కళాఖండమ్
కళాఖండం (Author: యములపల్లి నరసి రెడ్డి)
తవ్వకాల్లో బయటపడ్డ పురావస్తువులా
పండగ, పబ్బాలకు ఇంటిని సర్ది చక్కదిద్దుకుంటున్నప్పుడల్లా
పశువుల కొట్టం అట్టవపై చెక్కపెట్టెలో ఒక వస్తువు
వ్యవసాయ పనిముట్ల మధ్యన సజాతి ధృవ అయస్కాంతంలా
ఆకర్షించి కట్టి పడేసేది
పాత సామాన్ల వాడికి ఇస్తే, పది రూపాయలు రాల్చడు గానీ!
నా ఒంటరి వేలం పాటలో రోజూ దాని విలువ
వందల రెట్లు పెంచుకునే వాడిని
ఏ చేయి తిరిగిన పనిమంతుని ఉక్కు సంకల్పపు సృష్టో
ఆ కళాఖండం
నా దృష్టిలో నెమలి సింహాసనం కన్నా అతి ఖరీదైనది
పశువుల దొడ్లో చెంగుచెంగున ఎగిరే లేగదూడ మెడకు
సున్నపు డబ్బీ పరిమాణమంత గంట ఎంత అలంకారమో
మా అవ్వ చేతికి అది, అంత అందం
ఇంటి గుమ్మం ముందూ.. చేను గట్టు పైనో
మా అవ్వ దాన్ని పట్టుకొని నుంచుంటే
కంటి చూపుకు దొరక్కుండా నాన్ చాక్ ఆయుధాన్ని
రఫ రఫా తిప్పే బ్రూస్ లీ నే గుర్తుకొచ్చే వాడు
దానితోనే మా అవ్వ చెనిక్కాయ కల్లంలోపడ్డ
దొంగల రగతం కళ్ల చూసిందంట
ఆకు వక్క ముదర చుట్టి దాంట్లో వేసి దంచుతుంటే
గ్రామదేవత ముత్యాలమ్మ గజ్జెల గుర్రంపై వచ్చి
ఊరంతా కలియ తిరిగి, జనాల కష్ట సుఖాలు విచారించి నట్లుండేదట
దాని కోసం నడుములు వొంగిన పాత, కొత్త ముసలి చుట్టాలు, మిత్రులు
మా ఇంటికి వరుస కట్టేవారు
ఉపయోగించి చూశాక ఎంత బాగా మెదిగిందో అని
అరచేతిలో గోరింటలా ఎర్రగా పండిన నోటితో
గొప్పగా కితాబిచ్చి పోయేవారు
తరాలవయసున్న దానికి మా అవ్వ ఎన్నో పీఠాధిపతో
తెలియదు గానీ.,
అమ్మ నున్నగా నమిలి, కొన నాల్కన బిడ్డ నోటికి అందించిన
తాంబూలపు తమ్మ సేవ దానిది
మా అవ్వగాలి ప్రాణాల్ని కాలం మింగేశాక
దాంట్లోనే ఆమె ఆత్మ ఐక్య మైనట్లుఅనిపించేది
మసగ్గా కనిపించే ఆమె కాగిత చిత్రపటాన్ని
చెద పురుగులు తినేశాక
మా అవ్వ మొక్కవోని దీక్షల్ని ఎక్కువగా చూసిన
ఆ వక్కరోలు లోనే ఆమెను చూసుకుంటున్నాను
అస్తిత్వాలను అశ్రద్ధకు అప్పగించకుండా
నిట్రాయి తగిలి బెనికిన మా తాత మోకాలికి
ఉడుమునెయ్యితో మా నాయన మర్ధనా చేసినట్టు
పాత టేకు కుర్చీకి వార్నీసు పూసి నిగారింపు పెంచినట్టు
చక్కగా చారెడు కొబ్బరి నూనె రాసి
సింహద్వారం ఎదురు గోడకు కొత్త మేకు తెచ్చి కొట్టి
అంతర్జాతీయ ఆటల పోటీల్లో గెలిచిన బంగారు పతకంలా
సగర్వానికి చిహ్నంలా వక్కరోలును తగిలించాను
మా అవ్వను నేనిప్పుడు రోజూ చూస్తున్నాను
మాఅవ్వ నన్ను చూస్తోంది
ముందుకేమి జరుగుతుందో నాకు తెలియదు
మూలాలను మరవడం నా చేత కాని పని.