Article
సామెతలు (ఆఖరి విడత) (Author: మండ వెంకట అప్పారావు)
ప
పంచపాండవులు మంచం కోళ్ళవలె ముగ్గురు అంటారేగాని, యిద్దరే అని ఒక వేలు చూపినాడట
పంచశుభం పంచాశుభం
పంచాంగములు పోతే నక్షత్రములు పోనా
పంచాగ్ని మధ్యమందు వున్నట్టు
పండగ తొల్నాడు గుడ్డల కరువు, పండగనాడు అన్నము కరువు, పండగ మర్నాడు మజ్జిగ కరువు
పండు జారి పాలల్లో పాడినట్టు
పందికి ఏలరా పన్నీరు గిండి( సన్నపు మెడ గల చెంబు)
పందిని నందినీ, నందిని పందినీ చేసేవాడు
పందిలి (పందిరి యొక్క రూపాంతరం ) పడి చచ్చిన వారూ యిల్లు పడి బ్రతికినవారు లేరు
పక్కపుండు పెంచుతావేమి
పక్కలో కత్తి
పగటి మాటలు పనికి చేటు, రాత్రి మాటలు నిద్రకు చేటు
పగలు చస్తే వాటికి లేదు, రాత్రి చస్తే దీపముకు లేదు
పగలెల్ల బారెడు నేసినాను, దివ్వెతేనే దిగ నేస్తాను
పగవానింట పడి బిచ్చాలు పోయినా పోయినవేను
పచ్చి గడ్డి వేస్తే భగ్గుమని మండుతున్నది
పచ్చి వెలగకాయ గోతిన పడ్డట్టు
పట్టపగలు కన్నము వేస్తావేమిరా అంటే, నా కక్కుర్తి నీకు ఏమి తెలుసు అన్నాడట
పట్టపగలు చుక్కలు పొడిపిస్తాడు
పట్టినది చింత కొమ్మ గాని ములగ కొమ్మ కాదు
పడమట కోరాడు వేస్తే, పాడు గుంతలన్నీ నిండును
పడిసెము పది రోగాల పెట్టు
పడుచుల కాపరం, చితుకుల మంట
పత్తిగింజలు తింటావా బసవన్నా అంటే ఆహా అన్నాడట, గంట కట్టనా బసవన్నా అంటే వూహూ అన్నాడట
పదిమందితోటి చావు పెండ్లితో సమము
పదిమందిలో పడ్డ పాము చావదు
పది రాళ్లు వేస్తే ఒక రాయి అయిన తగలదా
పని అంటే నా వొళ్ళు భారగిస్తుంది, భోజనమంటే నా వొళ్ళు పొంగి వస్తుంది.
పని చెయ్యనివాడు యింటికి దొంగ, పన్ను యివ్వనివాడు దివాణానికి దొంగ
పనిలేని పాపరాజు ఏం చేస్తున్నాడంటే, కుందేటి కొమ్ముకు రేఖలు తీరుస్తున్నాడు అన్నాడట
పనిలేని మంగలి పిల్లి తల గొరికినాదట
పనిలేని మచ్చమ్మ పిల్లి పాలు పితికినాదట
పన్నెండు ఆమడ మధ్య బ్రాహ్మణుడు లేకపోతె యజ్ఞము చేయిస్తాను అన్నాడట
పప్పన్నమంటే పడి ఆమడ అయిన పరుగెట్టవలెను.
