అడవి మల్లి  (Author: సింగీతం విజయలక్ష్మి)

బుల్లెట్టు బండి స్పీడుగా పోతోంది. తన ముందర కూర్చొన్నదెవరో తెలియడం లేదు. ఎందుకంటే తన కళ్ళకు గంతలు కట్టబడి ఉన్నాయి. చేతులు వెనక్కు కట్టబడి ఉన్నాయి. కనీసం ఏ వైపుగా వెళుతున్నామో తెలుస్తుందేమో అని ఆశగా చెవులు రిక్కించి వింటోంది. గాలి హోరు తప్ప మరేమీ వినిపించడం లేదు. నోరు తెరచి ఏదీ అడగకూడదన్న వార్నింగ్. అనన్య మనసుకు ఏదీ అంతు చిక్కకుండా ఉంది. తనను తాను నియంత్రించుకొంది. ఏదేమైనా తనకుతానుగా తీసుకొన్న నిర్ణయం. వెనుకంజ వేయకూడదు అని గట్టిగా అనుకొంది. బండి ఆగింది.

“దిగు” అనగానే దిగేసింది. చేతులకు కట్టిన కట్లు విప్పబడ్డాయి. తన చేతులతో కళ్ళకు కట్టిన గంతలు విప్పుకొనే లోపే బుల్లెట్ బండి వెళ్ళిపోయింది. కళ్ళు తెరచి చూసింది. తానెక్కడ ఉన్నదీ అన్న విషయం అర్థం కాలేదు.

నియమం ప్రకారం ఆరు గంటలు తను ఈ అడవిప్రాంతం లోనే తిరుగుతూ శోధించాలి.

కారుమబ్బులు కమ్ముకొన్న కటిక చీకటి. నీరవ నిశీథిలో నిశ్శబ్దం వికటంగా నవ్వుతున్నట్టు ఉంది. అనన్యలో అంతర్మథనం మొదలైంది. నిబ్బరంగా ముందడుగు వేయలేకపోతోంది. లేనిపోని భేషజాలకు పోయి సమస్యలలో ఇరుక్కొంటున్నానేమో అని బెంబేలు పడసాగింది. అదీ ఒక్క క్షణం మాత్రమే. వెంటనే ఆమెలో స్థైర్యం స్థిరనివాసం ఏర్పరచుకోసాగింది.

“ధైర్యే సాహసే లక్ష్మీ” అనుకొని ముందుకు సాగింది. అమ్మ చెప్పే మాటలు మననం చేసుకొంది. ‘జీవితంలో ఎప్పుడైనా భయమనే ఊబిలో చిక్కుకొని పోకూడదు. మనం ఆందోళన పడకుండా అనంత విశ్వాసంతో ఆలోచనా స్ఫూర్తితో మనలనే కాకుండా మన చుట్టూ ఉన్న వారిని కూడా సమస్యల సుడిగుండం నుండీ బయటకు లాగగలగాలి. వృథా ప్రయాస ఎందుకులే అని మిన్నకుండిపోతే జీవితంలో మిగిలేది వ్యథ మాత్రమే. ప్రయత్నం చేస్తే ప్రకాశం కనబడుతుంది. ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి పరిపూర్ణతను సాధించాలి. చీకటి తెరలు తొలగించుకొని వెలుగు దిశగా సాగి పోవాలి’. అనుభవంతో పండిన అమ్మ పలుకులు తన కెప్పుడూ ఆణిముత్యాలు.

చీకట్లో చరవాణి ద్వారా వచ్చే కాంతి సహాయంతో అడుగులో అడుగు వేస్తూ నడుస్తోంది. ఆ అడవి ఒక పద్మవ్యూహం లాంటిదట. ఒకసారి లోపలికి వెళితే అసలు బయట పడలేమట.

అంతేకాకుండా భయానక పరిస్థితులు కూడా ఎదుర్కోవలసి ఉంటుందంటూ ముందే హెచ్చరించారు కళాశాలలో సీనియర్స్. అయినా తానేమీ భయపడలేదు సరిగదా సవాల్ చేసి మరీ వచ్చింది.

