అన్నపూర్ణమ్మ
అన్నపూర్ణమ్మ (Author: బివిడి ప్రసాద రావు)
రాంబాబు ఫోన్ చేసి చెప్పాడు. ఆ వెంటనే నేను కాశీరాంకి ఫోన్ చేసి..
"అన్నపూర్ణమ్మని హాస్పిటల్ లో చేర్చారట." చెప్పాను.
"అవునా? ఎలా తెలిసింది." అడిగాడు కాశీరాం.
"హనుమంత ఫోన్ చేసి రాంబాబుకి చెప్పాడట. రాంబాబు నాకు చెప్పాడు" చెప్పాను.
"ఇంకేమైనా చెప్పాడా?" అడిగాడు కాశీరాం అటు నుండి.
"అన్నపూర్ణమ్మ ఒంట్లో నలతగా ఉందంటూ హనుమంతుకి కబురుపెట్టిందట. వాడు తనని హాస్పిటల్ కి తీసుకువెళ్లాడట. డాక్టర్ పరీక్షలు చేయాలని హాస్పిటల్ లో చేర్పించ మన్నారట. దాంతో వాడు ఆ పని చేశాడట." నాకు తెలిసింది చెప్పాను.
"ఏం చేద్దాం?" అడిగాడు కాశీరాం.
ఫోన్ ని ఎడమ చెవి వైపు నుండి కుడి చెవి వైపుకు మార్చుకొని, "నేను వెళ్లి చూద్దామనుకుంటున్నాను. రాంబాబు కూడా బయలుదేరుతాడట" చెప్పాను.
"అలానా!" అన్నాడు కాశీరాం.
"నేను ఆఫీస్ కు వెళ్లి సెలవు పెట్టి.. అటు నుండే బయలుదేరుతాను." చెప్పాను.
"అలానా! నేనూ బయలుదేరి వస్తాను." చెప్పాడు కాశీరాం.
"సరే. కలుద్దాం" అనేసి, ఆ ఫోన్ కాల్ కట్ చేసేశాను.
ఆ తర్వాత..టూకీగా నా భార్య రత్నకుమారికి సంగతి చెప్పి, బేగ్ సర్దుకున్నాను. ఆఫీస్ కు వెళ్లి రెండురోజులకు సెలవు పెట్టాను. అన్నపూర్ణమ్మ కోసం బయలుదేరాను.
సమయాలు కుదరడంతో కాంప్లెక్స్ కు వెళ్లగానే బస్సు దొరికింది. పైగా నాకు ఇష్టమైన విండో పక్క సీటే దొరికేసింది. బస్సు హైవే ఎక్కగానే జోరందుకుంది. గాలి చక్కగా ఉంది. సీట్ వైపుకు తలని జారవేశాను.
అన్నపూర్ణమ్మ.. నిజానికి తన పేరు అన్నపూర్ణ. ఆమె తీరుతో మేము తనను అన్నపూర్ణమ్మగా పిలిచే వాళ్లం. అన్నపూర్ణమ్మ నిండుగా, గంభీరంగా ముప్పై - ముప్పై ఐదు మధ్య ఉండే గొప్ప ఆవిడ.
నేను కోచింగ్ కై పట్నం చేరాను. కోచింగ్ సెంటర్ లో నాకు కాశీరాం, రాంబాబు, హనుమంత పరిచయమయ్యారు. మేమంతా వేరు వేరు ఊళ్ల నుండి కోచింగ్ కై పట్నం వచ్చి ఉన్నాం. మా నలుగురం కలిసి బాత్రూంతో కూడిన ఓ గదిని షేరింగ్ ప్రకారం అద్దెకు తీసుకున్నాం. తొలుత హోటల్ భోజనాలు కానిచ్చాం. ఆ తిళ్లు మాకు అస్సలు నచ్చలేదు. ఐనా తప్పదన్నట్టు సర్దుకు వచ్చాం. ఆ సమయంలోనే.. మమ్మల్ని అన్నపూర్ణమ్మ కలిసింది.
"మీరు ఉద్యోగ పరీక్షలకై చదువుకుంటున్న పిల్లల్లా ఉన్నారు. భోజనాలకు ఇబ్బందయితే చెప్పండి. నేను మూడు పూటల వండి తెచ్చి వేళలకు పెడతాను" చెప్పింది.
