ఒక మందస్మిత గగనం కోసం  (Author: పాండ్రంకి సుబ్రమణి)

పచ్చదనం ఇంటివాకిట పల్లవించే పూలతోటలా పండాలి

గగనాన పచ్చతోరణంలా పెళపెళ మెరిసి పచ్చబొట్టై నిలవాలి

కళ్యాణమండపంలోని కలయికలా చుట్టపు చూపులా వినబడాలి

ఉదయకాల (పు) పూలవనం తల్లి పలకరింపులా పారవశ్యం కలిగించాలి

గతుకుల బ్రతుకులకు తావులేని రాచ బాటగా ధృవనక్షత్రంలా మారాలి

ప్రకృతికి బింబప్రతిబింబాలై భూమ్యాకాశాలను మమేకం చేసేలా స్పర్షించాలి

అది చూసి గగనం ప్రసన్న వదనమై త్యాగయ్య సుందర గానమై వర్షించాలి

వీటికి యేకైక బింబం మురిపించి మైమరిపించే పసితనపు చిక్కదనం,

ఈ చిక్కదనానికి ఒకే ఒక ప్రతిరూపం ముగ్ధ మనోహరం కలిగించేది వృక్షమే

తరచి చూస్తే తెలుస్తుంది మనసు నెమలీకలా పురి విప్పుతుంది పంచభూతాలకు

ఏకైక ప్రతినిధి మరెక్కడో లేదు మన పెరట్లో మొలచి మునముందు పెరిగిన చిన్నటి చెట్టే

ముఖం చాటేసి సరసరా తరలిపోతూన్నమేఘమాలలను చిర్నవ్వులతో నిలిపి పలకరించి

ధాన్యరాశుల ముత్యాల ముగ్గులను నలు వైపులా రచించి విరచించేది చెట్టే అది కాదంటే ఒట్టే

తాను మ్రానై చల్లని నీడై అన్నిటికీ తానై కనిపించని గొడుగై మనకోసమే పుట్టానంటుంది చెట్టే

ఎండనక వాననక పిడుగుల పోట్లకు వెరవక ఏదీ యెదురుచూడక ఎదురొడ్డి నిలిచేదీ మనూరి చెట్టే మట్టిలో మట్టై ధూళిలో ధూళయి కలసిపోయి సమసిపోయేంత వరకూ నిలుస్తూ మట్టిని గట్టి చేసేది చెట్టే

దారిన పోయే దానయ్యల రాళ్ళదెబ్బలను భరిస్తూ చప్పుడు చేయని గాయాలను మౌన నినాదంతో స్వీకరిస్తూ అతలపాతాలనూ హెచ్చుతగ్గులనూ తృణీకరిస్తూ ఇంద్ర చంద్ర దేవేంద్ర సభలనూ పవనాలతో పరవశింప చేసేది చెట్టే—

అనునిత్యమూ అంటాను చెట్టు మా అమ్మ పలకరింపువంటిదని మరవలేని బాల్య కాలపు చిలకరింపు వంటిదని--

0 Comments