హైదరాబాద్ హరిదాసు  (Author: కర్లపాలెం హనుమంతరావు)

సుబ్బరాజు గారింట్లో దొంగతనం జరిగిందని ఫిర్యాదొస్తే విచారించటానికని వెళ్ళాం. పోయింది ఒక ఉంగరమే. కాని, దాని ఖరీదు 'ఐదు లక్షలు'!

"విలువ సంగతి అట్లా ఉంచి అది మా కుటుంబానికి అచ్చొచ్చిన ఉంగరం. పిల్ల పెళ్ళి పెట్టుకున్నాం. ఇప్పుడిట్లా జరగడం ఏదో అశుభంగా తోస్తోంది" అన్నాడు సుబ్బరాజుగారు మధన పడుతూ.

ఇంట్లోని ఇంతకన్నా విలువయిన వస్తువులన్నీ అట్లాగే ఉన్నాయి. ఈ ఒక్క ఉంగరమే మాయమయిపోవడానికి ఏదో బలమైన కారణమే ఉండుంటుంది. అది కనుక్కోవడమే పోలీసులుగా మా పని!

సుబ్బరాజుగారు ప్రముఖ ఆరక్ కంట్రాక్టర్. జీడమెట్ల ఏరియాలో ఇంకేదో పరిశ్రమా ఉంది. సినిమా నిర్మాణంతో సంబంధాలున్నాయి. రాజకీయంగా ఎంతో పలుకుబడి కూడా ఉన్న పెద్దమనిషి ఫిర్యాదుని తేలిగ్గా తీసుకోలేం గదా!

సుబ్బరాజుగారు కుటుంబసమేతంగా బెంగుళూరు వెళ్ళినప్పుడే ఇంట్లో ఈ దొంగతనం జరిగింది. సహజంగానే ముందు అనుమానం ఇంటి పనిమనషుల మీదకు మళ్ళింది.

"ఆ రెండురోజులూ పనివాళ్ళనెవర్నీ రావద్దన్నాం. బైట వాచ్ మేన్, కేర్ టేకర్ వెంకటేశ్వరావుగారూ, ఇంట్లో ఉండే మంగమ్మా తప్ప ఎవరూ లేరు" అన్నాడు సుబ్బరాజుగారు.

వెంకటేశ్వరావు గారుండేది ఔటుహౌసులో. కుటుంబం లేదాయనకు. అయినా అక్కడా గాలించాము. అనుమానించదగిందేమీ కనిపించలేదు.

పెద్దవాళ్ళ ఇళ్ళల్లో సి. సి. కెమెరాలు వాడతారు దొంగల భయాలు ఎక్కువైపోయి. సుబ్బరాజుగారింట్లో కూడా అట్లాంటి ఏర్పాటు ఉండటం వల్ల ఆ రెండు రోజుల్లో ఆ ఇంటికి జరిగిన రాకపోకల్ని గమనించడానికి వీలైంది.

మొదటిరోజు ఉదయం పనమ్మాయి ఇల్లు శుభ్రం చేస్తున్నప్పుడు బైట నుంచీ ఏదో పద్యం వినిపించింది కాసేపు. భాగవతంలోని గజేంద్ర మోక్షంలోని పద్యం అది. రాగయుక్తంగా శ్రావ్యంగా పాడుతున్నారెవరో.

"లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె బ్రాణంబులున్ ఠావుల్ దప్పెను మూర్ఛ వచ్చె దనువున్ డస్సెన్ శ్రమం బయ్యెడిన్...' ఇంతలో పద్యాన్ని మాటేదో మింగేసింది. ఆ గొంతు గూర్ఖాది. పనమ్మాయిల దోసిట్లో ఏదో పట్టుకుని బైటికి వెళ్ళి రావడం కనిపించింది. తిరిగొచ్చేటప్పుడు ఆమె చేతులు ఖాళీగా ఉన్నాయ్!

"శుక్రవారం మార్చి శుక్రవారం'హైదరాబాదు హరిదాసు' వస్తాడయ్యా! ఆ దాసు వచ్చినప్పుడల్లా అమ్మగారింట్లో ఉన్నా లేకపోయినా ఓ దోసెడు బియ్యం అక్షయ పాత్రలో ఎయ్యడం ఎప్పుడూ చేసేదే. అందుకే ఏసాను. అదీ తప్పే!" అంటూ దీర్ఘాలు తీసింది పనమ్మాయి.