ఆ వెంబడే.. "నా చేతి వంటలు బాగుంటాయి. ఇది వరకటి ఈ ఇంట్లోని పిల్లలకి నేనే వండి పెట్టేదాన్ని. వాళ్లు వెళ్లేక ఈ మధ్యనే మీరు ఇక్కడ చేరారని తెలిసి వచ్చాను." అంది.
"నువ్వు వంటావిడవా?" అడిగాను.
"అలానే అనుకో. ఏదో నా భుక్తి గడవాలని. చేచాచడాలు.. పాచి పనులకు తిరగడాలు ఇష్టం లేక, మరో తోడు, దిక్కు లేక.. ఇలా కష్టపడి ఇంత తినాలనుకుంటున్నాను" మెల్లిగా చెప్పింది అన్నపూర్ణమ్మ.
"సరే. మాకు బయట తిళ్లు సహించడం లేదు. నువ్వు వండి పెడతానంటే మాకు ఇష్టమే. మరి ఇంటి తిళ్లలా ఉండాలి" కలగజేసుకున్నాడు కాశీరాం. అన్నపూర్ణమ్మ సంతోషపడుతోంది.
అప్పుడే రాంబాబు.. "నీ పూట భోజనం ఎంత?" అడిగాడు.
"అలా లెక్క కాదు. నేను రోజూ మూడు పూటలు వండి పెడతాను.." చెప్పుతోంది అన్నపూర్ణమ్మ.
అడ్డై.. "ఉదయం పూట భోజనం ఎందుకు" అన్నాడు హనుమంత.
"అబ్బే. ఉదయం పూట టిఫిన్ ఇస్తాను. మిగతా రెండు పూటలు భోజనాలు" చెప్పింది అన్నపూర్ణమ్మ. ఆ వెంబడే.. "పూటలు లెక్క కాదు. మీకు కావలసిన పూట వారీ తిళ్లు రోజు వారీగా చెప్పండి. వాటికి సరిపడ్డ సరుకులు చెప్తాను. వాటిని మీరే కొని ఇవ్వండి. నేను వండి పెడతాను. ఆ వంటల్లోదే నేను ఇంత తింటాను. అంతే. నాకు మరి ఏ డబ్బులు మీరు ఇవ్వనక్కర లేదు." చెప్పింది.
నేను విస్మయమయ్యాను. మిగతా ముగ్గురినీ చూశాను. అంతలోనే హనుమంత "ఇదేమిటీ?" అన్నాడు. అన్నపూర్ణమ్మ ఏమీ అనలేదు. తర్వాత మేము తర్జనభర్జన అవుతుండగా..
"మొదట కొద్దిరోజులు నా వంటలు తినండి. మీకు నచ్చితేనే కొనసాగించుకోండి" చెప్పింది అన్నపూర్ణమ్మ.
"మరి.. వంటలు మీ ఇంటి దగ్గర వండి తెస్తావా?" అడిగాను.
"అవును. నాకు దగ్గరలోనే పాకిల్లు ఉంది. వంట సామాగ్రి ఉంది" చెప్పింది అన్నపూర్ణమ్మ. మేము ముఖాలు చూసుకుంటుండగానే, నేనే ముందుగా, "సరే. రేపటి నుండి వండి పెట్టు" చెప్పాను.
"సంతోషం. సాయంకాలం వస్తాను. రేపటి మీ తిళ్లు చెప్పండి. వాటి సామాన్లు చెప్తాను. మీరు కొనివ్వండి" చెప్పింది అన్నపూర్ణమ్మ.
"సరే.. సరే" అనేశాను. అన్నపూర్ణమ్మ వెళ్లిపోయింది. మా నలుగురం కూడబలుక్కుని, సాయంకాలం అన్నపూర్ణమ్మ వచ్చినప్పుడు మాకు కావలసిన తిళ్లు చెప్పాం.
ఆ తర్వాత..
"రెండు రోజులు వండి ఇవ్వు. దానిబట్టి తర్వాతది చెప్తాం." చెప్పాడు కాశీరాం.
"ఈ రెండు రోజులకి మేము చెప్పిన తిళ్లకు ఏఏ సరుకులు ఎంతెంత కావాలో చెప్పు" అడిగాను. ఆవిడ చెపుతుంటే నేనే పేపరు మీద వాటిని రాశాను.