         ఆరోజు హాస్టల్ లో సీనియర్స్ జూనియర్లను ర్యాగింగ్ చేయడానికి వచ్చి వాళ్ళ మాటలు విని తీరాలన్న హుకుం జారీ చేశారు. ఐతే గుడ్డిలో మెల్ల అన్నట్టుగా తమకు రెండు ఛాయిస్ ఇచ్చారు. ఒకటి సీనియర్స్ ప్రాజెక్టు వర్క్ రికార్డులన్నీ జూనియర్స్ రాసి పెట్టాలి. రికార్డు వర్క్ చాలా ఉంటుంది. రాత్రి పగలు కూర్చొని రాసినా కూడా కనీసం పదహైదు రోజులు పడుతుంది. దానితోనే తమ విలువైన సమయం అంతా వృథా అయిపోతుంది. ఎంతో ప్రయాసలకు ఓర్చుకొని ముగించి ఇచ్చినా కూడా అంతటితో ర్యాగింగ్ ముగిసిపోదు. మళ్ళీ మళ్ళీ అవస్థలకు గురి చేస్తూనే ఉంటారు. అలా వద్దు, అంటే వాళ్ళు తమను ర్యాగింగ్ చేయకూడదు అంటే, రెండవది, తమలో ఒకరు ఎవరైనా పద్మవ్యూహం లాంటి అడవిలో ఎన్నో భయానక పరిస్థితులను ఎదుర్కొని కొన్ని విశిష్ట జాతి మొక్కలు సీనియర్స్ పరిశోధనల కోసం తీసుకురావాలి. కాలేజి పరిశోధనలకు అవసరమయ్యే విశేష జాతి మొక్కలు ఆ అడవిలో ఎవరూ పీకడానికి కుదరదట. ఆ మొక్కలను నిధిలాగ సంరక్షించుకొంటూ ఏవో అసాధారణ శక్తులు తిరుగుతుంటాయట. అవి దైవికశక్తులో లేక దుష్టశక్తులో ఎవరికీ అంతుబట్టడం లేదట. ఆ అడవిలో వెళ్ళినవాళ్ళెవరూ తిరిగి వచ్చిన చరిత్ర లేదట. ఆనాటి సంఘటన అనన్య మదిలో మెదిలింది.

         ***

         “కష్టమో నష్టమో మొదటి ఆప్షన్ ఎంచుకొందాం. ఆ కారడవిలోకి ఎవరూ కూడా పోవద్దు” అన్నారు కొంతమంది.

         “అనన్యా, నాకు భయమేస్తోంది. ఎందుకొచ్చిన తంటా. నేను చదువు ఆపేసి మా ఊరెళ్ళి పోతాను” అన్నది వారుణి.

         “అవును. నేను కూడా ఈ కాలేజి మానేస్తా. ఇక్కడే ఉండి అంతోటి రికార్డు రాయలేను. చేతులు నొప్పెడతాయి. అదీ కాకుండా అవి రాస్తే మన చదువు సాగదు. సెమిస్టర్ పరీక్షలు సరిగా రాయలేము. అత్తెసరు మార్కులు తెచ్చుకొని తల్లిదండ్రుల తిట్లు భరించలేము” అన్నది రశ్మిక.

         “నేను ఇక్కడే ఉండి రికార్డులు రాస్తూ నా నిద్ర తగ్గించి కష్టపడి చదివి సెమిస్టర్ మంచి మార్కులు తెచ్చుకొంటా” అన్నది మైత్రేయి. మిగతావాళ్ళు వంత పాడారు.

         “మీరెన్నయినా చెప్పండి. నేను ఆ అడవిలోకి వెళతాను. అనుకొన్నది సాధించుకొని వస్తాను. ఒక్కరోజు, అదీ ఒక్క రాత్రి భయాన్ని దూరంగా నెట్టేసి ఆ మొక్కలను నేను పట్టుకొస్తాను. మీరందరూ ధైర్యంగా ఉండండి. నేనీ పని సాధించి మీకు కూడా కష్టం లేకుండా చేస్తాను. ఒక్కరోజు ఓపిక పట్టండి. నేను వెళ్లి సీనియర్స్ తో మాట్లాడి వస్తాను” అంటూ వెళ్ళింది అనన్య. అనన్య ధైర్యానికి అందరూ చేష్టలుడిగి చూస్తుండిపోయారు.

