ఉండిపోరాదే... !  (Author: రాయప్రోలు వెంకట రమణ శాస్త్రి)

నల్లని మబ్బులు కమ్మేసాయ్

చల్లని తెమ్మెరలు తాకేసాయ్

సూర్యుడి శక్తిని వెనక్కు నెట్టేశాయ్!

ఈ సందడితో

పెరటిలోని అరటికి తెలిసి పోయింది..,,

నైరుతి నుంచి కురిసే చుట్టం వస్తోందని!

మురిసి పోయి

వాకిట్లోకి ఇంట్లోకి తిరిగే పిల్లిలా

అవిశ్రాంతంగా ఎదురు చూస్తోంది!

లేలేత ఆకుల్లో తన పరువమంతా పరచి

స్వాగతం చెబుతోంది

తొలిజల్లు చిలకరింపుకు!!

ఒక సన్నని చినుకు వచ్చి

వాలింది ఆకు మధ్య ఈనెలో!

పడిందే తడవుగా

ముత్యంలా మెరుస్తోంది

పచ్చదనం మధ్యలో!

ఆ చినుకు పవనం తెచ్చిన ఉపుకు

ముందుకు సాగింది

నున్నని మెత్తని జారుడు బండ మీద!

బాల్యంలా

నవ్వుతూ జారి పోయింది

ఈనె నివ్వెరపోయేలా!

మరో చినుకు … మరో చినుకు...

ఒక దాని వెనక ఒకటి వస్తున్నయ్!

తోసుకుంటున్నయ్ జారుడు బండ మీద!

ఆకులో పచ్చదనం మురిసిపోతోంది!!

చినుకుల శూలాలకు

కొన్నిసార్లు దొరుకుతో

కొన్నిసార్లు దొరకక

ఆకు "నేల - బండ" ఆడుకుంది!

కాసేపటికే చినికి చినికి వానయ్యింది!

ఈనెలలో ముత్యాల మాలలు

జారి పడుతూన్న జలపాతాల హేళ!

చినుకుల రద్దీ పెరిగి ఆకుకు

గాయం అయ్యింది!

ఆ గాయం ఒక హాయి అయ్యింది!

చినుకు శరాలకు పత్రం పరవశిస్తూ

ఒళ్ళు అప్పగించేసింది!

ఆకులో చిరుగులన్నీ ఇప్పుడు...

బోసినోరు తెరిచి నవ్వే పసికందులు!!

అలసిన ఆకు మురిసి ఓడిపోయింది

వళ్ళంతా చిరుగులు

అంపశయ్య మీద భీష్ముడిలా

స్వఛ్ఛంద ఓటమి!

"ఆటలో అరటి పండు"

అంటోంది గాయపడ్డ ఆకులతో

అరటి చెట్టు!

రాసలీల ఇక చాలు అనుకొందేమో

వెలుస్తోంది వాన

తను వెళ్ళొస్తా నన్నట్లు.....

అరటి అంటోంది నైరుతి నేస్తంతో -

నీ కోసం ఎన్ని మారాకులైనా వేస్తాను!

ఉండి పోరాదే!!

***************&&&************

0 Comments