పప్పుతో పడి కాబలాలు తింటే, పులుసు యెందుకు బుగ్గిలోకా
పప్పులేని పెండ్లీ వుప్పులేని కూరా వున్నదా
పయికము లేనివాడు పరస్త్రీ వర్జితుడు
పైపడ్డ మాట, మడి పడ్డ నీళ్ళు పోతాయా
పరుగెత్తుతూ పాలు తాగేకన్నా, నిలుచుండి నీళ్ళు తాగడము మేలు
పరుగెత్తేవాణ్ణి చూస్తే తరిమే వాడికి లోకువ
పరువిచ్చి పరువు తెచ్చుకో
పాలకాని వాండ్లతో పాడి వూళ్ళవాండ్లూ గెలవ లేరు
పల్లము వుండే చోట నీళ్ళు నిలుస్తాయి
పసుపు బోటూ పెట్టి పెండ్లికి పిలిస్తే వెళ్లక, పెంకు పట్టుకొని పులుసుకు వెళ్లినట్టు
పక్షిమీద గురి పెట్టి మృగమును వేసినట్టు
పాండవుల వారి సంపదము దుర్యోధనుల వారి పిండాకూళ్లకు సరి
పాటిమీది గంగానమ్మకు కూటిమీదనే లోకము
పాటు పడితే (శ్రమ పడితే) కూటికి కొదవా
పాటు పడితే భాగ్యము కలుగును
పాడిందే పాడరా పాచిపండ్ల దాసరి
పాడు వూరికి నక్క తలారి
పాడు వూరికి మంచముకోడు పోతరాజు
పాడు వూళ్ళో పొగిడేవారు లేరు, నాకు నేనే పొగడుకొంటానన్నాడట
పాతముండలందరు పోగయి కొత్తముండ తాడు తెంపినట్లు
పానకములోని పుల్ల
పాపి సొమ్ము పరులపాలు, ద్రోహి సొమ్ము దొంగలపాలు
పాముకాళ్ళు పామునకెరుక
పాముకు పాలుపోసినట్టు
పాముతో చెలిమి, కత్తితో సాము
పామును చావనివ్వడు, బడితె విరగనివ్వడు
పాములలో మెలగా వచ్చునుగాని, స్వాములలో మెలగా కూడదు
పాయసములో నెయ్యి వొలికినట్లు
పారవేసుకొన్న చోటనే వెతుక్కోవలసినది
పారే చీమ చప్పుడు వినేవాడు
పాలకు వచ్చి ముంత దాచినట్లు
పాలుపట్టితే మాత్రమే మేలు గుణము కలుగునా
పాలల్లో పంచదార వొలికినట్లు
పాలను చూడనా బంధాన్ని చూడనా
పాలుపోసి పెంచినా పాము కరవక మానదు
పాలు కుడిచి రొమ్ము గుద్దినాడు
పాసిన కూడు పదునుకు వస్తుందా?
పిండి బొమ్మను చేసి పీఠమీద కూర్చుండ బెట్టితే, ఆడబిడ్డతనాన అదిరదిరి పడ్డాదట
పిండి యేంటో నిప్పటి అంతే
పిండీ ప్రోలూ(పట్టణము) లేనిదీ పెండ్లి అవునా.
పిండిలో పండిన పండు
పిచ్ఛికమీద బ్రహ్మాస్త్రమా
పిచ్చుగుంతలవాని పెండ్లి యెంత, వైభవమెంత
పిట్ట కొంచెము కూత ఘనము
పిట్టా పిట్టా పోరు పిల్లి తీర్చినట్లు
పిఠాపురం వెళ్లి పిడతెడు నీళ్ళు తెచ్చినట్లు
పిడుగుకూ బియ్యనాకూఒకటే మంత్రము
పితికే బర్రెను యిచ్చిపొడిచే దున్నను తెచ్చినట్లు
పినతండ్రి పెండ్లాము పినతల్లి కాదు, మేనమామ పెండ్లాము మేనత్త కాదు
పిరికి బంటుకు తుమ్మొస్తే!
పిలిస్తే బిగిస్తే సరిగాని వస్తే వాడి అబ్బ తరమా
పిల్లకాకి యేమి యెరుగును వుండేలు దెబ్బ
పిల్లకాయలకూ పీటకోళ్ళకూ చలిలేదు
పిల్లగలవాడు పిల్లకు ఏడిస్తే, కాటివాడు కాసుకు ఏడ్చినాడు
పిల్ల ముడ్డి గిల్లి వుయ్యాల వూచే వాడు.