"ఆ సరుకులు నాకు కొనేసి ఇచ్చేయండి చాలు. రేపు టిఫిన్ నుండి పూట పూటకి వేడి వేడివి తెచ్చి రెండురోజులూ పెడతాను." చెప్పింది అన్నపూర్ణమ్మ.
"మా కోచింగ్ సెంటర్ దగ్గరనే. మేము ఉదయం తొమ్మిదికి వెళ్తాం. లంచ్ కి ఒంటి గంటకి వస్తాం. రాత్రి ఏడుకు వస్తాం" చెప్పాడు హనుమంత.
"సరే. ఆ వేళలకే నేను అందించగలను" ఒప్పుకుంది అన్నపూర్ణమ్మ.
"పచారి కొట్టు దగ్గరలోనే చూశాం. అక్కడ కొని ఇస్తాం" చెప్పాను.
"సరే" అంది అన్నపూర్ణమ్మ. "రా. కొని ఇచ్చేస్తాం." చెప్పాను. ఆ కొట్టులోనే కావలసినవి కొని అన్నపూర్ణమ్మకి ఇచ్చాం. తన కోరిక మీద మేము తన తోనే వెళ్లి.. తన ఇంటిని చూశాం. పిమ్మట మా నలుగురం రూంకి తిరిగి వచ్చేక, రెండురోజుల తిళ్ల సరుకులకి ఎంతైందో చూసుకొని, ఆ మొత్తం నలుగురం పంచుకున్నాం.
"ఈ లెక్కన రెండురోజులకి మనకు హోటల్ తిళ్ల కంటే తక్కువే ఐంది" అన్నాను. "అవునవును." మిగతా ముగ్గురు ఏకసారే అన్నారు.
"వంటలు బాగుంటే ఈమెనే కొనసాగించుకుందాం" అన్నాడు రాంబాబు. మేము 'సరే' అనుకున్నాం. అన్నపూర్ణమ్మ చేతి వంటలు బాగున్నాయి. దాంతో వారం రోజులకు సరిపడ్డ సరుకులు కొనిచ్చాం. క్రమంగా, అన్నపూర్ణమ్మ తీరు మెచ్చి, సరుకులకని వారం వారం నేరుగా ఆమెకే డబ్బు చెల్లించే వాళ్లం.
నమ్మకం మరింత పోగవ్వడంతో నెలకింతని సరుకులకు ముట్టచెప్పేవాళ్లం. దాంట్లో మిగిలితే తిరిగి ఇచ్చేసింది అన్నపూర్ణమ్మ. లేదా, కావలిస్తే కొరదాని అడిగి తీసుకునేది.
అన్నపూర్ణమ్మ చలువతో మేము ఆరోగ్యవంతంగా తిరగాడగలిగాం. తన చేతి వంటలు ఇంటివంటలకు తుల్యంగా అనిపించాయి. పైగా కొసరి కొసరి, బతిమలాడి, బతిమలాడి మాచే తను తిళ్లు తినిపించే విధం మాకు గొప్పగా తోచింది. తనలో మా అమ్మలు కనిపించారు.
మా ఆర్నెల్ల కోచింగ్ పూర్తయ్యింది.
ఆ రోజు.. దిగులుగానే.. చెప్పక తప్పక.. నేనే చొరవ తీసుకొని.. అన్నపూర్ణమ్మతో..
"మేము రేపు మా ఊళ్లకి వెళ్లిపోతున్నాం. పరీక్షల రోజునే వస్తాం" చెప్పాను.
"తప్పదుగా. మంచి తిళ్లు తినండి. ఆరోగ్యాలు మంచిగా చూసుకోండి" చెప్పింది అన్నపూర్ణమ్మ. తనలో మరో మారు మా అమ్మలు కనిపించారు. ఇది మా నలుగురికీ కలిగిన భావన అంటేనే సరైనది.
"ఇది మీలా చదువుకునే పిల్లలకి అనువైన చోటు. మీ తర్వాత ఎవరొస్తారో. వాళ్లని కూడతీసుకోవాలి. ఏమవుతోందో" నసుగుతోంది అన్నపూర్ణమ్మ.
"నీవు మంచిదానివి. నీ చేతి వంట అమోఘం. తప్పక నీకు మాలాంటివాళ్లు కుదురుతారు" చెప్పాను. ముందుగానే మేము కూడబలుక్కుని ఉండడంతో, "ఇదిగో ఈ మొత్తం అట్టిపెట్టుకో" చెప్తూ.. మేము పోగు చేసుకున్న నోట్లని తనకి అందిస్తుండగా,
"లేదు లేదు. నాకు ఇలాంటివి కష్టపెడతాయి. వద్దు. నేను పుచ్చుకోలేను." అన్నపూర్ణమ్మ చట్టుక్కున అనేసింది.