'హైదరాబాదు హరిదాసా'! ఈ పేరే ఏదో విచిత్రంగా ఉంది వినటానికి. అయినా ఇదేమీ సంక్రాంతి సీజను కూడా కాదే! ఇప్పుడు హరిదాసు రావడమేంటి?!

ముందు ఈ హైదరాబాద్ హరిదాసు సంగతేంటో కనుక్కోమని ఎస్సై హరివారాయణకు పురమాయించాను. రెండు రోజుల్లో ఓ సమాచారం కొంత వచ్చింది.

"హైదరాబాద్ హరిదాసు పెట్టుడు పేరు. అసలు పేరు కృష్ణదాసు. అన్నీ కృష్ణుడికి సంబంధించిన పాటలూ, పద్యాలే పాడుతుంటాడు. అందుకూ ఆ పేరు. కమ్మటి గొంతు. పాడుతుంటే వినే వాళ్ళు ఆ భక్తి పారవశ్యానికి ఎంత అర్జెంటు పనిలో ఉన్నా ఒక్క క్షణం నిలబడి ఆలకించాల్సిందేట.. తెల్సిన వాళ్ళు చెప్పారు సార్" అన్నాడు హరినారాయణ.

"ఓ.. ఆ దాసా!" అన్నాడు అక్కడే ఉన్న హెడ్ కానిస్టేబుల్ రాములు. స్టేషన్లో కూడా ఒక నైటు సెల్ ‌లో ఉన్నాడు రెండేళ్ళ క్రిందట. విద్యానగర్ ప్రొఫెసర్ గారి పాప కనిపించకుండా పోయిన కేసులో తెచ్చి విచారించాం సార్! లాకప్పులో కూర్చుని రాత్రంతా ఏవేవో పాటలూ పద్యాలూ పాడాడు సార్! అప్పటి ఎస్సై పాండురంగారావుగారికి కూడా పద్యాల పిచ్చి. ఇద్దరూ కలిసి నైటంతా మాకు 'శ్రీకృృష్ణ రాయబారం' నాటకం చూపించారు. "

"మరప్పుడా పంతులు అనుపానులు కనుక్కోలేదా?" అనడిగాను.

"లేదు సార్. వట్టి గంగిగోవు లాగున్నాడు. తెల్లారి తలా ఒక పది రూపాయలేసుకుని సంభావనిచ్చి పంపించాం" అన్నాడు రాములు.

"ఆ హరిదాసు హైదరాబాదులోనే తిరుగుతుంటాడు సార్! వారాల వంతుల ప్రకారం కాలనీల కొచ్చి పోతుంటాట్ట. నిన్న విజయ్ నగర్ కాలనీలో పురాణం చదివాట్ట. రమణమూర్తి అని ఇదివరకు టీవీల్లో, సినిమాల్లో వేషాలు వేసిన ఆర్టిస్ట్. ఆయన తల్లి ఆఖరి దశలో ఉందంటే వచ్చి పోతన భాగవతం చదివి పోయాట్ట" అన్నాడు ఎస్సై హరినారాయణ.

"నిజమే సార్ | మంచి విద్వత్తూ సంగీతజ్ఞానం. ఆ రాగాలూ తాళాలూ తప్పుల్లే కుండా పాడే పద్ధతి చూస్తే నిజంగా ఏ దేవలోకం నుంచో దిగొచ్చిన నారదుడు... తుంబురుడు లాగా అనిపిస్తాడు. టీవీల్లో రేడియోలో పాడితే రాణించేవాడు. ఎందుకో మరి ఇట్లా ఇళ్ళ గేట్లు పట్టుకుని వేలాడుతుంటాడు" అన్నాడు రాములు.

రమణమూర్తిని ఫోన్లో విచారించినప్పుడు "మేం అతన్ని ఎక్కడ పట్టుకోవచ్చు?" అనడిగాను. ఇంకా నా అనుమానం హరిదాసు మీద నుంచీ పూర్తిగా తొలగిపోలేదు. "ఆ దాసు భగవద్గీత శ్లోకాలు ఆలపిస్తుంటే మా అమ్మ మొహంలో కనిపించిన ప్రశాంతతను మర్చిపోలేను. అందుకే పెద్దకర్మ రోజుకు రమ్మని పిలిచా. వస్తాడనుకుంటా!" అన్నాడు రమణమూర్తి.