పిల్లలేని యింట్లో తాత తడువులాడినట్టు
పిల్లి కండ్లు పోగోరును, కుక్క పిల్లలు కలగకోరును
పిల్లి కండ్లు మూసుకొని పాలు తాగుతున్నాను ఎవరు ఎరుగరని యెంచుకొన్నట్టు
పిలికి చెలగాటము ఎలుకకు ప్రాణసంకటము
పిల్లికి రొయ్యల మొలతాడు కట్టితే, అసుంటా బోయి నోట్లో వేసుకున్నాడట
పిల్లిని చంకబెట్టుకొని పెండ్లికి వెళ్లినట్టు
పిల్లిని చంపిన పాపము నీది, బెల్లము తిన్న పాపము నాది
పిల్లి బ్రహ్మహంత
పిల్లి బ్రాహ్మణుడు, పీట ముత్తైదువ
పీటకు పిర్రకూ వాయనము
పీతాంబరము ఎరువిచ్చినమ్మ పీట వెంబడి పట్టుకొని తిరగవలసినది
పీనుగకు చేసిన జాతర
పుంగనూరు సంస్తానము
పుచ్చకాయ దొంగ అంటే, భుజము తడిమి చూచుకున్నాడట
పుచ్చినా మిరియాలయినా, జొన్నలకు సరితూగక పోవు
పుట్టడము చావడము కొరకే
పుట్టని బిడ్డకు పూసలు కట్టినట్లు
పుట్టని బిడ్డకు పేరు పెట్టాడు
పుట్ట మీద తేలు కుట్టినా, నాగుమయ్య మహిమేనా
పుట్టించినవాడు పూరి మేపుతాడు
పుట్టిన నాటనుంచీ పుల్లిగాడే మొగుడా
పుట్టిననాటి బుద్ధి పుడకాలతోగాని పోదు
పుట్టిన పిల్లలు బువ్వకు ఏడిస్తే, అవ్వ మొగుడుకి ఏడ్చినది
పుట్టిన యిన్నాళ్ళకు పురుషుడు యజ్ఞము చేసెను
పుట్టిన వాణికి తమ్ముడు, పుట్టే వానికి అన్న
పుట్టు ఛాయే గాని పెట్టు ఛాయ వచ్చునా
పుణ్యము పుట్టెడు, పురుగులు తట్టెడు
పుణ్యానికి పుట్టెడిస్తే, పిచ్చ కుంచమని పొట్లాడినట్లు
పుణ్యానికి పెట్టే అమ్మా నీ మొగుడితో సమముగా పెట్టుమన్నట్టు
పుత్రుడనై వేధింతునా, శత్రుడనై వేధింతునా, పేరులేని దయ్యమునై వేధింతునా, పెరిమిటినై వేధింతునా
పునుగు చట్టము పిండినట్టు
పుబ్బ రేగినా బూతు రేగినా నిలువదు
పురిటిలోనే సందు కొట్టినది
పులగము మీదికి తెడ్డెడు పప్పు
పులిగాడికి గిలిగాడు
పులి నాకి విడిచినట్టు
పూటకూళ్ళకు వచ్చిన వారికి పుట్ల ధర యెందుకు
పూటకూళ్లమ్మ పుణ్యమెరగదు
పూటకు ముందే పురుగు పట్టినది
పూరా (నిండా) మునిగిన వానికి చలి యేమి
పూల చీరెట్టినట్టు
పూస కూర్చిన చందము
పూస పోగు ఉంటే, భుజమెక్క వలెనా
పెండ్లికి వెళ్లుదామంటే, వెళ్లిపోదామంటాడు
పెండ్లినాటి సౌఖ్యము లంఖనామునాడు తలుచుకున్నట్టు
పెండ్లి మర్నాడు పెండ్లికొడుకు ముఖాన పెద్దమ్మ వేళాడుతున్నది
పెండ్లివారు వచ్చిపెరట్లో దిగినారా
పెట్టగల బచ్చలి పాదు కొనగల గేదె మేసిపోయినది
పెట్టేనమ్మ పెట్టనే పెట్టదుగాని, పెట్టేముండకు యేమి వచ్చినది రోగము
పెడితే పెట్టితే తింటారుగాని, తిడితే పడేవారు లేరు
పెడితే పెండ్లి, పెట్టక పోతే శ్రాద్ధం
పెట్టినమ్మకు ప్రాణహాని చెప్పినమ్మకు జన్మహాన.
పెట్టిన వానికి తెలుసు నిక్షేపము
పెట్టిన వారికి పుట్టినదే సాక్షి, పెట్టని వారికి పుట్టినదే నిజము
పెట్టి పోయానమ్మ కొట్టి పొమ్మన్నాదట
పెట్టు చుట్టము, పొగడు భాగ్యము
పెట్టు పోతలు శాశ్వతములా?
పెద బావగారు ఆడంగులతో సమము
పెదిమకు మించిన పళ్ళు, ప్రమితకు మించిన వత్తి
పెదిమ దాటితే, పెన్నా (ఒక నది పేరు) దాటుతోంది
పెద్ద కొడుకు పెండ్లీ, అసుర భోజనము
పెరటి చెట్టు మందుకు రాదు
పెద్ద తల లేకపోతె, గొర్రె తల తెచ్చుకోమన్నారు
పెద్ద పులి తరుముకు వచ్చినా, హజారము ముందరికి పోరాదు
పెన్నా దాటితే, పెరుమాళ్ల సేవ
పెన్నాలో మాన్యము చెప్పినట్టు
పెరుగుట విరుగుట కొరకే
పెరుగు పెత్తనము చెఱుచును
పెరుగు వడ్లు కలిపినట్టు
పేగు చుట్టమా, పెట్టు చుట్టమా
పేద కుప్పకు దృష్టి మంత్రమా
పే డలో పొదికిన వుల్లిగడ్డ
పెదాల బిగువు
పేదవాని కోపము పెదవికి చేటు
పేనుకు పెత్తనమిస్తే, తలంతా తెగకొరికినది
పేరంటానికి వచ్చి పెండ్లి కొడుకు వరస యేమి అన్నట్టు
పేరు గంగానమ్మ, తాగబోతే నీళ్ళు లేవు
పేరు పెద్ద, వూరు దిబ్బ
పేరు పెనిమిటిది, అనుభవము మామగారిది
పేరు పెన్నా మోసింది, వొళ్ళు నేల మోసింది
పైన పారే పక్షి, కింద పారే చీమా
పొంగేటంత పొయ్యి పాలు
పొక్కటి రాళ్లకు పోట్లాడినట్టు
పొట్టకారుకులు తిన్న వారికి వూచ బియ్యాలు లేవు
పొట్టకు పుట్టెడు తిని అట్లకు ఆదివారము
పొట్టి గట్టి, పొడుగు లొడుగు
పొట్టి పోతరాజు కొలువు
పొట్టి వాడికి పుట్టెడు బుద్ధులు
పొత్తుల మగాడు పుచ్చి చచ్చెను
పొదుగు కోసి పాలు తాగినట్లు.