మేము ముఖాలు చూసుకున్నాం. అన్నపూర్ణమ్మ కదిలి, తను వండి తెచ్చిన సామాగ్రిని కూడతీసుకునే పనిని చేపట్టింది. అప్పుడే మిగతా ముగ్గురును రూం బయటికి తీసుకువచ్చాను.
"తన సంగతి తెలిసిందేగా. డబ్బు ఊరకనే పుచ్చుకోదు" చెప్పాను.
"మన అభిమానం తను అర్థం చేసుకుంటే బాగుణ్ణు" అన్నాడు రాంబాబు.
"ఏం చేద్దాం?" అడిగాడు కాశీరాం.
"ఇప్పటికి మనం మన డబ్బును వెనుక్కు పంచుకుందాం" చెప్పాను.
ఆ వెంబడే.."తనకోసం ఏమైనా చేయాలి" అన్నాను.
"ఓ సారి మనం అనుకున్నాంగా. తను సొంతంగా ఓ చిన్న హోటలు నిర్వహిస్తే తనకి గిరాకీ బాగుంటుందని" గుర్తుచేసేలా అన్నాడు హనుమంత.
"నిజమే. కానీ అప్పుడే మనం అనుకున్నాంగా.. అందుకు మనం సాయపడగలగాలంటే.. మనం తొలుత నిలదొక్కుకోవాలని" కలగచేసుకున్నాను.
అంతలోనే అన్నపూర్ణమ్మ తన సామాన్లుతో వచ్చింది. మాకు మరీ మరీ జాగ్రత్తలు చెప్పి వెళ్లిపోయింది.
బస్సు ఆగినట్టు కావడంతో.. సర్దుకుంటూ తల విదిలించుకున్నాను.
"ఐదు నిముషాలు బస్సు ఆపుతాం." అరుస్తున్నాడు బస్సు కుర్రోడు.
దిగి టీ తాగాను. బస్సు ఎక్కాను. తిరిగి బస్సు కదిలింది. ఆ తోవనే తిరిగి అన్నపూర్ణమ్మ వైపు మరలాను.
పరీక్షల రోజున తిరిగి మా నలుగురం కలుసుకున్నాం. పరీక్షలు రాశాక, నలుగురం అనుకుని మేము అన్నపూర్ణమ్మని కలిశాం. మమ్మల్ని చూసి, "నన్ను యాద పెట్టుకున్నారా?" అన్నపూర్ణమ్మ మురిసిపోయింది.
"భలే. మేము ఫోన్లో మాట్లాడుకున్నప్పుడు నీ గురించి ముచ్చటించుకుంటుంటాం. నీవు మా మరో అమ్మవి" చెప్పాను.
అన్నపూర్ణమ్మ.. మేమున్న చోట గదిలోకి చేరిన కొద్ది మంది స్టూడెంట్స్ కి వండి పెట్టే పనిని చేస్తోందట. తను సంతోషంగా అగుపించింది.
ఆమెతో కొద్ది సేపు గడిపి.. మేము తిరిగి మా ఊళ్లకి బయలుదేరాం. ఆ తర్వాత కూడా మాకు వేరు వేరు చోట్ల ఉద్యోగాలు వచ్చినా.. మా నలుగురం టచ్ లోనే ఉన్నాం. ఆ తోవనే మాకు పెళ్లిళ్లయ్యిపోయాయి. ఒకరి పెళ్లికి ఒకరం హాజరూ అయ్యాం.
చిత్రంగా.. హనుమంతకు మేము కోచింగ్ చేసిన ఊరికి ఉద్యోగ రీత్యా ట్రాన్స్ఫర్ వచ్చింది. దాంతో అన్నపూర్ణమ్మని అడపాదడపా హనుమంత కలుస్తుండేవాడు. ఆమె సంగతులు మాకు ఫోన్ లో అందిస్తుండేవాడు.