మూర్తిగారి తల్లి పెద్దకర్మ ఎప్పుడో ఎక్కడో కనుక్కుని హరిదాసు మీదో కన్నేసి ఉంచేపని రాములుకు అప్పగించాను. రాములు తెచ్చిన రిపోర్టు వింతగా ఉంది. "ఆ దాసు వచ్చాడుసార్! పొద్దుట్నుంచీ ఒహటే పురాణపఠనం. ఏదో గరుడ పురాణంట. అరటి పండు వలిచి చేతిలో పెట్టినట్లు చెపుతున్నాడందులోని విశేషాలు. ఆ టైములో ఎట్లా డిస్టర్బ్ చెయ్యాలో తెలీలేదు. చివర్లో మాత్రం మీ ఇంటి అడ్రసు ఇచ్చి ఒకసారి కలిసి పొమ్మని చెప్పి వచ్చాం" అన్నాడు రాములు.

"నువ్విచ్చిన అడ్రస్ ఒక పోలీసాఫీసరుదని తెలిస్తే వస్తాడా! నువ్వే అతన్ని దగ్గరుండి తీసుకురావాల్సింది" అన్నాను అసంతృప్తిగా.

"అమ్మగారికి అన్నమాచార్యులువారి కీర్తనలంటే చాలా ఇష్టంగా సార్! ఆయన జయంతి రోజు రేపే గదా! ఒకసారి వచ్చి అమ్మగారిని కలిసి మెప్పిస్తే మంచి సంభావన ఇప్పిస్తానని మాట ఇచ్చాను సార్!" అన్నాడు రాములు.

రాములు వయసులో చాలా పెద్దవాడు. మా ఇంటి సంగతులు బాగా తెలిసినవాడు. ఆ అదివారం హరిదాసు మా ఇల్లు వెదుక్కుంటూ వచ్చాడు.

రాములు చెప్పిన మాట నిజమే. చూడగానే ఆకర్షించే విగ్రహం. నిలువు నామాలు, పట్టు వస్త్రాలు, పైన శాలువ, మెళ్లో మరువం దండ, నెత్తిమీద అక్షయపాత్ర. మగ్గిన కమలాపండు రంగులో ఉన్నాడు. వాచికంలో స్పష్టత, గొంతులో మాధుర్యం. అతని సంగీత ప్రావిణ్యానికి మా శ్రీమతి బాగా ఇంప్రెస్ అయిపోయింది.

'ఎంత మాత్రము ఎవ్వరు దలచిన అంత మాత్రమె నీవు | అంతరాంతరము లెంచి చూడు పిండంతే నిప్పటి యన్నట్లు...' అని హరిదాసు భక్తిపారవశ్యంతో పాడుతుంటే పక్క ప్లాట్ల వాళ్ళు కూడా వచ్చికూర్చున్నారు. అడిగిందే తడవుగా తడుము కోకుండా అడిగిన కీర్తనలను పాడేస్తుంటే అన్నమాచార్యులవారే మా నట్టింట్లో కొలువైనట్లనిపించింది.

'ఈ మనిషిని అనుమానించడం సబబేనా?' అన్న మధన మొదలయింది నాలో. ఏమైనా డ్యూటీ డ్యూటీనే.

సుబ్బరాజుగారు ఇంట్లో లేనప్పుడు ఆ ఇంటికి పిలిపించింది ఎవరు? పనిమనిషి నిజంగానే ఎప్పటిలాగే గుప్పెడు బియ్యంతో సరిపెట్టిందా? మామూలుగా ఇంటి యజమానులు ఇంట్లో లేనప్పుడు బిచ్చగాళ్ళకి అంత చొరవగా దానాలు చేసే ఆసక్తి పని మనుషులు చూపించరు. సుబ్బరాజుగారు పోయిందంటున్న ఉంగరం పూజ గదిలో దేవుడి ముందు ఉండేది. ఊరికి వెళ్ళేముందు ఆ గదికి తాళం వేసుకొని వెళ్ళామని సుబ్బరాజుగారు చెబుతున్నారు. వేసిన తాళం వేసినట్లే ఉన్నప్పుడు లోపలి వస్తువుకి మరి రెక్కలు ఎలా మొలిచినట్లు?!