పొయ్యి అరిస్తే బంధువులు, కుక్కలు కూస్తే కరువు.
పొయ్యిలో పిల్లి యింకా నిద్రపోతూ వున్నది
పొయ్యి వూడుమంటే, కుండ బద్దలు కొట్టినాడు
పొరిగింట చూడరా నా పెద్ద చెయ్యి
పొరిగింటి కలహము విన వేడుక
పొరుగు పచ్చగా ఉంటే, పొయ్యిలో నీళ్ళు పోసుకున్నట్టు
పొల్లు దంచి బియ్యము చేసినట్టు
పోకల కుండ చత్రాతి మీద పగలకొట్టినట్లు
పోతేపల్లివారికి పప్పే సంభావన
పోయిన కంటికి మందు వేస్తే, వున్నకన్నూ వూడ్చుకొని పోయినది
పోయినది ఒర, వుండేది కత్తి
పోరాని చుట్టము వచ్చినాడు, తమలపాకులు బొడ్డు వంచి కోయుమన్నట్టు.
పోరాని చోటలకు పోతే, రారాని నిందలు రాకమానవు.
పోరినా పొరుగూ రాసిన కుండలో మానవు
పోరు నాస్తి, పొత్తు లాభము
పోలిగాడి చెయ్యి బొక్కలో పడ్డది
పోలీ పోలీ నీ భోగము యెన్నాళ్లే అంటే, మాఅత్త మాలవాడ నుంచీ వచ్చే వరకు అన్నట్టు
పొల్నాటిలో పోకకు పుట్టెడు అమ్మితే, ఆ పోకా దొరకక పొర్లి పొర్లే ఏడ్చినాడట
ప్రతిష్టకు పెద్దనాయుడు చస్తే, ఏడవలేక యింటివాండ్లు చచ్చినారు
ప్రసూతి వైరాగ్యము, పురాణ వైరాగ్యము, స్మశాన వైరాగ్యము
ప్రాణము తీపా, బెల్లము తీపా
ప్రాణము పోయినా, మానము దక్కించుకోవలెను
ప్రీతితో పెట్టినది పిడికెడే చాలును
ప్రీతిలేని కూడు పిండాకూటితో సమము
బ
బంగారపు కత్తి
బంగారపు పిచ్చుక
బంగారు పొల్లు వున్నదిగాని మనిషి పొల్లు లేదు
బండి దొంగరికము
బగబగమను వాని పంచనుండ వచ్చునుగాని, నాలిముచ్చు నట్టింట నుండరాదు
బట్ట తలలకు మోకాళ్ళకూ ముడివేసినట్టు
బట్టప్పు పొట్టప్పు నిలవదు
బడాయి బారెడు, పొగచుట్ట మూరెడు
బడాయి బావగారా అంటే, ఏమే గుడ్డికంటి మరదలా అన్నాడట
బడే సాయబు జోస్యులూ తొలి ఏకాదశి యెన్నడు
బర్రె కొమ్ము అంటే, యిర్రి కొమ్ము అంటాడు
బర్రె చస్తే పాడి బయట పడుతోంది
బర్రె దూడ వద్దా పాత అప్పులవాడి వద్ద వుండరాదు
బలవంత మాఘ స్నానము
బలవంతుని సొమ్ముగాని బాపడి సొమ్ము కాదు
బలిజె పుట్టుక పుట్టవలె, బత్తాయి బుడ్డి కొట్టవలె
బాపనివాని కొలువూ తెల్ల గుర్రపు కొలువూ కొలువ కూడదు
బారకాడివాలె పడ్డావు, నీవెవ్వరురా మా యింటి దేవుడికి మొక్కను
బావ మరిది బ్రతకగోరును, దాయాది చావ కోరును
బావా నీ బార్య ముండ మోసినదోయి అంటే, మొర్రో అని ఏడ్చినాడట
బావిలోటు చూడ వచ్చునుగాని, మనసులోటు చూడ కూడదు
బిచ్చపు కూటికి శనీశ్వరుమద్దగించినట్టు
బిచ్చపు వాణ్ణి చూస్తే బీద వాడికి కోపము