నేనొక రోజున.. మిగతా ముగ్గురితో,
"మనం ఉద్యోగాలు చేస్తున్నాం. ఇప్పుడు కొంత మేరకు అన్నపూర్ణమ్మకి మనం చేదోడు కాగలం. ఇప్పుడైనా తన చేత మనం చిన్న హోటల్ పెట్టిస్తే బాగుంటుంది. తనంతట తాను నిలదొక్కుకోనిద్దాం" కదిపాను. ముగ్గురూ సానుకూలతయ్యారు. కూడబలుక్కుని మేము అన్నపూర్ణమ్మని కలిసి, మా ఆలోచన చెప్పాం. కాని, తొలుత అన్నపూర్ణమ్మ స్పందించలేదు.
"నీకు వయస్సు పెరుగుతోంది. ఈ తెంపరాట్లు నీకు మరి వద్దు. నీ ఇంటి పట్టున ఉండి, నీ చేతి వంటలను, నీ దగ్గరికే వచ్చి తినేలా చేసుకో." చెప్పాం. బతిమలాడాం. చివరికి ఒప్పించ గలిగాం.
"మదుపులు మేము సమకూరుస్తుంటాం. ఆరాంగా హోటల్ నప్పుకో చాలు" చెప్పాను.
"ఊరకనే మీ మదుపులు నాకు వద్దు. నాకు కూడినప్పుడు నేను తిరిగి ఇస్తుంటాను. మీరు పుచ్చుకోవాలి" చెప్పింది అన్నపూర్ణమ్మ.
తను చెప్తే వినదని తెలిసిన నేను "మేము నీకు ఓ బ్యాంక్ అకౌంట్ తెరిచి డబ్బులు వేస్తుంటాం. ఆ డబ్బులతో సరుకులు కొనుక్కో. ఆ బ్యాంక్ అకౌంట్ లోనే నీవు కూడ పెట్టగలిగింది వేస్తుండు. మేమూ అప్పుడప్పుడు దాంట్లోనే డబ్బులు వేస్తుంటాం. ఇలా ఇచ్చి పుచ్చుకునేలా గడుపుదాం" చెప్పాను. అందుకు మిగతా ముగ్గురు వంతు పాడారు.
దాంతో అన్నపూర్ణమ్మ మా మాటలని వినుకుంది. మేము సెలవులు పొడిగించుకొని, హనుమంత ఇంటన ఉండి, నాలుగు రోజుల్లోనే అన్నపూర్ణమ్మ ఇంటి ముందు ఓ పాక హోటల్ కుదిర్చి పెట్టాం. తన పేరున బ్యాంక్ అకౌంట్ ఒకటి ఏర్పర్చి ఇచ్చాం. బ్యాంక్ వాళ్లని ఖాతా నిర్వాహణలో తనకు సాయపడుతుండమని కోరాం. ఆ తర్వాత.. అన్నపూర్ణమ్మ హాయిగా కాలం గడుపుతోందని వింటూ వచ్చాం.
బస్సు కుర్రోడి అరుపుతో ఆలోచనల్లోంచి బయట పడ్డాను.
నేను దిగవలసిన చోటు వచ్చేసింది. బస్సు దిగేశాను. హనుమంత ఫోన్ సమాచారంతో అన్నపూర్ణమ్మ ఉన్న హాస్పిటల్ చేరాను. అప్పటికే అక్కడ కాశీరాం.. రాంబాబు వచ్చి ఉన్నారు.
"ఎలా ఉంది తనకి?" అడిగాను.
"మమ్మల్ని చూసింది. నిన్ను అడిగింది. వస్తున్నావని చెప్పాం" చెప్పాడు హనుమంత.
మేము అన్నపూర్ణమ్మ వద్దకు వెళ్లాం. నన్ను చూసి, చేయి ఊపింది. దగ్గరగా వెళ్లాను. నా చేయి పట్టుకుని, అన్నపూర్ణమ్మ చనిపోయింది. మేము గతుక్కుమన్నాం. తేరుకోడానికి మాకు చాలా సమయం పట్టింది.
ఆ పిమ్మట.. తదుపరి కార్యక్రమాలు పూర్తి చేశాం. ఇప్పుడు మా నలుగురం అన్నపూర్ణమ్మ ఇంటిని, ఆ హోటల్ ని, తన బ్యాంక్ అకౌంట్ మొత్తాన్ని, తన జ్ఞాపకార్థంగా ఓ ఛారిటీకి దఖలుపరచడానికి పూనుకుని తిరుగుముఖం పట్టాం. అన్నపూర్ణమ్మ జ్ఞాపకాలతో భారంగా …
***