హఠాత్తుగా పాట అగిపోవడంతో ఈ లోకంలోకి వచ్చిపడ్డాను. ఎదుటి మనుషుల్లో ఏ మాత్రం అనాసక్తి పసిగట్టినా వెంటనే పాట ఆపేస్తాడుట ఈ హరిదాసుగారు. అన్నీ వింత అలవాట్లే! సుమారు గంటన్నర సేపు సాగింది మా ఇంట్లో దాసుగారి గాన కచేరి. మామూలుగా దానధర్మాలంటే అంతగా ఆసక్తి చూపించని మా అర్ధాంగి నా చేత అర్థవెయ్యి నూటపదహార్లు, పంచెల చాపు ఇప్పించింది పంతులుగారికి.

యధాలాప సంభాషణలో హరిదాసుగారి నోటి నుంచి కొంత సమాచారం రాబట్టగలిగాను నా పోలీసు తెలివి చూపించి. ఈ హరిదాసుది మంగళగిరి దగ్గర ఏదో చిన్న పల్లెటూరు. చిన్నప్పుడు వాళ్ళ ఊళ్ళో 'భక్త ప్రహ్లాద' నాటకంలో బాల ప్రహ్లాదుడి వేషం కట్టాడుట! నాటకాల పిచ్చిలో పడి చదువుని అటకెక్కించేసాడు. పదోతరగతి పోయినా... పద్యాలూ పాటలూ ఒక్కసారి వింటే చాలు ఇట్టే పట్టేసే కళ మాత్రం అట్లాగే ఉందిట! తొమ్మిదోతరగతిలో తెలుగువాచకంలోని ‘రుక్మిణీ కళ్యాణం' లోని 'భూషణములు చెవులకు బుధ తోషణములు' పద్యం బిగ్గరగా చదువుతుంటే పక్క క్లాసులోని ఇంగ్లీషు టీచరు శోభారాణి గారు పిలిపించుకుని అందరి ముందు తన తల్లోని పువ్వు తీసి ఇచ్చిందని ఇప్పుడు చెప్పుకుని మురిసిపోయాడు పిచ్చి బ్రాహ్మడు.

"మీ అసలు పేరేంట"ని అడిగితే 'కనకయ్య' అని చెప్పాడు. 'నాటకాల్లో తను ఎక్కువగా వేసిన కృష్ణుడి వేషం పాప్యులర్ అయిపోవడం వల్ల అందరూ 'కృష్ణదాసు' అంటారు సార్' అన్నాడు హరిదాసు.

"మరి ఈ హరిదాసు వేషం ఏమిటి?" అనడిగాను అసలు విషయం రాబట్టటానికి. చాలా విషయాలే చెప్పుకొచ్చాడప్పుడు.

"మా నాయన పబ్లిక్ వర్క్స్ డిపార్టుమెంటులో ప్యూప్యూను సార్. క్షయవ్యాధి వచ్చి, తగ్గించుకొనే డబ్బు లేక చచ్చిపోయాడు. మా అమ్మ పోరు భరించలేక నేనాయన ఉద్యోగంలో చేరాను. అప్పుడే పెళ్ళయింది. నాటకాల పిచ్చి మరీ ముదిరింది. విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల్లో జరిగే ఊరేగింపులో ప్రతి ఏటా నేనే కృష్ణుడి వేషం కట్టేది. అన్యమతస్తుడు నా పై అధికారి. నా మీద కక్ష గట్టాడు. నన్ను ఉద్యోగంలో నుంచి వూడబెరికించిందాకా నిద్రపోలేదు. నాకు ఏడేళ్ళ పాప. ఇల్లు పట్టకుండా తిరుగుతున్నానని అలిగి పిల్లతో ఎటో వెళ్ళిపోయింది మా ఆవిడ. అమ్మే నన్ను చివరిదాకా కనిపెట్టుకుని ఉన్నది. అందుకే అమ్మంటే నాకు చాలా ఇష్టం. ఆమె పోయిన తరువాత ఆ భారమూ వదిలిపోయింది. తెగిన గాలిపటంలా ఎటో ఎటో తిరుగుతూ చివరికి ఇక్కడ ఇట్లా తేలాను సార్!"

"అది సరే! ఈ హరిదాసు వేషం?!"