         ***

         అప్పటి విషయాలను తలచుకొంటూ నడుస్తున్న అనన్య ఉన్నట్టుండి కాలు బెణకడంతో దొర్లి క్రింద పడింది. చేతిలోని చరవాణి ఎగిరి దూరంగా పడింది. పడిన చోటునుంచి తలెత్తి చూసింది అనన్య. దూరంలో ఏదో పొగమంచులా ఆకారం కదలడంతో అనన్య గుండెల్లో వణుకు పుట్టింది. అయినా కళ్ళు నులుముకుని బాగా పరికించి చూసింది. మర్రిచెట్టు ఊడలు జోరు గాలికి కదులుతూ ఊడలతోబాటు వాటికి అల్లుకుని ఉన్న కొన్ని తీగలు అక్కడేదో మానవాకారమే కదులుతున్నట్టు భ్రమింప చేస్తోంది. అనన్య నెమ్మదిగా స్థిమితపడింది. అలాగే పాకుతూ ముందుకు వెళ్ళి చరవాణి అందుకోబోయింది. మొబైల్ కాంతి ప్రసరించిన దిశలో ఆ కాంతికి అటువైపు దూరంగా గుబురు పొదలచాటుగా ఎవరివో పాదాలు కనబడ్డాయి. ఆమె క్రింద పడి ఉండడం మూలంగా పొదలు అడ్డంగా ఉండడంవల్ల నల్లని వస్త్రం క్రింద పాదాలు మాత్రం కనబడి ఎవరో అక్కడ నిలబడి ఉన్నట్టు ఆనిపించింది. ఆ ప్రదేశమంతా చిమ్మ చీకటిగా ఉంది. తను వచ్చిన దారి అసలు అర్థం కాలేదు. కాలు సవరించుకొని లేచి నిలబడి తడుముకుంటూ ముందుకు వెళ్ళి చరవాణి అందుకొని కాంతిని తన ముందువైపుకు ప్రసరింపజేసింది. ఏదైతే అదే అవనీ అనుకొంటూ పాదం కనిపించిన గుబురు పొదల వైపుగా ధైర్యంగా అడుగు వేసింది. కొద్ది దూరం వెళ్ళగానే సరిగ్గా ఆ పొదల దగ్గరనుండి ఏదో నల్లటి ఆకారం కదులుతూ తనవైపు వస్తూ కనిపించింది. అనన్యకు కొంత అర్థమైనట్లు అనిపించి బాగా ధైర్యం వచ్చింది. ఠక్కున ఏదో ఆలోచన మెరిసింది. ఆ ఆకారం దగ్గరకు రాగానే మొబైల్ లైట్ ఆ ఆకారం వెనుకవైపుకు ప్రసరింపజేసి తొంగిచూస్తూ బాగా భయపడుతున్నట్టు నటిస్తూ, “తె... తె... తెల్ల దయ్యం” అంటూ అరిచింది.

         ఆ నల్లటి ఆకారం తల తిప్పి వెనుకకు చూసింది. అదే అదనుగా అనన్య ముందుకురికి తన చేతులను కత్తిగా మార్చి ఆ ఆకారం మెడ వెనుక భాగాన గట్టిగా ఓ దెబ్బ వేసింది.

         ఆ దెబ్బకు ఆ ఆకారం స్పృహ తప్పి క్రింద పడిపోయింది. దగ్గరికెళ్ళి నల్లటి ముసుగు తీసి చూస్తే ఆ ఆకారం ఒక అమ్మాయి. ఎందుకైనా మంచిదని ముందస్తుగా ఆ అమ్మాయి నోరు, చేతులు కాళ్ళు కట్టి పడేసింది. ఆమెను అక్కడే వదిలేసి సీనియర్స్ చెప్పిన ఆ విశేషమైన మొక్కలకోసం వెదుకుతూ ముందుకు బయలుదేరింది. వెళుతూ వెళుతూ తన దగ్గరున్న సంచీలో నుండి ముగ్గుపిండి ప్యాకెట్ తీసి తను వెళ్ళే దారి పొడవునా ముగ్గుపిండి చల్లుకొంటూ వెళ్ళింది. చాలా దూరం నడిచాక ఎర్రరంగు చిట్టి చిట్టి పూలతో సీనియర్స్ చెప్పిన ఆ మొక్కలు ఓ నాలుగైదు చోట్ల గుంపులు గుంపులుగా కనిపించాయి. ఆనవాలు సరిగ్గా సరిపోయింది. చకచకా అవి కోసుకొని ముగ్గుపిండి గుర్తులు సరిచూసుకొంటూ ఆ అమ్మాయిని కట్టి పడేసిన చోటుకు తిరిగి వచ్చింది.

         అప్పటికే ఆ అమ్మాయి కట్లు విప్పుకోవాలని శతవిధాల ప్రయత్నిస్తోంది. అనన్య రాగానే ఏదో చెప్పాలన్నట్టు తల ఆడించింది. ఆమె నోటికి కట్టిన గుడ్డ ముక్క ముడి విప్పింది అనన్య.

         “ఇప్పుడు చెప్పు. ఎవర్నువ్వు? ఏమిటీ నాటకాలు?” అని అడిగింది అనన్య.