బిచ్చానికి పోయినా బిగువు తప్పలేదు, దుప్పటి పోయినా వల్లెవాటు తప్పలేదు
బిడ్డ చక్కిలము వలె యెండిపోయినాదంటే, చక్కిలాలు యిమ్మని ఏడ్చినాడట
బిడ్డను వేసి లోటు చూచినట్టు
బిడ్డ ఎదిగితే లోతు చొచ్చినట్లు
బిడ్డ లేని ముద్దు, వాన లేని వరద
బీద వాడు బిచ్చపు వాడికి లేని వరద
బురద గుంటలో పంది సామెత
బురదబుక్కడము వంటివాడు
బుర్రకు ఒక గుణము, జిహ్వకు ఒక రుచి
బూడిద గుంటలో కుక్క సామెత
బూడిదలో చేసిన హోమము
బూడిదలో పోసిన పన్నీరు
బెదిరించి బెదిరించి బెల్లపు కుండకు తూటు పొడిచినాడట
బెల్లపు పిల్లాడికి ముడ్డి గిల్లి నైవేద్యము
బొంకరా బొంకరా పోలిగా అంటే, టంగుటూరి మిరియాలు తా టికాయలంతేసి అన్నాడట
బొంత కుట్టుకొన్నవాడు కప్పుకో లేడా
బొగ్గులలో రామచిలుక
బొచ్చు కాలిస్తే బొగ్గులవునా
బొట్నవేలు సున్నమైతే బోర్ల పడుతాడు
బోగం వలపూ బొగ్గు తెలుపూ లేదు
బోడి తలకు బొడ్డు మల్లెలు ముడిచినట్టు
బోడి నెత్తిన టెంకాయ కొట్టినట్లు
బోడెద్దుకు పోటు మప్పడము
బ్రతకని బిడ్డ తెగబారెడు
బ్రతికి వుంటే, బలుసుకూర తిని వుండవచ్చును
బ్రతికి వుండగా పాలు లేవు గానీ, చచ్చిన వెనక గంగి గోవును దానము చేస్తానన్నట్టు
బ్రతికే బిడ్డ అయితే, పాసిన వాసిన యెందుకు వస్తున్నది
బ్రహ్మకూ పుడుతున్నది రిమ్మ తెగలు
బ్రహ్మ తలిస్తే ఆయుస్సుకు తక్కువా, మొగుడు తలిస్తే దెబ్బలకు తక్కువా
బ్రహ్మ వ్రాసిన వ్రాలు తిరుగునా
బ్రహ్మాస్త్రానికి తిరుగు లేదు
బ్రాహ్మణుని చేయీ యెనుగ తొండమూ వూరకుండవు
బ్రాహ్మణుని మీది సంధ్య కోమటి మీది అప్పు నిలవదు
బ్రాహ్మణులలో చిన్నా, బెస్తలలో పెద్ద
బ్రాహ్మణులలో నల్లవాణ్ని మాలలలో యెర్రవాణ్నినమ్మరాదు
భ
భక్తిలేని పూజ పత్రి చేటు
భల్లూకపు పట్టు
భాగ్యము ఉంటే, బంగారం తింటారా
భారీముద్ర భారముద్రే, కారుకు కారుకే బంగారపు కత్తి
భూమికి రాజు న్యాయము తప్పితే, గ్రామము వారందరూ ఏమి చెయ్యగలరు
భూమికి వాన మేలా అంటే, మేలే అన్నట్టు
భోజనము చేసిన వానికి అన్నము పెట్ట వేడుక, బోడి తల వాడికి తలంటు వేడుక
భోజనానికి ముందు, స్నానానికి వెనుక
భోజునివంటి రాజు కలిగితే, కాళిదాసు వంటి కవి అప్పుడే వుంటాడు
మ
మంగళవాడి పెంట కుళ్లగిస్తే, బొచ్చు బైలు వెళుతున్నది
మంగలిని చూచి ఎద్దు కాలు కుంటినది
మంగలిపాత, చాకలి కొత్త
మంచి ప్రాణానికి మండలము వరకు భయము లేదు
మంచి వాణికి మరణమే సాక్షి
మంచి వానికి మాట్లాడనిదే మందు
మంచి వానికే వచ్చెనా మరణ కాగితము.