"నాకు వచ్చిన విద్య పాటలూ పద్యాలూ పాడటం. ఈ వేషం పిడికెడు కూడు పెట్టడానికి. ఇప్పటి జనం పాత పాటలూ పద్యాలూ ఇష్టపడుతున్నారు. ఒకసారి ఇట్లాగే రైల్లో పోతూ ఊంఛ వృత్తి సౌందర్యాన్ని గురించి శ్రీత్యాగరాజస్వామి వారు ఆలపించిన దివ్యనామ సంకీర్తన 'హరిదాసు వెడలె ముచ్చట ఆనందమాయె దయాళో' అని పాడుకుంటుంటే ఎదుటి సీట్లోని సాహెబుగారొకాయన లేచి వచ్చి అమాంతం నన్ను ఆలింగనం చేసుకొని చేతిలో ఓ యాభై రూపాయల నోటు పెట్టాడు. అప్పటి నుంచి ఇట్లా పాడుకొంటూ జీవిక గడుపుకోవటమే వృత్తిగా ఎంచుకున్నా' అన్నాడు హరిదాసు.

"అది సరే! సీజనుతో సంబంధం లేకుండా ఇట్లా వేషం వేస్తే జనం నమ్ముతారా?" అని అడిగాను..

"సార్! ఈ కాలంలో జనాలకు అన్నిటిలో వెరైటీ కావాలి. చివరకు పాతకాలం నాటి పాటలలో కూడా కొత్తదనం కోరుకొంటున్నారు. మరీ మైకేల్ జాక్సన్ మోడల్లోనో, అద్నాన్ సామీ తరహాలోనో మోడ్రన్ బీట్స్ నా వయసుకీ, తాహతుకూ సరిపడేవి కాదు. పల్లెటూళ్లో కనిపించే హరిదాసు మే మాసం ఎండల్లో కూడా సిటీలో కనిపిస్తే, ఎంత బిజీగా ఉన్నవాళ్ళైనా ఒకసారి ఇటు చూపు సారిస్తారు. హరిదాసు వేషంలో ఉన్న మనిషి సత్యహరిశ్చంద్రుడి నాటకం కాటి సీను పద్యాలు చదివితే బంజారా హిల్స్ లాంటి లోకేలిటీలోని పెద్దవాళ్లకు భలే నచ్చుతుంది. సికిందరాబాద్ వెస్ట్ మారేడ్ పల్లిలో పాతకాలం నాటి కన్నడ కుటుంబాలు ఇంకా కొన్ని ఉన్నాయి. వాళ్ళ కోసం పురందరదాసు పదాలు పాడుతుంటాను.'ఈస బేకు ఇద్దు జయిస బేకు - ఈదవలెను, ఈది నెగ్గవలెను' అని కన్నడ యాసతో పాడుతుంటే వాళ్ళకదో ఆనందం. కాచిగూడ సెంటర్లో ఒక ఫేమస్ బార్ ఉంది సార్! మీకు తెలిసే ఉంటుంది. దాని ముందొకసారి హరిదాసు వేషంలో నిలబడి ముద్దుకృష్ణ అనువాదం చేసిన ఉమర్ ఖయ్యాం గజల్స్ వినిపించా. కాసులే కాసులు. మీరు నమ్ముతారో నమ్మరో గానీ.. ఒక సారి కోటీ వుమెన్స్ కాలేజీ గేటు ముందు నిలబడి కొనకళ్ల వెంకటరత్నంగారి 'రావోయి బంగారిమామ' అంటూ పాడితే... అడపిల్లలు చుట్టూతా మూగి గాల్లో ముద్దులు విసిరారు. ముద్దు మురిపాలతో కడుపు నిండే వయసా నాది! రెండు ముద్దలు కడుపు నిండా తింటా.. ఒక పూటకు 'టాక్ టైము' తగ్గించుకుని పదిరూపాయలు కనికరించమంటే కరిగి నీరయి పోయారు సార్ ధర్మతల్లులు! ' అంటూ చాలా సంగతులు ఎమోషనల్ గా చెప్పుకొచ్చాడు హైదరాబాద్ హరిదాసు.

పోతూ పోతూ మా ఆవిడ ఇప్పించిన 'పంచెలచాపు' మడతల మధ్య నేను దాచి ఉంచిన రెండు వేల నోటు తిరిగిచ్చేశాడు. దాసు బుద్ధి బైటపడుతుందని నేనే మా అవిడకు కూడా తెలీకుండా ఆ నోటు అక్కడ పెట్టించింది. ఇలాంటి మనిషి మీద ఇంకా అనుమానం పెట్టుకుని తిరగట. టైమ్ వేస్ట్ అని ఆ క్షణంలోనే నిర్ధారణ కొచ్చేసాను.