         “నా పేరు మల్లిక. ఈ ప్రాంతంలో చాలావరకు రకరకాల మొక్కల్లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. వాటిని ఔషధంగా చేసి వాడితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. సర్జరీ అవసరం లేకుండా శరీర అవయవాలు సరిచేయవచ్చునట. ఇవి మన భారతదేశంలో ఈ ప్రాంతంలో ఈ అడవిలో మాత్రమే లభిస్తాయి. ఇది మా తాత ముత్తాతలనుండి మాకు లభించిన జ్ఞాన సంపద. మా వెనుకటి తరాలవారు చాలామందికి ఈ మొక్కల ద్వారా తక్కువ ఖర్చులో అనేక రకాల వ్యాధులు గుణం చేస్తూ వచ్చారు. మా తరంలో కూడా ఇదే చెయ్యాలని నిర్ధారించుకున్నాము. కానీ విషయం తెలుసుకొన్న కొన్ని దుష్టశక్తులు ఈ మొక్కలను దొంగిలించాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఎవరినీ ఇటువైపు రానివ్వకుండా చేయాలని మా కుటుంబమంతా కలిసి మాకున్న ఈ ఆస్తులను కాపాడుకునేందుకు ఇలా ప్రతినిత్యం ఒక కొత్త నాటకం ఆడుతుంటాము” అన్నది మల్లిక.

         “ఇవే కదా ఆ మొక్కలు” అడిగింది అనన్య తన చేతిలోని మొక్కలు చూపిస్తూ.

         “అవును. కానీ ఇవొక్కటే కాదు, ఇంకా చాలా రకాలున్నాయి” అన్నది మల్లిక.

         “మల్లికా, ఈ మొక్క గురించి మా సీనియర్స్ చెప్పారు. వాళ్ళు కాలేజిలో ఈ మొక్కలపైనే పరిశోధనలు చేస్తున్నారట. మమ్మల్ని ర్యాగింగ్ చేయకూడదంటే ఈ మొక్క తెచ్చి ఇవ్వాలని కండీషన్ పెట్టారు. అదే పనిమీద నేను ఇక్కడకు వచ్చాను” అన్నది అనన్య.

         “నీవు ధైర్యవంతురాలివి. నీ తెలివితో నన్ను పడగొట్టి అనుకొన్నది సాధించావు. మొక్కలు మంచికి ఉపయోగపడితే సంతోషమే. కానీ కేవలం డబ్బు సంపాదించాలనే దుష్టశక్తులకు చిక్కకూడదని మా ప్రయత్నం” అన్నది మల్లిక.

         “ఈ మూలికలతోపాటు మల్లిక అనే అడవి మల్లి స్నేహం దొరికింది” అన్నది అనన్య నవ్వుతూ.

         ఇంత జరిగేలోపు తెల్లగా తెల్లారిపోయింది. మల్లిక సాయంతో ఆ అడవి బయటకు వచ్చి హాస్టల్ చేరుకొన్నది. మొక్కలు సీనియర్స్ చేతుల్లో పెట్టింది.

         సీనియర్స్ ఆమె ధైర్యానికి సంతోషించి అభినందించారు. ఐతే వాళ్ళ అభినందనలను స్వీకరించే మూడ్ లో లేని అనన్య సీనియర్స్ ను ఒకే ఒక ప్రశ్న అడిగింది.

         “ఏ ధైర్యంతో నన్ను పద్మవ్యూహంలాంటి అడవిలో వదిలి పెట్టారు? మీ ర్యాగింగ్ భూతం వల్ల అక్కడే నా జీవితం అంతం అయిఉంటే ఏం చేసేవారు?” అని సూటిగా ప్రశ్నించింది.

         “మేము అవన్నీ జాగ్రత్తలు తీసుకునే పంపించామని నీకు తెలుసా? మొదటినుండీ నీ సాహస చరిత్ర అంతా తెలుసుకొనే నిన్ను పంపించే సాహసం చేసాము” అన్నారు సీనియర్స్.

         “ర్యాగింగ్ అనేది అన్ని విద్యా సంస్థల్లోనూ నిషేధం. దీనివల్ల విద్యార్థుల జీవితం నాశనం అవ్వకూడదనే నిషేధించారు. ఒకవేళ ఉన్నా అది విద్యార్థుల మధ్య స్నేహం పెంచేదిలా ఉండాలి గానీ ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు” అన్నది అనన్య. కళాశాల ఆవరణం చప్పట్లతో మారు మ్రోగింది. విషయం తెలుసుకున్న అందరూ అనన్యను అభినందించారు.

         ***

0 Comments