మంచి వారికి మాటే మందు
మంచి వారికి ఒక మాట, మంచి గొడ్డుకు ఒక దెబ్బ
మంత్రము చెప్ప మల్లుభొట్లు, తినడానికి యెల్లుభొట్లు
మంత్రము లేని సంధ్యకు మరచెంబుడు నీళ్లు
మంత్రసాని ముందర మర్మము దాచినట్లు
మంత్రాలకు మామిడి కాయలు రాలుతున్నావా
మంది యెక్కువైతే మజ్జిగ పలచన
మక్కాకు పోయి కుక్క మలము తెచ్చినట్లు
మఖ పుబ్బలు వరపయితే, మహత్తయిన క్షామము
మఖలో పుట్టి పుబ్బలో పోయినాడు
మగ్గనకు ఒక రాయి మరవకుండా పట్టండి
మట్టి గుర్రమును నమ్మి ఏట్లో దిగినట్లు
మట్టి తిన్నా పామువలే వున్నాడు
మట్టి యెద్దయినా, మా ఎద్దే గెలవ వలెను
మట్టు మీరిన మాటకు మారు లేదు
మణులు చెక్కిన సంకెళ్లు
మతి లేని మాట, శృతి లేని పాట
మదురు మీది పిల్లి వలె ఉన్నాడు
మనమడు నేర్చుకొన్నట్టు, అవ్వకు దురద తీరినట్లు
మనమెరగని చెవులకు మద్ది కాయలా
మనసు మహమ్మేరు దాటుతోంది, కాలు కడప దాటలేదు
మనసు లేని మనుము
మనిషి కాటుకు మందు లేదు
మనిషికి రాక మానుకు వస్తుందా
మనిషికి వున్నది పుష్టి, పసలమునకు తిన్నది పుష్టి
మనిషి పేద అయినా, మాట పేద కాదు
మనో వ్యాదికి మందు లేదు
మన్మధుడే పురుషుడైనా, మాయలాడి తన మంకు బుద్ధి మానదు
మర్యాద రామన్న మాట తప్పినా, నా వేటు తప్పదు
మలాప సన్యాసికీ మాచకమ్మకూ జత
మలయాళములో చెవులు కుట్టుతారని, మాయవరములోంచి చెవులు మూసుకొని పోయినట్టు
మసి పూసి నేరేడు కాయ చేసినట్టు
మాసి ముఖము వాడు, చమురు కాళ్లావాడూ పోగయినట్టు
మహా లక్ష్మి పరదేశము పోయినట్టు
మాంసము తినటమని బోకెలు (ఎముకలు) గుచ్చి మెడను వేసుకొనా
మాంసము మాంసమును పెంచును
మాటకు మాట తెగులు, నీళ్లకు నారు తెగులు
మాట తప్పిన వాడు మాల వాడు
మాటలకు పేదరికము లేదు
మాటలకు మల్లి, పనికి యెల్లి
మాటలు కోటలు దాటుతవి, కాలు కడప దాటలేదు
మాటలు తేటలు మా యింటను, మాపటి భోజనము మీ యింటను
మాటలు నేర్చిన కుక్కను వేటకు బంపితే, వుజ్జో అంటే వుజ్జో అన్నట్టు
మాటలు మా తల్లి మాటలు, పెట్టు మా మారుతల్లి పెట్టు
మాటాడితే మల్లెలు, కాటాడితే కందిరీగలు వొలుకుతవి
మాదిగ మంచానకు కాళ్లవైపు తలవైపు ఒక్కటే
మాదిగ మల్లి, కంసాలి యెల్లి
మాధవ భొట్లకు పడిసెము ఏట రెండు మార్లు రావడము, వచ్చినప్పుడెల్ల ఆరేసి మాసములు వుండడము
మానము పోయిన వెనుక ప్రాణమెందుకు
మానిన రోగానికి మందు వద్దు, ఈనిన కుక్క ఇంట వున్నది వైద్యుడా అన్నాడట
మాని పోయిన పుండు మళ్ళీ రేపినట్టు
మానును చూసేవా, మానును పట్టిన భూతాన్ని చూసేవా
మాను పండ్లు మాను కిందనే రాలుతావి
మానుపిల్లి అయిన, మట్టి పిల్లి అయిన, ఎలుకను పట్టినదే పిల్లి
మాను పేరు చెప్పి పండ్లు అమ్ముకోవచ్చును
మాల పల్లెలో మంగళాష్టకాలు
మాలలకు మంచాలు, బ్రాహ్మణులకు పీటలు
మాలయ గారికి కోలయగారు గురువు
మింగ మెతుకు లేదు, మీసాల మీదికి సంపెంగ నూనె
మింటికన్నా పొడుగు, నగరి కన్న దాస్తీకము లేదు