కానీ మర్నాడు రాములు తెచ్చిన సమాచారంతో వ్యవహారమంతా తలకిందులయి పోయినట్లయింది. "సార్! మీరు చెప్పినట్లు నిన్న ఆ హరిదాసుని రోజంతా ఫాలో చేశాం. సాయంకాలం సికింద్రాబాదులో లోకల్ ట్రైన్ ఎక్కినవాడు చీకటి పడేవేళకి చర్లపల్లి శివార్లో దిగిపోయాడు. అక్కడ ఏ ఊరూ లేదు. డొంకలో పడి ఆయన పోయిన దిక్కున ఉన్నది ఒక హరిజన వాడేనంట! అక్కడికి ఈ బాపనాయన ఎందుకు వెళ్ళనట్లో కనుక్కుందామనుకొని వెళదామనుకొంటే.. ఇంతలోనే ఎస్సై గారు తిరిగి రమ్మన్నారు" అన్నాడు రాములు.

"మీ దగ్గర్నుంచి సరైన ఇన్ స్ట్రక్షన్స్ లేకుండా ముందుకు పోవడం మంచిది కాదనుకున్నా సార్!" అన్నాడు ఎస్సై హరినారాయణ సంజాయిషీగా. మర్నాడు తెల్లారుజామునే రాముల్ని తీసుకొని నేనే స్టేషన్ వెహికల్ మీద బైలుదేరాను.

రాములు చెప్పింది నిజం. ఆ ముళ్ళూ రాళ్ళలో బండి నడపడానికి వీలుకాకుండా ఉంది. జీపుని ఒక ఇంటి ముందు నీడలో నిలిపించి కాలినడకన బయలుదేరాం నేనూ, రాములూ. పరగడుపున జనాలు ఉపయోగించే బహిర్భూమి లాగా ఉంది ఆ ప్రాంతమంతా. రెండు మురుగుకాలువలు దాటిం తరువాత గాని రాలేదు హరిదాసు ఉన్నాడని చెప్పిన ఇల్లు.

నిజానికి అది ఇల్లు కాదు. తాటాకులు కప్పిన ఒక చుట్టుపాక. బయట బావి దగ్గర హరిదాసు వంటికి నీళ్ళు పోసుకుంటూ యెంకి పాటలు పాడుకుంటూ కనిపించాడు. "యెంకి వంటి పిల్ల లేదోయి లేదోయి/ యెంకి నా వంకింక రాదోయి రాదోయి/ మెళ్లో పూసల పేరు/ తల్లో పూవులు సేరు/ కన్నెత్తితే చాలు కనకాభిషేకాలు.." ఇలా సాగిపోతుంది హరిదాసుగారి యెంకి నాయుడు బావ పాట.

మధ్యలో కళ్ళెత్తి చూడగానే మేం! కంగారుపడ్డాడు.. కానీ వెంటనే తేరుకున్నాడు హరిదాసు. గబగబ తుండు మొలకు బిగించుకొని నా ఎదుటకు వచ్చి నిలబడ్డాడు.

నిన్న అతన్ని చూసిన ఆకారానికి.. ఇప్పుడు చూస్తున్న రూపానికీ ఎంతో తేడా! పాక లోపలి నుంచి ఒక ఆడమనిషి గొంతు. 'ఏ తీరుగ నను దయతలచెదవో/ ఇల వంశోత్తమ రామా॥ నా తరమా భవసాగర మీదను! నళిన దళేక్షణ రామా'.. ఆర్దత మిళితమైన ఆ రాగం ఉదయపు తేట గాలిలో పాకలో నుంచి తెరలు తెరలుగ తేలివస్తూన్నది. అర్థంకాక హరిదాసు వంక గుడ్లురిమి చూశాను. అర్థం చేసుకొన్నట్లున్నాడు.. నిశ్శబ్దంగా పాకలోకి దారి తీశాడు. వెనకనే నేనూ రాములూ.

పాకంతా చీకటి. చీకు వాసనతో డోకు వచ్చేటట్లుంది లోపల. ఒక మూల గుడ్డి దీపం. రాత్రంతా బలహీనంగా వెలిగినందుకు గుర్తుగా పొగచూరి ఉంది. ఆ మసక వెలుతురులోనే మూలనున్న కుక్కి మంచంలోని శాల్తీ నుంచి ఇందాకటి రామదాసు కీర్తన తేలివస్తున్నది.

