొకటుంటుందని, ఆడుకునే సమయమొకటుంటుందని

నడక, నడత నేర్పిస్తున్న బడి చెప్ప(లే)దు.

మైమరచిన బాల్యం

ప్రకృతి గాఢాలింగనంలో మునకలెయ్యాలన్న నిన్నటి నమ్మకం

పగుళ్ళిచ్చి చాలాకాలమైంది!

రాత్రనక పగలనక కేరింతలు కొట్టి కొట్టి అలసిసొలసి

హృదయపు దండేల మీద వేలాడుతున్న స్మృతులు మరుగున పడుతున్నాయి!

వర్తమాన బాల్యం క్రమశిక్షణ వెనుక ఇంకా ఇంకా ఒదిగిపోతూనే ఉంది!

కొసరించే వాడి ఆటల కొనసాగింపూ లేదు,

కొసరికొసరి తినిపించే వ్యవధి అమ్మకీ లేదు!

0 Comments