మిండడి (విటుడి) ఈవి (త్యాగము) యెంతో లంజ మక్కువ అంతే
మిండలను మరిగిన అమ్మ, మీగడలు తిన్నఅమ్మ వూరకుండదు
మిడతంభొట్ల జ్యోస్యము
మిద్దె మీద పరుగు
మిన్ను విరిగి మీద పడ్డట్టు
మీకు మాట, నాకు మూట
మీగాళ్లు (పాదోపరిభాగము) వాచినమ్మ మీ యింట్లో పెండ్లి ఎప్పుడంటే, మోకాళ్ళు వాచినమ్మ మొన్ననే అయిపోయినదన్నట్టు
మీ గొడ్డుకు తవుడు అంటే, మీ బిడ్డకు యిన్ని పాలు అన్నాడట
మీ యింటికి వస్తాను నా కేమి యిస్తావు, మా యింటికి వస్తే నాకేమి తెస్తావు
ముంజేతి కంకణముకు అద్దము కావలెనా
ముండా కొడుకే కొడుకు, రాజు కొడుకే కొడుకు
ముండ ముప్పావుకు చెడ్డది, నరకడు ( దుష్టుడు) పావుకు చెడ్డాడు
ముండ మొయ్య వచ్చును, నింద మొయ్యరాదు
ముండా కాదు, ముత్తయిదా కాదు
ముంతెడు నీళ్లకే జడిస్తే, బానేడు నీళ్ళు ఎవరు పోసుకుంటారు
ముంతెడు పాలకు, ముత్యమంత చెమరు( చెమట)
ముందర పల్లము, వెనుక మిట్ట.
ముందర వున్నది ముసళ్ల పండగ
ముందర వస్తే గొయ్యి, వెనకకు పోతే నుయ్యి
ముందు పోయే ముతరాచ (ఒక శూద్ర జాతి ) వాణ్ణి, వెనక వచ్చె బోయవాణ్ణి, పక్కను వచ్చె పాత్రతివాణ్ని నమ్మరాదు
ముందు వచ్చిన చెవులు కన్నా, వెనక వచ్చిన కొమ్ములు వాడి.
ముందు వచ్చినది ముత్తైదువ, వెనక వచ్చినది వెధవ
ముక్కిడికి తోడి పడిసెము
ముక్కు చొచ్చి కంట్లో ప్రవేశించే వాడు
ముక్కు పట్టని ముత్యము
ముక్కు వుండేవారికి పడిసెము వున్నది
ముఖము చూస్తే కనపడ్డ మీగాళ్ల వాపు
ముఖము మడపు (విముఖమగు) దీపము యింటికి కొరగాదు, రంకుబోతు పెండ్లాము మొగుడికి కొరగాదు, ఏడుపుగొట్టు బిడ్డ చంకకు కొరగాదు.
ముగ్గురిని కూర్చారా మూల దేవుడు
ముగ్గురి మధ్య ముంత దాగింది
ముడి మూరెడు సాగదు
ముడ్డి కిందకి నీళ్ళు వస్తే లేవక మానరు
ముడ్డి మీద కొట్టితే, నోటి పండ్లు రాలేన
ముడ్డీ ముఖము లేని బిడ్డ, మొదలు లేని పాట
ముదిమి (వార్థకము) తప్పితే మూడు వర్ణాలు
ముద్దు ముఖము గరుడసేవా
ముద్దులు గులకరా ముడిపెండ్లి కొడకా అంటే, పెండ్లికి వచ్చిన పేరంటాండ్లు అందరు నా పెద్ద పెండ్లాలు అన్నట్టు
మున్నూటి కులానికి ముప్పు లేదు, మొండి కాలికి చెప్పూ లేదు
మున్నూరు శిఖలయినా కూడ వచ్చునుగాని, మూడు కొప్పులు కూడ రాదు
ముప్పై తట్టల పేడ మోసే పోలికి, మూడు పుంజాల దండ బరువా
ముప్పై యేండ్ల ఆడదీ, మూడేండ్ల మొగవాడు ఒకటే
మురదన్న సందేహము నిస్సందేహము
మురిపెముకు మూడు నల్ల పూసలు, కొలిక్కి ఒక తిరగట్రాయి
మురిపెము తిరిపెము చేటు, ముసలి మొగుడు ప్రాణముకు చేటు
ములకకాయకు తగిన ముండ్లు యెప్పుడు వున్నావో, కాకరకాయకు తగిన గరుకులు అప్పుడే వున్నవి
ముల్లాలు తిండికి లేక మొత్తుకొంటూ వుంటే, పీర్లకు పంచదార
ముల్లు దీసి కొర్రాడచినట్టు
ముల్లు ముంత తీస్తే పొయ్యేదానికి దబ్బనము తీసినట్టు
ముష్టికి మూడు సంచులా
ముసలమ్మ సుద్దులు.