మా రాకను ఏ మాత్రం పట్టించుకొన్నట్లు లేదా ఆకారం. రాములు అటువైపు టార్చి లైట్ ఫోకస్ చేశాడు. ఆ వెలుతురుల్లో ఆమెను చూసి షాకయ్యా ను. సుబ్బరాజు గారి ఇంట్లో గోడ మీది ఫోటోలో చూపినట్లుంది ఆ ఆకారం.

"ఎవరీమె?" అనడిగాను హరిదాసును గద్దించి. అనుమానం నిర్థారించుకోవాలిగా! హరిదాసు నుంచి బదులు లేదు.

"సుబ్బరాజుగారి తల్లి కదూ?" నేనే అడిగాను అనుమాన నివృత్తి కోసం.

"కాదు సార్! ఆయన అత్తగారు. ఆయన భార్య విమలమ్మగారి తల్లి". హరిదాసు సమాధానంలో బెదురే మాత్రం లేదు.

"అలాగా. అయితే అంత పెద్దాయన అత్తగారు ఇక్కడెందుకున్నట్లో? నువ్వు గానీ ఎత్తుకొచ్చావా?" అనరిచాను అసహనంగా.

"లేదు సార్!! సుబ్బరాజుగారే పంపించారు స్వయంగా."

"ఎందుకు? నమ్మే కహానీయేనా ఇది?'' నా సహనం అంతకంతకూ నశించిపోతోంది.

"నమ్మండి.. నమ్మకపోండి.. మీ ఇష్టం. జరిగింది చెబుతా వినండికాస్త ఓపిగ్గా" అంటూ ఆమె వంటి మీద కప్పిన దుప్పటిని తొలగించాడు హరిదాసు. వళ్ళంతా పుళ్లు.. కుష్టు పుళ్లు! ఆవాసనే ఇందాకట్నుంచీ పాకంతా ఆక్రమించి ఉంది.

హరిదాను ఆ ముసలమ్మ పక్కలో కూర్చుని అనునయంగా ఆమె చేతులు చూపిస్తూ చెప్పుకొచ్చాడు "ఈ తల్లికి కుష్టువ్యాధి. చూశారుగా వేళ్ళన్నీ ఎలా కరిగిపోయాయో. ఇట్లాంటి మనిషిని వాళ్ళ ఇంట్లో పెట్టుకోడానికి ఇష్టపడలేదు సుబ్బరాజుగారు. కూతురికి సంబంధాలు చూస్తున్నారు. అమ్మమ్మకు ఇట్లాంటి రోగముందని తెలిస్తే సంబంధాలొస్తాయా!"

"అందుకని నీ దగ్గర దింపి పోయారా.. కార్పొరేట్ ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తారు గానీ!"

"సుబ్బరాజుగారేమన్నా చిన్నా చితకా మనిషా సార్! ఇవాళ మీడియా ఎంత ప్రో యాక్టివ్ గా ఉందో మీకు తెలీంది కాదు. గుట్టు కోసం ఈ ఏర్పాటు చేసుకున్నారు." హరిదాను వాదన తెలివిగానే ఉంది గానీ.. ఎందుకో నమ్మ బుద్ధి కావడంలేదు.

"పిల్ల పెళ్ళి అయిందాకా ఇక్కడ అట్టే పెట్టే ఏర్పాటు చేసింది సుబ్బరాజుగారే. నేను కేవలం కాపలా మనిషిని మాత్రమే సార్! కావాలంటే క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు"

"ఐదులక్షలు ఖరీదు చేసే ఈ ఉంగరం కూడా ఇచ్చి పంపించారా?" నా మాటల్లో సాధ్యమైనంత వెటకారం చొప్పించి అడిగాను.. ముసలమ్మ మిగిలున్న ఎడం చేతి ఒక వేలుకూ ఉన్న ఉంగరాన్ని చూపిస్తూ.

"ఓ.. ఇదా! అంత ఖరీదైందా?! నాకు తెలిదే! ఇది విమలమ్మ గారు ఇచ్చి పంపించారు. మామ్మగారి కండిషన్ చూస్తున్నారుగా! మనలోకంలో లేరు వారంరోజులుగా. తాతగారు పెళ్ళయిన మొదటి ఏడాది 'మేరేజీ డే' సందర్భంగా ఇచ్చిన ప్రేమకానుకట ఈ ఉంగరం. ఈ మామ్మగారే చెప్పారు. ఉండుండి ఈ ఉంగరం కోసం వలవలా ఏడుస్తుంటే నేనే కబురు పంపించాను. బెంగుళూరు పోయే ముందు వాళ్ళ పనమ్మాయి ద్వారా ఇప్పించే ఏర్పాటు చేశారు విమలమ్మగారు."