ముసలమ్మా బుర్ర వణికిస్తావేమి అంటే, వూరుకుండి నేనేమి చేస్తాను అన్నాదట
ముసుకులో గుద్దులాట
మూగవాని ముందర ముక్కుగోకు కొన్నట్టు
మూతికే ముడి వేస్తే, యేమీ లేదు
మూడు నాళ్ల ముత్తయిదువతనానికి ఆరు జోళ్ల లక్క ఆకులా
మూడు నెలలు సాముచేసి, మూలనున్న ముసలిదాన్ని పొడిచాడు
మూడు మూర వక చుట్టు, ముప్పై మూర వక చుట్టు
మూరెడు పోనెల, బారెడు కుంగనేల
మూరెడు యింట్లో బారెడు కర్ర
మూర్తి కొంచమయినా కీర్తి విస్తారము
మూలము అంటే, నిర్మూలము అంటాడు
మూలవిగ్రహాలు ముష్టి ఎత్తుముష్టి ఎత్తుకుంటూ వుంటే, ఉత్సవ విగ్రహాలకు దద్దోజనం
మూల వున్నదాన్ని ముంగిట్లోకి తెచ్చినట్లు
మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు
మూలుగులు ముందటి వలెనే , తిండి యెప్పటి వలెనే
మూసిపెట్టితే, పాసిపోయినది
మెచ్చి మేక తోలు కోరి గొర్రెతోలు కప్పుతారు
మెట్టను మాట, పల్లాన భార్య
మెట్టను వున్నా యేనుగే, పల్లాన వున్నా యేనుగే
మెడ తావడము పూసల కొరకే
మెరుగు వెయ్యకగాని మృదువుకాదన్నము.
మేక మేడ చన్ను
మేక వన్నె పులి
మేడికాయ పై మిసిమి (నూతన కాంతి)
మేత కారణము
మేలు మేలంటే, మేడ విరగపడ్డట్టు
మొండికి సిగ్గు లేదు, మొరడు కు (మ్రోడు కు , స్థాణువు కు) గాలి లేదు
మొండికే బండకూ నూరేండ్లు ఆయుస్సు
మొండికెక్కినదాన్ని మొగుడేమి చేసెను, రచ్చకెక్కినదాన్ని రాజేమి చేసెను
మొండిచేతి తోటి మొత్తు కొన్నట్టు
మొండిచేతివానికి నువ్వులు తిన నేర్పినట్లు
మొండిముక్కున ముక్కెర వున్నట్టు
మొండివాడు రాజుకన్న బలవంతుడు
మొక్కపోయిన దేవుడు యెదురుగా వచ్చినట్టు
మొక్కుబడే లేదంటే, ఒక్క దాసరికయినా పెట్టుమన్నట్టు
మొక్కేవారికి వెరవనా, మొత్తేవారికి వెరవనా
మొగుడి తలమీద మిరియాలు నూరినట్టు
మొగుడు కొట్టినందుకు కాదుగాని, తోటికోడలు దెప్పుతున్నదని విచారము
మొగుడు కొట్టినా కొట్టెను, ముక్కు చీమిడి పోయెను
మొగుణ్ణి కొట్టి, మొగసాల యెక్కినది
మొదటికి మోసము, లాభానికి గుద్దులాట
మొదలు దుర్బలం, అందులో గర్భిణి
మొదలే మన్ను, కరువు వస్తే గద్దలు
మెప్పులేని వాడే మొదటి సుజ్ఞాని
మొర్రో మొర్రో వద్దనగా లింగము కట్టెరుగని, మొక్క చేతులు తేగలరా
మొలమట్టు దుఃఖములో మోకాలుమట్టు సంతోషము
మోచేయి ఆడితే, ముంజెయ్యి ఆడుతుంది
మోటు కు (మొద్దు కు) మోడు (స్థాణువు ) కంపు, వన్నెగాడికి వాళ్లంతా కంపు.
మోటు (మొద్దు) గాలికి వెరవడు
మోటు గాలికి వెరవడు
మోసేవనికి తెలుసు కావటి బరువు
మోక్షానికి పోతే, మొసలి ఎత్తుకొని పోయింది