సి. సి కెమేరాలో పనమ్మాయి బైటున్న హరిదాసు భిక్షకని తీసుకెళ్లిన దోసిలి బియ్యంలోనే ఈ ఉంగరం ఉందన్న మాట! క్లూ దొరికింది. కేసంతా తెలిమబ్బులా విడిపోయింది.. ఒక్క అనుమానం తప్ప. మరి సుబ్బరాజుగారే స్వయంగా ఎందుకు కంప్లయింట్ ఇచ్చినట్లు?!

"సుబ్బరాజుగారికీ సంగతులేవీ తెలిసుండక పోవచ్చు. అత్తగారంటే ఆయనకు మొదట్నించీ గిట్టదంటారు. ఇల్లరికపుటల్లుడంట గదా ఈయన!" అన్న హరిదాను మాటల్లో నిజాయితీ కొట్టొచ్చినట్లు కనబడుతోంది.

ఇక ఉంగరం గురించి ముందుకు పోకూడదని ఆ క్షణంలోనే నిశ్చయించుకున్నాను. చిత్రంగా సుబ్బరాజగారూ తర్వాత ఆ ఉంగరం గురించి వాకబు చేయనేలేదు. అసలు విషయం ఎస్సై ద్వారా తరువాత తెలిసింది. "మీరు అక్కడికి వెళ్లొచ్చిన మర్నాడే ముసలమ్మ పోయారు సార్! హైదరాబాదు హరిదాసు ఆ ఖరీదైన ఉంగరం తిరిగి సుబ్బరాజుగారి భార్యకు భద్రంగా చేరేశాట్ట!"

"అన్యాయంగా ఒక సద్బ్రాహ్మణుణ్ణి అనుమానించారు మీరు. ఇంటికి పిలిచి భోజనం పెడితేగాని పాపపరిహారం కాదు" అంది మా శ్రీమతి కథంతా విని నిష్టూరంగా. ఇందులో అభ్యంతరం చెప్పాల్సిందేముంది?! కానీ, ఆ హైదరాబాదు హరిదాసు అసలు దాసరి బ్రాహ్మడే కాదుట!

"ఇవాళే తెలిసింది సార్. భాగవతం పద్యాలూ పాటలూ పాడుకుంటూ తరతరాలుగా పొట్టపోసుకొనే బుడగ జంగాలంట సార్!" అన్నాడు మర్నాడు ఎస్సై హరినారాయణ. అయినా సరే, హైదరాబాదు హరిదాసు గారికి మేము ఇచ్చే ఆతిధ్యం ఆపదలుచుకోలేదు. కులానిదేముంది? గుణం ప్రధానం కానీ.

సుబ్బ 'రాజు' గారు.. హైదరాబాదు హరి 'దాసు'.. ఈ ఇద్దరూ ఇందుకు ఉదాహరణే.

0 Comments

సంక్రాంతి సంచిక

అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)


సంపాదకీయం (సంపాదకీయం)


గుంటూరు లో కనులవిందుగా TFAS ‘కృష్ణ లీలా తరంగిణి’ (TFAS కార్యక్రమాలు)


ఉఱ్రూతలూగించిన సంక్రాంతి వేడుకలు (TFAS కార్యక్రమాలు)


జయ వందేమాతరం (కవితలు)


సంక్రాంతి...... (బాలలు)


శిక్ష నాది కాదు (కథలు)


అచ్చతెలుగు మాటలాట (వ్యాసం)


యుద్ధం వద్దు శాంతే ముద్దు (బాలలు)


చిరస్మరణీయం (కవితలు)


లక్ష్యం చేరిన గమ్యం (కథలు)


మృత్యోర్మా అమృతంగ‌మ‌య (కథలు)


కళ్ళున్న మనసు (కథలు)


అక్షరాలని ప్రేమిస్తాను (కవితలు)


అక్షర కోవెల! అంతర్యామి (కవితలు)


నేను శాంతిని‌ కోరుకొంటాను (కవితలు)


ధాతువు (కవితలు)


ఊరవతలి మేఘం (కథలు)


అతనొక శాపగ్రస్తుడు (కవితలు)